Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vidhivinyasalu

ఈ సంచికలో >> కథలు >> మా వదిన – నేను – ఉప్మా...

maa vadina ..nenu..upma..

మా వదిన నన్ను పెద్ద చిక్కులోనే పడేసింది. అసలేం జరిగిందంటే పొద్దున్నే ఫోన్ చేసి, “స్వర్ణా, పదకొండుగంటలకల్లా రెడీగా వుండు.. మా పిన్ని కొడుకు..రాజీవ్ లేడూ..వాడి పెళ్ళిచూపులకెళ్ళాలి..” అంది.

ఎక్కడో ఉరిమితే ఇక్కడ అదిరినట్టు, మా వదినే నాకు స్వంత వదిన కాదాయె. పెద్దమ్మ కోడలు. అయినా చిన్నప్పట్నించీ అన్నయ్యతో వున్న చనువు వల్లా, ఇద్దరం హైద్రాబాదులో వుండడమే కాకుండా ఫ్రెండ్స్లా రాకపోకలు కూడా బాగా వుండడం వల్లా వదిన నాకు మంచి స్నేహితురాలైంది. అంతమాత్రాన ఆవిడ పిన్నికొడుకు పెళ్ళిచూపులకి నేను వెళ్ళడం యేమిటీ.. నేనేదైనా అనే లోపలే.. “కాదనకు స్వర్ణా, నేనూ, మా తమ్ముడూ, మీ అన్నయ్యే వెడుతున్నాం. ముగ్గురు వెళ్లకూడదు కదా.. అందుకని నాలుగోదానివిగా నువ్వు రావాలంతే..” అనేసింది.

నాకు మొహమాటంగా అనిపించింది. అసలే రోజులు మారిపోయాయి. ఇదివరకటి పెళ్ళికూతుళ్ళూకాదు, అప్పటి పెళ్ళిచూపులూ కాదు. ఎక్కడో వేలు విడిచిన బంధువు పెళ్ళిచూపులకి నేను వెళ్ళడమేవిటీ..చోద్యం కాకపోతే.. అందుకే అడిగాను “వాళ్ళ అమ్మానాన్నా రాలేదా వదినా..” అంటూ.

“లేదు. వాళ్లని మా తమ్ముడే రావొద్దన్నాడు. మా పిన్ని వస్తే పెళ్ళిచూపుల్లో ఆ అమ్మాయిని ఎక్కడ ఉప్మా చెయ్యమంటుందోనని వాడి భయం..” అంది. అదేవిటో.. ఈవదిన ఒక్కోసారి ఏవీ అర్ధంకాకుండా మాట్లాడుతుంది. పెళ్ళిచూపుల్లో పెళ్ళికూతురు ఉప్మా చెయ్యడమేవిటీ అనుకుంటూంటే తెలివైన వదిన నా అనుమానం కనిపెట్టేసింది.  “ఓ.. నీకు తెలీదు కదూ! ఇదివరకు రోజుల్లో మావాళ్ళు ఎవరింటికి పెళ్ళిచూపులకి వెళ్ళినా ఆ అమ్మాయిని ఉప్మా చేసి తెమ్మనేవారు. ఎందుకంటే ఉప్మా చేసేముందు ఆ అమ్మాయి ఉప్మారవ్వ పురుగులు పట్టిందో లేదో అని పరీక్షగా చూస్తుందో చూడదోనని పరీక్ష పెట్టేవాళ్ళన్న మాట. అలా చూడకుండా ఉప్మా చేసి తెచ్చేస్తే ఆ అమ్మాయికి శుచీ, శుభ్రం లేవని తీర్మానించేసుకుని ఆ సంబంధం వదిలేసుకునేవాళ్ళన్న మాట. మా పిన్ని కూడా మొన్న ఎవరింటికో పెళ్ళిచూపులకి వెళ్ళినప్పుడు అలాగే ఆ అమ్మాయిని కాస్త ఉప్మా చేసి తెమ్మందిట. అప్పటిలాగే ఇప్పుడూ అడుగుతారా ఎవరైనా.. రోజులు మారిపోలేదూ.. పాపం మా రాజీవ్ వాళ్ళ ముందు తలెత్తుకోలేకపోయేడుట. అందుకే ఇప్పుడు సంబంధం చూడ్డానికి  మా పిన్నినీ, బాబయ్యనీ వద్దని వాడొక్కడే వచ్చాడు. ఒక్కడే పెళ్ళిచూపులకి వెడితే పిల్లవాళ్లముందు చిన్నబోతామని మా పిన్ని నన్నూ, మీ అన్నయ్యనీ వెళ్ళమంది. అందుకే మేం ముగ్గురం కాకుండా నిన్నూ రమ్మంటున్నాను. నువ్వు కూడా నా పక్కన వున్నావనుకో.. ఆ పిల్ల సంగతులు ఒక్కొక్కళ్లం ఒక్కొక్కటి కనిపెట్టొచ్చు” అంది.

నాకు ఎందుకో మొహమాటంగా అనిపించింది. ఆ రాజీవే వదినకి పిన్ని కొడుకు. ఆ వదినకు నేను పిన్నత్తగారి అమ్మాయిని. నీ ముక్కేదంటే ఏదో అన్నట్టు ఈ రోజుల్లో ఇంత దూరం చుట్టరికంతో యేమని వెడతాను పెళ్ళిచూపులకి.. అందుకే వదినతో అన్నాను.. “బాగుండదేమో వదినా, అయినా అన్నయ్య వస్తున్నాడుగా.. నువ్వూ, రాజీవ్ ముందెళ్ళి అన్నయ్యని ఒక అడుగు వెనకాల రమ్మను. ఇంక ముగ్గురన్న శంక వుండదు.” నాకు తోచిన చక్కటి సలహా చెప్పేసేను.

“సరిలే..మీ అన్నయ్యని నమ్ముకుంటే ఇంతే సంగతులు. అయినా నీకు తెలీదా స్వర్ణా.. ఈ మొగుళ్ళున్నారే..వాళ్ళని వట్టి పసుపు  విఘ్నేశ్వరుల్లాగ చూడాలంతే.. వారిని అంతవరకే వాడుకోవాలి..” అంది. “ఏంటొదినా..?” అన్నాను ఆశ్చర్యంగా. అసలు మొగుళ్ళు పసుపు విఘ్నేశ్వరులనే మాటే నేనెక్కడా వినలేదు మరి.

“అయ్యో.. నీకు తెలీదా? అంటే మరేంలేదు స్వర్ణా.. మనం పండగల్లో వ్రతాలు చేసేటప్పుడు ముందు పసుపు విఘ్నేశ్వరుణ్ణి చేసి తమలపాకులో పెట్టి, తొలిపూజ చేస్తాం కదా..ఆ తర్వాత ఓ చిన్న బెల్లమ్ముక్క నైవేద్యం పెట్టేసి, ఆయనని ఎత్తి పక్కన పెట్టేసి, శుభ్రంగా వ్రతం చేసుకుని, అష్టోత్తరాలూ, సహస్రాలూ చదువుకుని, ఆ దేవుడికి నవకాయ పిండివంటలతో మహా నైవేద్యం పెట్టుకుంటాం. ఈ మొగుళ్ళూ అంతే.. ఎక్కడికెళ్ళాలన్నా మన పక్కన వాళ్ళు వుండాలి. అంతవరకే. తీరా ఎక్కడికైనా వెళ్ళాక వాళ్లని మాట్లాడనివ్వకూడదు. ఓ పక్కకి పెట్టెయ్యాలి. అంతే. ఆడవాళ్ల విషయాలు మనమే గ్రహించాలి. అందుకే నేను నిన్ను రమ్మంటున్నది.” అంది. నాకు భయం ఇంకా ఎక్కువైంది.
ఈ రోజుల్లో ఆడపిల్లలు చదువులూ, ఉద్యోగాల్లోనే కాదు తెలివితేటల్లోనూ, నలుగురిలో మసలడం లోనూ కూడా మగపిల్లల్ని మించిపోయున్నారు. వాళ్లని పాతకాలంవాళ్ళం మేం కనిపెట్టడమేమిటీ.. మా రోజుల్లో అయితే వేరు.. లోపల ఎంత ఉక్రోషంగా వున్నా నాన్న తెచ్చిన సంబంధం ముందు తలొంచుకుని కూర్చుని, వాళ్ళు అడిగిన అడ్దమైన ప్రశ్నలకీ సమాధానాలు చెప్పేవాళ్ళం. ఇప్పుడలా కాదే.. ఆడపిల్లలే ప్రశ్నలు వేస్తున్నారని ఎక్కడో విన్నాను కూడానూ..అందుకే వదినతో  “అయినా ఈ రోజుల్లో కూడా పెళ్ళిచూపులేంటి వదినా అసహ్యంగా. వాళ్ళిద్దరినీ బైట ఏదైనా హోటల్లో మాట్లాడుకోమంటే సరి. ఒకరి అభిప్రాయాలు ఇంకోళ్ళు తెలుసుకుంటారు.” అన్నాను.
వదినకి నామాటలు నచ్చినట్టులేదు. “స్వర్ణా, ఇంటికి పిల్లని తెచ్చుకునేటప్పుడు ఎన్ని చూసుకోవాలో తెలీదా? ఏ హోటల్‍కో వెళ్ళి నీకూ దోశే ఇష్టం, నాకూ దోశే ఇష్టం.. మన ఇద్దరి అభిరుచులూ ఒకటే అనుకుంటే సరిపోతుందా? అందులోనూ ఈ రోజుల్లో ఆడపిల్లలు చదువుతోపాటూ లోకజ్ఞానం కూడా నేర్చుకుని ఆవలించకుండానే పేగులు లెక్కెట్టేస్తున్నారు. మగవాళ్ళేమో ఆ ఒక్క చదువులోనే ములిగిపోయి నోట్లో వేలెట్టుకుని వెర్రివెధవల్లా తయారౌతున్నారు. పిల్లాణ్ణొక్కణ్ణీ అలా వదిలెయ్యొద్దని మా పిన్ని ఏడుస్తూ ఫోన్లో నా చేత ఒట్టు వేయించుకుంది. అందుకే నిన్నడుగుతున్నాను. మనిద్దరం ఒకళ్ళకొకళ్ళం వుంటే ఆ ఇంటి గురించీ, పిల్ల గురించీ బోలెడు వివరాలు సేకరించి పిన్నికి చెప్పొచ్చు..” అంది.

నాకు గాభరా వేసింది. వదిన యేమనుకుంటే అనుకోనీ అని “అమ్మో, నేను రాను. నాకసలే మొహమాటం. మా తమ్ముడి పెళ్ళిచూపులకే నేను వెళ్ళలేదు. నాకు భయం కూడానూ..” అంటూ అర్ధం లేకుండా గబగబా చెప్పేసేను. వదిన ఊరుకోలేదు..”అలాకాదు స్వర్ణా.. ముగ్గురం వెళ్ళడానికి శాస్త్రం ఒప్పదు కదా.. పోనీ, నీకు భయమైతే మీ అన్నయ్యలాగా ఓ పక్కన కూర్చో.. అంతే.. మిగిలినవి నేను చూసుకుంటానుగా..నువ్వు రాకపోతే మరింక నీతో మాట్లాడనంతే.. అయినా అవసరం పడి అడిగాను.. రేప్పొద్దున్న నీకేమీ అవసరం పడదా.. నేను రావద్దా..” అంటూ నిష్ఠూరాలాడేసి, అలాగే వస్తానని నాచేత ఒప్పించేసింది మా వదిన.

నేను భయపడుతూనే ఒప్పుకున్నాను కానీ ఖచ్చితంగా వదినకి చెప్పేసేను.. అక్కడ నన్నేమీ మాట్లాడమనొద్దు, ఉట్టినే లెక్కకి ఆటలో అరటిపండులా కూర్చుంటాను అంతే అని చెప్పేను. కానీ మా వదిన సంగతి నాకు తెలుసు. ఎక్కడ యే మాటల్లో నన్ను ఇరికించేస్తుందోనని గుండె దడదడలాడుతోంది. ఇహనో..ఇప్పుడో వచ్చేస్తుంది.. అనుకుంటూ ఈ చిక్కులోంచి మర్యాదగా బైట పడెయ్యి భగవంతుడా.. అని దేవుణ్ణి మొక్కుకుంటుంటే మాటల్లోనే వచ్చింది వదిన.. అదుగో.. కార్ హారన్.. పిలుస్తోంది. వణుకుతున్న కాళ్ళని స్వాధీనం లోకి తెచ్చుకుంటూ, కారెక్కబోతూ వదిన చెవిలో నెమ్మదిగా అన్నాను.. “వదినా, నేను ఆటలో అరటిపండునే. గుర్తు పెట్టుకో..” అంటూ. వదిన నవ్వింది.  భగవంతుని మీద భారం వేసి కారెక్కేను.

పెళ్ళివారింటికి వెళ్ళిన పదినిమిషాలకి, మర్యాదలన్నీ పూర్తయ్యాక అమ్మాయిని తీసుకొచ్చారు హాల్లోకి. అమ్మాయి చెక్కినశిల్పంలా చక్కగా వుంది. పంజాబీసూట్ వేసుకుంది. ఇప్పుడు అందరు అమ్మాయిల్లాగే జుట్టుని స్వేఛ్ఛగా వదిలేసింది. మామూలుగా వచ్చి, వాళ్ళమ్మగారి పక్కనున్న కుర్చీలో కూర్చుంది. “మా అమ్మాయి రేఖ. విప్రోలో పనిచేస్తోంది..” అని పరిచయం చేసారు వాళ్ళ నాన్నగారు. చేతులు రెండూ జోడించి నమస్కారం పెట్టింది. రాజీవ్‍ని చూసాను. అతని కళ్ళల్లో సంతోషం కనిపించింది. అమ్మయ్య.. అనుకున్నాను. “ఆఫీసు ఇక్కణ్ణించి దూరమేమో..ఎలా వెడుతుంది?” వదిన అడిగింది. నాకు చాలా ఆనందం వేసింది. వదినని ఏమో అనుకున్నాను కానీ ఇప్పటి రోజుల్లో ఏమడగాలో తెలిసున్నదే అనుకున్నాను. “కాబ్ వస్తుందండీ..” అన్నారు వాళ్ళమ్మగారు. “నీ హాబీస్ ఏంటమ్మా..” అడిగింది వదిన. నవ్వుతూ “షాపింగ్..” అని చెప్పిందా అమ్మాయి.

ఇంతలో నానడుం పక్కన గట్టిగా ఏదో కుట్టింది.. ఒక్కసారి.. “అమ్మో..” అన్నాను. “ఏవయింది?” అంటూ ఖంగారుపడ్దారు పెళ్ళికూతురి తల్లి. “ఏదైనా కుట్టిందేమో.. లోపలికెళ్ళి చూద్దాం” అంటూ నా చేయి పట్టుకుని వాళ్ళింటి లోపలికి తీసుకుపోయింది వదిన. పక్కగా కనిపిస్తున్న బెడ్రూమ్‍లోకి  వెళ్ళగానే నేను గట్టిగా నడుం రుద్దుకుంటూంటే..”ఏం కాదులే.. నేనే కాస్త గిచ్చాను..” అన్న వదిన మాటలకి తెల్లబోయాను. ఇది కాస్త గిచ్చడమా.. కండలు కదిలి వచ్చేట్టుంటే అనుకుంటూ అన్నయ్యని తల్చుకుని కాస్త బాధపడ్డాను. ఇంకేమనలేక ”ఎందుకూ?” అనడిగాను నెప్పితో నడుము మండిపోతుంటే. వదిన  కాస్త గొంతు తగ్గించి, “చూసేవా.. ఆ పిల్లకి షాపింగ్ హాబీట. ఎలా చెప్పేసిందో చూసేవా? ఇంకేవుందీ.. మావాడు ఇంక క్రెడిట్ కార్డులు గీక్కుంటూ ఉండడమే..” అంది. “అది కాదొదినా.. ఆ పిల్ల కూడా సంపాయిస్తోంది కదా..” అన్నాను నడుం రాసుకుంటూ. “అమ్మో.. వీళ్ళు వట్టి పిసినార్లు. వీళ్ళు ఖర్చుపెడతారా?” అంది. “నీకెలా తెలుసూ?”  అన్నాను. “ఆమాత్రం తెలీట్లేదూ? టీతో పాటు ఓ చిన్న ప్లేట్లో బిస్కట్లు మటుకు పెట్టారు. పెళ్ళిచూపులకొచ్చామని..యేం.. ఓ స్వీటూ, హాటూ పెట్టొచ్చు కదా.. అక్కడే తెల్సిపోటంలేదూ?” అంది.

“ఈ రోజుల్లో అందరూ అలాగే పెడుతున్నారు వదినా. పిల్ల బాగుంది కదా.. మనకి పిల్ల ముఖ్యం. రాజీవ్‍కి  కూడా నచ్చినట్టే వుంది. “ అన్నాను. “వాడిమొహం.. వాడికేం తెల్సు? అందం కొరుక్కు తింటామా ఏవిటీ? నువ్విక్కడే ఈ బాల్కనీలో కనపడకుండా వుండు. నెప్పి తగ్గలేదనీ, వేరే గదిలో పడుకున్నావని వాళ్లకి చెపుతాను. వాళ్ళు అబ్బాయినీ, అమ్మాయినీ పక్కకివెళ్ళి మాట్లాడుకోమన్నప్పుడు వాళ్ళు ఈ రూమ్‍లోకి వచ్చి మాట్లాడుకుంటారు. వాళ్ళేం మాట్లాడుకున్నారో నువ్వు జాగ్రత్తగా విని చెప్పు. అసలే ఆ అమ్మాయి చాలా చలాకీగా కనిపిస్తోంది. మనవాడిని ఏమేం అడుగుతుందో తెలిస్తే మన జాగ్రత్తలో మనం వుండొచ్చు” అంటూ నేను వద్దంటున్నా వినకుండా నా చేయిపట్టి బాల్కనీలోకి లాక్కుపోయి, అక్కడ నన్ను వదిలేసి వదిన హాల్లోకి వెళ్ళిపోయింది. ఇంక నా పరిస్థితి యేం చెప్పను.. ఒకవైపు నడుం దగ్గర మంట మరోవైపు దొంగలా బాల్కనీలో దాక్కోవల్సిన పరిస్థితి..ఆటలో అరటిపండులా వుంచుతానన్న వదిన నన్నిలా అకస్మాత్తుగా ఆటలోకి లాగేస్తుందని ఎలా అనుకోగలను? వదిన మీద పీకల్దాకా కోపం వచ్చింది.

ఇంకా నన్ను నేను సంబాళించుకుంటుండగానే ఆ రూమ్‍లోకి రాజీవ్, రేఖ వచ్చిన సవ్వడైంది. వదినని తిట్టుకుంటూనే ఆమె కోసం తలుపుకి చెవి ఆనించేను. ఢబాలున తలుపు తెరుచుకుంది. ఆ తలుపుకి ఆనుకుని వున్న నేను ముందుకి తూలిపడబోతుంటే  రేఖ లాఘవంగా పట్టుకుంది. దొరికిపోయిన దొంగలా వెర్రిమొహం వేసాను. హాల్లోంచి ఒక్కొక్కరూ ఆ రూమ్‍లోకి వచ్చారు.

వదిన గబగబా నా దగ్గరికి వచ్చి, “అయ్యయ్యో స్వర్ణా.. దెబ్బేం తగల్లేదు కదా!..” అంటూ నా చేతులు పట్టుకుంది. అన్నయ్య వదినని పక్కకి తప్పించి నా దగ్గరికి వచ్చి, “సారీ చెల్లాయ్.. వదిన ఇలా చేస్తుందని తెలీదు. వెర్రిమొహంది..పిన్నికి ఏదో సాయం చెయ్యాలనుకుని నిన్ను ఇలా ఇబ్బందిలో పడేసింది.” అంటూ బాధపడ్డాడు.  తెల్లబోయి చూస్తున్న నన్ను రాజీవ్ అక్కడే వున్న కుర్చీలో కూర్చోబెట్టి, “ఏమనుకోకండీ.. అసలు సంగతి మా అక్కకి తెలీదు.. నేనూ రేఖా ఆల్రెడీ ఆన్లైన్లో చాటింగ్ చేసుకుని, ఒకరి గురించి ఇంకొకరం తెలుసుకున్నాం. ఒకసారి పర్సనల్‍గా కలుసుకుని మా పేరెంట్స్ ని పిలిచి ఆ విషయం చెప్దామనుకున్నాం. కానీ ఈ లోపల మా అమ్మ, అక్క కలిసి ఇలా చేస్తారనుకోలేదు.

నా వల్ల మీరు పడ్ద ఇబ్బందికి నన్ను క్షమించండీ..” అన్నాడు. అప్పటికి కాస్త తేరుకున్న నేను “అంటే మీరిద్దరూ ముందే డిసైడ్ చేసేసుకున్నారా?” అన్నాను ఆశ్చర్యంగా.  వదిన ముందుకు వచ్చి, “చూసేవా స్వర్ణా, వీళ్ళిద్దరూ అప్పుడే అన్నీ మాట్లాడేసుకున్నారుట.” అంది. నాకు ఒక రకమైన ఉక్రోషం వచ్చేసింది. “మరి ఉప్మా చేయించవూ రేఖ చేతా?” అనడిగాను వదినని. అది విని నవ్వుతూ రేఖ ముందుకు వచ్చింది.. “నేను  అదీ నేర్చేసుకున్నానండీ. రాజీవ్ చెప్పాడు.” అంది కాస్త సిగ్గుపడుతూ.. ఆ మాటలకి అక్కడున్న అందరం నవ్వకుండా వుండలేకపోయాం..

మరిన్ని కథలు
sangeetapoti