Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
maa vadina ..nenu..upma..

ఈ సంచికలో >> కథలు >> సంగీత పోటీ

sangeetapoti

పూర్వం  మాళవ  రాజ్యాన్ని  కీర్తి సింహుడు  అనే  రాజు  పరిపాలించేవాడు. కీర్తి సింహుడి తండ్రి  సమరసింహుడు ఆకస్మికంగా మరణించటంతో ఆ రాజ్యానికి ఏకైక వారసుడు అయిన కీర్తి సింహుడు  చిన్న  వయసులోనే  సింహాసనం అధిష్టించాడు.  తండ్రి అకాల మరణం తో  గురుకులం లో  తన  విద్యాభ్యాసాన్ని అర్ధంతరంగా ముగించుకొని రాజ్య పాలన బాధ్యత లను స్వీకరించవలసి వచ్చింది. అలా  అనుకోకుండా  చిన్న  వయసులోనే  రాజ పదవి  చేపట్టటంతో  కీర్తి  సింహుడికి  కొద్దిగా  అహంకారం పెరిగింది. తండ్రి సమర  సింహుడి  శాంత స్వభావానికి పూర్తిగా విరుద్ధమైన స్వభావం కల కీర్తి సింహుడు  తాను  దేశానికి  రాజుని  కనుక  తన  మాటే వేదంగా, తన  వాక్కే  శాసనంగా   తన  మంత్రులు,  రాజోద్యోగులు,  ప్రజలు  అందరూ  పాటించాలని భావించేవాడు. తన తండ్రి కి అత్యంత  ఆప్తుడు,  ఆ రాజ్యానికి  ఎంతో కాలంగా  మంత్రిగా ఎనలేని సేవలు అందిస్తున్న విక్రమసేనుడు సైతం అతని  దుడుకు స్వభావాన్ని గమనించి, వీలైనంత గా  మంచి సలహాలు చెప్పి కీర్తి సింహుడిని  మార్చాలని ప్రయత్నించాడు.   కానీ  కీర్తి  సింహుడు పరిపాలనా  సంబంధిత  విషయాలలో తప్ప మిగతా విషయాలలో ఆయన మాటలను ఏ మాత్రం పట్టించుకొనే వాడు కాదు.  తను  చేయ దలచిన పనులను  మరో  ఆలోచన  లేకుండా  చేసేసేవాడు.  అతని  మొండి స్వభావం గురించి  తెలిసిన వారు  ఎవ్వరూ  కీర్తి  సింహుడి  మాటకు  ఎదురు  చెప్పే  ధైర్యం  చేసేవాళ్ళు  కాదు.  ఎవరైనా  చెప్పాలని చూసినా  వారిని అందరి ముందూ   అవమానకరంగా మాట్లాడి చిన్నబుచ్చేవాడు.  రాజ మాత  సైతం  తన  కుమారుడి ని  పల్లెత్తు మాట  అనటానికి  జంకేది.

కీర్తి సింహుడుకి కొద్దిగా సంగీతం లో  ప్రవేశం ఉన్నది. గురుకుల చదువు  అర్ధంతరంగా ముగించటం వలన  సంగీతం సాధన కూడా మధ్యలో వదిలేయవలసి వచ్చింది. సంగీతంలో  పూర్తిగా పట్టు సాధించ లేకపోయాడు. తనకున్న మిడి మిడి  జ్ఞానాన్నే గొప్పగా భావించుతూ తనకు  సంగీతం గురించి ఎంతో తెలుసు అని, తానో సంగీత సామ్రాట్టు ననీ  భావించేవాడు.  కీర్తి సింహుడి తండ్రి సమర సింహుడికి లలిత కళలంటే  ముఖ్యంగా సంగీతం అంటే  చాలా ఇష్టం. కీర్తి సింహుడి  తల్లి కూడా చక్కటి సంగీత విద్వాంసురాలు.  సమర సింహుడి హయాము లో  మాళవ  దేశం లో  గాయకులకు,  కళాకారులకు, నాట్యకారులకు చక్కటి ఆదరణ ఉండేది.  కీర్తి సింహుడు రాజు అయ్యాక గాయకులకు, కళాకారులకు క్రమేణా ఆదరణ తగ్గిపోసాగింది.  నటులను, నాట్యకారులను, గాయకులను నిండు సభలో  నిష్కారణంగా విమర్శించి వారిని  అవమానించి ఆనందించేవాడు కీర్తి సింహుడు. తమ తమ రంగాలలో ఎంతో ప్రతిభా వ్యుత్పత్తులు చూపించి ఉద్దండులు గా పేరు తెచ్చుకొని కీర్తిసింహుడి  తండ్రి హయాములో ఎంతో  ఆదరణ పొందిన కళాకారులు క్రమేణా వేరే దేశాలకు వలస పోవటం మొదలు పెట్టారు.  మరి కొందరు పుట్టి పెరిగిన దేశం అనే  అభిమానం తో  సరైన ఆదరణ లేక పోయినా ఎప్పటికైనా మంచి రోజులు  రాక పోతాయా అనుకుంటూ ఆ  కొలువులో అలాగే కొనసాగుతున్నారు.

కీర్తి సింహుడు సింహాసనాన్ని అధిష్టించి  ఐదు సంవత్సరాలు అయిన  సందర్భంగా మాళవ దేశం అంతటా ఘనంగా వేడుకలు జరపాలని నిర్ణయించారు.  ఐదు రోజుల పాటు  విందులు, నృత్య గాన వినోదాలు జరపాలని నిర్ణయించారు. నృత్య గానాదు లలో  పోటీలు నిర్వహించి విజేతలకు బహుమానాలు ఇవ్వాలని నిర్ణయించారు.

పనిలో పనిగా ఆస్థాన గాయకుడి పదవి కూడా  ఖాళీ గా ఉన్నందున ఆ పదవికి కూడా నియామకం జరపాలని రాజమాత పనుపున   మంత్రి విక్రమ సేనుడు నిర్ణయించాడు. నృత్య పోటీలను నిర్వహించి విజేతల ను ఎంపిక చేశాక సంగీత పోటీలను  నిర్వహించాలని మంత్రి  విక్రమసేనుడు తలపెట్టాడు. అయితే  సంగీత పోటీకి తానే న్యాయ నిర్ణేత గా ఉంటానని కీర్తి సింహుడు చెప్పటంతో  రాజు కోరికని తిరస్కరించ లేక సరేనని తల  ఊపాడు మంత్రి విక్రమ సేనుడు.

సంగీత పోటీలు నిర్వహించే గడియ రానే వచ్చింది.  దేశం నలుమూలల నుండే కాకుండా విదేశాల నుంచి కూడా గొప్ప గాయనీ గాయకులు పోటీలో పాల్గొనేందుకు వచ్చారు. ఒక్కొక్క గాయకుడు సంగీత కచేరీ ముగించగానే కీర్తిసింహుడు వారి గానం గురించి కాకుండా వారి  ఆకారం గురించి,  వారి కి ఉన్న అవకరాల గురించి వ్యాఖ్యానాలు చేయసాగాడు. ఒక గాయకుడు అధ్బుతంగా పాడాడు. ఆ గానానికి  సభ మొత్తం తన్మయమైపోయింది.  ఆ గాయకుడికి కుడి కన్ను కొంచెం మెల్ల.  కీర్తి సింహుడు ఆ మెల్ల గురించి ప్రస్తావించి  "మెల్ల కంటి సంగీతం"  అంటూ విమర్శించటం తో బాధ పడిన  ఆ గాయకుడు అవమాన భారంతో తల వంచుకుని సభ నుండి నిష్క్రమించేలా చేసాడు. మరొక  గాయకుడికి  ఘట వాయిద్యం లాంటి  బొజ్జ  ఉన్నందున అతను  "బొజ్జతో  పాడినట్లుంది"  అని ఎగతాళి చేసాడు కీర్తి సింహుడు.  మరొకరు పాడిన సంగీతాన్ని "గార్ధభ సంగీతం" అంటూ విమర్శించాడు.  తనకు సంగీతం లో  అంతంత మాత్రమే ప్రవేశం ఉన్నా  శాస్త్రీయ సంగీతాన్ని అవుపోసన పట్టిన ఉద్దండులను సైతం వారి వారి  బాహ్య రూపాలను, అవకరాలను ఎంచి కించ పరచటం చేయ సాగాడు.  రాజు కాబట్టి  ఎవరూ ఎదురు తిరిగి మాట్లాడలేక మౌనంగా తల దించుకుని నిష్క్రమించేవారు.

ఇలా ఐదు రోజుల పాటు సాగిన సంగీత పోటీలు రసాభాస గా ముగియ నున్న సమయంలో ఒక గాయకుడు సభలోనికి ప్రవేశించాడు. అతను తల నుండి పాదాల వరకు వల వంటి వస్త్రం కప్పుకున్నాడు. అతని రూపు రేఖలు సరిగా గుర్తు పట్టలేని విధంగా ఉన్నాడు.  అతను మహారాజు కి  నమస్కరించి తానూ సంగీత పోటీలో పాల్గొనేందుకు వచ్చానని తనది మాళవ రాజ్యానికి పక్కన ఉన్న వైదేహి రాజ్యం అని చెప్పాడు.  అయితే తన గురువు గారు విధించిన నిబంధన ప్రకారం తను ఆ వల వంటి వస్త్రం లేకుండా పాడలేను కనుక తనకు ఆ వస్త్రం ధరించే పాడేందుకు అవకాశం ఇప్పించమని కోరాడు. ఏ కళ నున్నాడో  కీర్తిసింహుడు ఆ గాయకుడి కోరికకు  అంగీకరించాడు.  సంగీత కచేరి ఆరంభం అయింది.  ఆ గాయకుడు  గొంతెత్తి పాడుతూ ఉంటె సభ మొత్తం తన్మయులై పోయారు. పాట ముగిసే సరికి సభా ప్రాంగణం చప్పట్లతో మార్మ్రోగి పోయింది.  కీర్తి సింహుడు సైతం ఆ గానం లో  లీనం అయిపోయాడు. అప్రయత్నంగా కీర్తి సింహుడి నోటి నుండి  "బాగు బాగు. శహబాష్ " అనే  మాటలు వెలువడ్డాయి.  అదే సరి అయిన అవకాశం గా భావించిన విక్రమసేనుడు వెంటనే ఆ గాయకుడు సంగీత పోటీలలో విజేత అని ప్రకటించాడు. కీర్తి సింహుడు సైతం ఆ నియామకానికి అభ్యంతర పెట్టటానికి ఏ విధమైన అవకాశం లేక పోవటంతో మౌనంగా తల  ఊపాడు.  విజేత గా ప్రకటించ బడ్డాక ఆ గాయకుడు తను కప్పుకున్న వల లాంటి  వస్త్రాన్ని నెమ్మదిగా తొలగించాడు. ఆశ్చర్య కరంగా  అతను  అంతకు ముందు రోజులలో జరిగిన పోటీలలో కీర్తి సింహుడు "మెల్ల కంటి సంగీతం"  అని వెక్కిరించిన గాయకుడే !!

అప్పుడు మంత్రి విక్రమ సేనుడు ఇలా  చెప్పాడు "మహా రాజా సంగీతం అనేది కేవలం చెవులతో విని మనసుతో   ఆస్వాదించేది. సంగీతం అనేది దైవ దత్తమైన విద్య.  అది అందరకూ సాధ్యమయ్యే విద్య  కాదు. సంగీతానికి రూపు రేఖలతో ప్రమేయం లేదు.  చక్కటి గాత్రం, సంగీత శాస్త్రం పై అవగాహన ఉన్న వారే గాయకులుగా రాణించగలుగుతారు.  మీరు ఇంతకు ముందు అనేక మంది గాయకుల  గానాన్ని  విన్నా వారి గానం కన్నా వారి  రూపు రేఖలకు అధికమైన ప్రాధాన్యత ఇవ్వటం వలన, మీ దృష్టి అంతా వారి రూపు రేఖల పైనే  ఎక్కువగా కేంద్రీకరించినందువలన వారి  వారి సంగీత ప్రజ్ఞా పాటవాలను పూర్తిగా గమనించలేక పోయారు. అందుకే ఈ గాయకుడు తన రూపు రేఖలు కనుపించకుండా కేవలం తన గాత్రం మాత్రమే మీరు వినేలా చేశాడు. ఇతడి రూపు రేఖలు కనుపించ నందువలన తమరు అతని గానాన్ని పూర్తిగా ఆస్వాదించారు" అని ముగించాడు.

"మీరు చెప్పినది నిజమే.  ఈ  గాయకుడు ఈ పోటీలో అసలైన విజేత" అంటూ అంగీకరించాడు  కీర్తి సింహుడు. ఈ విధంగా ముఖ కవళికలు తెలియకుండా సంగీత పోటీలో పాల్గొనమని సలహా ఇచ్చిన  రాజ మాతకూ తన ఎంపికకు సహకరించిన మంత్రి విక్రమ సేనుడికి మనసులోనే కృతఙ్ఞతలు తెలుపుకున్నాడు ఆస్థాన గాయకుడు గా నియమితుడైన శ్రీధర శాస్త్రి.

**********************************

మరిన్ని కథలు