Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope 16th december to 22nd december

ఈ సంచికలో >> శీర్షికలు >>

గోతెలుగు కథా సమీక్షలు - ..

కథ : తీరని రుణం
రచయి   చెన్నూరి సుదర్శన్
సమీక్ష : రాచమళ్ళ ఉపేందర్  
గోతెలుగు 65వ సంచిక!

సృష్టిలో అపూర్వమైనది అమ్మ.

అమ్మ మీద ఎన్ని కథలు రాసినా ఆమెలోని  ప్రేమ, కరుణ, ఆప్యాయతల,  పిల్లల కోసం చేసే త్యాగాల గొప్పతనం ఇంకా మిగిలే వుంటుంది.
అలాంటి అమ్మనే కథా వస్తువుగా గోతెలుగు 65వ సంచికలో ప్రచురితమైన కథ  "తీరని రుణం".  పఠితుల గుండెల్లో ఆర్ర్థత ను నింపుతూ, మంచి అనుభూతి కలిగిస్తూ ఆద్యంతం కథను అందంగా మలిచిన శ్రీ చెన్నూరి సుదర్శన్ గారికి అభినందనలు.

ఈ కథలో ఉద్యోగ విరమణ పొందిన శ్రీనివాస్ మిగిలిన జీవితం భార్య అన్నపూర్ణతో హాయిగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా గడపాలని ప్రణాళిక సిద్దం చేసుకుంటాడు. ఆ ప్రణాళికలో భాగమే పదవీ విరమణ తరువాత రోజు భార్యతో సరదాగా గడపటానికి సినిమాకు కారులో బయలుదేరుతాడు.

ఇక్కడి వరకు జరిగిన కథలో సరదా సంభాషణలు. ఆలుమగలు మధ్య ఉండే  ప్రేమానురాగాలు  రక్తి కట్టించడంలో రచయిత ప్రదర్శించిన నైపుణ్యం అమోఘం.

అలా సినిమా హాలు వైపు దూసుకెళ్తున్న కారు రోడ్దు మీద సడన్ గా ఆగిపోవటం, రోడ్డు ప్రక్కన చెట్టు క్రింద దీనంగా కూర్చున్న వృద్దురాలిని శ్రీనివాస్ తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టడంతో మొదట ఆశ్చర్యపోయిన అన్నపూర్ణ ఆ తర్వాత నిశ్చేష్టురాలౌతుంది. అక్కడితో ఆగకుండా ముసలావిడ శాంతమ్మను ఇంటికి తీసుకొచ్చి, శ్రీనివాసే స్వయంగా అన్నం తినిపించడంతో అన్నపూర్ణ మనసు భగ్గున మండుతుంది.
జాలిడే ట్రిప్ క్యాన్సిల్ కావడంతో అలక పానుపు ఎక్కుతుంది అన్నపూర్ణ. శ్రీనివాస్ చాలా ఏళ్ళుగా అటక మీద దాచుకున్న సుటుకేసులోంచి భద్రంగా దాచిపెట్టిన ఫోటోను అన్నపూర్ణకు చూపిస్తాడు. ఆ ఫోటోలో ఒక తల్లి బిడ్డకు చనుబాలిస్తున్న అపూర్వ దృశ్యం చూడగానే మళ్ళీ ఆశ్చర్యపోతుంది అన్నపూర్ణ.

ఆ ఫోటోలొని తల్లి శాంతమ్మేనని, ఆ బిడ్డ తల్లి కానుపులోనే చనిపోయిందని, పోత పాలు బాబుకు సరిపడక వాంతులు, విరేచనాలు అవుతుంటే...శాంతమ్మ తన పాలిచ్చి ఆ బాబులు ప్రాణాలు కాపాడింది అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటాడు శ్రీనివాస్.

“ఎవరి బిడ్డకో ఈవిడ పాలిస్తే మనమెందుకు ఆదరించాలి?’’ అంటూ కొంచెం పరుషం ప్రదర్శించింది అన్నపూర్ణ. శ్రీనవాస్ “ఆబిడ్డ ఎవరో కాదు. అనూ...! నేనే...” అంటుండగా  దుఃఖం పొంగుకొచ్చింది..  గొంతు కూరుకు పోయింది.    అన్నపూర్ణ నిశ్చేష్టురాలైంది... అంటూ... అప్పటి వరకు ఉత్కంఠగా సాగుతున్న కథనాన్ని తారాస్థాయికు చేర్చాడు రచయిత.  

దీంతో అప్పటి వరకు కథతో పరుగులు  తీసిన పాఠకుడు ఆలోచనా తరంగాల్లో మునిగిపోతాడు. కంటి నిండా కన్నీళ్ళను నింపుకుంటాడు. మాతృ హృదయానికి మనసు నిండా జేజేలు పలుకుతాడు. అందుకే ఇది ఖచ్చితంగా మంచి కథ.

నవ మాసాలు మోసిన కన్నతల్లిని  వీధిపాలు చేస్తూ చేతులు దులుపుకుంటున్న నేటి తరానికి… కనకపోయినా కడుపునిండా పాలిచ్చిన తల్లి శాంతమ్మను ఆదరించిన శ్రీనివాస్ పాత్రను ఆదర్శంగా తీర్చిదిద్దిన రచయితకు అభినందనలు. కథలోని సారమంతా బొమ్మలోనే జీవం పోస్తూ.. మేలిమి చిత్రంతో అలరించిన మాధవ్ గారికి శుభాభినందనలు.

చివరిగా...
 

రచయిత అనుభవమూ, ప్రతిభకు హారతి పట్టే "అయినా బిడ్డలమీద కోపం నీళ్ళ మీద దెబ్బలాంటిది. ఎన్నాళ్ళుంటుందిలే... నాలుగు రోజులైతే వాళ్ళే కలిసిపోతారు..." లాంటి వాక్యాలు కథలో అక్కడక్కడ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి.

కథ చదివిన వారు మళ్ళొకసారి చదవండి.... చదవని వారు వెంటనే చదవండి. ఎందుకంటే ఇది అమ్మ కథ.. ఎప్పటికి మనం రుణం తీర్చుకోలేని అమ్మ కథ.

ఈ కథను ఈ క్రింది లింక్ లో చదవచ్చు....http://www.gotelugu.com/issue65/1780/telugu-stories/teerani-runam/

 

మరిన్ని శీర్షికలు
types of pains treatment