Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

 

గతసంచికలో ఏం జరిగిందంటే....http://www.gotelugu.com/issue192/553/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/

ఎగిరిన తల కిందకు జారే లోపలే మరో బాణం దూసుకొచ్చి ఆ తలను మరింతగా గాల్లో ఎత్తుకు లేపింది. బాణాల వెంబడే బాణం మీద బాణం ప్రయోగిస్తూ శర వేగంతో దూసుకొస్తున్న ధనుంజయుని అప్పుడు చూసారంతా.
ఎప్పుడైతే మాంత్రికుడి తల మొండెం నుండి వేరైందో ఆ మరు క్షణమే కణ కణ రుగులుతున్న అగ్ని వలయం చుట్టూ ఎవరో నీరు పోసి ఆర్పినట్టు చప్పున ఆరి పోయింది. తల లేని మొండెంగా నిల బడున్న మాంత్రికుడు రోదిస్తున్నట్టుగా గుండెలు బాదుకోవటం చూసి నివ్వెర పోయారంతా. అదే క్షణంలో ధనుంజయుని వెనకే ఆడు చిరుతలా ఈటె పుచ్చుకుని రంకె వేస్తూ దూసుకొస్తున్న భద్రా దేవిని చూసి మతి పోగొట్టుకున్నారు. అసలక్కడ ఏం జరుగుతుందో కొద్ది సేపు నాగ లోక వాసులకి అర్థం కాలేదు. అయితే తాము ఇంత మంది ఉండీ చేయ లేని కార్యాన్ని ఒక సాహస వీరుడు సాధించాడు. నాగ రాజు కాపాడ బడుతున్నాడని గ్రహించి ఆనంద భాష్పాలు రాలుస్తున్నారు.
భగ భగ మండుతున్న ఈటెలతో అగ్గి పిడుగులా దూసుకొస్తున్న భద్రా దేవి ఆరి పోయిన అగ్ని వలయాన్ని చెంగున ఒక్క దూకులో దాటింది. అక్కడి నుంచే ఈటెను గురి చూసి మాంత్రికుని ఛాతీ మీదకు బలంగా విరిసింది.
తృటిలో అది దూసుకెళ్ళి మాంత్రికుడి ఛాతీ లోకి బలంగా దిగ బడింది. ఈటె నాటుకున్న విసురుకు తూలి వెల్లికిలా పడి పోయింది మొండెం. ఛాతీ మీద ఈటె భాగం తగల బడుతోంది. భద్రాదేవి వస్తూనే పక్కన పళ్ళెంలో వున్న గుగ్గిలం పసుపు కుంకుమల్ని వాడి మీద వెదజల్లింది. అంతే` మాంత్రికుడి శరీరం భగ భగా మంటల్లో చిక్కి ఒక్క సారిగా తగల బడి పోనారంభించింది. అయినా సరే `
నెత్తుటి మడుగులో తగల బడుతున్నా వాడి చేతులు ఛాతీని కొట్టుకోవటం ఆపలేదు. అంటే` శిరస్సు నశిస్తే గాని వాడి ప్రాణాలు పోవని గ్రహించింది భద్రా దేవి. అవతల ధనుంజయుడు మాంత్రికుడి శిరస్సు పైనే గురి వుంచి హోమ గుండాన్ని చుట్టి పరుగెడుతూ బాణాలు సంధించి శిరస్సుతో చెండాడుకొంటున్నాడు. అది హోమ గుండానికి నేరుగా వచ్చేలా చూస్తున్నాడు. అతడి వేగం, ధనుస్సు ఎక్కు పెట్టి బాణాలు సంధిస్తున్న తీరు నాగ లోక వాసుల్ని అబ్బుర పరుస్తున్నాయి. ఈ లోపల`
సర్రున ఒర నుంచి ఖడ్గం దూపింది భద్రా దేవి.
మాంత్రికుడి మొండాన్ని కాలితో తొక్కి పట్టి రౌద్రంగా చూస్తూ` ‘‘నాగ రేడునే బలి యిచ్చెదవురా శునకమా! నీలాటి నీఛునికి గంధర్వ లోకాధిపత్యము కావలెనా? నీ మరణంతో ఇక్కడే గాదు, గంధర్వ లోక వాసులూ అదృష్టవంతులవుతారు. ఇంకా ఎంతసేపు కొట్టుకొనెదవురా... చావుమురా’’ అంటూ ఆవేశంతో ఆ మొండెం నుండి కాలు చేతుల్ని నరికి వేరు చేసింది.
ఇక్కడ అందరి కన్నా మిక్కుటంగా అమితాశ్చర్యంతో బాటు హతాశుడై చేష్టలు దక్కి చూస్తున్నవాడు వక్ర దంతుడు. పక్కనున్న మాయా శృంగుడికైతే మతి లేదు. చివరికి భయ పడినంతా అయింది. ధనుంజయ, భద్రా దేవి ప్రవేశంతో కథ మొత్తం మారి పోయింది అనుకుంటూ నేలకు పాతిన కొయ్యలా ఏం చేయాలో తోచక చేష్టలు దక్కి చూస్తున్నాడు. వక్ర దంతుడికైతే నాగ లోకాధిపతి కావాలన్న తన కల కళ్ళ ముందే కరిగి పోతున్నట్టుంది. జడల మాంత్రికుడు చావ కూడదు. ఏదో ఒకటి చేయాలి. ధనుంజయుడు ఆ తలను నేల బడకుండా చూస్తున్నాడంటే అది కింద పడితే మాంత్రికుడు బ్రతుకుతాడేమో... చివరి ప్రయత్నంగా అడ్డం పడేందుకు ధనుంజయుని వైపు కదులుతూ అక్కడ పడున్న బలి ఖడ్గం అందుకున్నాడు.
మరో రెండు బాణాలతో గాలి లోకి మాంత్రికుడి శిరస్సు నేరుగా అగ్ని గుండంలో పడి పోగలదు. కాని వక్ర దంతుడు అడ్డం పడితే సాధ్యం గాదు. ఓ పక్క బాణాలు సంధిస్తూ వాడి ఖడ్గం నుంచి తప్పించు కోవటం దుస్సాధ్యం. ఓర కంట వాడ్ని గమనించ గానే ధనుంజయుని కోపం తారా స్థాయికి చేరుకుంది.. వెంటనే` ‘‘భద్రా!’’ అనరిచాడు.
‘‘ఈ గుంట నక్క సంగతి చూడుము. ఆ రోజు నీ నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు నీ చేతిలో చావు తప్పదు. వాడిని వదలకుము’’ అంటూ హెచ్చరించాడు.
ధనుంజయుని పిలుపుతో చివ్వున అటు తిరిగింది భద్రా దేవి. బలి ఖడ్గంతో ధనుంజయునే అంతం చేయాలని దూకుతున్న వక్ర దంతుని చూడగానే కోపంలో నిప్పు కణంలా మారిందామె. నెత్తురోడుతున్న ఖడ్గంతో శర వేగంగా పరుగెత్తి వక్ర దంతుని మార్గానికి అడ్డంగా నిలిచింది. ఒకే వేటుతో వాడి చేతిలో బలి ఖడ్గం జారి పోయేలా చేసింది. అదే సమయంలో ధనుంజయుని కృషి ఫలించింది. గాలి లోని మాంత్రికుడి శిరస్సు గింగిరాలు తిరుగుతూ వచ్చి నేరుగా హోమ గుండంలో పడింది. అంతే`
వాడి జడలను అగ్నికీలలు ఆబగా కబళించనారంభించాయి. చిట పట పేలుతూ మాంత్రికుడి జుత్తుతో బాటు తల దగ్థం గానారంభించింది. సరిగ్గా ఇక్కడే ఒకింత గందరగోళ పరిస్థితి నెలకొంది.
బలి ఖడ్గం చేజార గానే వక్ర దంతుడు ప్రాణ భయంతో భద్రా దేవికి దూరంగా పారిపో నారంభించాడు. వాడ్ని వదిలే వుద్దేశం ఆమెకు లేదు. వెంటడింది. ఇక్కడ ఎప్పుడైతే జడల మాంత్రికుడి జడలు అగ్నిలో తగల బడటం ఆరంభమైందో మరు క్షణం వాడి మంత్రశక్తులూ అంతరించ నారంభించాయి. దాంతో అంత వరకు బండకు బంధితుడై వున్న నాగ రేడుకు విముక్తి లభించింది. వెంటనే పది శిరముల సర్ప రూపం నుండి తన గంభీర పురుషాకృతి ధరించి గద భుజాన వేసుకున్నాడు. అటు అంత వరకు నేలకు పాతిన కొయ్య బొమ్మల్లా వున్న నాగ లోక వాసుకూ విముక్తి లభించి కదిలారు. వారి లోని వక్ర దంతుని మద్దతు దారులు సుమారు యాభై అరవై మంది వరకు భద్రా దేవి నుంచి వక్ర దంతుని కాపాడేందుకు ఆయుధాలు ఝుళిపిస్తూ కేకలు అరుపులతో పరుగులెత్తుకు రాసాగారు.
భద్రా దేవి ఖడ్గ ప్రహరా నుంచి రెండు మార్లు తప్పించుకున్న వక్ర దంతుడు ఇక భద్రా దేవి తనను విడువదని అర్థం కాగానే ప్రాణ భయంతో తప్పించుకోడానికి అదృశ్యమై ఆకాశ మార్గం వైపు పోబోయాడు. కాని భద్రా దేవి తన మంత్ర శక్తితో వాడిని కిందకు లాగింది. గాలి లోనే అదృశ్య శక్తి క్షీణించి దబ్బున క్రింద పడ్డాడు వక్ర దంతుడు.
‘‘ఇంత జేసి ఎచటకు పారి పోయెదవురా నీఛుడా! ఆనాడు నా సఖుడు ధనుంజయుల వారు ప్రాణ భిక్ష పెట్టగా తప్పించుకొంటివి. వారినే వధింప కత్తి లేపిన నిన్ను క్షమింప. ఇక నీవు తప్పించుకో లేవు. నీవు చావక తప్పదు’’ అనరుస్తూ తన వైపు దూసుకొస్తున్న భద్రా దేవిని చూసి వణికి పోతూ చివ్వున లేచి తన కోసం వస్తున్న మద్దతు దారుల మధ్యకు పరుగు తీసాడు. అయినా వదల్లేదు. ఛురిక తీసి విసిరింది. గాలిని చీల్చుకు దూసుకెళ్ళిన ఛురిక వక్ర దంతుని వీపు భాగంలో పడి వరకు దిగ బడి పోయింది. ‘కెవ్వున’ అరిచి బోర్లా పడి పోయాడు వక్ర దంతుడు. పడి లేచే లోన సుడి గాలిలా వచ్చిన భద్రా దేవి ఒకే వేటుతో వాడి తల నరికేసింది. అంతే కాదు, వాడికి మద్ధతుగా వచ్చిన నాగుల మీద వీరావేశంతో విరుచుకు పడి వీర విహారం చేయనారంభించింది. ఆమెకు అండగా వెనకే ధనుంజయుడు రావటంతో సంకుల సమరం ఆరంభమైంది. మరో ప్రక్క వారికి సాయంగా నాగ రేడు కూడ గదాయుధంతో దొరికిన వాడ్ని దొరికినట్టు పచ్చడి చేస్తూ పోరాటం లోకి వచ్చేసాడు. ఉన్నట్టుండి` ‘‘ధనుంజయా....’’ అనరిచాడు.
‘‘వక్ర దంతుడి సాయ పడిన మాయాశృంగుడు తప్పించుకుని గగన మార్గంగా పారిపోవుచున్నాడు. వాడిని నేలకూల్చుము’’ అంటూ హెచ్చరించాడు.
స్వయంగా నాగ రాజే తనను పిలిచి హెచ్చరించటం ధనుంజయునికి ఉత్సాహాన్ని, బలాన్ని ఇచ్చింది. వెంటనే ఆకాశం వంక చూస్తూ ధనుస్సు ఎక్కు పెట్టాడు. అప్పటికే చాలా దూరం పైకి వెళ్ళి పోయాడు మాయా శృంగుడు.
బాణాన్ని చెవి వరకు లాగి గురి చూసి వదిలాడు ధనుంజయుడు. అతడి గురి తప్పదు. తుమ్మెదలా ఝుంకారం చేస్తూ దూసు కెళ్ళిన బాణం ఏట వాలుగా మాయా శృంగుని వీపు భాగం నుండి గుండె ల్లోకి దూసుకు పోయింది. వాడి చావు కేకతో ఆ ప్రాంతం మారు మ్రోగింది. గాల్లో ఉండ గానే వాడి ప్రాణాలు ఎగిరి పోగా శరీరం గిరికీలు కొడుతూ వచ్చి హోమ గుండంలో పడి దగ్ధం గా నారంభించింది.
ఈ లోపల నాగ లోక సైనిక దళం బిల బిలా దూసుకొచ్చి ఆ ప్రాంతాన్ని చుట్టు ముట్టింది. అరుపులు ఆర్తనాదాలు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లనారంభించింది. ఇంతలో` ‘‘అక్కా!’’ అంటూ యువ రాణి ఉలూచీశ్వరి పెద్దగా అరవటం విన్పించి తృళ్ళి పడింది భద్రాదేవి. ధనుంజయుని వంక చూసింది. శతృ సంహారంలో నెత్తు రొడుతున్న ఖడ్గంతో ఎర్ర బడిన దుస్తులతో అగ్ని కీలలా ప్రకాశిస్తోంది భద్రా దేవి.
‘‘భద్రా! వీళ్ళ సంగతి మేము జూచెదము. నీవు ఉలూచీ వద్దకు పోయి ఏమి జరిగినదో చూడుము’’ ఓ పక్క పోరాడుతూనే చెప్పాడు ధనుంజయుడు.
వెంటనే అటు యిటు ఉన్న శత్రువుల్ని ఖడ్గంతో చెండాడి మార్గం జేసుకుని పోరు మొన నుండి బయట పడి ఉలూచీశ్వరి కోసం పరుగెత్తింది భద్రా దేవి.
ఈ పరిస్థితిలో ఓ పక్క నాగ రేడు ఉగ్ర రూపంతో తన గదాయుధంతో విజృంభించగా మరో వంక ధనుంజయుడు తన ఖడ్గ ప్రహరాతో వూచ కోత కోస్తున్నాడు. మొదట వక్ర దంతుని మద్దతు దారులు యాభై అరవైకి మించరనుకుంది పొరబాటే. సుమారు మూడు వందల మందికి పైగా ఉంటారు. ఇక నాగ భటుల ప్రవేశంతో వాళ్ళు కూడ దొరికిన వాళ్ళను దొరికినట్టు వధించ సాగారు. వక్ర దంతుని మరణంతో చాలా మంది పారి పోవాని చూసారు గాని ఎవరినీ వదిలే ఉద్దేశం లేదు. చూస్తూండగానే వాళ్ళ సంఖ్య తరిగి పో నారంభించింది.
ఇలా వుండగా`
అంతకు ముందే`
ఆరంభంలో ఎప్పుడైతే ధనుంజయ భద్రాదేవిలు పొదల వెనక నుండి జడల మాంత్రికుని వైపు కదిలారో ఆ వెను వెంటనే ఉలూచీశ్వరి తెలివి తప్పి పడున్న తన తల్లి కీర్తి మతి వద్దకు పరుగెత్తింది. ఆమె ననుసరించి శంఖు పుత్రి , భూతం ఘృతాచి వెళ్ళారు.
మహా రాణి కీర్తిమతి గాఢమైన మూర్చలో ఉలుకు పలుకు లేకుండా పడుంది. ఉలూచీశ్వరి తల్లి తలను ఒడిలోకి తీసుకుంది. ఆమె పరిస్థితికి ఆందోళన చెందింది. భూతం ఘృతాచి తృటిలో మడుగు వద్దకెళ్ళి నీరు తెచ్చింది. నీరు ముఖాన చల్లారు, బుగ్గలు తట్టారు, గాలి విసిరారు, శంఖు పుత్రి మహా రాణి పాదాలు రుద్దింది. ఎన్ని ఉప చర్యలు చేసినా మహా రాణికి తెలివి రాలేదు. ఈ లోపల మాంత్రికుడి శిరస్సు అగ్నిలో పడగానే వాడి మంత్ర శక్తి తొలగి నాగులు చైతన్యవంతుయ్యారు. రాజ కుటుంబానికి చెందిన స్త్రీలు, పరిచారికులు అంతా గుమి గూడి మహారాణి పరిస్థితికి విచారించ సాగారు. భద్రా దేవిని పిలిస్తే గాని పరిస్థితి చక్క బడదనుకుంది ఉలూచీశ్వరి. కాని అక్కడ హోరా హోరీ పోరులో వున్న భద్రా దేవిని పిలవాలా వద్దా అర్థం కాలేదు. కాని ఆత్రుత ఆపుకో లేక చివరికి ‘‘అక్కా’’ అంటూ ముమ్మారు ఎలుగెత్తి పిలిచింది.
ఆ పిలుపు వినగానే ధనుంజయుని సలహాతో పోరాటం నుంచి బయట పడి నేరుగా అక్కడికి పరుగెత్తు కొచ్చింది భద్రా దేవి. నెత్తురొడుతున్న ఖడ్గాన్ని ఒరలో వుంచుతూ అగ్ని పుష్పంలా వస్తున్న భద్రా దేవిని అబ్బురంగా చూస్తూ నాగ స్త్రీలంతా దారి వదిలారు.
‘‘ఏమైనది?’’ వస్తూనే అడిగింది భద్రాదేవి కీర్తిమతిని నిశితంగా చూస్తూ.
‘‘అక్కా... జనని... ఉలుకు పలుకు లేదు. ఎంత ఉపచరించినా తెలివి రాకున్నది.’’ అంటూ ఏడ్చేసింది ఉలూచీశ్వరి.
‘‘అరె... దీనికింత కలత ఏల? నేనున్నాగదా. కొంచెం తాళుము.’’ అంటూ వచ్చినంత వేగం గానూ వెను తిరిగి సమీపం లోని పొదల్లోకి వెళ్ళింది భద్రాదేవి. వెళ్ళిన మూడో నిమిషం లోనే అర చేయంత వున్న ఒక పచ్చని ఆకు, ఎరుపు రంగు లోని మరో చిన్న ఆకులతో తిరిగి వచ్చింది. అవి రెండూ అర చేతిలో వుంచి నలిపి బాగా అదిమి పిండి కీర్తిమతి నాసికా రంధ్రాల్లో రెండు చుక్కలు పిండింది. అంతే`
బలంగా రెండు సార్లు తుమ్మి స్పృహ లోకి వస్తూ లేచి కూచుంది కీర్తి మతి. ఉలూచీశ్వరిని చూస్తూనే దుఖ్ఖం ఆపుకో లేక విలపిస్తూ` ‘‘వచ్చినావా తల్లీ... చూచితివా ఈ ఘోరం... మీ జనకుని ఆ నీచ మాంత్రికుడు...’’ అని చెప్ప బోతుంటే వారించింది ఉలూచీశ్వరి.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atadu..aame..oka rahasyam