Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nagalokayagam

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు...ఆమె... ఒక రహస్యం!

గతసంచికలో ఏం జరిగిందంటే ..... http://www.gotelugu.com/issue192/555/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/

(గతసంచిక తరువాయి)..“ఆత్మహత్య చేసుకోవడానికి  రక రకాల పద్దతులున్నాయి. ఉరి వేసుకుని మరణించడం, మణికట్టు నరాలని కోసుకోవడం, హానికరమైన రసాయనాలని లేదా  క్రిమి సంహారక మందులని మింగడం ఇవన్నీ ఒక రకమైనవి అయితే, నిద్ర మాత్రలని మోతాదుని మించి మింగడం అన్నది మరొక రకమైన పద్దతి.  సాధారణంగా ఆవేశంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాళ్ళు మొదటి విధానాలని అనుసరిస్తారు. నిదానంగా ఆలోచించి జీవితాన్నుంచి నిష్క్రమించాలని ఒక స్థిర నిర్ణయానికి వచ్చిన వాళ్ళు మాత్రమే  ఆత్మహత్య చేసుకోవడానికి నిద్ర మాత్రలని ఆశ్రయిస్తారు.

కాసేపు రాజేంద్రది ఆత్మహత్యేననుకుందాం. అందుకు అతడు నిద్రమాత్రలని ఆశ్రయించాడంటే, ఆయన ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయం ఆవేశంలో తీసుకున్నది కాదని అర్ధమౌతోంది. అతడు ప్రశాంతంగా మరణించాలనుకున్నాడే తప్ప హింసాత్మక పద్దతిలో ప్రాణాలు  తీసుకోవాలనుకోలేదు. అలాంటిది నిద్ర మాత్రలు మింగి, అవి పని చెయ్యవన్న అనుమానంతో నరాలని కోసుకున్నాడనుకోవడం లాజికల్‍గా లేదు. దీన్ని బట్టి చూసినా అతడి మరణంలో ఏదో మిస్టరీ ఉందనిపిస్తోంది. ఆ మిస్టరీని శోధిస్తే మనకి అతడి మరణం వెనుక ఉన్న క్రిమినల్ ఇంటెన్షన్ ఏమిటో, అది ఎవరిదో తెలుస్తుంది”  అన్నాడు పాణి.

ప్రసాద్ అంగీకరిస్తున్నట్టుగా తలూపాడు అతడి మాటలకి “నువ్వన్నది నిజం. అతడి మరణం వెనుక ఏదో మిస్టరీ ఉంది. దాన్ని నువ్వే ఇన్వెస్టిగేట్ చెయ్యి. నేను డిపార్టుమెంట్ తరపున నీకు ఆర్డర్స్ ఇస్తున్నాను”

అతడి మాటలకి పాణి తల అడ్దంగా ఊపాడు. “ప్రస్తుతం మనకున్న ఆధారాలని బట్టి,  పోస్టుమార్టమ్ రిపోర్టుని బట్టీ చూస్తే రాజేంద్ర సింగ్‍ది ఆత్మహత్య.  ఎటువంటి కంప్లైంటూ లేకుండా ఆత్మహత్య మీద డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఆర్డర్ ఇస్తావు?”

“అతడి మరణాన్ని అనుమానాస్పద మరణంగా భావించి ఇన్వెస్టిగేషన్‍కి ఆర్డర్ చెయ్యడానికి కారణం చూపించాలంటే, నీకొచ్చిన ఈ మెయిల్ చాలు”

“నాకొచ్చిన ఈ మెయిల్ గురించి అప్పుడే బయట పెట్టడం మంచిది కాదు. మహల్ లో బయట పడ్డ నిధి గురించి పెద్ద రాజా వారికి కూడా తెలియదని రాజేంద్ర వర్మ నాకు మెయిల్ లో రాసాడు. అసలు విషయం తెలియకుండా ఆ నిధి గురించి బయటకి చెప్పడం నాకు ఇష్టం లేదు. ముందు అసలు ఆ నిధి రాజేంద్ర ఎక్కడ దాచాడో,  అది ఇంకా అక్కడ ఉందో లేదో, ఈ విషయాలన్నీ తెలుసుకోకుండా మనం మనం నిధి గురించి చెప్పేస్తే  కేసు మరింత కాంప్లికేట్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ కేసులో నువ్వు విచారణకి ఆదేశాలిస్తానన్నా అందుకు రాజేంద్ర కుటుంబీకులు ఒప్పుకోక పోవచ్చు. ఎందుకంటే, పెద్ద పెద్ద కుటుంబాలలో ఇలాంటి  పోలీసు ఇన్వెస్టిగేషన్లూ అవీ జరగడాన్ని పరువు నష్టంగా భావిస్తారు.

అందుకే ఏదో వంకతో నేను రాజ మహల్ లోకి అడుగు పెట్టి కొద్ది కాలం అక్కడ గడప గలిగే అవకాశం కావాలి. అందు కోసమే నేను ఇక్కడికి వచ్చింది” అన్నాడు పాణి.

“అలా వెళ్ళడానికి ఒకే ఒక్క అవకాశం ఉంది.  నిన్ను నువ్వు చని పోయిన రాజేంద్ర వర్మ స్నేహితుడిగా చెప్పుకోవాలి. అతడి మరణ వార్త విని పరామర్శించడానికి వెళ్ళినట్టుగా కోట లోకి వెళ్ళచ్చు”

“నా ఆలోచన కూడా అదే. కానీ రాజేంద్ర వర్మ స్నేహితులంతా ఈ ప్రాంతంలోని వాళ్ళే అయి ఉంటారు. వాళ్ళంతా అతడి తాతకీ, బావకీ తెలిసే ఉంటారు కదా? వాళ్ళకి తెలియని స్నేహితులు అతడికి ఎవరున్నారు అన్నది మనం కనుక్కోవాలి. అతడి చదువు అదీ ఎక్కడ సాగింది? అతడు సిర్నాపల్లి వదిలి  తాత్కాలికంగానైనా కొద్ది కాలం ఎక్కడైనా ఉన్నాడా? ఉంటే ఎక్కడ ఉన్నాడు? ఆ వివరాలు కావాలి. అవి తెలిస్తే, అక్కడ అతడితో నాకు స్నేహం ఏర్పడిందని చెప్పచ్చు”

పాణి మాటలకి ప్రసాద్ ముఖం ఏదో ఐడియా వచ్చినట్టుగా వెలిగింది “రాజేంద్ర సింగ్‍కి ట్రావెలింగ్ హాబీ అని విన్నాను. ముంబయి రాక ముందు నువ్వు కూడా చాలా కాలం అండమాన్ లోనే ఉండే వాడివి కదా? అతడితో నీకు అండమాన్ లో స్నేహం అని చెబితే?” అన్నాడు వెంటనే.

“గుడ్ ఐడియా. కానీ అతడు అండమాన్ ఏ సమయంలో వెళ్ళినదీ, ఎక్కడ బస చేసినదీ మొదలైన కనీస వివరాలేనా తెలుసుకోకుండా ముందుకు వెళ్ళడం రిస్కుతో కూడుకున్న పని” అన్నాడు పాణి.

“మా నిజామాబాద్‍లో  ఇలాంటి టూర్ లకి టిక్కెట్లు బుక్ చేయడానికి పేరు పొందిన ట్రావెల్ ఏజంటు ఒక్కడే ఉన్నాడు. నా అంచనా తప్పు కాకపోతే, రాజేంద్ర వర్మ అండమాన్ ప్రయాణం ఏర్పాట్లు కూడా కచ్చితంగా అతడే చేసి ఉంటాడు” అంటూ ఫోన్ ఎత్తి ఆఫీసు తన వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాడు. ఫోన్ పెట్టేసి, “రాజేంద్ర అండమాన్ ఎప్పుడు వెళ్ళినదీ, ఎన్నాళ్ళున్నదీ ఎక్కడ బస చేసినదీ ఆ వివరాలన్నీ పది  నిమిషాల్లో నీ ముందు ఉంటాయి. ఆ వివరాలు మనకి ఇచ్చినట్టుగా మూడో కంటి వాడిక్కూడా తెలియదు. చాలా” అన్నాడు నవ్వుతూ.

“థాంక్స్. కానీ నేను ఈ పని మీద అక్కడికి వెడుతున్నట్టు ఎవరికీ తెలియ కూడదు. చివరకి మీ డిపార్టుమెంట్ లో మనుషులకి కూడా” అన్నాడు పాణి.

****

హాల్లోకి నడుచుకుని వస్తున్న సురేష్ సింగ్‍ని పరిశీలనగా చూసింది ఇంద్రనీల. అతడికి ఇరవై ఆరేళ్ళు ఉంటాయేమో, ఐదడుగుల పదంగుళాల పొడవుంటాడు. మేనత్త మేనమామ పిల్లలవడం వల్ల చని పోయిన రాజేంద్ర సింగ్‍కీ అతడికీ పోలికలు కనిపిస్తున్నాయి. ఒత్తైన కనుబొమలూ, సూటి ముక్కూ, విశాలమైన కళ్లూ. కుర్తా పైజామా వేసుకుని హుందాగా కనిపిస్తున్నా, ముఖంలోని భావాలని దాచుకో లేక పోతున్నాడు. ఆ వార్త తెలిసిన దగ్గర నుంచీ బాగా  కదిలి పోయాడన్న దానికి సూచనగా ముఖంలో అలసట ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కళ్ళలో అనిర్వచనీయమైన   బాధ కనిపిస్తోంది. అతడి వాలకం చుస్తుంటే, హడావిడిగా బయలు దేరి వచ్చాడని ఇట్టే తెలిసి పోతోంది.

వస్తూనే నేరుగా తాత గారి గది లోకి వెళ్ళాడు. మంచమ్మీద నిద్ర పోతున్న పెద్ద రాజా వారిని చూస్తూ ఏం చెయ్యాలో తోచనట్టుగా అలా నిలబడి పోయిన అతడి భుజమ్మీద చెయ్యి వేసాడు సర్వోత్తమ రావు ఓదారుస్తున్నట్టుగా.

అప్పటికి కానీ అతడ్ని గమనించలేదు సురేష్ వర్మ. ఒక్క సారిగా ఆయన్ని పట్టుకుని బావురు మన్నాడు.

ఊరుకోండి బాబూ...” అంటూ అతడ్ని అక్కడ ఉన్న కుర్చీలో కూర్చో పెట్టాడు.

“తాత గారికి ఎలా ఉంది?” తేరుకుంటూ అడిగాడు.

“బానే ఉన్నారు. కానీ  జరిగిన దాన్ని తట్టుకోవడానికి టైము పడుతుంది. మెలకువ వచ్చిన పది నిమిషాలకే మళ్ళీ మగత లోకి జారి పోతున్నాడు. మీరు ధైర్యంగా ఉండి, ఆయన్ని ఓదార్చాలి” అన్నాడు సర్వోత్తమ రావు.

అతడి మాటలకి మళ్ళీ సురేష్ వర్మ కళ్ళలో నీళ్ళు తిరగడం స్పష్టంగా కనిపించింది. ఈసారి తనని తాను కంట్రోల్ చేసుకుంటూ కళ్ళు తుడుచుకున్నాడు అతడు. ఇంద్రనీలని, డాక్టర్లనీ అతడికి పరిచయం చేసాడు సర్వోత్తమ రావు.

కొద్ది సేపు అక్కడ మాట్లాడాక లేచి నిల్చున్నాడు అతడు.  “బావగారు...” ‘శవం’ అనాలో ఏమనాలో తెలియనట్టుగా, బాధగా మాటల్ని గొంతు లోనే మింగేస్తూ “ఎక్కడ?” అన్నాడు సర్వోత్తమ రావుతో.

సర్వోత్తమ రావు అతడ్ని రాజేంద్ర భౌతిక కాయాన్ని ఉంచిన గది లోకి తీసుకు వెళ్ళాడు. అద్దాలతో చేసిన ఫ్రీజర్ బాక్సులో ఉంచిన రాజేంద్ర శరీరం కాళ్ళ నుంచీ మెడ వరకూ తెల్లటి దుప్పటి కప్పి ఉంది.  పోస్టు మార్టమ్ చేసిన గాయాలేమీ కన పడకుండా మొత్తం బ్యాండేజ్ చుట్టేసి ఉండడంతో శరీరంలో కేవలం ముఖం మాత్రమే పైకి కనిపిస్తోంది.  బాక్సులో శవాన్ని ఉంచినప్పుడు ఎవరో వేసిన ఖరీదైన గులాబీల దండ తాలూకూ ఎరుపు రంగు తెల్లటి దుప్పటి మీద ప్రతిఫలిస్తూ కర్మ సిద్దాతాన్ని బోధిస్తున్నట్టుగా ఉంది.

అతడు తదేకంగా బాక్సు లోని రాజేంద్ర శరీరం వైపు చూస్తూ కాసేపు మౌనంగా ఉండి పోయాడు. తరువాత నెమ్మదిగా వెనక్కి తిరిగాడు.

రాజేంద్ర రాసిన సూసైడ్ నోట్‍ని అతడికి చూపించింది ఇంద్రనీల “ఈ చేతి రాత రాజేంద్ర గారిదేనా?”

“ఇది రాజేంద్ర వర్మ బావ గారి చేతి రాతే,  క్రింద ఉన్న సంతకం కూడా ఆయనదే” చెప్పాడు అతడు.

“ఈ ఉత్తరాన్ని బట్టి చూస్తే ఆయన చాలా సున్నిత మనస్కులనీ, ఏదో అవ్యక్తమైన సమస్యతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నారని పిస్తుంది. మీకు తెలిసి ఆయనకి అలాంటి సమస్యలేమైనా ఉన్నాయా?” అంది ఇంద్రనీల.

“సున్నితమనస్కులే ఎక్కువగా ఆత్మహత్యలకి పాల్పడుతూ ఉంటారు. ఇక పోతే సమస్యలంటారా, చిన్నా పెద్దా సమస్యలు అందరికీ ఉంటాయి. మనం చూసే దృష్టిని బట్టే అంతా ఉంటుంది”

“ఆయన ఆత్మహత్యకి కారణం ఏమిటని మీరనుకుంటున్నారు?”

ఆమె ప్రశ్నకి సమాధానంగా భారంగా నిట్టూర్చాడు సురేష్ వర్మ “నేను ఏమీ ఊహించ లేక పోతున్నాను” అన్నాడు కళ్ళద్దాలు తీసి కళ్ళు తుడుచుకుంటూ.

ఇంద్రనీల ఇంకా ఏదో మాట్లాడ బోయే లోగా, సర్వోత్తమ రావు అతడి పక్కకి వచ్చి “బయట జనం పొద్దుట నుంచీ రాజా వారి భౌతిక కాయాన్ని చూడాలని ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు అనుమతిస్తే ఆయన భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనకి ఏర్పాట్లు చేస్తాను”  అన్నాడు.

అంత లోనే ఒక నర్సు అక్కడికి వచ్చి “నరేంద్ర గారికి స్పృహ వచ్చింది. డాక్టరు గారు మిమ్మల్ని రమ్మంటున్నారు” అని చెప్పింది సర్వోత్తమ రావుతో.

***

మర్నాడు ఉదయం తెల తెల వారుతుంటే  ఒక ఇన్నోవా కారు రాజ మహల్  గేటు లోపలకి వచ్చింది.  నేరుగా రాజ మహల్ పోర్టికో లోకి వచ్చి ఆగిన ఆ కారు లోంచి దిగాడు పాణి.  అక్కడ నిల్చున్న పని వాళ్ళతో “సురేష్ వర్మ గారిని కలవాలి” అన్నాడు.

“నాతో రండి” అంటూ వాళ్ళలో ఒక వ్యక్తి ప్రజల సందర్శన కోసం రాజేంద్ర భౌతిక కాయం ఉంచిన దగ్గర ఉన్న సురేష్ వర్మ దగ్గరకి  అతడిని తీసుకుని వెళ్ళాడు.

“వీరు మిమ్మల్ని కలవాలని వచ్చారు” అని చెప్పాడు పాణిని తీసుకుని వచ్చిన వ్యక్తి సురేష్ వర్మ.

“మీరు?!” అంటూ ఆశ్చర్యంగా చూసాడు సురేష్ వర్మ పాణి వంక.

“నా పేరు పాణి.  రాజా నరేంద్ర వర్మ గారి స్నేహితుడ్ని”

(తను కాపాడ లేకపోయిన రాజేంద్ర వర్మ భౌతిక కాయాన్ని చూసిన డిటెక్టివ్ పాణి ఫీలింగ్స్  ఏమిటి?... వచ్చేవారం !)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atulitabhandham