Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
atadu..aame..oka rahasyam

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

గతసంచికలో ఏం జరిగిందంటే... http://www.gotelugu.com/issue192/554/telugu-serials/atulitabandham/atulitabhandham/

 

( గతసంచిక తరువాయి)  ఒంటరిగా, అసహాయతతో అల్లాడి పోయిన తన అమాయక ప్రేయసి నిస్సహాయ స్థితి కనుల ముందు మెదిలింది... దానికి తోడు, చిధ్రమైన తమ ప్రేమఫలం విషయం తెలిసి అపరాధ భావనతో కుమిలిపోసాగాడు కార్తీక్... బాధగా, వేదనగా ఐశ్వర్య వైపు చూసి, ఒక్కసారిగా వంగి ఆమె పాదాన్ని స్పృశించాడు.

“క్షమకు అర్హుడిని కాను... కానీ...దయచేసి నన్ను క్షమించి నన్ను నీ వాడిగా అంగీకరించు ఐశూ... ప్రమాణం చేసి చెబుతున్నాను... ఇక నీ కంట ఆనంద బాష్పాలే తప్ప దుఃఖాశ్రువులు రానీయను... ఒట్టు!” ఆమె తల మీద చేయి వేసి దగ్గరకు తీసుకుని, కన్నీటితో, ఆమె నుదుట ముద్దు పెట్టాడు కార్తీక్.

అతని గుండెల్లో తల దాచుకుని, ఒదిగి పోయి అలాగే ఉండి పోయింది ఐశ్వర్య... ఆ కౌగిలిలో కోరిక లేదు... ఆ దగ్గర తనంలో కామం లేదు... ఒకరి నొకరు కోరుకుంటున్న అభిలాష, అనురాగం మాత్రమే ఉన్నాయి.

అతని చేతుల నుండి విడిపించుకుంటూ, “బెడ్ రూమ్ లో నీ డ్రెసెస్ కొన్ని ఉన్నాయి... మార్చుకుని రా కార్తీ... ఈ లోగా మనకి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను...” అంది ఐశ్వర్య.

“థాంక్స్ రా ఐశూ... థాంక్స్ అ లాట్...” ఆమె చేతిని అందుకుని పెదవులకు ఆనించుకుని వదిలి బెడ్ రూమ్ లోకి వెళ్లి చూసిన కార్తీక్ తన కళ్ళను తనే నమ్మ లేక పోయాడు. తాను ఇల్లు విడిచి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నదో అలాగే సర్ది ఉంది రూమ్ అంతా... వార్డ్ రోబ్ లో తన డ్రెస్ లు కొన్ని, ఇంట్లో వేసుకునేవి, బయటకు వేసుకు వెళ్ళేవి ఉన్నాయి. తన వస్తువులు, పుస్తకాలు కొన్ని ఇంకా అలాగే ఉన్నాయి... డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర తాను  వాడే పెర్ఫ్యూమ్, ఆఫ్టర్ షేవ్ లోషన్, తనకిష్టమైన కలర్ దువ్వెన, వాష్ రూమ్ లో తనకిష్టమైన బ్రాండ్ సోప్, షాంపూ అన్నీ అలాగే అమర్చ బడి ఉన్నాయి ... అవన్నీ  తన చెలి తన కోసం ఎంతగా ఎదురు చూస్తున్నాయో చెబుతున్నాయి...
“ఈ ప్రపంచంలో ఐశూ కన్నా మిన్న అయిన ప్రియురాలు ఎవరికీ దొరకదేమో... ఈమె తన ప్రియ సఖి... ఉహు కాదు, ప్రియ సతి...” అనుకున్నాడు గర్వంగా.

స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చాడు బయటకి.

“ఐశూ... బాబాయి గారున్నారా? కలిసి మాట్లాడి వస్తాను...”

“ఓ, ఏం మాట్లాడతావు కార్తీ?” చిలిపిగా అడిగింది ఐశ్వర్య.

“నీ తరఫున వాళ్ళిద్దరూ ఇక్కడ లోకల్ గార్డియన్స్ కదా, నిన్ను నాకిమ్మని అడిగి వస్తాను... సరేనా?” నవ్వుకుంటూ బయటకు నడిచాడు కార్తీక్. అతని మనసు పూల మేఘాలలో తేలి పోతోంది.

***

“హమ్మయ్య, మనింటికి వచ్చేసాక హాయిగా ఉంది నాకు...” అన్నాడు వేణు మధు ఇచ్చిన మాత్రలు వేసుకుంటూ.

“పవన్ అన్నయ్య వాళ్ళు అంత బాగా చూసుకుంటే, అదేమిటి అలా అంటారు?” అంది మధు.

“అవునమ్మా, అల్లుడైనా కొడుకు లాగే చూసుకున్నాడు... కానీ... మన ఇంట్లో ఉన్న స్వేచ్చ, స్వాతంత్ర్యం ఎక్కడ ఉంటాయి...” అన్నది సుగుణమ్మ.

“నిజమే అత్తయ్యా... నాకూ అక్కడ చాలా బాగా అనిపించింది... పెద్దమ్మ గారూ, అవంతి అక్కయ్యా, పవన్ అన్నయ్యా అందరూ ఎంతో బాగా చూసుకున్నారు మమ్మల్ని... వినత కూడా ఎంతో ఆత్మీయురాలు అయి పోయింది ...”

“అవునమ్మా, అతను అంత గట్టిగా, కఠినంగా చెప్పి ఉండక పోతే ఎప్పటికీ మార్పు వచ్చి ఉండేది కాదేమో దానిలో... ఏం జరిగినా మన మంచికే...” అంటూ బాబి ఏడుస్తూ ఉంటే అవతలికి తీసుకు వెళ్ళింది సుగుణమ్మ.

“మధూ, నా వలన, వినత వలన నీ మనసు చాలా సార్లు చాలా గాయ పడింది... సారీ చెబితే సరి పోదు... అయినా అయామ్ సో సారీ డియర్...” ఆమె చేతిని నిమిరాడు వేణు.

“ఇట్స్ ఆల్ రైట్ వేణు... మన జీవితంలోంచి చెడ్డ రోజులు వెళ్ళి పోయాయని ఆశిద్దాం... మనం ప్రేమించి పెళ్ళి చేసుకోక పోయినా, పెళ్ళి చేసుకుని ఒకరి నొకరు ప్రేమించు కున్నాము... మధ్యలో అపార్థాలు, అనుకోని సంఘటనలు జరిగాయి... చిన్న ఎడం వచ్చింది... కానీ అంత మాత్రం చేత విడి పోవటం సరియైన పని కాదని మనిద్దరికీ తెలుసు... ఏ ఇద్దరూ ఒకేలా ఉండరు...  ప్రాణ స్నేహితులు కూడా ఒక్కలా ఆలోచించరు. అయినా వారిని యాక్సెప్ట్ చేస్తాము... భార్యా భర్తల మధ్య మాటా మాటా వస్తేనో, అభిప్రాయ భేదాలు వస్తేనో మాత్రం ‘ఈగో’లకు పోయి, నా  మాటే నెగ్గాలని ఎవరికీ వారే అనుకుంటాము... అందు వలన వచ్చిన ‘గ్యాప్’ మరింత ఎక్కువ అవుతుంది... నిజానికి మీ తప్పు ఎంత ఉందో, దానికి ప్రతి చర్యగా నా వంతూ తప్పులు జరిగాయి... అంచేత జరిగినది మరచి పోయి, ఇక అవి మళ్ళీ మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడదాం... కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం...” నవ్వుతూ చెప్పింది మధుబాల.

“నేను నడవటం మొదలు పెట్టగానే అర్జెంట్ గా మన బాబుకు నామకరణం జరిపించాలి...” అన్నాడు వేణు గోపాల్.

ఫక్కున నవ్వింది మధుబాల... “ఇంకో రెండు నెలల్లో వాడికి మొదటి పుట్టిన రోజు వస్తోంది... అప్పుడు పేరు పెట్టేద్దాం లెండి... ఐశ్వర్య, కార్తీక్ కూడా అప్పుడే పెళ్ళి చేసుకుంటారట!”

“అవునా, ఎందుకంత ఆలస్యం?”

  “మీరు కోలుకున్నాకే, మనమిద్దరం వెళ్ళి పెళ్ళి జరిపించాలని కోరిక ఇద్దరికీ... అఫ్ కోర్స్ రిజిస్టర్ మేరేజే అనుకోండి... అయినా, మనం పక్కన ఉండాలి వాళ్ళకి...”

“ఏమిటి మధూ? ఐశ్వర్య పెళ్ళా? అబ్బ, ఎంత కమ్మని కబురు చెప్పావు అమ్మా? ఆ అబ్బాయి తోనేగా?” అంది సుగుణమ్మ లోపలికి వస్తూ.   “అవును అత్తయ్యా, కార్తీక్ తోనే...” చెప్పింది మధు.

“హమ్మయ్య... పోనీలే, ఆ అమ్మాయి జీవితం స్థిర పడుతోంది...” తృప్తిగా నిట్టూర్చింది సుగుణమ్మ...“అన్నట్టు మమత గుర్తుంది కదా... అత్తయ్యా, ఓ సారి మీకు చెప్పాను కదా, నా క్లాస్ మేట్ అని... ఆమె పెళ్ళి కూడా కుదిరింది... ఢిల్లీ లోనే పెళ్ళి...” ఆనందంగా చెప్పింది మధు బాల.

“పోనీలేమ్మా, ఆ అమ్మాయి కూడా, ఆ మొగుడితో  చాలా బాధలు పడింది పాపం... అలాంటి ఆదుకునే తల్లిదండ్రులు ఉండాలి... లేక పోతే ఆడ పిల్లలు ఏమై పోతారు?”

“నిజమే అత్తయ్యా...”

***

హోటల్ తార – ఐదు నక్షత్రాల హోటల్ లో పెళ్ళి రిసెప్షన్ జరుగుతోంది.

వేదిక మీద సూట్ లో కార్తీక్, పట్టు చీరెలో ఐశ్వర్య కూర్చుని ఉన్నారు. వేదికకి ఎదురుగా ఉన్న కుర్చీలలో ఐశ్వర్య తల్లిదండ్రులు, కార్తీక్ తల్లిదండ్రులు, అన్నా వదినలు, రూప, అన్నపూర్ణ, విశ్వనాథంలు, వేణు, మధు, సుగుణమ్మ, వినత, పవన్ అందరూ ఉన్నారు. అందరి మనసుల లోని సంతోష తరంగాలు ముఖాల్లో ఆనంద జ్యోతులై వెలిగి పోతున్నాయి.

ఒకరి మెడలో ఒకరు పూల దండలు వేసుకున్నారు. ఒకరి వేలికి మరొకరు పెళ్ళి ఉంగరాలు మార్చుకున్నారు. ఉదయమే గుడిలో దైవం ముందు కార్తీక్ కట్టిన పచ్చని పసుపు తాడు ఐశ్వర్య మెడలో మరింత పచ్చగా మెరిసిపోతోంది. నుదుట గుండ్రని బొట్టు కింద ఎర్రగా మెరిసి పోతున్న కుంకుమ బొట్టు ఆమె ముఖానికి సరికొత్త వెలుగునిస్తోంది.

నిండు ముత్తయిదువగా తమ కూతురిని చూసుకుంటున్న తిరుపతయ్యకు, అలిమేలమ్మకూ ఆనందంతో కళ్ళు, మనసు నిండి పోయాయి...
    ఇక కాత్యాయని, పరమేశ్వర రావుల ఆనందానికి హద్దు లేదు... తమ చిన్నకొడుకు జీవితంలో అటూ ఇటూ ఆకతాయి పరుగులు మాని ఒక చక్కని అమ్మాయికి భర్త అవుతున్నాడంటే, స్థిరమైన జీవితానికి నాంది పలుకుతున్నాడు అంటే అంతకన్నా సంతోషకరమైన విషయం మరేముంటుంది?

కార్తీక్ కి ఐశ్వర్యను చూస్తుంటే, అంతులేని ఆమె హృదయం లోని ప్రేమ అనే ఐశ్వర్యానికి అధిపతి అయినందుకు, విశ్వవిజేతను అనే భావన కలుగుతోంది... ‘నిన్ను నిన్నుగా ప్రేమించుటకు... నీకోసమే కన్నీరు నించుటకు, నేనున్నానని నిండుగా పలికే తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గము....’ అనే పంక్తులు మదిలో మెదిలాయి. ఆ క్షణం తనకన్నా భాగ్యవంతుడు ఎవరున్నారని అనిపించింది.

ఐశ్వర్యకు తన తల్లిదండ్రుల ఆనందాన్ని చూస్తూంటే, తన శ్రేయోభిలాషుల సంతోషాన్ని, తృప్తిని చూస్తూంటే, ‘వివాహం’ చేసుకోవటంలో తనకు స్వయంగానే కాక, తనవారికి  ఇంతమందికి తృప్తి ఉన్నదా -అనిపించింది. తనకిష్టమైన వాడితో జీవితాంతం ఒక్కటిగా బ్రతకటం... ఈ ఆలోచనే ఎంతో బలాన్నీ, శక్తినీ ఇస్తోంది... ఇక ‘సహజీవనం’ అనే జీవన విధానంలో ఒక అభద్రతా భావంతో అన్నాళ్ళు తానెలా బ్రతికిందో ఆలోచిస్తేనే ఒక్క క్షణం ఒళ్ళు జలదరించినట్టయింది.

బంధు మిత్రులంతా ఒకరి వెనుక ఒకరు వచ్చి వధూవరులను అభినందిస్తూ, అక్షతలు వేసి ఆశీర్వదించసాగారు.

మధు, వేణు బాబుతో సహా వేదిక మీదకు వచ్చి ఇద్దరినీ అభినందించారు. మధు ఐశ్వర్యను గాఢంగా ఆలింగనం చేసుకోగానే, “మధూ, నాకు చాలా గట్టిగా ఏడవాలని ఉందే...” అంది ఐశ్వర్య జీరవోయిన గొంతుతో...

“ఛ, ఆ రోజులు వెళ్ళి పోయాయి... ఇక అన్నీ నవ్వులే వినిపించాలి నీ ముంగిట్లో... హార్టీ కంగ్రాట్స్ ఐశూ... నీ లక్ష్యం నీవు చేరుకున్నావు...” మనసారా అభినందించింది మధుబాల.

వేణు కూడా కార్తీక్ ని హగ్ చేసుకుని అభినందించాడు... “కార్తీక్, మీ నావ తీరం చేరింది... కంగ్రాట్స్...” అన్నాడు మనసారా...
ఉప్పొంగే సంతోషపు ఉప్పెన నిండిన ముఖాలతో ఒకరి కళ్ళలోకి ఒకరు ఆనందంగా  చూసుకున్నారు కార్తీక్, ఐశ్వర్య... ఆ చూపులలో ఎన్ని బాసలో, భాష్యం లేని ఊసులో!

(సమాప్తం)   

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్