Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

avee - ivee

ఒకానొకప్పుడు మనకి శక్తికి మించినవి కాలక్రమేణా “ ఓస్ ఇంతేనా..” అనే స్థాయికి చేరుతాయి.వయసు మీదపడేకొద్దీ, తిరిగి పాత స్తితికే చేరుతామనుకోండి.  నా ఉద్దేశ్యమేమిటంటే ఒకరికి affordable గా ఉండేది, ఇంకోరికి చాలా సుళువుగా ఉండొచ్చు. వీటికి కారణం సంపాదిస్తున్న డబ్బు మీద ఆధారపడుతుందేమో అని నా అభిప్రాయం. ఏదో ఒక వస్తువు కొన్నప్పుడు, దాని ఖరీదు కొద్దిగా ఎక్కువేమో అని నాలాటివాడు అన్నప్పుడు, కొందరికి అది వింతగా అనిపించొచ్చు.ఓస్ ఈమాత్రందానికేనా ఇంత హడావిడీ అనికూడా అనుకోవచ్చు.అది మన మనస్థత్వాన్నిబట్టీ, సంపాదనబట్టీ ఉంటుంది.

కొన్ని కొన్ని నగరాల్లో కొన్ని ప్రాంతాల్లో ప్రతీదాని ఖరీదూ ఆకాశాన్నంటుతాయి. అక్కడ నివాసముండే మనుషుల ధర్మమా అని. ఏ ఐటీ కంపెనీల్లోనో పనిచేసేవారుండే ప్రాంతాలలో ఈ ఒరవడి ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వోద్యోగులుండే కాలనీల్లో మామూలుగానే ఉంటుంది. ఇదివరకంటే, జీవితంలో ఇంకా ఎన్నెన్నో బాధ్యతలు అంటే పిల్లలకి చదువులూ, పెళ్ళిళ్ళూ , ఓ కొంప ఏర్పాటుచేసికోడమూ లాటివి ఉన్నచేత, ప్రతీదీ మనం afford చేయలేమేమో అనే అనిపించేది.కానీ, వాటన్నిటినీ ఏదో నా శక్తిమేరకు,భగవంతుని దయతో, దాటేయడం మూలానా, ఇంకేమీ పేద్ద బాధ్యతలన్నవి లేకపోవడం మూలానైతేనేమిటిలెండి బావున్నట్టే అనిపిస్తోంది. అంటే ఒకలా చూస్తే, గట్టెక్కేసినట్టే అనుకోండి. ఇది ఒక అదృష్టంగానే భావిస్తున్నాను.

అందుకోసమే, అసలు ఈప్రాంతంలో ఇంతంత ఖరీదులెందుకెక్కువా అనే ఆలోచనలాటిదోటొచ్చింది.ముఖ్యకారణం( నా ఉద్దేశ్యంప్రకారం), ఇక్కడెవరికీ బేరం ఆడే అలవాటు లేదు.ఆ కొట్టువాడేం చెప్తే అంతిచ్చేయడం. కారణం చేతినిండా డబ్బులు, వాటినెలా ఖర్చుపెట్టాలో తెలియదూ. అది ఓ కూర్లనండి, పనిమనిషనండి, లాండ్రీవాడనండి,ఒకటేమిటి ప్రతీదీనూ.కూరలూ, గ్రోసరీలూ, దగ్గరలోనే ఉండే రిలయెన్సు మార్టూ, డీమార్టూ లలో ఫరవాలేదు,మరీ అంత ఖరీదెక్కువకాదు, పైగా తూకంకూడా బాగానే ఉంటుంది.కానీ వచ్చినగొడవల్లా బిల్లింగు దగ్గరే. ఏ వీకెండులోనే వెళ్తే గంటలతరబడి వేచిఉండాలి.పైగా కొన్నవన్నీ కొంపదాకా మోసుకుపోడమోటి. కానీ మామూలు కిరాణా దుకాణం వాడు కొన్నసరుకులు కొంపకి చేర్చే సౌలభ్యమోటిచ్చాడు.దీనివలన ఏమౌతోందంటే, కావలిసిన సరుకులు ఆ కిరాణా కొట్టువాడిదగ్గరే తెప్పించేసికుని, window shopping కి మాత్రమే మాల్స్ కి వెళ్ళడం.అయినా లింగూలిటుకూమంటూ ఉండే ఇద్దరికి ఏం కావాలీ?

ఇంక పనిమనుష్యులవిషయానికొస్తే, ఈ ప్రాంతంలో ఉండే చాలా ఇళ్ళల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్థులు కావడం చేత, పనిమనుష్యులు part and parcel వాళ్ళకి. పాపం ప్రొద్దుటే పిల్లలని స్కూళ్ళకీ, భర్తలని ఆఫీసులకీ పంపడంకోసం, ముందుగా ఓ వంటమనిషి ముఖ్యం. ఏ సాయంత్రమో ఆఫీసులనుండి కొంపకి తిరిగొచ్చే సమయానికి, ఆ రెండో పనిమనిషిని రమ్మంటారు.చెప్పేదేమిటంటే, వారి సౌకర్యంప్రకారం ఆ పనిమనుష్యుల పనివేళలు మనం నిర్ణయించేసరికి, వాళ్ళేమో నెత్తికెక్కేస్తారు. అవసరం మనదిగా, వాళ్ళేంచెప్తే దానికే చచ్చినట్టు ఒప్పుకోవాలి.వాళ్ళకి మూడ్డుంటే వస్తారు, లేకపోతే ఓ దండం పెట్టుకోవడం. ఇక్కడనే ఏమిటిలెండి, ఈ మహానగరాల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకి వెళ్తూన్న ప్రతీ ఇంట్లోనూ ఇదే భాగవతం.ఏదో నూటికీ కోటికీ ఇంట్లోంచే పనిచేసేసదుపాయం ఉన్నవారికి తప్పించి, మిగిలినవారందరి అవస్థా ఇదే.

ఇలా పనిమనుష్యుల tantrums మాట్టాడకుండా భరిస్తున్నారంటే మరి affordability యే కారణం కదా! దీనితో ఏమయ్యిందీ అంటే మామూలు జీతాలకి పనిమనుష్యులు దొరకడం అంటే చాలా కష్టం.మధ్యతరగతి ప్రాణులు ఎవడైనా వచ్చి ఇలాటి ప్రాంతాల్లో ఉండాలంటే ప్రాణం మీదకొచ్చిందంటే రాదు మరీ ?

ఇంక కూరలూ, పళ్ళూ వ్యవహారంలోకి వస్తే, వాటినమ్మే కొట్టువాడిని రేటెంత బాబూ అంటే ఏదో వింతమృగాన్ని చూసినట్టు చూస్తాడు, కారణం- ఇప్పటిదాకా ఎవడూ రేటడిగిన పాపానికి పోలేదు, ఏదో కారు కొట్టుపక్కనే ఆపడం, ఓ కూర చూపించడం, ఫలానాది అరకిలో, ఇంకోటేదో పావుకిలో అంటూ చెప్పడం, వాడడిగినదేదో ఇచ్చేయడం.అలాటిది ఓ అర్భకప్రాణి వచ్చి రేటెంతా అని అడిగాడంటే ఆశ్ఛర్యపడ్డంలో వింతేముందీ? కానీ I could get a break in the price! ఈమధ్యన ఓ కూర్లకొట్టుదగ్గరకి వెళ్ళి ఫలానాది ఎంతా, అన్నాను , ఏదో చెప్పాడు, కాదూ ఇంతకైతే ఇస్తావా అన్నాను, ముందుగా కాదూ అన్నవాడే తీరా నేనడిగిన రేటుకే ఇచ్చేశాడు. కారణం- మిగిలినవారిదగ్గరనుంచి ఎలాగూ చాలా లాభం సంపాదించుకున్నానుకదా, అలాటిది రొజులో ఏ ఒకరిద్దరికో, వాళ్ళడిగిన రేటుకిస్తే ఏం పోయిందీ. ఇక్కడుండే ఐటి వారి ధర్మమా అని, ఆ కొట్టువాడుకూడా CRM లో దిట్ట అయిపోయాడేమో..ఏదైతేనేం, తేలిందేమిటయ్యా అంటే, బేరాలు ఆడొచ్చు అని.కానీ బేరం ఆడడానికి నామోషీఆయే.

బయట రోడ్లపక్కనుండే చాయ్ దుకాణాల్లో చాయ్ తాగాలంటే చాలామందికి ఇష్టం ఉండదు. కారణం, ఎవరైనా చూస్తారేమో అని! అదే ఎవడో, ఓ మెర్సిడీజ్ బెంజ్ కారు ఆపి, ఆ కొట్టులో చాయ్ తాగాడనుకోండి, ఇంక ప్రతీవాడూ అక్కడే తాగడం మొదలెడతాడు. పైగా అదో స్టేటస్ సింబలనుకుంటారు. అదేచాయి, ఏ కెఫే కాఫీలోనో, బరిస్టాలోనో తాగాలంటే తాడితెగుతుంది! అలాగని పెద్ద పెద్ద రెస్టారెంట్లకి వెళ్తే పాపమనికాదు.Affordability అనేది ఎంత ఆత్మవిశ్వాసం ఇస్తుందో అని చెప్పడానికి.

ఇంక ఇక్కడి ఎపార్టుమెంట్ల గొడవ. ఎప్పుడో ఆరేడేళ్ళక్రితం, ఇంకా ఇంత expansion లేని రోజుల్లో కొనుక్కున్న ఏ అపార్టుమెంటో అమ్ముకుందామని చూశారో, ఇంక చూడండి, ఆ సొసైటీ సెక్రెటరీయో ఎవడో ఉంటాడు, వాడికేమో చవకలో కొట్టేద్దామని ఆశ, అమ్మేవాడేమో ఏదో రేట్లు పెరిగాయికదా, ఆ పెరిగిన రేటుకి అమ్ముదామని వీడి ఆలోచనా.చివరకి బేరం కుదరక తాళం పెట్టుకుంటాడు. ఇదో టైపు mean..
దాదాగిరీ. ఏమిటో అంతా గందరగోళం.

సర్వే జనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
beauty of kashmir