Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kamanuveedhikathalu

ఈ సంచికలో >> కథలు >> అలగాజనం

alagajanam

“ కావేరీ ఎక్కడ తగలడ్డావే  ? “ అన్న శిరీష గర్జన వినిపించగానే ,  దొడ్లో మొక్కలకి నీళ్ళు పెడుతున్న కావేరి గబాలున పరిగెత్తుకొచ్చింది హాల్లోకి.

“ నీ కూతురు గచ్చంతా ఎలా పాడు చేసిందో చూడు. నీకెన్ని సార్లు చెప్పాలే , పని చేయటానికి వచ్చేటప్పుడు నీ కూతురిని నీతో పాటు తీసుకుని రావద్దని. మనిషన్నాక కాస్తంత బుద్ది ఉండక్కర్లా “ అని శిరీష తిడుతుంటే “చెమించండమ్మా. మా అత్తకి నాలుగు రోజుల నుంచీ జొరంగా ఉందమ్మా . అందుకే బొట్టిని నాతొ తోలుకొస్తిని. యిప్పుడే తుడిచేస్తానమ్మా “ అంటూ తడి బట్ట తెచ్చి కావేరి గచ్చంతా శుభ్రం చేస్తున్నా కూడా “ఛీ ఛీ అలగా జనం , అలగా బుద్ధులు. “ అని విసుక్కుంటూ బెడ్ రూమ్ లోకి వచ్చింది శిరీష. 

ఆఫీసు కని తయారవుతూ  టై కట్టుకుంటున్న శిరీష భర్త అభిరాం  “ ఏమిటా మాటలు శిరీ . పని వాళ్ళూ మన లాగా మనుషులేగా. పొరపాట్లనేవి జరిగి నప్పుడు కాస్త ఓర్పు వహించాలి, అంతే  గానీ  నోటికొచ్చినట్లు యిలా మాట్లాడ కూడదు “ అంటున్న అతని వైపు కోపంగా చూసింది శిరీష.

“అసలు మిమ్మల్ని అనాలి.  మీరిచ్చిన  అలుసు తోనే వాళ్ళు యిలా పేట్రేగి పోతున్నారు. ఎక్కడి వాళ్ళని అక్కడే ఉంచాలి “  అంటూ యింకా ఏదో అన బోయేంతలో , ఫోన్ మ్రోగడంతో హాల్లోకి  విసా విసా నడిచింది శిరీష. 

అభిరాం  డైనింగ్ టేబుల్ దగ్గరకి వచ్చి కూర్చోగానే , వంటావిడ పార్వతమ్మ వేడి వేడి పూరీలు, బంగాళ దుంప కూర తెచ్చి అతనికి ప్లేటులో వడ్డించింది. 

పూరీలు తింటూ “ కూర చాలా రుచిగా వుంది పార్వతమ్మా . అన్నట్టు మీ అమ్మాయి పూజ బాగా చదువుతోందా “ అని అభిరాం అడిగిన దానికి  “ మీ దయ వల్ల బాగానే చదువుతోంది బాబూ. ఈ ఏడు తో దాని చదువు పూర్తవుతుంది. ఆ తరవాత ఏదైనా ఉద్యోగంలో అది నిలదొక్కుకుంటే , మా కష్టాలు తీరి పోతాయి“ అంటూ కాఫీ తీసుకుని  రావడానికి వంటింట్లోకి వెళ్ళింది పార్వతమ్మ. 

యిదంతా వింటున్నశిరీష “ ఈ కబుర్ల కేమీ తక్కువ లేదు. మీరెంత సాయం చేసినా వీళ్ళకి కృతజ్ఞత అన్నది వుండదండీ . మొన్నటికి మొన్న, మా ఫ్రెండ్ పరిమళ, అదే మీకు తెలుసుగా లీడింగ్ లాయర్ కృష్ణ మూర్తి గారి వైఫ్,  వాళ్ళింటికి చుట్టాలు వచ్చి పనెక్కువ అవడంతో కాస్త సాయానికి వీళ్ల అమ్మాయి పూజని వాళ్ళింటికి పంపించమంటే ససేమిరా పంపనందీవిడ.  అవసరానికి మొండి చేయి చూపిస్తారు . అలగా జనం , అలాగా జాతి , వాళ్ళ బుద్దులే  అంత. అందుకే వాళ్ళ తల రాతలూ అలాగే ఏడుస్తాయి “  అంది భర్తతో నిరసనగా.
“ తప్పు శిరీ . అలా మాట్లాడకు. కాలేజీ లో చదువుకుంటున్న పిల్లని  అలాంటి పనులకి ఎవరైనా ఎలా పంపుతారు చెప్పు “ అన్నాడు అభిరాం శిరీష కి నచ్చ జెబుతున్నట్లుగా .

 “ మీతో చెప్పుకున్నాను చూడండీ , నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. మీరెప్పుడూ వాళ్ల పక్షమేగా . యిలా మీరన్నింటికి వాళ్ళని వెనకేసుకొస్తుంటే, మీ అండ చూసుకునే,  వాళ్ళు మరీ నెత్తికెక్కుతున్నారు “ అని శిరీష పెద్ద గొంతుతో అంటుంటే “ ఈ మనిషి తీరింతే. తనని మార్చడం ఎవ్వరి వల్లా  కాదు. కాలమే తనలో మార్పు  తేవాలి ” అనుకుని  మనసు లోనే నిట్టూర్చాడు అభిరాం. 

* * *

ఆఫీస్ పని మీద అభిరాం లండన్ వెళ్లి వారం రోజులయ్యింది. మరో రెండు వారాలకి గానీ తిరిగి రాడు . 

“ ఈ డ్రైవర్ వెధవ ఈ రోజు యింకా రాలేదు. అడ్డమైన వెధవలనీ పనిలో పెట్టుకుంటే యింతే మరి.  యిలాంటి అలాగా జనాన్ని పని లోంచి తీసేద్దామంటే ఈయన పడనివ్వరు . ‘ఏళ్ల తరబడి మననే నమ్ముకుని వున్నారూ’ అంటారు. కానీ ఆ విశ్వాసమేమైనా వుందా అసలు వాళ్లకి. అంతా నా ఖర్మ  “ అని సణుక్కుంటూ శిరీష  అలా సోఫాలో కూర్చుందో లేదో  ఫోన్ మ్రోగింది. 

“ మీ అబ్బాయి అరవింద్ కి  ఆక్సిడెంట్ జరిగింది, మణి పాల్ హాస్పిటల్లో వున్నాడు “ అన్న వార్త ఫోన్ లో వినగానే శిరీషకి కాళ్ళు , చేతులూ ఆడ లేదు. సమయానికి అభిరాం ఊళ్ళో లేడు, డ్రైవరేమో అతీ పతీ లేడు . ఏం చేయడానికీ పాలు పోలేదు. 

వెంటనే తన ప్రాణ స్నేహితురాలు పరిమళ కి ఫోన్ చేసి విషయం చెప్పి , తనకి సాయంగా వాళ్ళ కారు  తీసుకుని హాస్పిటల్ కి తోడుగా రమ్మని రిక్వెస్ట్ చేసింది శిరీష. 

అంతా విన్న  పరిమళ  “ సారీ శిరీషా . నేనూ , మా వారు ఈ రోజు ఎగ్జిబిషన్ కి వెళ్తున్నాము. తీరిక చేసుకుని బాబుని చూడడానికి ఈవెనింగ్ హాస్పిటల్ కి వస్తాములే ”  అని చెప్పిన సమాధానానికి హతాశురాలైంది శిరీష.

మాటా పలుకూ లేకుండా ఫోన్ రిసీవర్ పట్టుకుని అలాగే ఉండి పోయిన యజమాను రాలిని చూసిన పార్వతమ్మ, పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే బయటకు వెళ్లి ఆటో పిలుచుకుని వచ్చింది. శిరీషని  ఆటోలో కూర్చోబెట్టి సాయంగా తనూ ఆమె వెంట హాస్పిటల్ కి వెళ్ళింది. హాస్పిటల్ కి చేరే వరకూ  కూడా శిరీష కి ధైర్యం చెబుతూనే వుంది. 

హాస్పిటల్ లోని వార్డ్ లో ఒళ్ళంతా బ్యాండేజీలతో వున్న బాబుని చూసేటప్పటికి , పై ప్రాణాలు పైనే పోయినట్లు అయ్యింది శిరీషకి.
బాబు కి వైద్యం చేస్తున్న డాక్టర్, శిరీషని చూసి, “ ఏమ్మా, మీరేనా బాబు మదర్ ? బాబు కి దెబ్బలు బలంగా తగిలాయి. రక్తం చాలా పోయింది. వెంటనే రక్తం ఎక్కించాలి. బాబుది అరుదైన బ్లడ్ గ్రూప్. ఓ  పాజిటివ్ . మా దగ్గర ప్రస్తుతానికి స్టాక్ లేదు. మీరు వెంటనే రెండు బాటిల్స్ అరేంజ్ చేస్తే , మా ప్రయత్నాలు మేము చేస్తాము “ అని చెప్పేసి  మరో పేషెంట్ ని చూడడానికి వెళ్ళాడు. 

బాబుని ఆ స్థితిలో చూసేటప్పటికి, శిరీష కి దుఃఖం ఆగట్లేదు. డాక్టర్ చెప్పిన మాటలు ఆమెకి అసలు అర్థం కూడా అయినట్లు లేవు. 
పార్వతమ్మే “అమ్మా, మనింటికి ఎప్పుడూ వస్తుంటుందే మీ స్నేహితురాలు మాధురమ్మ. ఆవిడదీ, బాబుదీ ఒకే గ్రూప్ రక్తమని మీరు అప్పుడప్పుడు అనుకుంటుండే వారు కదమ్మా. ఆమెకి ఫోన్ చేసి పిలిపించండమ్మా“ అని చెప్పగానే వెంటనే తేరుకుని మాధురి కి ఫోన్ చేసింది శిరీష .

ఫోన్ లో శిరీష గొంతు వింటూనే మాధురి హుషారుగా “హాయ్ శిరీషా, వాటే కో యిన్సిడెన్స్ , నేనే నీకు ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను , ఈ లోగా నువ్వే చేసావు. ఈ రోజు రిలీజ్ అవుతున్న షారుఖ్ ఖాన్ మూవీ ఈవెనింగ్ షో కి రెండు టికెట్స్ దొరికాయి. నేనొచ్చి నిన్ను పికప్ చేసుకోనా సాయంత్రం ..“ అంటూ యింకా ఏదో చెప్ప బోతుంటే  మధ్య లోనే ఆమెని ఆపి బాబు విషయం చెప్పింది శిరీష.

“బాబుదీ, అభీదీ  ఒకే బ్లడ్ గ్రూప్ మాధురీ , కానీ సమయానికి అభి ఊర్లో లేడు. నీదీ ఓ పాజిటివ్ గ్రూపే కదూ. నువ్వు కొంచం త్వరగా యిక్కడికి వచ్చి బాబుకి రక్తం యిస్తే  మా బాబుని బ్రతికించిన దానివవుతావు , ప్లీజ్ “ అని రిక్వెస్ట్ చేసింది శిరీష.

“ సారీ శిరీషా, నీకు తెలుసుగా, నాకు హాస్పిటల్స్ అంటే అలర్జీ. బ్లడ్ ని  చూస్తేనే కళ్ళు తిరిగినంత పని అవుతుంది నాకు.  పైగా నా ఫేవరెట్ హీరో షారుఖ్ ఖాన్ మూవీని మొదటి రోజే చూడక పోతే నాకు నిద్ర పట్టదని నీకు తెలుసుగా “ అంటూ ఫోన్ కట్ చేసేసింది మాధురి. 
స్నేహితురాలి  మాటలకి స్పృహ తప్పినట్లైన శిరీష , కుర్చీలో ఒక ప్రక్కకి ఒరిగి పోతుంటే పడి పోకుండా వెంటనే ఆమెని పట్టుకున్నారు పార్వతమ్మ,  అప్పుడే అక్కడికి వచ్చిన ఆమె  కూతురు పూజా.

* * *

శిరీషకి స్పృహ వచ్చి కళ్ళు తెరిచేటప్పటికి, ఆమె కి గ్లూకోజ్  ఎక్కిస్తున్నారు. “బాబూ అరవింద్ “ అంటూ  లేవ బోయేటప్పటికి, ప్రక్కనే సెలైన్ బాటిల్ అడ్జస్ట్ చేస్తున్న పూజ , ఆమెని ఆపి “ ఆంటీ , అరవింద్ కి ఏమీ ప్రమాదం లేదు, తను క్షేమంగానే  వున్నాడు. మీరు నాతో  రండి “ అంటూ శిరీషని అరవింద్ వున్న రూమ్ కి తీసుకుని వెళ్ళింది . 

అక్కడ బెడ్ మీద నీరసంగా పడుకుని వున్న అరవింద్ , శిరీషను చూస్తూనే “ మమ్మీ, నువ్వెక్కడికి వెళ్లావు? పూజక్కని అడిగితే  ప్రక్క రూమ్ లో డాక్టర్ తో మాట్లాడుతున్నావని చెప్పింది. డాక్టర్ ఏం చెప్పారు మమ్మీ? నాకు త్వరలోనే నయమౌతుందన్నారా? నెక్స్ట్ మంత్ మా స్కూల్ లో బాడ్మింటన్ సెలెక్షన్స్ వున్నాయి కదా. అప్పట్లోగా నేను నార్మల్ అవుతానా మమ్మీ? “ అని అడుగుతున్న బాబు ప్రశ్నలకు సమాధానం చెబుతున్న శిరీష , బాబుకి కుడి వైపున బెడ్ మీద కావేరిని  చూసి ఆశ్చర్య  పోయింది. 

అది గమనించిన పూజ “ ఆంటీ, కావేరిదీ కూడా అరవింద్  బ్లడ్ గ్రూపే. వాళ్ళ అత్తని డాక్టర్ కి చూపించడానికి వచ్చిన కావేరి మిమ్మల్నీ, బాబునీ యిక్కడ ఈ స్థితిలో చూసి వెంటనే బాబుకి రక్తం యివ్వడానికి ముందు కొచ్చింది “ అని చెప్పింది. 

శిరీష వెంటనే కావేరి  దగ్గరకు వెళ్లి ఆమె  రెండు చేతులూ పట్టుకుని “ కావేరీ , నా బాబుకి ప్రాణ దానం చేసావు. ఏమిచ్చినా నీ ఋణం తీర్చుకో లేను “ అని గద్గద స్వరం తో అంది. 

“ఊరుకోండమ్మా. యిందులో నేను చేసిందేముంది? మనిషికి మనిషి సాయం. నాకే యిలాంటి కట్టం వస్తే, మీరూ, అయ్య గారూ చూసుకోరా? అరవింద్ బాబుని ఈ చేతులతో పెంచానమ్మా . నాకు మా బొట్టెంతో , అరవింద్ బాబూ అంతే కదమ్మా “  అని కావేరి అంటుంటే శిరీష కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. 

“ తన కష్టాన్ని వాళ్ళ కష్టంగా భావించి యింత సాయం చేసిన వీళ్ళనా తను యింతకాలం ‘అలగాజనం’ అంటూ ఈసడించుకుంది “ అని ఎంతో పశ్చాత్తాపపడింది శిరీష. 

* * *

ఆభిరాం లండన్ నుండి తిరిగి వచ్చాడు. జెట్ లాగ్ అదీ  పూర్తయి  స్నానం చేసి బ్రేక్ ఫాస్ట్ కి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే, దోసెలు, కొబ్బరి చట్ని వడ్డించిన  పార్వతమ్మ లోనికి వెళ్ళబోతుండగా “ పార్వతమ్మా, ఈ నెల మన పూజకి ఫైనల్ టర్మ్ ఫీజు కట్టాలేమోగా, యిదిగో తీసుకో “ అంటూ డబ్బు ఆమె చేతికి యిచ్చింది శిరీష.

అక్కడే హాల్లో అద్దాలు తుడుస్తున్న కావేరి తో “ కావేరీ, అయ్యగారు లండన్  నుండి చాక్లెట్లు తెచ్చారు. ఫ్రిడ్జ్ లో పెట్టాను చూడు. యింటికి వెళ్ళేటప్పుడు నీ  కూతురికి తీసుకుని వెళ్ళు. అన్నట్టు  దానికి సేమ్యా పాయసం అంటే చాలా యిష్టమన్నావు కదూ. పార్వతమ్మా, ఈ రోజు మీరు చేసిన పాయసాన్ని కావేరికి ఒక బాక్స్ లో యిచ్చి పంపండి వెళ్ళేటప్పుడు“ అని చెబుతున్న  శిరీషని చూస్తూ అభిరాం ఎంతో ఆనంద పడ్డాడు తానెంతగానో ఆశించిన మార్పు భార్యలో యింత కాలానికి  కనిపిస్తుంటే.

"చ...అలగా జనం అలగా జనం అంటూ ఇంత కాలం ఎంత తప్పుడు అభిప్రాయం పెంచుకున్నానండీ...వాళ్ళ ల్లోనే ప్రేమాభిమానాలుంటాయని  అర్థం చేసుకో లేక పోయాను...." అంటున్న శిరీషని చూస్తూ అభిరాం " చూడు శిరీషా, తప్పు చేసానని అంటూ అదే తప్పు మళ్ళీ చేస్తున్నావు...మంచి బుద్ధులూ, ప్రేమాభిమానాలూ పేద వాళ్ళల్లోనే ఉంటాయనేదీ కరెక్ట్ కాదు...అలాగని ధనిక వర్గాల మనసుల నిండా ఈర్ష్యా అసూయా ద్వేషాలు, మనుషులని వాడుకుని వదిలేసే బుద్ధులూ ఉంటాయనేది కరెక్ట్ కాదు....మంచి చెడులకు ఏ వర్గమనేది కొలమానం కానీ గీటురాయి గానీ కానే కాదు....ఇంత కాలం అలగా జనమంటూ వాళ్ళ మీద తక్కువ చూపు చూసిన నువ్వే ఇప్పుడు వాళ్ళ మీద అమాంతం ప్రేమ పెంచేసుకుని డబ్బున్న వాళ్ళ మీద ద్వేషం పెంచేసుకోవడం విడ్డూరంగా ఉంటుంది" అన్నాడు...అవునన్నట్టుగా తల ఊపింది శిరీష..

మరిన్ని కథలు
bali