Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
alagajanam

ఈ సంచికలో >> కథలు >> బలి

bali

ఆ రోజు బూదవ్వ, ఆవిడ ఒక్కగానొక్క కొడుకు పొలం పనులకి పోయి వచ్చి అరుగు మీద కూర్చున్నారు. అదిగో అప్పుడే వచ్చాడు గంగేసు, భూముల బ్యారం చేస్తాడు,  బ్యారం  అంటే వాడు డబ్బు పెట్టి భూములు కొనడం కాదు, డబ్బున్న ఆసాములకు, భూములు కొని తమ వద్ద మూలిగే డబ్బుని స్థిరాస్తిగా మార్చుకునే భూ బకాసురుల కోసం ఈ పల్లెలో అమాయకులని మభ్య పెట్టి, డబ్బు ఆశ చూపి, బుట్టలో వేసే బ్యారం  చేస్తాడు, ఒక్కమాటలో చెప్పాలంటే బ్రోకర్ పని చేస్తాడు,దానికి తగిన ప్రతిఫలం భూమి విలువ కట్టిన వారి దగ్గర తీసుకుంటాడు. అలా సంపాదించే సిటీ లో నాలుగు కమెర్షియల్ కంప్లెక్సులు కట్టాడు, అదే ఆ పల్లెలో వాడికి వాడి మాటకి విలువ తెచ్చింది, వాడు ఏదయినా చెబితే నమ్మేలా చేసింది. అదే డబ్బు చేసే మేజిక్, ఆ మేజిక్ బూదవ్వని కూడా బుట్టలో పడేసేలా చేసింది.

అరుగు మీద కూర్చున్న భూదవ్వని,  " ఏం బూదవ్వ బాగున్నావా, పొలం పనులు బాగా సాగుతున్నాయా, నీ కొడుకు కూడా ఈన్నే ఉన్నాడు కదా, ఎరా  రాజేశం అంతా బాగేనా కొద్దిగా బక్కగైనట్లున్నావ్, మీ అవ్వ కూడు సక్కగా పెడుతా లేదారా ? "ఏందిరా అట్లంటవ్? నాకున్నది ఆడొక్కడేనాయె, ఆన్ని కూడు వెట్టక సంపుతానా??, 

నా పెనిమిటేమో ఏనాడో వాగ్గడ్డకు వాయే, నాకు ఆడు ఆడికి నేను, పొలం పనుల తోటి కొద్దిగా పనెక్కువై అట్లా కనవడుతున్నాడు గని, ఏందీ సంగతి నువ్వు ఇట్లా వచ్చినవ్ ఆరా తీసింది బూదవ్వ. బూదవ్వ కొడుకు రాజేశం కాస్త అమాయకుడు, వ్యవసాయం  పనులు, ఇంటి పనులు తప్ప ఏది పెద్దగా పట్టించుకునే వాడు కాదు, బయటి పనులు చేయ నిచ్చేది కాదు బూదవ్వ, అంతా తానే చూసుకునేది.
"ఏం లేదు బూదవ్వా,  నీ పొలం హై వే కి ఆనుకుని ఉన్న ఒక ఎకరం పొలం ని ఐదెకరాలు చేసే మంచి మార్గం ఒకటుంది చెబుదామని వచ్చినా....." మెల్లగ వ్యవహారం మొదలెట్టిండు గంగేసు...

"ఆ ఏందీ ఒక ఎకురం పొలం ఐదుకురాలు చేసే మార్గమా?" ఆశ్చర్యం, ఆనందంతో బూదమ్మకు తెల్వకుండనే కండ్లు పెద్దగైనయి...

"ఆ(..ఆ(..ఐదెరాలు, నీ పొలాన్ని యాభై లచ్చలకి ఎవరికన్నా అమ్మినవానుకో, అదే ధరకి మనూరి చెరువు దగ్గర ఐదెకరాలు పొలం భూమి కొనచ్చు, కొనచ్చు" మొదటి పాచిక విసిరిండు గంగేసు... 

"సరే, అది కొనేదెవరట?" బూదవ్వలో అనుమానం....

"అక్కడికే అస్తున్న....నాకు తెలిసిన ఒక పెద్దాయన ఉన్నాడు, పట్నంల ఉంటడు, బాగా బలిసినాయన, డబ్బులు బాగా ఉన్నోడు, ప్లాట్ల దందా చేస్తడు, మన హైవే దగ్గరి పొలంల ప్లాట్లు పెట్టి అమ్ముదామని అయన ఆలోచన, నువ్వు ఊ అంటే సాలు ఇయ్యాలనే పిలిపిస్తా" ఆశపెట్టిండు గంగేసు..

"కానీ ఒరేయి గాంగేషు, అది నీళ్ల పార్కం సవులతున్న భూమి యాడాదికి మూడు పంటలు కూడా పండుతాయి ఓపికుండాలే అంతే, బంగారు గుడ్లు పెట్టె బాతుని ఎట్లా అమ్మలీనా అని?"ఆశ కల్గినా బూదవ్వకు కన్నతల్లిలాంటి పొలం మీద మమకారం వెనక్కు లాగుతోంది...
"బూదవ్వ నీకు తెల్వనట్టే చేస్తావేందే....ఈ బంగారు బాతునమ్మి ఇసుంటి బంగారు గుడ్లు పెట్టె ఐదెకరాల బాతుని నీకు కొని పెట్టె పూచి నాది, నేనొక్కటే మాట అడుగుతా బూదవ్వ...ఈ ఎకరం నువ్వే ఉంచుకున్నవనుకో దాంతోటి ఎం జేస్తవ్? వ్యవసాయం, మరి చెరువు గట్టు కింద ఐదెకరాల పొలం కొన్నావనుకో, అప్పుడేం జేస్తవ్? వ్యవసాయం.. కానీ ఇక్కడికి అక్కడికి ఎంత తేడా నాలుగెకరాల....? అంటే నీకు  ఈడ ఐదేండ్లు చేసే ఎవసాయం అక్కడ ఒకేడాదే  చేయచ్చు.....బూదవ్వ కి ఐదెకరాల పొలం ఉందంటే ఎంత విలువా...నీ కొడుక్కి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యచ్చు......ఆలోచించు.." కొద్దిసేపు మౌనం రాజ్యమేలింది....

బూదవ్వ ఆలోచనలో పడింది.....గంగేసు మాటలు నిజమే అనిపించాయి....మత్తు ఇంజక్షన్ లాగా గంగేసు చెప్పిన విషయాలన్నీ భూదవ్వని ఆక్రమించాయి..

మత్తులో ముంచేశాయి....అదే మత్తులో "సరే నువ్వన్నట్టే కానిద్దాం....కానీ ఒరేయ్ గంగేసూ పైసలన్నీ ముట్టినంకనే రిజిష్టరీ, ఏంటనే యెల్లి ఆ ఆసామిని పిలిసుక రా....." అని చెప్పింది...

***********

గన్గేసు వెళ్లి ఆ పెద్దాయనను పిచుకొనిరావడం, బూదవ్వ భూమి కొలతలు చేయించడం, రేటు కుదుర్చుకోవడం, భూమి కాగితాలు చూసుకుని అంతా పక్కాగా ఉందొ లేదో చూసుకోవడం, "ఒక మంచి రోజు చూసుకుని వస్తాము, వాయిదాలు లేవు ఒకే ఇన్ స్టాల్ మెంట్ లో డబ్బు కట్టేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకుంటాము " అని చెప్పి వెళ్లి పోవడం, ఈ విషయాలన్నీ బూదవ్వ కొడుకుకి చెప్పి ఒప్పించడం, బూదవ్వ గన్గేసు చెప్పిన చెరువు గట్టు క్రింది భూమి చూసి రావడం, ఆ భూమి రేటు మాట్లాడుకోవడం, సిటీ పెద్దాయన డబ్బు కట్టిన మరుసటి రోజునే డబ్బు కట్టి భూమి రిజిస్టేషన్ చేయించుకుంటామని మాట పక్క చేయించుకోవడం, అన్ని చక చకా జరిగి పోయాయి.

************

పెద్దాయన చెప్పిన రోజు రానే వచ్చింది, రెజిస్ట్రేషన్ తంతు ముగిసింది, పెద్దాయన ఒక లగేజి బ్యాగు నిండా డబ్బు కట్టలు నింపి ఇచ్చాడు, అన్ని వెయ్యి రూపాయల నోట్ల కట్టలు, బూదవ్వ బ్యాగు తీసుకుని ఇంటికి బయలుదేరింది, డబ్బు జాగర్తగా దాయమని, ఎవరి కంటా పడకుండా తీసుకెళ్లామని, రేపు పొద్దున్న వెళ్లి చెరువు గట్టు క్రింది భూమికి బయానా ఇద్దామని, జాగర్తలు చెప్పి పెద్దాయనతో కలిసి వెళ్లి పోయాడు గంగేసు, డబ్బు బ్యాగుతో ఇంటికి చేరింది బూదవ్వ.... బ్యాగు మరో సారి విప్పి చూసుకుంది, అన్ని వెయ్యి రూపాయల నోట్ల కట్టలు, బ్యాగు విప్పగానే వాసన డబ్బు వాసన అదో రకమైన వాసన, మత్తు మందు పెట్టినట్లు మైకం కమ్మేసే వాసన, ఆ మత్తు కోసం ఎన్నో నేరాలు చేయించే వాసన, ఆ మత్తుతో మంచిని చెడుగా చేసే వాసన,చెడుని మంచిగా మార్చే వాసన, తెగి పోయిన బంధాలను కలిపే వాసన, ప్రేమల్ని సృష్టించే వాసన, ప్రాణాలు తీయించే వాసన, ప్రాణాలు నిలిపే వాసన, ప్రభుత్వాలు నడిపే వాసన, ప్రభుత్వాలు కూల్చే వాసన, మంచి మంచి వారినే తన చిటికెన వేలు పైనా నిలుపుకుని ఆడించే డబ్బు వాసన, ఆ వాసన మైకంలో బూదవ్వ తేలి పోసాగింది, రేపటి నుండి మా జీవితం మారిపోతుంది, నా కొడుకు జీవితం మారి పోతుంది, నా కొడుకు బంగారు జీవితం కోసం నేను కన్న కలలు నిజం కాబోతున్నాయి..ఆలోచనలతో, ఆనందంతో ఉక్కిరి బిక్కిరి కాసాగింది బూదవ్వ, డబ్బుని జాగర్త చేసి పడుకుంది, నిద్రే రావడం లేదు, అదే ఆలోచనతో తెల్ల వారింది, ఎంతో ఉత్సాహంగా...రాత్రి ఆలోచనతో నిద్ర లేకున్నా ఎంతో ఉల్లాసంగా నిద్ర లేచింది బూదవ్వ.....

పక్కింటి శ్రీలక్ష్మి ఉరుకుల మీద....."బూదవ్వ బూదవ్వ ఇది విన్నావా ఇది విన్నావా....." అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది.
" ఏంటే ఆ ఎగిర్థం...ఏదో కొంపలంటుకు పోయినట్లు, ఏందీ, జర స్థిరం బట్టు....ఇప్పుడు సెప్పు.... 

"మీరు నిన్న జాగా అమ్మిండ్లు కదా?"

"అవును అమ్మినం...రిజిస్టేషని కూడా అయిపాయె ఇప్పుడెందుకు ఆ యిసయం...?"

"రెజిస్ట్రేషని కూడా అయిందా....పైసలు కూడా ముట్టినాయ....?"

"ముట్టంది నేనెందుకు సంతకం బెడుతనే....ముట్టినయ్" "పైసలు ఎయ్యి రూపాల నోట్లు, ఐదు వందల నోట్లు గిట్ల యిచ్చిండా...?" 

"ఎందుకే....? ఏ పైసలిస్తే నీకెందుకు.....ఏమో బాగా ఆరాలు దీయవడ్తివి"

"ఆరాలు కాదు బూదవ్వ నీ మంచి కోరే అడుగుతున్న.....పొద్దుగాల్ల టి.వి.వార్తలల్ల సెప్తున్నారు........ఇయ్యాళడ్సంది ఎయ్యి రూపాల నోట్లు, ఐదు వందల నోట్లు నడవయంటా...., ఏదో నల్ల డబ్బంటే....ఇయ్యల్డసంది అవన్నీ ఉట్టి కాయిదాల తోని సమానమంటా.......
ఒక్కో మనిషి దగ్గర రెండున్నర లచ్చల కంటే ఎక్కుంటే అదంతా నల్ల డబ్బంట, అవన్నీ లెక్క సెప్పాల్నాటా, లేక పోతే జైలుకే నాటా, తనకు తెలిసినవి తెలియనివి అన్ని విషయాలు కలగా పులగంగా చెప్పింది పక్కింటి శ్రీలక్ష్మి.....శ్రీలక్ష్మి చెప్పిన విషయం విన్నంతనే  బూదవ్వకి గుండెల్లో కత్తితో పొడిచి నంత పనయింది, శ్వాస ఆడకుండా ఎవరో గొంతు నులుముతున్నట్లు ఊపిరి ఆడడం లేదు బూదవ్వకి, ఏం చేయాలి ఇప్పుడు, నిన్న పెద్దాయన ఇచ్చిన నోట్లన్నీ ఎయ్యి రూపాయల నోట్లే.....మల్లి ఒక సారి లోపలికి వెళ్లి బ్యాగు తెరిచి చూసింది, అవును అన్ని వెయ్యి రూపాయల నోట్ల కట్టలే.....ఏం చేయాలో తోచ లేదు బూదవ్వకి, గంగేసు......ఓ గంగేసూ.....ఒక్క సారిగా గురుతుకు తెచ్చుకుని గంగేసు దగ్గరికి వెళ్లి చెబితే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో అని గంగేసు ఇంటికి పరుగు తీసింది........గంగేసు ఇంట్లో లేడు......ఇయ్యాల మబ్బులనే ఆగమాగంలా బీరువా అంత సదురుకుని, బ్యాగుల పెట్టుకుని, ఎంత అడిగినా ఏం సప్పుడు చేయకుండా....గాలి గాలిలా ఎల్లి పోయిండు పట్నం బోతానని  చెప్పింది గంగేసు పెళ్ళాం.

అయ్యో అట్లన ఇప్పుడెట్లా అనుకుంటూ తన ఇంటి వైపు నడవ సాగింది, "ఏమైంది బూదవ్వ" అని గంగేసు పెండ్లాం పిలిచినా వినిపించుకోకుండా...వెళ్ళి పోయింది ఇప్పుడే వెళ్లి ఈ విషయం తన కొడుకుకి చెబితే? చెప్పినా వాడికేం తెలుస్తది వాడుట్టి ఎర్రి బాగులోడు, మరి ఎవరికి చెప్పాలి, ఏం చేయాలి, కొడుకు జీవితం బాగు పడుతుందని ఉన్న ఒక ఎకరం పొలం అమ్మతే ఇంత పనైంది, నా దగ్గరున్న పైసలన్నీ పనికి రావట, ఇది నిజమేనా.....?" ఇంటికి నడుచుకుంటూ... దారి మధ్యలో కలిసిన వారినల్లా అడిగింది, నోట్లు నడవయనే అందరు చెబుతున్నారు, అంటే అది నిజమే అవును నిజమే, నా దగ్గరున్న నోట్లన్నీ పనికి రావు యాభయ్ లచ్చలు ఒకటా రెండా యాభయ్ లచ్చలు, బూదవ్వ కాళ్ళ కింద భూమి కదిలి పోయినట్లు అయింది, కళ్ళు తిరిగినట్లు అయిన్ది, కొడుకు గూర్చి  ఆలోచిస్తే ప్రాణం పోయినట్లు అవుతుంది, ఇప్పుడు తన దగ్గర ఉన్న నోట్లన్నీచిత్తు కాగితాలతో సమానం అని తలుచుకుంటేనే పై ప్రాణాలు పైనే కలిసి
పోతున్నాయి.......

తన కొడుకు జీవితం తన చేతుల తోనే నాశనం చేసినట్లు అయింది, ఇప్పుడు నా కొడుకుకి ఏం ముఖం చూపించాలి, అవ్వ గిట్ల జేసిన వేందే అంటే ఏం సమాధానం జెప్పాలె, ఆలోచనతో ఇంటికి చేరుకుంది, ఇంట్లో కొడుకు లేడు ఎటో బయటికి పోయినట్లున్నాడు, ఈ విషయం వాడికి తెలుసో లేదో, తెలువ కుండా ఎట్లుంటది, తెలిసే ఉంటది ఈ పాటికి ఎవరన్నా చెప్పే ఉంటరు, తెలిసినంకా ఇంటికి వచ్చి నన్ను అడిగితే ఏం చెప్పాలే, నీ జీవితం నేనే నాశనం చేసినారా అనాలనా, ఏం ముఖం బెట్టుకుని వాడి ముందర తేరుగాలే.......భయం, కోపం, ఆందోళన, వణుకు, నీరసం, ఆలోచనలు అన్ని రకాలుగా బూదవ్వకి తుఫాను సుడి గాలిలో చుట్టుకు పోయినట్లుంది ఏం చేయాలో తోచడం లేదు........బూదవ్వ ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుంది, వేసిన తలుపు మళ్ళి తెరుచుకోలేదు పొగ......పొగ......పొగ.........మంటలు... మూగ వేదనకి అంటుకున్న మంటలు, నిస్సహాయతకి అంటుకున్న మంటలు.......పొగ.....పోగా....కాలుతున్న నోట్ల వాసన, గది నుండి, గది బయట,ఊరంతా.......కాలుతున్న నోట్ల వాసన.......కాలుతున్న నోట్ల వాసన...

*****

మరిన్ని కథలు
tappu