Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> కమాను వీధి కథలు

kamanuveedhikathalu
వంటలమ్మ...పద్దమ్మ..!:

‘మీరెంత చేసినా...ఎంత కస్టపడినా...ఆ పద్దమ్మలా ఓళిగలు సేయడం మీ వల్ల కాదంతే...’నాన్న తరచూ అనే ఈ మాటలకి అమ్మ , పిన్నమ్మ బంధువుల్లో సానా మందికి రోషమొచ్చినా...కోపం మాత్రం వచ్చేది కాదు. కారణం ఇది కువ్వాడం కాదు నిజం కాబట్టే! వంటల రుచులపై తమ అభిప్రాయాలను ఏమాత్రం తగ్గకుండా ఠపీమని చెప్పగలిగే నాన్నలాంటి చాలా మంది మెచ్చుకునేలా వంటలమ్మ పద్దమ్మవ్వ పనితీరుండేది. ఆమె ఇంటికొచ్చిందంటే ఎక్కడ్లేని సందడి...హడావుడి. అవ్వ ఇంట్లో వచ్చీరాంగానే వంటింట్లో పోయి పొయ్యి ముందు కూర్చొనేది. ఇంక అప్పట్నుంచి ఆమె ప్రతి కదలికా...నాకు అబ్బురమే. బళ్లారి నుంచి అదేపనిగా తెప్పించిన ఓళిగరవను అమ్మ అప్పటికే బాగా ముద్దలా కలిపి ఓ పళ్లెంలో పెట్టి దానిపై తడిగుడ్డ కప్పి ఉంచేది. పొయ్యిలో కట్టెల్ని సరిగా పేర్చుకోవడం...నూనెలో తడిపిన రవ ముద్దను సున్నితంగా మునివేళ్లతో తీసుకుని అందులో బెల్లం పూర్ణాన్ని కూరి ఉండల చుట్టడం...చపాతిలా తిక్కడం...పెనం వేయడంతో మొదటి దశ పూర్తయ్యేది. దాని నూనెలో ముంచిన కొబ్బరిపీచును అలా అలా తిప్పేది. ఇవన్నీ ఒక ఎత్తయితే పెనంపై ఉన్న ఓళిగను తిప్పి మళ్లీ వేయడం...వాహ్వా...పద్దమ్మవ్వే చేయాలి. చాలామంది ఇలా చేసేటపుడే ఓళిగలు చిరిగిపోయి...పరువు తీసేస్తుంటాయి. అయితే మా పద్దమ్మవ్వ తీరేవేరు. అలవోకగా కాడతో అలా తిప్పేసేది. ఇంకో విశేషమేంటంటే...ఇదేదో అద్భుతం చేస్తున్నట్టు కాకుండా కబుర్లు చెబుతూ...చెణుకులు విసురుతూ ఈ పని కానిచ్చేది.  పద్దమ్మవ్వను మాకు పరిచయం చేసింది ఈ ఓళిగలే! ఆమె పేరు చాలా త్వరగా అందరిలో పాకిందీ ఈ వంటకం మూలానే!

చిన్న...చిన్న తీపి వంటకాలెన్ని చేసినా...ఓళిగ చేసేవాళ్లే...చేయగలిగినవాళ్లే పాకశాస్త్ర ప్రవీణులకింద లెక్క! ఈ లెక్కన మా పద్దమ్మవ్వకు ఓ పది డాక్టరేట్లు చాలా సులువుగా ఇచ్చేయొచ్చు! నేనింతగా ఆయవ్వను పొగిడేకి కారణముండాది. ఓళిగలు ఓ పట్టాన కుదురుగా ఎవరికీ రావు. రవముద్దలో కూరిన పూర్ణం ...చపాతిలా తిక్కినపుడు అంచుల దాకా వెళ్లగలగాలి. చాలామంది అలా చేయలేక చేతులెత్తేయడం వల్ల అంచుల్లో కేవలం రవ ఉంటుంది కానీ పూర్ణం ఉండదు.  మిగిలిన వాళ్ల మాటేమో గానీ మా కమానులో రెండు రకాల ఓళిగలు చేసేవాళ్లు. అమ్మా వాళ్లు చేసే ఓళిగల్లో నూనె అధికంగా వాడేవాళ్లు కాదు. చపాతిలా రుద్ది పెనంపై వేసేవాళ్లు. అయితే లింగాయతులిళ్లల్లో ఇలా కాకుండా నూనెలో బాగా ముంచి ఓ తగుడు రేకుపై  నేర్పుగా అతికించి...దాన్ని పొరలా విడదీసి పెనంపై వేస్తారు. రుచిలో తీసిలో రెండు రెండే! అయితే నూనెఓళిగలు ఎంత పెద్దగున్నా ..అరచేతిలో ఇమిడేలా మడిచేయవచ్చు! పద్దమ్మవ్వ పొయ్యిముందు కూర్చుంది అంటే...ఓళిగలు చేసేందుకే అన్నంతగా పేరు పాకిపోయింది. ఓళిగలకు తనే ఓ పెద్ద బ్రాండ్‌ అంబాసిడర్‌లా ఉండేది.

ఓళిగలు మాట సరేగానీ...ఇంతకూ ఎవరీ పద్దమ్మవ్వ ...ఉన్నట్టుండి యాడ్నుంచి మా ఊరికి ఊడిపడిండాదనేది ఇప్పటికీ చాలామందికి తెలీని ఓ దేవరహస్యం. పద్దమ్మవ్వది ఆలూరు పక్కన హాలహర్వి. భర్త రుద్రప్ప ఊరి కరణం..పోస్ట్‌మాస్టర్‌గా రెండు పనులు చేసేటోడు. అంతా బాగుంది అనుకుంటుండగానే అవ్వకు పెద్ద కస్టమొచ్చేసిండాది. భర్త పోవడమే ఓ పెద్ద కస్టమయ్యిండాది. కనీసం ఓ నలుసైనా పుట్టి ఉంటే...భర్త పేరు తలచుకుంటూ...బిడ్డను చూసుకుంటూ బతికేసేదేమో...కానీ పిల్లలు లేకపోవడంతో ఒంటరితనం సానా దిగాలుగా చేసిండాది. కస్టాలు వచ్చినప్పుడే అయినోళ్లెవరో...పరాయోళ్లెవరో తెలుస్తాదంట! పద్దమ్మవ్వ పరిస్థితి దీనికి మినహాయింపేం కాదు. తనవారు అనుకున్నవారు ఒక్కొక్కరు దూరమయ్యారు. కట్టుకున్నాయప్ప పోయిండాడని బాధ పడాలా...ఇంక బతికేదెట్టారా నాయనా అనుకుని బాధ పడాలా...ఏమీ అర్థం కాని స్థితిలో పద్దమ్మవ్వ. కానీ ఎంతకాలం అలాగే ఉండేది. ఉన్నూరు కాదన్నప్పుడు...పరాయి ఊరే దిక్కు! ఇంక బతికినంతకాలం ఒంటిగానే బతకక తప్పదు...ఆ బతుక్కోసం మళ్లీ రెక్కలు ముక్కలు చేసుకోక తప్పదు అని పద్దమ్మవ్వకు తెలిసొచ్చిండాది. వంటిల్లే సామ్రాజ్యమనుకుని...గడప దాటకుండా...కాలు బైట పెట్టకుండా సంసారం చేసుకొచ్చిన పద్దమ్మవ్వకు వచ్చిన కస్టం మామూలు కస్టం కాదు. అయితే కడదాకా తోడు ఉండాల్సిన పెనిమిటే పోయాక...ఊరొదలి పోవడం ఆమెకు పెద్ద ఇబ్బందనిపించలేదు. పైగా ఉందామనుకన్నా ఏమాత్రం సరిగా లేని పరిస్థితులు. భర్త తలపులుతోపాటు తలవెంట్రుకలు వదిలేసుకుని గంగాభాగీథి సమానురాలిగా మారి...ఊరు వదిలి వెళ్లింది పద్దమ్మవ్వ!

అమ్మ లెక్క ప్రకారం మొదట పద్దమ్మవ్వ ప్రత్యక్షమైంది కుసుమావతమ్మ వాళ్లింట్లో. ఈ ఇంటిని మేం మూడు రకాలుగా పిలిచేవాళ్లం, కుసుమావతమ్మ వాళ్లిల్లు...డైమండ్‌ వాళ్లిల్లు...ఆడిటర్‌ రామారావు ఇల్లు... విశేషం ఏంటంటే ఎట్టా పిలిచినా మాకు ఎప్పుడూ గందరగోళం అనిపించేది కాదు. కుసుమావతమ్మ వాళ్లింట్లో వంటలమ్మగా కనిపించిన పద్దమ్మవ్వ చాలా సులువుగా అందరిలో కలిసిపోయింది. గరిటె తిప్పడంలోనే కాదు...మనుషుల్ని కలుపుకోవడంలోనూ ఆరితేరిన అవ్వకు అందరూ ఆత్మీయులుగా మారిపోయారు. ముఖ్యంగా అమ్మ. మా లలితక్క పెళ్లప్పుడు పద్దమ్మవ్వ ఇంటికొచ్చింది. ఆమెకు తెలిసిన వంటకాలు వినే నోరెళ్ల బెట్టుకున్నవాళ్లున్నారు. సాధారణంగా ఆడోళ్లు ఏ విషయంలోనైనా రాజీపడి పొగిడేస్తారు గానీ...వంటల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. ఎదుటివారి వంటను మెచ్చుకోవడం అంటే పరోక్షంగా తమను తగ్గించుకోవడమే అన్నంతగా ఇది అవుతుంటారు. అలాంటిది  పద్దమ్మవ్వ విషయంలో మాత్రం బేషరతుగా బాగుందనేవారు. పెళ్లికి పదిరోజుల ముందే చిరుతిళ్ల తయారీకి అమ్మావాళ్లు నడుం బిగించారు. ఈ ఘట్టంలో ప్రభావతికక్కి, సీతమ్మకక్కి తదితరులంతా వీరావేశంతో పాల్గొన్నారు. అయిదుశేర్ల అత్రాసలు చేయడమనేది అప్పట్లో  కమాను చుట్టుపక్కల మా బంధువుల ఇళ్లల్లో  పెద్ద వార్తే అయింది. ఇంతగా చేసినోళ్లెవరూ అని ఆరా తీసిన వారికి పద్దమ్మవ్వే గరిట తిప్పుతూ విలాసంగా కనిపించింది. అప్పట్నుంచి ఆమె పేరు వాడలు దాటి ఊర్లకు పాకింది. పద్దమ్మ బాగా తీపి వంటలు చేస్తుందంట...అందులోనూ ఓళిగలు....జొన్నరొట్టెలు చేయడంలో స్పెషల్‌ అనే వాణిజ్యప్రకటనలూ వినిపించాయి. అక్క పెళ్లి తర్వాత ఇంట్లో జరిగే ప్రతి చిన్న కార్యక్రమానికి పద్దమ్మవ్వ హాజరు వేయించుకునేది. నిజం చెప్పాలంటే అమ్మ కొన్ని వంటలు చేయగలిగినా...పట్టుబట్టి పద్దమ్మవ్వనే పిలిచేది. ఆమెకో పని కల్పించడమన్నది బైట కనిపించే కారణమైతే...స్నేహధర్మమనేది లోపలి నీతి. హుళిపుడి...సారు పుడి...చింతొక్కు...ఇలా మసాలు పుడులు..పచ్చళ్లు చేయడంలోనూ తన మార్కు చూపించేంది.

పద్దమ్మవ్వ వంట గురించి ఎంత చెప్పొచ్చో ఆమె మాటలు గురించి అంతకన్నా ఎక్కువ చెప్పొచ్చు. బలే కువ్వాడం మనిసి. సరదాగా మాట్లాడ్డంలో దిట్ట. మేం ఎప్పుడన్నా ఆట పట్టించేందుకు  ప్రయత్నిస్తే...‘రేయ్‌...మీ రామదుర్గమోళ్లు తొగులాటగాళ్లురా...మీ కత తెలియందెవరికి’ అంటూ ఎదురు దాడి చేసేసేది. నలుగురు కలిసినపుడు సరదాగా మాట్లాడ్డమే కాకుండా అమ్మలాంటి వాళ్ల వద్ద ఎన్నెన్నో సుద్దుల మూటలు విప్పేది. నాల్గు చోట్ల వెళుతుండటం వల్ల ఎన్నో విశేషాల ఘుమఘుమలు మోసుకొచ్చేది. అక్కడ అలా అంట...ఇక్కడ ఇలా అంటా...విన్నావా శాంతమ్మా అంటూ ఇంట్లోకి వస్తుంటే అమ్మ మొహం వెయ్యివోల్టుల బల్బులా వెలిగిపోయేది. పద్దమ్మవ్వ ఇంటికొచ్చిందంటే సరదాగా ఓ గంట గడిచినట్టే! ఇలా మా ఇల్లొకటే కాదు. చుట్టుపక్కల సానా ఇండ్లల్లో  పద్దమ్మవ్వకు బేకయ్యే వాల్లుండేవారు. ఆమె కస్టసుకాలు తెల్సుకుని పరామర్శించే వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోయింది. పద్దమ్మవ్వ  వంటకళ తెలుసుకన్న అశ్వత్థ డాక్టరు ఇంట్లో వంట చేయాల్సిందిగా  కోరారు. ఆ డాక్టరంటే చుట్టుపక్కల వటారంలో మంచి పేరుండటం...పైగా డాక్టరు కాబట్టి జొరమో గిరమో వస్తే ఏదో మందూ మాకూ ఇస్తాడన్న ఆశతో పద్దమ్మవ్వ వెంటనే ఒప్పేసుకుంది. ఆ ఇంట్లో రోజూ వంటకెళ్లేది. అశ్వత్థ డాక్టరు ఇంటికి వంటకెళ్లడం అనేది పద్దమ్మమ్మకు ఓ విజిటింగ్‌ కార్డులా ఉపయోగపడింది.

పని దొరికింది గానీ తలదాచుకునేందుకు సరైన గూడు దొరకలేదు. వాళ్లిల్లూ వీళ్లిల్లూ...పనికోసమైతే వెళ్లొచ్చు గానీ... అదేపనిగా తిష్టవేసుకుంటామంటే ఎవరుమాత్రం ఒప్పుకుంటారు? పద్దమ్మవ్వకు పెద్ద పజీతే వచ్చిండాది. అయితే అశ్వత్థడాక్టరు పున్యమా అని వెంకటనరసప్ప గుడికి చెందిన పేద్ద ఇంట్లో స్థానం దొరికింది. గుడి ఎదురుంగా ఉండే దాంట్లో మొదట స్మార్త బ్రాహ్మణ మండలి నడిపేవారు. ఆ తర్వాత అది బ్రాహ్మణమండలిగా రూపాంతరం చెందింది. ఆ ఇంట్లో  పేద విద్యార్థులు తలదాచుకునే అవకాశం ఉండేది. అంత పెద్ద కొంపలో ఓ మూలలో పద్దమ్మవ్వకు చోటు దక్కగానే హమ్మయ్యా అంటూ ఊపిరితీసుకుంది. అప్పట్నుంచి అవ్వ నిశ్చింతగా కాలం వెళ్లదీసింది. పొద్దున్నే వంట పనులకు వెళ్లడం. సాయంకాలానికల్లా మండలి చేరుకోవడం దినచర్యగా మారింది. పద్దమ్మవ్వ తరచూ మా ఇంటికి వచ్చేది. కమానులో ఉండేవాళ్లకి మాటలకు కరవెక్కడుంటుంది? అమ్మతోనూ చుట్టుపక్కలోళ్లతోనూ కూర్చొని మనసారా కబుర్లాడేది. వళ్లు పులిసేలా బండెడు చాకిరీ చేసే పద్దమ్మవ్వకు మా కమాను ఓ విశ్రాంతిగృహం! అడపా దడపా ఏదైనా ఆరోగ్యపర చీకాకులు వచ్చినా ఇంటికొచ్చి అమ్మతో వెళ్లబోసుకునేది. 

నా కాలేజీ రోజుల్లో అదెలా సాధ్యపడిందో తెలీదుగానీ...కొద్దిరోజులు మండలిలో స్నేహితులతోపాటు రాత్రిళ్లు చదువు కుంటూ పడుకునే వాణ్ని. అప్పుడు అవ్వతో బోల్డెన్ని కబుర్లు చెప్పేవాళ్లం. ఆవిడ మాతో కాసేపు సరదాగా మాటలు కలిపేది. నేను ఓసారి అనుకోకుండా చిక్కుల్లో చిక్కుకున్నప్పుడు అవ్వే ఆదుకుంది. ఇంటర్‌లో కాలేజీ ఫీజు కట్టడానికి నాన్న డబ్బులు ఇస్తే...అవి కాస్తా పోయాయి. డబ్బులు యాడ పడేసుకుండానో ఏమో తెలీదు. కాలేజీ నుంచి ఇంటికొచ్చి అమ్మకు చెప్పాను డబ్బు పోయిందీ అని. పాపం అమ్మకు దిక్కుతోచలేదు. ఏదో అయిదో పదో అంటే సర్దొచ్చు కానీ పందల్లో అంటే...అదీ డబ్బు పోయిందన్న బాధ ఓ వైపు...నాన్నకు తెలిస్తే ఏమవుతుందోనన్న భయం మరోవైపు! ఈ సమస్యలు తట్టుకోలేక...ఎంత పనిచేసినావురా...నీకెప్పుడు బుద్దొస్తుందనీ తిట్టడం సురు చేసుకునిండాది. ఎంత తిడితే ఏముంది? మొదట ఫీజు కట్టాలి కదా! ఆలోచించి ఆలోచించి...పద్దమ్మ వద్దకెళ్లింది. ఇట్టా జరిగింది...ఈ పనికిమాలినోడు ఫీజు డబ్బులు పోగొట్టుకునిండాడు. అంతా నా సావుకొచ్చిండాది. ఇప్పుడేం చేయాలో తెలీట్లేదు అంటూ బాధగా అంటుంటే...అవ్వ ఏమాత్రం ఆలోచించకుండా..‘అయ్యో శాంతమ్మా...ఇంత బేజారైతే ఎట్టా? ఇట్టాగే అవుతుంటాయి మరి...పిలగాళ్లు వాళ్లనేమంటాం చెప్పు? నువ్వేం కంగారు పడొద్దు పీజు దుడ్లు నేనిస్తాను...నిదానంగా ఇద్దువు గానీలే...’ అనేసరికి పాపం అమ్మ ప్రాణాలు ఒక్కసారిగా లేచి వచ్చిండాయి. అట్లా పద్దమ్మ దుడ్లతో ఫీజు గండం గట్టెక్కింది.

పద్దమ్మవ్వ రెక్కలు ముక్కలు చేసుకుని పైసాపైసా పోగేసుకున్న డబ్బు ...అంతా ఆమెకు ఉపయోగపడిందా అంటే మాత్రం అదో చిక్కువీడని ముడిలాంటి ప్రశ్నే! ఆమె మరి ఎవరి వద్ద దాచుకునేదో...దాన్ని ఎలా ఖర్చు చేసేదో ఎవరికీ తెలీని విషయం. అయితే ఆమె జీవించిన విధానాన్ని చూస్తే మటుకు ఖర్చులు పోనూ చాలా మిగిలేంతగానే సంపాయించుకుని ఉంటుందని చాలామంది అంచనా! అందులో సత్యమెంతో సుళ్లు ఎంతో ఆ వెంకటనరసప్ప గుడి ఈశ్వరుడికే తెలియాలి. అంతా బాగుంటే ఇంక నన్ను అనుకునేదెప్పుడు? నాకు మొక్కేదెప్పుడు అని ఆ శివుడు అనుకునిండాడేమో...హాయిగా సాగిపోతున్న పద్దమ్మమ్మకు మరో కస్టం వచ్చిపడింది. ఎండోమెంటుకు చెందిన కొందరు ఈయమ్మ పుసాటుగా ఈడ ఎందుకుండాలా? ఎవరుండమన్నారు? ఈమెకే యాల ఈ పర్మిసను? అంటూ మాట్లాడ్డం సురు చేసుకునిండారు. అది క్రమంగా పెద్దదయ్యిండాది. పద్దమ్మవ్వకు ఏం జరిగిందో తెలిసేలోపు... మండలి నుంచి ఖాళీ చేయాలని ఆపీసర్లు అనేశారు. యాడ పోవాలా...ఎవర్ని వేడుకోవాలా? పాపం పద్దమ్మవ్వ మరో సారి బగవంతుడా...నీకు మళ్లీ నేనే దొరికిండానా ఆడుకునేకి అనుకుని కండ్లెమ్మట నీళ్లు పెట్టుకునిండాది. కానీ ఖాళీ చేయక తప్పలేదు. అశ్వత్థ డాక్టరు సెప్పినాంక కూడా ఆమెకు కస్టం వచ్చిండాదంటే...ఇంక ఎవరూ ఏం సేయలేరనే అర్థం! ఇండ్లకు వంటలకు పిలిచి బాగుండాదని మెచ్చుకుంటూ...పదో పరకో ఇచ్చిన అమ్మలాంటోళ్లకు కూడా ఏం చేయాలో తెలీలేదు. వయసు పైపడుతోంది...పైగా ఎనకా ముందరెవరూ లేరాయే...ఈయమ్మని ఇంట్లోకి పిలుసుకునే దైర్యం ఎవరికి ఉంటుంది? 

చివరికి పొమ్మన్న ఆ ఈశ్వరుడే...మరో దారి సూపిండాడు. వాళ్లనీ వీళ్లనీ పట్టుకుని ఎట్టాగోలా కమాను వెనక వీధిలో ఉన్న కోర్టుగుడిలో చేరుకునింది. చేతిలో విద్య ఉన్నా...చేసే సత్తువ లేనప్పుడు ఎవరైనా ఏం చేసేకి లేదు...ముక్కుతూ మూల్గుతూ రోజులు లెక్కెట్టుకోవడం తప్పించి. పాపం పద్దమ్మవ్వకు అలాంటి స్థితే ఎదురయింది. అయ్యోపాపం పెద్దమనిసి...కస్టాల్లో ఉంది అనుకున్న వాళ్లు తలా ఇంత సాయం చేస్తునే ఉన్నారు. మెల్లగా వంటలు చేయడం తగ్గిపోయింది. వళ్లు కూడదీసుకుని...వంటింట్లో పొయ్యిముందు కూర్చోవాలని ఉన్నా...వయసు...శరీరం సహకరించలేదు.  కానీ ఒకటి మాత్రం నిజం మా ఊరికి వచ్చిన వేళా విశేషం ఏంటో గానీ...పద్దమ్మవ్వ నా బతుకిలా అయ్యిందే అని బాధపడ్డ సందర్భాలు చాలా తక్కువ! ఆ లెక్కన ఊరు ఆమెను బాగానే ఆదరించిందని చెప్పొచ్చు! పొడులు చేసినా...పచ్చళ్లు పెట్టినా...ఓళిగలు చేసినా...ఆమె ఏం చేసినా ఆహా ఏం చేసిందనే అన్నారు. 

కాలం గడుస్తున్నకొద్దీ...తరాలు మారుతున్న కొద్దీ అప్పటి దాకా మనతో ఉన్న మనుషులు కూడా దూరమైపోతారనేకి పద్దమ్మవ్వే పెద్ద ఉదాహరణ! మాటల మూటలతో...వంటల నేర్పుతో తనకంటూ ఓ గుంపునే కూడగట్టుకున్న పద్దమ్మవ్వ మెల్లగా ఒంటరి అయిపోయింది. ఏ ఒంటరితనం తనను మింగేస్తుందని అత్తారింటి నుంచి పరుగులు తీసిందో...చివరికి అదే ఒంటరితనం మళ్లీ కమ్మేసింది. హడావుడిలో... సందడిలో తెలీకుండానే జారిపోయిన సత్తువ మళ్లీ వచ్చేకి కుదురుతుందా?  తప్పనిసరి స్థితిలో మంచానికతుక్కుపోయింది. ‘పాపం మఠం శాంతమ్మే పద్దమ్మవ్వను చివర్లో కాస్త చూసుకునిందంటరా! పద్దమ్మ వంట్లో సరిగా లేదని తెలిసి వెళ్లాను...కానీ ‘అయ్యో ఇప్పుడే... హŸస్పేట నుంచి ఆమె పుట్టింటి బంధువులు వచ్చి తీసుకెళ్లారు శాంతమ్మా! ఓ గంట ముందొచ్చినా బాగుండేది...’ అందిరా ’ అమ్మ అంటుంటే ఆమె గొంతులో జీర...నా కండ్లలో నీళ్లు!  ఆ తర్వాత హŸస్పేటలోనే పద్దమ్మవ్వ తుది శ్వాస వదిలిందని తెలిసింది. పద్దమ్మవ్వలాంటి మనుషులు చాలా అరుదుగా మనకు పరిచయం అవుతారు. గొప్ప వ్యక్తిత్వాలు...లెక్కనేంత సంపాదన...సంఘంలో మోసుకపోయేంత పేరు గట్రాలు లేకున్నా...అనామకంగా బతికేస్తున్నా...వారి పరిచయం మనపై ప్రభావం చూపుతుంటుంది. అదీ మన ప్రమేయం లేకుండానే! పద్దమ్మవ్వా అంతే. ఎక్కడ్నుంచి వచ్చిందో...ఎలా వచ్చిందో...ఎందుకొచ్చిందో...మేమెవరూ ఆలోచించలేదు. అసలు ఆ దిశగా ఆలోచించాలన్న ధ్యాసకూడా లేనంత గాఢంగా మా జీవితాల్లో వచ్చి తన ముద్రవేసింది. 

పద్దమ్మ...ఒంటరి పద్దమ్మగా...వంటల పద్దమ్మగా...మళ్లీ ఒంటరి పద్దమ్మగా ఎలా మారిందో తెలుసుకుంటే మాత్రం ఓ జీవితం ఎలా ఉంటుందన్న తత్వం మనకు సుతారం తెలిసొస్తుంది!!

––––

ఓళిగళు–బొబ్బట్లు,హుళిపుడి–సాంబారు పుడి, సారుపుడి–రసం పుడి, తొక్కు–పచ్చడి. దుడ్లు–డబ్బులు, పజీతి–కష్టం
మరిన్ని కథలు
alagajanam