Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with rakulpreeth singh

ఈ సంచికలో >> సినిమా >>

వంగవీటి చిత్రసమీక్ష

vangaveeti movie review

చిత్రం: వంగవీటి 
తారాగణం: సందీప్‌కుమార్‌, కౌటిల్య, శ్రీతేజ్‌, వంశీ చాగంటి, నైనా గంగూలీ తదితరులు 
సినిమాటోగ్రఫీ: రాహుల్‌ శ్రీవాస్తవ్‌, దిలీప్‌ వర్మ, సూర్య చౌదరి 
నిర్మాణం: రామదూత క్రియేషన్స్‌ 
నిర్మాత: దాసరి కిరణ్‌కుమార్‌ 
దర్శకత్వం: రామ్‌గోపాల్‌ వర్మ 
సంగీతం: రవిశంకర్‌ 
విడుదల తేదీ: 23 డిసెంబర్‌ 2016 
క్లుప్తంగా చెప్పాలంటే 
విజయవాడలో చాలామందికి తెలిసిన వంగవీటి - దేవినేని కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు, ముఠా తగాదాలు ఈ చిత్ర కథకి మూలం. రాజకీయం, రౌడీయిజం నేపథ్యంలో జరిగిన హత్యలు, ఈ క్రమంలో ఆయా పాత్రధారుల మధ్య సంఘర్షణ వంటివి ఈ కథలో ప్రధాన సన్నివేశాలు. వంగవీటి అనే పేరుకి విజయవాడ చరిత్రలో ఎవరూ చెరిపేయలేనంత గుర్తింపు ఎలా వచ్చింది? అన్నది అసలు విషయం. ఇది యదార్థ సంఘటనల సమాహారం గనుక, కథ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వర్మ ఎలా చూపించాడన్నది తెరపై చూడాల్సిందే. 
మొత్తంగా చెప్పాలంటే 
వంగవీటి రాధ, రంగ పాత్రల్లో సందీప్‌కుమార్‌ ఒదిగిపోయాడు. అద్భుతమైన నటనా ప్రతిభను చూపించాడు. గాంధీ, నెహ్రూ, మురళి తదితర పాత్రలు కూడా సహజంగా అనిపిస్తాయి. దగ్గరి పోలికలున్న నటుల్ని ఎంచుకోవడంతో ఆయా పాత్రలు తెరపై చూస్తున్నప్పుడు సినిమాలా కాకుండా, నిజంగా అక్కడ జరుగుతున్న సంఘటనల్ని మనం చూస్తున్నామా? అనిపిస్తుంది. వంగవీటి రత్నకుమారి పాత్రలో నైనా గంగూలీ బాగా నటించింది. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు. 
కథ దాదాపుగా అందరికీ తెలిసిందే. ఈ మొత్తం కథ బెజవాడలో ఒకప్పుడు జరిగినా, తెలుగు రాష్ట్రాలకు బాగా పరిచయమున్న చరిత్ర ఇది. చక్కని స్క్రీన్‌ప్లేతో దర్శకుడు సత్తా చాటాడు. ముఖ్యమైన సన్నివేశాల్ని ఎంచుకున్న తీరు బాగుంది. కొన్ని సంవత్సరాలపాటు జరిగిన చరిత్రను రెండు గంటల్లో చెప్పేయడం చాలా కష్టం. కానీ దర్శకుడు పెర్‌ఫెక్ట్‌గా ప్లాన్‌ చేసుకున్నాడు. స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌ అనిపిస్తుంది. ముఖ్యమైన సన్నివేశాల్లో వర్మ మార్క్‌ కనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే బాగుంది. డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. ఎటిటింగ్‌ అక్కడక్కడా ఇంకాస్త అవసరం అనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి ఊపిరి. పాటలు వినడానికి, తెరపై చూడ్డానికీ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. సినిమాలో ఆ క్వాలిటీ కనిపిస్తుంది. 
'రక్తచరిత్ర' సినిమాకొచ్చేసరికి వర్మ పాత్రల పేర్లను దాదాపుగా మార్చేశాడు. ఊరి పేర్లను కూడా మార్చేయాల్సి వచ్చింది. కానీ ఈ సినిమా విషయంలో అలాంటివేమీ జరగలేదు. తాను 'యదార్థం' అని నమ్మిన 'వంగవీటి' చరిత్రను సినిమాగా తెరకెక్కించడంలో సఫలమయ్యాడు. 'తాను యదార్థం అని నమ్మిన' అని పదే పదే చెప్పాడు గనుక, ఇది ఇలా కాదు అలా ఉండాలి, అలా కాదు ఇలా ఉండాలి అనుకోవడం అంత సమంజసం అనిపించదేమో. ఓవరాల్‌గా సినిమా జరుగుతున్నంతసేపూ ఓ రకమైన మూడ్‌లోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్ళడంలో సఫలమయ్యారంటే, సినిమాలో చాలా విషయం ఉన్నట్లే. అయితే తొలి సగం ఉన్నంత గ్రిప్పింగ్‌గా రెండో సగం లేకపోవడం కాస్త బలహీనత అనిపిస్తుంది. ఓవరాల్‌గా ఆడియన్స్‌కి బాగా కనెక్ట్‌ అయ్యే సబ్జెక్ట్‌ ఇది. మరీ ముఖ్యంగా విజయవాడ రౌడీ రాజకీయాల గురించి తెలిసినవారికి, ఆనోటా ఈనోటా ఆ చరిత్ర తెలుసుకున్నవారికీ ఇది చాలా ఇంట్రెస్టింగ్‌ సబ్జెక్ట్‌. చాలా సందర్భాల్లో వర్మ మెరుపులు కన్పిస్తాయి. అది ఆయన అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటుంది. చరిత్రను సినిమాగా తీయాలనుకున్న వర్మ, కాస్టింగ్‌ ఎంపికలో సూపర్‌ సక్సెస్‌ అయ్యారు. అక్కడే సినిమా వైపు థియేటర్లను లాగేందుకు తొలి బీజం వేయగలిగారు. మొత్తంగా చూస్తే వంగవీటి గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ఉన్నవారిని అలరించే చిత్రమిది. 
ఒక్క మాటలో చెప్పాలంటే 
వర్మ దృష్టి కోణంలో 'వంగవీటి' ఇది 
అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
cinechuraka