Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

గతసంచికలో ఏం జరిగిందంటే.... http://www.gotelugu.com/issue193/556/telugu-serials/nagaloka-yagam/nagalokayagam/

 

( గతసంచిక తరువాయి) ‘‘లేదమ్మా! నీవనుకున్నట్టు ఏ ఘోరము జరుగలేదు. ఆ జడల మాంత్రికుడు అంతమైనాడు’’ అంది నవ్వుతూ. కీర్తిమతి స్పృహ లోకి రావటంతో స్త్రీలంతా సంతోషించారు.

‘‘ఏమంటివి? జడల మాంత్రికుడు అంతమైనాడా... నీ జనకుడు క్షేమమా... ఎవరు... సమయానికి దైవంలా వచ్చి కాపాడినది ఎవరు? ఈ వీర వనిత ఎవరు?’’ అంది భద్రా దేవిని చూస్తూ.

‘‘ఇంకెవరు జననీ... ఓసారటు చూడుము’’ అంటూ నాగ రేడును, ధనుంజయుని చూపించింది.

ముందుగా తన నాధుడు నాగ రేడును గాంచగానే ఊరట చెంది ఆనందంతో కన్నీరు తుడుచుకుంది.ఖడ్గంతో వీర విహారం చేస్తూ శత్రువుల్ని చెండాడుతున్న ధనుంజయుని గాంచగానే అబ్బుర పాటుతో ఆమె కనులు విశాలమయ్యాయి. అతడేనా అన్నట్టు ఉలూచీశ్వరి వంక చూసింది. అవునన్నట్టు తల వూపింది ఉలూచీశ్వరి.

‘‘వారేనమ్మా నేను వరించిన రత్న గిరి యువ రాజు ధనుంజయుల వారు. ఇదో... అక్క భద్రా దేవి. గొప్ప వైద్య శిఖా మణి, మంత్ర శక్తుల్లో అజేయురాలు, వీర వనిత. చూస్తున్నారుగా! జడల మాంత్రికుని ఎలా వధించి జనకుని కాపాడ వచ్చునో ఆ కిటుకు అక్క చెప్పకున్న ఈ విజయము సాధ్యమయ్యేది గాదు. అలాగే సకాలమున అత్త శంకుపుత్రి దారి కాచి మాకు విషయము చెప్ప బట్టి తక్క సమయమున మేమిచటకు చేర గలిగితిమి’’ అంటూ ఉలూచీశ్వరి ఉత్సాహంగా వివరిస్తుంటే రాణి కీర్తిమతి తో బాటు నాగస్త్రీలంతా అచ్చెరువొందారు.
కీర్తి మతి భద్రా దేవిని చూస్తూ` ‘‘ఏ తల్లి కన్న బిడ్డవో... ఈనాడు నాకు పతి భిక్ష పెట్టినావు. ఏమిచ్చి నీ రుణం తీర్చ గలను తల్లీ!’’ అంటూ చేతులు జోడిస్తుంటే చప్పున ఎదురుగా కూచుని ఆమె చేతులు పట్టి వారించింది భద్రా దేవి.

‘‘అమ్మా! మీరు నాగ దేవతలు. మేము నరులము. మీ బిడ్డల్లాంటి వాళ్ళము. మీ కరములు ఆశీర్వదించాలే గాని నమస్కరించ కూడదు. తల్లిదండ్రులు లేని ఒంటరిని. ఇక నుంచి నన్ను కూడ మీ బిడ్డగా భావించిన చాలును’’ అంది.

భద్రా దేవి వినయానికి, ఆమె మాటలకు పులకించిన రాణి కీర్తి మతి ఆమెను దగ్గరకు తీసుకుని నుదురు ముద్దాడి శిరస్సున చేయి వుంచి ఆశీర్వదించింది.

ఈ లోపల అక్కడ సమరం ముగింపుకు రావటంతో వారి సంభాషణ ఆగి పోయింది. కీర్తి మతి లేచి భద్రా దేవి, ఉలూచీశ్వరి తో నాగ రేడు వద్దకు బయలు దేరింది.

వక్ర దంతుడి ఆఖరి మద్దతు దారులు ముగ్గురూ ధనుంజయుని చేతిలో హతం గావటంతో ఆ పోరాటం ముగింపు కొచ్చింది. ఎటు చూసినా శవాలు, నెత్తుటి మడుగు. బీభత్సంగా వుంది అంతటా. అంత దూరంలో గదాయుధాన్ని భుజాన వేసుకుని ధనుంజయుని అవక్ర పరాక్రమాన్ని ఆసక్తిగా వీక్షిస్తున్నాడు నాగ రేడు మహా పద్ముడు.

అంతలో రాణి కీర్తి మతి శవాలను తొక్కుకొంటూ తన వద్దకు పరుగులెత్తుకు రావటం చూసాడు. భద్రాదేవి, ఉలూచీశ్వరి, శంఖు పుత్రి, భూతం ఘృతాచి అంతా ధనుంజయుని వద్దనే ఆగి పోయారు.

పరుగున వచ్చి భర్త కౌగిట వాలి పోయి ఏడ్చేసింది రాణి కీర్తి మతి. ఆనందం దుఖ్ఖం ముప్పిరి గొనగా నాగ రేడు కళ్ళ లోనూ నీరు నిలిచింది. ఇది తమకు పునర్జన్మగా వుంది. తను కన్నీరు విడుస్తూనే భార్య కన్నీరు తుడిచి ఓదార్చాడు మహా పద్ముడు. కీర్తిమతి ఆనంద పారవశ్యంతో పులకిస్తూ కుమార్తె ఉలూచీశ్వరి చెప్పిన విషయాలన్నీ భర్తకు వివరించి చెప్పింది.

ఈ లోపల నాగ సైనికుల శవాలను అక్కడి నుండి తొలగించటం ఆరంభించారు. అంత వరకు దూరం గానే వుండి చూస్తున్న నాగ లోక పెద్దలు, ప్రముఖులు, ప్రజలు అంతా కదిలి రానారంభించారు. తమ రాజ దంపతుల క్షేమం గాంచి ఆనంద భాష్పాలు విడుస్తున్నారు.
నాగ రేడు ధనుంజయ బృందాన్ని`

చెంతకు రమ్మని సైగ చేసాడు.

అంతా వచ్చి ఎదురుగా నిలిచారు. ఉలూచీశ్వరిని చెంతకు పిలిచి ప్రేమగా నుదురు ముద్దాడాడు. దుఖ్ఖంతో మాటలు పెగల్లేదు ఉలూచీశ్వరికి.
నాగ రేడు తలెత్తి ముందుగా` శంకు పుత్రి వంక చూసాడు.

అప్పటికే ఆమె తండ్రి శంఖుడు`

కుమార్తె వద్దకొచ్చి నిలిచాడు.

‘‘మధూలిక! నర జాతి పట్ల నాకున్న తేలిక భావంతో నీకు చాలా అన్యాయమే చేసాను తల్లీ. అయినా నీవు మా క్షేమాన్ని కోరావు. నీ లోని క్షమా గుణాన్ని ఏమని పొగడను. నేను విధించిన అర్థము లేని ఆంక్ష మూలంగా ఇంత కాలం ఎన్నో ఇడుముల బడితివి. నా మూర్ఖత్వమును మన్నించమ్మా. నాడు మరణించిన నీ ప్రియుని తిరిగి తేలేను గాని ఇక మీదట నీకు విధించిన నిషేదాజ్ఞలను తొలగించు చున్నాను. ఇక నుండి మాతో బాటు నీవును మన నాగ లోక మందే నీ జనకుని చెంత వశింప వచ్చును’’ అన్నాడు.

‘‘కృతజ్ఞతలు ప్రభూ!’’ అంటూ తండ్రి కూతుళ్ళు యిద్దరూ నమస్కరించారు.

తర్వాత భద్రా దేవి వంక చూసి`

చెంతకు పిలిచాడు నాగ రేడు.

భద్రా దేవి శిరమున చేయి వుంచి`

అప్యాయంగా దీవించాడు.

‘‘ఆ రోజు రాత్రి నిను మంత్ర గత్తెవని చులకన జేసి మాటలాడినందుకు చాలా బాధగా వుంది తల్లీ. సిగ్గు పడుచున్నాను, మన్నించు. నీ విలువ ఏమిటో ఇప్పుడు గదా తెలిసినది. స్త్రీలయందు ఆణి ముత్యానివి. ఇక మీదట తల్లి దండ్రులు లేరను కొరత నీకు లేదు. మేముంటిమి. ఈ దినము నుండి మాకు ఇరువురు బిడ్డలు. మా పెద్ద కుమార్తె భద్రా దేవి, రెండవ కుమార్తె ఉలూచీశ్వరి.’’ అంటూ అందరి ముందు ప్రకటించాడు. హర్షాతిశయంతో నాగ లోక వాసు చప్పట్లు చరిచి అభినందించారు. భద్రా దేవి ఆనందంతో నాగ రాజ దంపతులకు పాదాభివందనం చేసింది. 

చివరిగా ధనుంజయుని చూసి ప్రసన్నుడవుతూ దరహాసం చేసాడు నాగ రేడు. ‘‘యువ రాజా ధనుంజయా... మానవుల పట్ల నాలోని చులకన భావం నా కనులను పొరుగప్పి అహంకారమున నీకు అనేక కష్టములు కలిగించితి. నిను గుర్తించుటలో నేను పొర బడితి. అందుకే ద్రోహి ఆ వక్ర దంతుని నమ్మి తప్పు జేసితి. అందుకు తగిన శిక్ష అనుభవించితి. నేను తప్పు జేసినను మా తనూజ ఉలూచీశ్వరి ఒప్పు జేసినది. నిను గుర్తించి వరించినది. ఈనాడు మీ ధైర్య సాహసాలు మముల మృత్యు కుహరము నుండి కాపాడినవి. ఈ సంతోష సమయంబున ఆనందముగ నీకు రెండు వరంఋ అనుగ్రహించెద. కోరుకొనుము... అదియును... దివ్య నాగమణి... మా గారాల పట్టి ఉలూచీశ్వరి తక్క... ఏమైనను కోరుకొనుము. ఇచ్చెద’’ అన్నాడు మీసం మెలివేసి గంభీరంగా.

భద్రా దేవి, ఉలూచీశ్వరిలు ఒకరినొకరు చూసుకుని ముసి ముసిగా నవ్వుకున్నారు. ధనుంజయుడు కూడ నవ్వాడు. 

‘‘నన్ను పరీక్ష పెట్టకండి ప్రభూ! ఉలూచీశ్వరి నా రెండవ ప్రాణము. దివ్య నాగమణి, ఉలూచీశ్వరి తక్క లోకమున వేరేదియు నాకు సమ్మతము గాదు’’ అన్నాడు.

‘‘ఆహాఁ... మరి నీ మొదటి ప్రాణము భద్రా దేవి గదా. ఆమె వలదా? ఇప్పుడు ఆమె కూడ మా కుమార్తెయే గదా’’ అనడిగాడు పరిహాసంగా నాగ రేడు.

‘‘అయ్యో! భద్రా దేవి లేక ఎటుల? సరి ప్రభు! నాకు దివ్య నాగ మణి తో బాటు మీ ఇరువురు కుమార్తెలూ కావలె’’ అంటూ తన మాటను సవరించుకున్నాడు ధనుంజయుడు.

ఒక్క సారిగా నవ్వు విరిసాయక్కడ.

‘‘సరి మహా వీరా.నీకు దివ్య నాగ మణిని యిత్తును, అటులనే నీ కాళ్ళు కడిగి మా ఇరువురు కుమార్తెలను నీకు కన్యా దాన మొనర్చెద. కానీ....’’ అంటూ ఆగాడు నాగ రాజు.

తిరిగి ఏమి మెలిక పెడతాడోనని`

కంగారు పడ్డాడు ధనుంజయుడు.

‘‘కాని... ఈ సంతోష సమయంబున మా నాగ లోకమునకు ఏడు దినముల పండుగ దినముగ ప్రకటించు చుంటిని. ఈ ఏడు దినమును మీరు మా ఆత్మీయుగా మా నాగ లోకమున ఉండాలె. సమ్మతమే గదా?’’ అంటూ అడిగాడు నాగ రాజు.

ఇది ధనుంజయునికి ఇబ్బంది కర మగు సమస్య. అవతల తన జనకుడు ఎటున్నదీ తెలియదు తను రత్నగిరి వదలి చాలా దినము దాటినది. మరో పక్క బాహ్లీకుని కుట్ర ఫలితముగా అచట యుద్ధము అనివార్యము. ఎప్పుడు రత్న గిరికి మరలి పోవుదమాని ఆత్ర పడుచున్నాడు. ఈ సంకట స్థితిలో సంతోషముగ ఆతిధ్యమెటుల స్వీకరించునది! ధనుంజయుడు ఏమి బదులు చెప్పేవాడో గాని ఈ లోపల యువ రాణి ఉలూచీశ్వరి కల్పించుకొంటూ` ‘‘జనకా! యువ రాజా వారి కి మూడో ప్రాణము కూడ గలదు. ఆ సంగతి అడుగ రేమి? మాతో బాటు తను కూడ అతిధిగా రావాలి గదా’’ అంది అమాయకంగా.

‘‘మూడో ప్రాణమా...’’ నమ్మ లేనట్టు చూసాడు నాగ రేడు.

ఈ కొంటెపిల్ల కొంప ముంచినదే. ఇప్పుడేమి చేప్పాలి అనుకుంటూ` ‘‘యువ రాణీ వారికిది పరిహాస సమయము గాదు సుమా’’ అన్నాడు.
‘‘ఇందులో పరిహాస మేమున్నది. నీవు చెప్ప వేమి అక్కా!’’ అంటూ భద్రా దేవిని అడిగింది ఉలూచీశ్వరి.

భద్రా దేవి ఏమి చెప్పేదో గాని ఇంతలో చిన్న కలకలం విని మాటలు ఆపి అటు చూసారంతా. ఆశ్చర్య సంభ్రమాలతో నోట మాట రాలేదు ఎవరికీ.

అంత దూరాన ప్రత్యక్షమైన పాతాళ రేడు బలి చక్రవర్తి గదాయుధాన్ని భుజాన వేసుకుని మీసం తిప్పుతూ పెద్ద పెద్ద అంగలతో ఇటే వస్తున్నాడు. ఆయన వెనకే ఆయన దేవేరీ యువ రాణి మణి మేఖల, శుక్రా చార్యుల వారు మరి కొందరు ప్రముఖులు విచ్చేస్తున్నారు. తన కనులను నమ్మ లేక పోయాడు నాగ రేడు మహా పద్ముడు. వెంటనే చేతులు జోడిస్తూ ఎదురు వెళ్ళాడు. ధనుంజయునికి పరిస్థితి అర్థమై పోయినది.

తను వూహించని విషమ పరిస్థితి యిది. ప్రసన్నుడైన నాగ రేడు నుండి తనకు అవసరమగు దివ్య నాగ మణిని పొంది, ఎలాగో ఒప్పించి వెంటనే రత్న గిరికి తిరుగు ప్రయాణం చేసే ఉద్దేశంతో తనుండగా, పులి మీద పుట్రలా యిలా అకస్మాత్తుగా పాతాళ రేడు రాక ఏ కొత్త సమస్యకు దారి తీస్తుందో ఏమిటో. యువ రాణి మణి మేఖల తమ వలపు గురించి చెప్పకుండా మరికొద్ది దినములు ఆగాల్సింది అని చింతిస్తూ అక్కడే నిలుచుండి పోయాడు ధనుంజయుడు. ఈలోపల`

‘‘ఆహాఁ... ఏమి ఈ సుదినం. ఓ పక్క మా ప్రాణములు రక్షింప బడుటయే గాక శతృ సంహారము జరిగి వరుస  శుభములొనగూడు చున్నవి. ప్రణామము మహా బలి. దయ చేయండి. తమ దర్శన భాగ్యమే కడు దుర్లభము. అలాంటిది తమరే స్వయముగా విచ్చేయుట మహదానంద కరం. దయ చేయండి.’’ అంటూ ఎదురు వెళుతూ బలి చక్రవర్తికి ప్రణామం చేసాడు నాగ రేడు. అయితే`
నాగ రేడు మాటలు పట్టించు కోకుండా పెద్ద పెద్ద అంగలతో ముందుకు వస్తూ` ‘‘ఎచట ఆ కపటి... మోసగాడు.. చోరుడు... ఎచట నుండెతను’’ అంటూ మేఘ గంభీర స్వరముతో అడిగాడు బలి.

నాగ రేడుకు అర్థం గాలేదు.    

విస్తు పోయాడు.

‘‘మహా బలి! ఎవరిని గూర్చి పలుకుచున్నారు?’’ అనడిగాడు.

‘‘ఇంకెవరయ్యా నాగరాజా! ఆ రత్న గిరి యువ రాజు ధనుంజయుని గురించే’’ అంటూ గదను భుజం నుంచి దించి నేలకు ఆన్చి ఆగాడు బలి చక్రవర్తి.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atadu..aame..oka rahasyam