Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nagaloka yagam

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు..ఆమె..ఒక రహస్యం

గతసంచికలో ఏం జరిగిందంటే .... http://www.gotelugu.com/issue192/555/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/

 

(గతసంచిక తరువాయి).. “అలాగా? రండి!”  అన్నాడు సురేష్ వర్మ గౌరవంగా.  “నేను రాజా వారి బావమరిదిని.  నా పేరు సురేష్ వర్మ. మిమ్మల్ని ఎప్పుడూ నేను చూడలేదే. ఎక్కడ్నుంచి వచ్చారు మీరు?” అన్నాడు పాణిని పరిశీలనగా చూస్తూ.

“నేను ముంబై నుంచి వచ్చాను”

“మా బావగారితో ఎక్కడ పరిచయం మీకు?”

“రాజేంద్ర గారితో వారు అండమాన్ నికోబార్ దీవులకి పర్యాటనకి వచ్చినప్పుడు పరిచయం నాకు.  వారు అండమాన్ ఎప్పుడు వచ్చినా మా స్నేహితుడు నడిపే హోటల్లోనే బస చేసేవారు.  అలా మా ఇద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది.  వారు కవిత్వం బాగా రాస్తారు.  నాకు పొయెట్రీ అంటే ఇష్టం అదే మా  స్నేహాన్ని బలపడేలా చేసింది.  నేను  అండమాన్‍ లో పుట్టి పెరిగిన వ్యక్తిని కావడంతో ఆ చుట్టు పక్కల ఎవరూ చూడని చాలా ప్రదేశాలకి  రాజా వారిని తీసుకెళ్ళి చూపించే వాడిని. ఆయన ఆ ట్రిప్స్ బాగా ఎంజాయ్ చేసే వారు.  అండమాన్ ఎప్పుడు వచ్చినా ఆయన నాకు ఫోన్ చేసేవారు. తరువాత నేను అండమాన్ వదిలి ముంబై వచ్చాక కూడా రెండు మూడు సార్లు కలిసాము” అని తను ముందరే సిద్దంగా ఉంచుకున్న సమాధానాన్ని చెప్పాడు పాణి.

పాణిని రాజేంద్ర భౌతిక కాయం దగ్గరకి తీసుకుని వెళ్ళాడు సురేష్ వర్మ.   అద్దాల బాక్సు లోంచి కనిపిస్తున్న రాజేంద్ర వర్మ ముఖం చూస్తుంటే, అతడు తనకి రాసిన మెయిల్ గుర్తుకు వచ్చింది పాణికి అప్యత్నంగా.  అతడ్ని ఈ పరిస్థితుల్లో చూడవలసి వస్తుందని కలలో కూడా అనుకోలేదు.

“నన్ను సిర్నాపల్లి రమ్మని రాజేంద్ర గారు చాలా సార్లు ఆహ్వానించారు. హైదరాబాద్ ఏదైనా పని మీద వచ్చినప్పుడు తప్పకుండా సిర్నాపల్లి రమ్మని అనేవారు. నాకు ఎప్పుడూ రావడం కుదరలేదు. రెండు రోజుల క్రితం ఒక పని మీద హైదరాబాద్ వచ్చాను. ఈసారి ఎలాగైనా రాజా వారిని కలవాలని వారి గురించి ఎంక్వయిరీ చేస్తుంటే,  ఆయన మరణించినట్టు తెలిసి షాక్ తిన్నాను. ఆయన మరణించారంటే నిజంగా నేను నమ్మలేకపోయాను”  అన్నాడు పాణి సురేష్ వర్మతో.

సురేష్ వర్మ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. మౌనంగా ఉండే వ్యక్తులని అంచనా వెయ్యడం కష్టం. అతడ్ని ఏదో రకంగా మాట్లాడించాలన్న ఉద్దేశంతో, “అసలు ఎలా మరణించారాయన?” అన్నాడు.

సమాధానం చెపడం ఇష్టం లేనట్టుగా సురేష్ వర్మ ముఖం అప్రసన్నంగా మారింది.  “దురదృష్టవశాత్తూ ఆయన అత్మహత్య చేసుకున్నారు” అన్నాడు.

“ఆత్మహత్యా?!” ఉలిక్కి పడ్డట్టుగా గట్టిగా అన్నాడు పాణి.

అతడంత గట్టిగా మాట్లాడే సరికి ఎవరైనా ఇంటు చూస్తున్నారేమోనని చుట్టూ చూసాడు సురేష్ వర్మ.

ఏమి మాట్లాడాలో తెలియనట్టుగా తను కూడా మౌనంగా ఉండిపోయాడు పాణి.  కొద్ది సేపటి తరువాత అన్నాడు  “అసలు రాజేంద్ర గారి గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ ఆయన ఆత్మహత్య చేసుకున్నారంటే నమ్మరు”

“నిజమే... మేమూ నమ్మలేకపోతున్నాం”  మాట్లాడకపోతే బాగుండదని తప్పనిసరై అంటున్నట్టుగా అన్నాడు సురేష్ వర్మ.

“మరణానికి ముందు ఏమైనా అనుకోని సంఘటనలు  జరిగాయా? ఎందుకు ఆయన ఆత్మహత్య చేసుకున్నారు?” 

“ఆయన ఏ కారణంగా ఆత్మహత్య చేసుకున్నారన్నదాన్ని మేము కూడా ఊహించలేక పోతున్నాము”    తూచినట్టుగా  మాట్లాడుతున్న అతడిని   తను ఎన్ని ప్రశ్నలు వేసినా అంతకు మించి ఏ సమాచారం  రాబట్టలేడని అర్ధమైంది పాణికి.

“రాజా గారికి  ఒక తాతగారు ఉన్నారని, వారినంతా పెద్ద రాజా వారు అంటారని చెబుతుండేవారు రాజేంద్ర గారు.  ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన్ని చూడాలి” అన్నాడు పాణి.

“లోపల బంగళాలో ఉన్నారు. పదండి.  ఆయనకి మిమ్మల్ని పరిచయం చేస్తాను”

“మీరు రావడం ఎందుకులెండి?  మీరిక్కడ ఉండడం అవసరం. నేనే బంగళా లోపలకి వెళ్ళి ఆయన్ని పలకరిస్తాను” గబ గబా అన్నాడు పాణి  అతడు తను కూడా లోపలకి వస్తే తాతగార్ని కూడా తనతో సరిగా మాట్లాడనివ్వడన్న భయంతో.

అక్కడే ఉన్న ఒక పని వాడ్ని పిలిచి, “వీరు చిన్నరాజా వారి స్నేహితులు.  లోపలకి తీసుకెళ్ళి కాఫీ ఫలహారాలు పెట్టించి, పెద్ద రాజా వారి దగ్గరకి తీసుకుని వెళ్ళు”  అన్నాడు.

“ఇలాంటి పరిస్థుతుల్లో అలాంటి మర్యాదలేమీ వద్దండీ. నేను ముందు పెద్ద రాజా వారిని చూస్తాను. థాంక్స్.  మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను”  అన్నాడు పాణి.

అతడు అక్కడి నుంచి కదలబోతుంటే, మొట్ట మొదటిసారిగా తనంతట తాను ఒక మాట మాట్లాడుతూ అన్నాడు సురేష్ వర్మ  “ముంబైలో ఏం చేస్తూ ఉంటారు మీరు?”

“నేను ప్రొఫెషనల్ డిటెక్టివ్‍ని. ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ఏజన్సీ రన్ చేస్తూ ఉంటాను!” చెప్పాడు పాణి అతడి ముఖంలో  రియాక్షన్ని జాగ్రత్తగా గమనిస్తూ.

కళ్ళని చూసి, ఎదుటి వ్యక్తి  మనసు లోని భావాలని కనిపెట్టడంలో అతడు నిష్ణాతుడు.  ఈ విషయంలో అతడు ఊహించినది ఇప్పటి వరకూ తప్పు కాలేదు.  తన మాటలు వినగానే  సురేష్ వర్మ కను గుడ్లు కదిలిన తీరుని బట్టి చూసి అతడి మనసులోని భావ ప్రకంపనని వెంటనే గుర్తించాడు అతడు.

ఆ భావం... భయం !!

****

“నా మనవడు ఆత్మహత్య చేసుకుని మరణించాడు. అందుకు మేమందరం బాధపడుతున్నాం.  కానీ ఇంటి నిండా ఈ పోలీసులూ, ఈ బారికేడ్లూ హడావిడీ ఏంటమ్మా అర్ధం లేకుండా?” అన్నాడు నరేంద్ర వర్మ ఇంద్రనీలతో. అప్పటికి అరగంట నుంచీ ఆమె అతడికి అక్కడ తమ అవసరాన్ని గురించి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తోంది. పెద్ద వయసు చాదస్తం వల్ల ఆయన ఆమె మాటలు అస్సలు వినిపించుకోవడం లేదు. 

“పెద్ద హడావిడేం లేదండీ. రొటీన్‍గా ఇన్వెస్టిగేషన్ చేసి, శవ పంచనామా జరిపించాం అంతే.  మామూలుగా శవ పంచనామా  గవర్నమెంటు మార్చురీలో చేస్తారు. కానీ మీ హోదానీ, బయట ఉన్న జనాన్ని దృష్టిలో ఉంచుకుని నేనే పోస్టుమార్టమ్ బంగళాలోనే జరిగేట్టు ఏర్పాటు  చేసాను. చిన్నరాజాగారి మరణం  వెనుక ఇంకేమైనా కారణాలుండ వచ్చన్న ఉద్దేశంతో ఆధారాలు సేకరిస్తున్నాం.  అందుకే బంగళాలో కొంత మేర వరకూ  తాత్కాలికంగా సీజ్ చేస్తున్నాం”   నచ్చచెబుతున్నట్టుగా అంది.

“జరిగినదంతా జరిగిపోయాక ఇంక ఈ విషయంలో ఏం  ఇన్వెస్టిగేషను చేస్తారమ్మా మీరు?  అవసరం లేదు. మీ వాళ్ళందరినీ వెళ్ళిపోమ్మని చెప్పు. రాజమహల్లోని గదులని సీజ్ చేయడం, పోలీసు కుక్కలు తిరగడం ఇదంతా అవసరమంటావా?” చిరాగ్గా అన్నాడాయన.

ఇంద్రనీల పెద్దరాజా వారి వంక అనుమానంగా చూసింది.

(సురేష్ వర్మ కళ్ళల్లో పాణి చదివిన భావం నిజమేనా? పెద్దరాజావారి అసహనం వెనుక అసలు రహస్యం ఏమిటి?  వచ్చేవారం…)

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
meerajaalagaladaa neeyaanati