Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
atadu..aame..oka rahasyam

ఈ సంచికలో >> సీరియల్స్

మీరజాలగలడా నీయానతి

meerajaalagaladaa neeyaanati

గోతెలుగులో ప్రచురించబడే ధారావాహికలు భారతీయ సంస్కృతికీ, తెలుగు వారి జీవన శైలికీ అద్దం పట్టే విధంగా, పురాణేతిహాసాల పట్ల పాఠకులకు ఆసక్తినీ, అవగాహననూ పెంచేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతోంది.. ఒక్కో ధారావాహిక ఒక్కో ప్రత్యేకతను కలిగి, పాఠకుల మనసుల్లో చెరగని ముద్రను వేసుకుంటోంది...రచయిత(త్రి) నేపథ్యానికంటే, ప్రస్తుతం గోతెలుగుకి రాయబోతున్న రచన ఇతివృత్తం, సాగేవిధానం, అది పాఠకులకెంతవరకు నచ్చుతుందనే కోణానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది గోతెలుగు. అదే క్రమంలో మీముందుకు రాబోతున్న ధారావాహిక మీనాక్షి శ్రీనివాస్ కలం నుండి జాలువారిన మీరజాలగలడా నీయానతి...ఇది వరకే అడపాదడపా కథల ద్వారా గోతెలుగుగు పాఠకులకు పరిచయమున్న వీరు ఇతర పత్రికల్లో ధారావాహికలు, కథల ద్వారా తెలుగు పాఠకులకు చిరపరిచితులే.... ఈ సందర్భంగా మీనాక్షి శ్రీనివాస్ తో గోతెలుగు అందిస్తోన్న ముఖాముఖీ.... 

గోతెలుగు : నమస్కారమండీ మీనాక్షి శ్రీనివాస్ గారు...
మీనాక్షి శ్రీనివాస్ :  నమస్కారమండీ .

గోతెలుగు : మీ రచనా నేపథ్యం, రచయిత్రిగా మీ తొలి అడుగుల గురించి....
మీనాక్షి శ్రీనివాస్ :
నా రచనావ్యాసంగం సుమారుగా పదహారేళ్ళక్రింద మొదలై వృత్తికి, ప్రవృత్తికి మధ్య పొంతన కుదరక, సమయాభావం వలన చెప్పుకోదగినంతగా సాగలేదనే చెప్పాలి. అయితే వ్రాయాలీ అన్న నా సంకల్పం వలన పూర్తిగా ఆగిపోకుండా అలా అలా సాగుతోంది.నేను ఇప్పటికి సుమారు డభై పైచిలుకు కధలు, నాలుగు నవలలూ, నాలుగు రేడియో నాటికలూ, కొన్ని కవితలూ వ్రాయడం జరిగింది. నేను మొదట చేపట్టిన ప్రక్రియ ' నాటిక ' కానీ అది రేడియో వరకే కానీ బయట కూడా పంపచ్చు అన్న విషయం తెలియక '' ఆకాశవాణి క్రమక్రమంగా కనుమరుగవుతోంది అన్న భావనతో ( తెలియనితనం వలన) అది మానేసి కధల దిశగా ప్రయాణం మొదలుపెట్టాను. రచన అనేది సందేశాత్మకంగా, సమాజ హితవు కోరేదిలా ఉండాలన్నది నా భావన. అయితే రచనలు చదివి సమాజం మారుతుందా? అంటే అందరూ మారకపోవచ్చు కానీ కనీసం కొంతవరకైనా ప్రయోజనం ఉంటుంది అని నేను నమ్ముతాను.

గోతెలుగు : మిమ్మల్ని ప్రభావితం చేసిన, చేస్తున్న రచయిత(త్రు)లెవరు?
మీనాక్షి శ్రీనివాస్ :చిన్నప్పుడు కాలేజీ రోజులలో ఏ చిన్న కాగితం , కధ ఆఖరికి పొట్లాల కాగితాలు ( మా చిన్నప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు లెండి) ఏదీ విడిచిపెట్టకుండా, ఆఖరికి అన్నం తినేటప్పుడు కూడా, అన్నంతో బాటు కధలు, సైడ్ డిష్ గా మా అమ్మ తిట్లు కలిపి తినే దాన్ని. అలా తింటే తిండి వంటబట్టదనేది మా అమ్మ.ఎక్కువగా చదివే పుస్తకాలు షరా మామూలే యద్దనపూడి, మాదిరెడ్డి, కోడూరి .. లతో బటు ఇంకా అప్పటి ప్రముఖుల పుస్తకాలన్నీ .. వాటికి మంచి చదివించే గుణం ఉండేది.  ఆ తరువాత కొంతకాలం మల్లది, యండమూరి గారి హవా. అయితే నేను సాహిత్యం గురించి కొంచెం తెలిసాకా చదివినవి, ఇష్టపడినవి భరాగో గారి కధలు, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కధలూ, మధురాంతకం వారి కధలు ఇత్యాది. నిజాయితీగా చెప్పాలంటే ఇప్పుడు  మిగతా ఎవరి రచనలూ చదవడం అనేది జరగడం లేదు, ఒక్క ఆదివారం అనుబంధాలు తప్ప .. సమయాభావమే దీనికి కారణం. రోజుకు సుమారుగా పది, పన్నెండు గంటలు వృత్తి పరంగా పని, ఒక్కక్క సారి ఇంకా ఎక్కువే కూడా, ఈ మధ్య కోర్ బ్యాంకింగ్ వచ్చాకా కొంతలో కొంత నయం . తరువాత గౄహనిర్వహణ బాధ్యతలు .. అలసిపోయి నిద్రపోవడం .. అడపాదడపా ఏదైనా ఫీల్ అయినప్పుడు కాస్త వ్రాయడం జరుగుతోంది.నేను ఫీల్ అయినది నా పంధాలో వారయడమే కానీ ఎవరి రచనల ప్రభావం నాపై కానీ, నా రచనలలో కానీ ఉండదు..

గోతెలుగు : ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పై మీ అభిప్రాయమేమిటి?
మీనాక్షి శ్రీనివాస్ : ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అన్నది ఒక ఆరోగ్యకరమైన, చక్కని బంధాలకూ, అనుబంధాలకు నెలవై .. ఆ కుటుంబంలోని పిల్లలపై మంచి ప్రభావం, వ్యక్తిత్వం కలుగజేసేదిగా, ముఖ్యంగా షేరింగ్ .. తన వద్ద ఉన్నదీ, తను తినేదీ తోటివారితో పంచుకునే గుణం అలవడుతుందన్నది నా నమ్మకం.
అలాగే పిల్లలు చెడువైపు మళ్ళకుండా ఆపగలిగే శక్తి, అవకాశం, రక్షణ  ఆ కుటుంబాలకు ఎక్కువ అన్నది నా అభిప్రాయం.

గోతెలుగు : బతుకుతెరువు కోసం చేసే పోరాటం, ఉపాధి కోసం పెట్టే పరుగు వీటిలో పెరిగిన వేగం మనిషికీ మనిషికీ మధ్య దూరాల్ని పెంచుతున్నాయంటారా?
మీనాక్షి శ్రీనివాస్ : కేవలం బ్రతుకు పోరాటం, ఉపాధి మాత్రమే కాదు .. మనిషి ఆశ, అనే కంటే 'పేరాశ అన్నది సబబేమో, ఇవే మనిషికీ మనిషికీ మధ్య దూరం పెంచుతున్నాయి అన్నది నూటికి నూరు శాతం నిజం. అదేదో సినిమాలో చెప్పినట్లు ' నాకేంటి? ' అన్న ధోరణి బాగా ప్రబలిపోతోంది.  సాటివారితో సత్సంబంధాలు నెరపాలన్నా ఇదే ధోరణి .. ఇది మనిషిని నేనూ.. నాది అనే వైపే నడిపిస్తోంది. 'మన  ' అన్న ఫీలింగ్ కరువైపోతోంది.

గోతెలుగు : ఈ క్రమంలో నైతిక విలువలు, కుటుంబ ప్రమాణాలు పడిపోతున్నాయా?
మీనాక్షి శ్రీనివాస్ :
ఖచ్చితంగా.

గోతెలుగు : ఈ ధారావాహిక ద్వారా మీరు చెప్పదల్చుకున్న విషయం ఎలా ఉండబోతోంది?
మీనాక్షి శ్రీనివాస్ : ఈ ప్రపంచం చాలా పెద్దది .. అందులో మనిషి జీవితం చాలా చిన్నది .. మనచుట్టూ ఉన్న ఇంతపెద్ద ప్రపంచంలో అందరితో మనం కలవలేకపోవచ్చు, వాళ్ళకు ఉపయోగపడే దిశగా నడవలేకపోవచ్చు .. కానీ మన కుటుంబం .. అంటే నేనూ నా భార్యా బిడ్డలూ మాత్రమే అని కాకుండా .. తల్లీ, తండ్రీ, అత్తా, మామా, తోబుట్టువులూ.. వారివారి జీవిత సహచరులూ వీరంతా మన పరిధిలో వారే .. మన కుటుంబంలో వారే అని గ్రహిస్తే, అలా భావిస్తే మన పరిధి పెరుగుతుంది.. మన ఆనందం రెట్టింపు అవుతుంది అన్నది నా భావన.  ఆ దిశగానే నా ఈ రచన సాగుతుంది.

గోతెలుగు : ఈ ధారావాహిక ద్వారా మీరు ఆశిస్తున్నదేమిటి?
మీనాక్షి శ్రీనివాస్ : నేను ఈ విషయం చాలా ఖచ్చితంగా చెబుతాను. ఇది ఏ ఒక్కరినో ఉద్దేశించినది కాదు. ప్రస్థుత సమాజపు తీరుతెన్నులు ఆకళింపు అయ్యాకా నాకొక విషయం అర్ధమయింది. ఇప్పటి పిల్లలకు, మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు పెళ్ళి అయ్యాకా భర్త ఒక్కడే తనవాడు, అతని సంబంధీకులు .. అంటే తల్లితండ్రీ, తోబుట్టువులు కూడా తనకేం కారు, వారితో తమకు ఎలాంటి అనుబంధాలు, సంబంధాలు అఖరలేదు .. అన్నట్లుగానే వారి ఆలోచనా ధోరణి ఉంటోంది .. అయితే దానికి పూర్తిగా వాళ్ళు బాధ్యులు  అనడం మాత్రం తప్పే .. ఎందుకంటే తన కూతురు తమకు దూరంగ ఎక్కడో అమెరికాలో ఉన్నా ఫర్వాలేదు కానీ అత్తమామల దగ్గర మాత్రం ఉండకూడదు అన్న ధోరణి ఇప్పటి ఆడపిల్లల తల్లితండ్రులలో ఎక్కువ శాతం మందిలో కనబడుతోంది. నిజమా? కాదా? ఎవరికి వారే ఈ ప్రశ్న వేసుకుని అంతరాత్మల సాక్షిగా సమాధానం వెలికి తీయండి. అలా అని అందరూ అలాగే ఉన్నారు, ఉంటారు అని చెప్పడం నా అభిమతం కాదు. కానీ చాలా మంది అలాగే ఉన్నారన్నది మాత్రం జగమెరిగిన సత్యం.దానినుంచి బయటపడి తమ పిల్లలకు, అది ఆడైనా, మగైనా సరే  అత్తవారివైపు వారిని కూడా ప్రేమించడం ప్రేమను పంచడం , ఆదరించడం అన్న ధోరణి కలిగించాలన్నదే నే చెప్పదలుచుకున్నది.
పెళ్ళంటే కేవలం ఇద్దరి మనసుల, వ్యక్తుల కలయిక మాత్రమే కాదు రెండు కుటుంబాల కలయిక. ఆడైనా, మగైనా ఎవరికి వారే అత్తింటి కుటుంబం కూడా నా కుటుంబంలాంటిదే అనుకోవాలి , తల్లితండ్రులను ప్రేమించి గౌరవించినంతగా అత్తమామలనూ, వారి మిగతా కుటుంబ సభ్యులనూ ఆదరించాలి.

గోతెలుగు : ఒకప్పుడు వియ్యమందడానికి అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలనే భావం ఉండేది. కానీ ప్రస్తుతం అమ్మాయీ అబ్బాయీ ఒకే వృత్తిలో ఉన్నవారైతే ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలరు, ఒకరికొకరు సహకరించుకోగలరు అనే చూస్తున్నారు, తర్వాత కూడా వారిద్దరి మధ్యే ప్రాధాన్యతే కానీ మిగతా కుటుంబ సభ్యుల పాత్రలకిక ప్రాధాన్యత ఉండడం లేదు...ఈ విషయం గురించి మీ ధారావాహిక ద్వారా మీరేమనబోతున్నారు?
మీనాక్షి శ్రీనివాస్ :  తరాలలో అంతరాలు మొదలయ్యాకా ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాల కాన్సెప్ట్ సుమారుగా తగ్గిపోయిందనే చెప్పాలి. ఒకరినొకరు ఇష్టపడడం, ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ దాంపత్య జీవనం గడపడం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు చాలా పెళ్ళిళ్ళు, అవి ప్రేమ వివాహాలైనా, పెద్దలు కుదిర్చినవైనా మూడు గొడవలూ, ఆరు అగచాట్లు అన్న చందంగా తయారవుతున్నాయి, దీనికి ప్రధాన కారణం సర్దుబాటు ధోరణి అన్నది ఏ ఒక్కరిలోనూ లేక, అహం అయితే తల్లి తండ్రుల జోక్యం ఇంకో కారణం అవుతోంది. అదీ ముఖ్యంగా ఆడపిల్లల తల్లుల ప్రభావం ఆ జంటల మీద ఎక్కువగా ఉండడం అనేది జరుగుతోంది.
పూర్వం చిన్నపిల్లలప్పుడు పెళ్ళిళ్ళు అయ్యేవి ఎవరో ఒకరో లేక ఆ ఇద్దరూనో సర్దుకుపోవడం అనేది ఉండేది. ఇప్పుడు పిల్లలు ప్రాజ్ఞులు వారి మంచీ చెడూ వారికి తెలుసు అందులో మూడో మనిషి ప్రమేయం అనవసర కలహాలకు కారణం అవుతోందని నా అభిప్రాయం.

గోతెలుగు : ప్రేమ పెళ్ళి, పెద్దలు కుదిర్చిన పెళ్ళి ఈ రెండింటిలో మీ ధారావాహిక ఏ పెళ్ళిని సమర్ధించబోతోంది?
మీనాక్షి శ్రీనివాస్ : పెళ్ళి ఏదైనా వారిలో సర్దుబాటు మనస్తత్వం అనేది ముఖ్యం. పెద్దలు కుదిర్చిన పెళ్ళి, ప్రేమ పెళ్ళి లలో దేని ప్రయోజనాలు దానికే ఉన్నాయి. ప్రేమ పెళ్ళిలో పొరపొచ్చాలు వచ్చినా పెద్దల సహకారం ఉండదు.వారి పాట్లు వాళ్ళే పడాలి. ఇక నా ధారావాహికలో అయితే ఈ రెండు రకాల పెళ్ళిళ్ళూ , వాటి ఇబ్బందులూ సృశించడం జరిగింది.

గోతెలుగు : మీరు చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పడానికి ఇష్టపడతారా, లేక సుతిమెత్తగా అర్థం అయీ కానట్టు చెప్పి వదిలేయడానికా?
మీనాక్షి శ్రీనివాస్ :  సూటిగా చెప్పడాన్నే నేను ఇష్టపడతాను, అయితే కొన్ని కొన్ని టాపిక్స్ ఓపెన్ గా మాట్లాడలేము అలాంటివి మాత్రం సూచనప్రాయంగా చెప్పడాన్నే ఇష్టపడతాను.
గోతెలుగు:  మా గోతెలుగుతో  మీకున్న అనుబంధాన్ని వివరించగలరా?
మీనాక్షీ శ్రీనివాస్: మీ పత్రికలో ఇంతకు ముందు నా కధలు కొన్ని ప్రచురించి ప్రోత్సహించారు. నండూరి నాగమణి గారి, అత్తులూరి విజయలక్ష్ని గారి ధారావాహికలు ప్రారంభంలో కొన్ని వారాలు చదివాను కానీ చెప్పానుగా సమయాభావం వలన కంటిన్యూ చెయ్యలేకపోయాను.
కానీ ఒకటి మాత్రం చెప్పగలను మీ పత్రిక ద్వారా కొత్త రచనలకు కూడా ప్రోత్షాహం  యిస్తారు.

గోతెలుగు :  ఆల్ ద బెస్ట్ అండీ...మీ భావాలూ, ధారావాహిక ద్వారా చెప్పాలనుకున్న అంశాలూ వింటుంటేనే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి...పాఠకులు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు...మరి మీరజాలగలడా నీయానతిలోకి ఎంటరైపోదామా?
మీనాక్షి శ్రీనివాస్ : ధన్యవాదములండీ . మీ అంచనాలనూ, పాఠకుల అంచనాలనూ చేరడానికే ప్రయత్నిస్తాను.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్