Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

avee - ivee

ఎక్కడ చూసినా ప్రతీవారూ 'నూతన సంవత్సర శుభాకాంక్షలు..'2017', ఆంగ్ల సంవత్సర.. అంటూ ఏదో ఒక శీర్షిక పెట్టి వ్రాస్తున్నారు. మామూలు గ్రీటింగ్సే కదా అని, అమ్మో, కొత్తసంవత్సరం అలా మొదలెడితే ఏం బావుంటుందండీ, . ఒకళ్ళు చెప్పినా చెప్పకపోయినా, సంవత్సరాలు కొత్తవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఏదో మొహమ్మాటానికి ఈ గ్రీటింగ్స్ చెప్పేసికుంటే ఓ గొడవ వదిలిపోతుంది! చేతిలో  సెల్ ఉండడం ధర్మమా అని, ఓ మెసేజ్ పంపేస్తే చాలు.' ఓహో వీడింకా ఉన్నాడేమిటీ, ఫరవాలేదే, గుర్తుంచుకున్నాడూ..' అని ఓసారి అనుకోవడం. కాకపోతే ఈ మెయిల్స్ ఉండనే ఉన్నాయి ఓ గ్రీటింగు తయారుచేసేసి, మన ఎడ్రెస్ బాక్స్ లో ఉన్న ప్రతీవాడికీ 'సెండ్' చేసేస్తే చాలు. 'ఉభయ కుశలోపరి. మేము ఇక్కడ క్షేమం, మీరంతా క్షేమం అని తలుస్తాను..'అని భావించేయొచ్చు! ఈ రోజుల్లో ఈ గ్రీటింగ్స్ కి ఏమీ personal touch ఉండడం లేదు. ఏదో చెప్పాలి కాబట్టి చెప్పేయడం. బస్!

ఇది వరకటి రోజుల్లో ఎంత హడావిడి ఉండేది! నాన్నగారికొచ్చిన పాత గ్రీటింగు కార్డుల్లో మెసేజిలు కాపీ చేసేసికొని ( మనకి అంత భాషా పరిజ్ఞానం ఉండెక్కడేడ్సింది!), ఓ దిట్టంగా ఉన్న కార్డోటి తీసికుని, దానిమీద, ఇంకో గ్రీటింగు కార్డుమీది బొమ్మ నీట్ గా కత్తిరించుకుని, 'తుమ్మ జిగురు' తోనో 'లైపిండి' తోనో అంటించి తయారుచేసికోవడం!ఆ రోజుల్లో ఈ feviquick లు ఎక్కడుండేవి? ఆ గ్రీటింగుని, పాత కవరేదో తీసికుని, దానిమీద ఎడ్రెస్ కనిపించకుండా, మళ్ళీ ఓ కాయితం అంటించేసి, దీన్ని దాంట్లో పెట్టడం! ఇంత హడావిడి చేశాము కాబట్టి, దాంట్లో మన heart and soul కనిపించేది.ఎలాగూ మనం ఇచ్చేది ఒకళ్ళకో, ఇద్దరికో మరీ ఈ రోజుల్లోలాగ వందలమీదెక్కడుండేవారు? మా  పెద్దన్నయ్య గారైతే,  ఓ వారం రోజులు ముందుగానే, ఓ వంద పోస్ట్ కార్డులు కొనేసి, అన్నిటిమీదా HAPPY NEW YEAR అని వ్రాసి, సంతకం పెట్టి, మన దేశ రాష్ట్రపతి నుంచి, తనకు తెలిసిన చుట్టాలూ, స్నేహితులూ ఒకళ్ళేమిటి, తనకు గుర్తున్న ప్రతీ వారికీ పోస్ట్ చేసేసే వారు, సరీగ్గా జనవరి ఒకటో తారీఖుకి అందేలా!ఎప్పుడైనా ఎవరికైనా ఆ ఏడాది అందకపోతే, ' ఇదేమిటీ సోమయాజులు గారు మర్చిపోయారా ఈ ఏడాది' అని స్నేహితులూ, 'ఇదేమిటీ సుబ్బులన్నయ్య దగ్గరనుండి గ్రీటింగ్స్ రాలేదేమిటీ' అని చుట్టాలూ అనుకునేలా! అందుకనే, మా ఇంట్లో ఎక్కెడెక్కడినుంచో, అంటే రాజకీయ నాయకుల దగ్గరనుంచీ, మంత్రుల దగ్గరనుంచీ, ఆఖరికి సినిమా స్టార్లదగ్గరనుంచీ జవాబులు వచ్చేవి. దురదృష్టం ఏమంటే, వాటిలో ఒక్కటీ ఇప్పుడు లేవు! ఆ ఉత్తరాల విలువ, ఆయన ఉన్నంతకాలం తెలిసే జ్ఞానం లేదు నాకు, తీరా తెలిసే సమయానికి ఆయనే లేరు.పోనీ, మా వదిన గారిని అడిగితే ఏమైనా దొరుకుతాయేమో అని అప్పటికీ,

ఈ మధ్య అడిగి చూశాను.' ఇప్పుడు అవేమీ లేవోయ్, ఎప్పుడో తీసేశాము..' అనగానే, నాకైతే చాలా బాధేసింది.ఏం చేస్తాం, అవన్నీ ఇప్పుడు 'తీపి జ్ఞాపకాల' లాగ మిగిలిపోయాయి! అందుకే నాకొచ్చిన ప్రముఖుల ఉత్తరాలన్నిటినీ , ఓ ఆల్బం లో పెట్టి జాగ్రత్త చేశాను, మా అబ్బాయైతే, వాళ్ళ ఫ్రెండ్సందరికీ చూపించుకుంటూంటాడు! ఉద్యోగపు రోజుల్లో అయితె, ఇ రోజు ప్రొద్దుటినుండి, కనిపించిన ప్రతీ వాడూ, షేక్ హాండ్ ఇవ్వడం, HAPPY NEW YEAR అని చెప్పడం, ఈ షేక్ హాండ్ లు ఇచ్చి ఇచ్చి సాయంత్రానికి ఓ క్రేప్ బ్యాండేజ్ కట్టుకోవలసి వచ్చేది  మా ఫ్రెండొకాయనైతే, గ్రీటింగ్స్ చెప్పేసి,Copy to all concerned.. అనేవాడు. ఎక్కడికిపోతాయ్ ఆఫిసలవాట్లు?ఏదో పర్చేస్ ఆఫీసులో పని చేశాను కాబట్టి, వెండర్లందరూ, ఓ క్యాలెండరూ, డైరీ, ఓ బాల్ పెన్నూ తెచ్చేవారు. జనవరి నెల అయేసరికి, ఓ బస్తాడు తయారయ్యెవి అడిగిన ప్రతీవాడికీ ఇచ్చుకుంటూ పోయినా! వాటిల్లో రాస్తామా ఏమన్నానా? ఆ సీటులో ఉన్నాము కాబట్టి ఇచ్చేవారు, అంతే కానీ మనమీదేమైనా ప్రేమా ఏమిటీ?ఇప్పుడు చూడండి, రిటైరయి 12 ఏళ్ళయింది, ఒక్క డైరీఅయినా లేదు. ఏదో ఉంటే రాసేస్తామని కాదు,అదో తృప్తీ! అలా పోగెసిన డైరీలు ఎక్కడ తేలుతాయీ, చాకలి పద్దులకో, మనవలూ, మనవరాళ్ళూ పెన్నుతో గీతలు గీసుకోడానికో! ఒక్కొక్కప్పుడు, ఏ పేకాటైనా ఆడితే అదీ ఇంటావిడతోనేనండోయ్, స్కోరులు వ్రాసుకోడానికీ. ఆ ఎకౌంటులు ఛస్తే సెటిల్ అవవు, ఎందుకంటే ఎప్పుడూ నేనే ఓడిపోయేవాడిని!పైగా స్టేకు పాయింటుకి రూపాయి, ఇచ్చెమా చచ్చేమా! అసలు ఈ ఎకౌంట్లతోటే, మన జీవితం hyppothicate అయిపోయింది!

చిన్నప్పుడు, కనిపించిన ప్రతీ కొట్టుకీ వెళ్ళి వాళ్ళిచ్చే క్యాలెండర్లు తెచ్చుకోడం ఓ మరపురాని జ్ఞాపకం. వెంకట్రామా ఎండ్ కో వారి తెలుగు క్యాలెండరు, ప్రతీ ఇంట్లోనూ ఒక ఉన్నత స్థానం లో ఉండేది. తరువాత్తర్వాత, ప్రతీ వాళ్ళూ మొదలెట్టారనుకోండి, కానీ దాని ప్లేసు దానిదే! చింతలూరు వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం వారిదోటుండేది (వెడల్పుగా).ఓ ముహూర్తం చూడాలన్నా,వారం వర్జ్యం చూడాలన్నా, 'ఒరే ఆ కాలెండరోసారి పట్రా ' అనేవారు!ఇవే కాకుండా, చిన్న చిన్న కాగితాలతో, ఒక్కో తేదీకి, ఒక్కో కాగితంతో కొన్నుండేవి. ఓ దేముడి బొమ్మేసి, కింద ఒత్తుగా ఈ కాలెండరుని తగిల్చేవారు. ఏడాది అయిపోయినా, ఈ కాగితాలన్నీ చింపేసినా, పైనున్న ఆ ఫుటో బోనస్సన్నమాట మనకి. దాన్ని ఓ పటాలు కట్టేవాడి దగ్గరకు తీసికెళ్ళి, ఓ ఫ్రేము కట్టించేయడం.అందుకే ఇంటినిండా ఆ రోజుల్లో దేముళ్ళ ఫుటోలు ఎక్కడ పడితే అక్కడ వేళ్ళాడేవి,దానికి సాయం ఓ అగరొత్తి అంటించి గుచ్చడం!ఇవి కాకుండా, సినిమా స్టార్ల కాలెండర్లోటి, మన influence ని బట్టి దొరికేవి. కాలేజీకి వచ్చిన తరువాత చదుకోడానికి ఓ రూమ్మిచ్చేవారుగా, దాన్నిండా ఇవే! వాటినే చూస్తూ చొంగ కార్చుకోడం,ఇప్పటిలా ఇంటర్ నెట్లు చూశామా ఏమిటీ?

ఇప్పుడో, న్యూఇయర్ ఈవ్ పార్టీలూ, రేవ్ పార్టీలూ, తాగుళ్ళూ తందనాలూ, అర్ధరాత్రయేసరికి, ఫైర్ వర్క్సూ. ఇన్నీ అయి ఏ తెల్లారకట్లో కార్లు డ్రైవు చేసికుంటూ, ఎక్కడో ఎవడిమీదో పెట్టేసి యాక్సిడెంట్లూ, ఎవడి గోల వాడిదీ! పైగా ప్రతీవాడూ New Year resolutions అనోటీ.ఎన్నెన్నో అనుకుంటారు, ఒక్కటైనా చేసిన వాడిని చూశామా? అసలు మన జీవితమే unpredictable అయిన తరువాత, ఈ రిజల్యూషన్లూ, ప్లానింగులూ ఎందుకో? బయటికెళ్ళిన వాడు కొంపకి తిన్నగా తిరిగివస్తాడో లేదో తెలియదు, ఇంట్లో వాళ్ళ అదృష్టం బాగుండి, వాళ్ళ పుస్తె గట్టిగా ఉంటే, వచ్చినట్లూ, లేకపోతే అంతే సంగతులు! Life goes on and on.... కొత్త నోట్ల కొరత తగ్గి, జీవితం కొద్దిగా సుఖమయవవుతుందని ఆశిద్దాం…

సర్వేజనాసుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
navvandi navvinchandi