Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
modification

ఈ సంచికలో >> కథలు >> రేపటి కోసం

repati kosam

యధావిధిగా నేను రాంబాబు వాకింగ్ కి బయలుదేరాం.

రామాలయం దాటి మరో వీధిలోకి మలుపు తిరిగామో లేదో ; అక్కడ ఒక ఇంటి ముందు జనాన్ని చూసి రాంబాబు అవాక్కయ్యాడు. “అరె!పాపం పరంధామయ్య పోయినట్లుందే?...పద  చూసొద్దామ"ని అటు నడిచాడు.

"ఏమయింది?" అన్నాను నేను కంగారుగా.

"ఆయనా; నేనూ నిన్న బ్యాంక్కెళ్ళాం అయిదు వందల నోట్లు మార్చుకోవడానికి. అక్కడ క్యూలో నిల్చోలేక కళ్ళు తిరిగి పడిపోయాడు. హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. పాపం! చనిపోయినట్లున్నాడు." అన్నాడు రాంబాబు.

ఇంటికి సమీపించేకొద్దీ ఆ ఏడుపులు; పెడబొబ్బలు వినిపించేసరికి రాంబాబు వూహించింది నిజమే అయింది. పరంధామయ్య ఎంతో సౌమ్యుడు. మృధుస్వభావి. అప్పుడప్పుడు మాతోపాటు వాకింగ్ వచ్చేవాడు. రెవెన్యూ లో చేసి రిటైరయ్యాడు. ఇంకో కూతురు పెళ్ళికి ఉంది. చిన్నబ్బాయి ఇంకా సెటిల్ కాలేదు. ఎప్పుడూ వీళ్ళిద్దరి గురించే దిగులు పడేవాడు. బి.పి; షుగర్ వుంది. దానికి తోడు హార్ట్ ప్రాబ్లెం. గంటల తరబడి క్యూలో  నిలబడే సరికి కళ్ళు తిరిగి పడిపోయాడట. వెంటనే హాస్పిటల్ కి తీసుకు పోయినా ప్రయోజనం లేకపోయింది.   దారిలోనే ప్రాణం పోయింది. 

"ఒక ఇంటర్వ్యూ ఒకటుంటే వెళ్ళొచ్చాను అంకుల్. వచ్చేసరికి ఇలా అయిపోయింది." భోరున  ఏడ్చాడు చిన్నాడు.     "ఈ పెద్ద నోట్ల రద్దు ఇంకెంత ప్రాణాల్ని తీస్తుందో.....!" నిట్టూర్చాడు రాంబాబు.  . 

"ఇది నిజంగా విచారకరమే." అన్నాను.

ఈ సంఘటన మరువక ముందే మర్నాడు రామయ్య పొలం వైపు పోతూ పలకరించాడు.

"ఏం! రామయ్యా! ఎంత వరకు వచ్చాయి పెళ్ళి పనులు" విచారించాను.

'ఏం పెళ్ళి పనులో బాబూ! గొప్ప ఇబ్బంది పెట్టేస్తున్నారు బ్యాంకు వాళ్ళు." అన్నాడు నిర్లిప్తంగా.

"ఏమంటున్నారేమిటి?"

"హెడ్డాఫీస్ పర్మిషన్ కావాలంట. బిల్లులు గావాలంట. డబ్బు వాళ్ళకే ఇస్తారంట...ఇంకా ఏమేమో కండీషన్లు పెడుతున్నారు. ఇంకో వారంలో పెళ్ళి. ఆ లోపల  చేతికి డబ్బులొస్తాయో..రావో తెలియడం లేదు" వాపోయాడు రామయ్య.

"వస్తాయిలే దిగులు పడకు. నీ డబ్బులు నీకివ్వడానికి ఏముంది?" ధైర్యం చెప్పాను.

"దేవుడెలా రాసి ఉంటే అలా అవ్వుద్ది. వస్తాను బాబూ!" అంటూ పొలం వైపు దారి తీశాడు నిరాశగా. మేము ముందుకు కదిలాము.   

“ సామాన్యుల పెళ్ళిళ్ళు సైతం ఆగిపోతున్నాయంటే ఏమనాలి? పెళ్ళి కోసం దాచుకున్న డబ్బులు తీసుకోవడానికి కూడా సవాలక్ష ఆంక్షలు. వారు నిజంగా  నరకం అనుభవిస్తున్నారు. మన అవసరానికి  మన డబ్బులు మనం తీసుకోవడానికే వీలు కాకపోతే ఇక బ్యాంకులెందుకు? ఇలా చేస్తే బ్యాంకుల పైన నమ్మకం ఉంటుందా? ఇక మీదట ఎవరైన బ్యాంకుల్లో దాచుకుంటారా? కానీ...కుబేరుల పెళ్ళిళ్ళు మాత్రం ఆగడం లేదు. వాయిదా పడడం లేదు. అవి మాత్రం అట్టహాసంగా జరిగి పోతున్నాయి. సామాన్యులకు ఒక న్యాయం? కుబేరులకు మరో న్యాయం? కష్టాలంతా సామాన్యులకు...సుఖాలంతా కుబేరులకు. బాగుంది కదా!"     అన్నాడు రాంబాబు నడుస్తూ.

ఒక నిట్టూర్పు విడిచి మళ్ళీ ప్రారంభించాడు.  “ మొన్న పేపర్లో చూసుంటారు... ఒక రైతు భార్య పొలం అమ్మిన డబ్బు యాభై లక్షలు మారవేమోనని ఆత్మహత్య చేసుకుంది. ఏమిటీ దౌర్భాగ్యం? ఎటుపోతున్నాం మనం?"

"అవును. అది మరో విషాదకరం! ఆమె తొందర పడింది." అన్నాన్నేను.

"ఏమిటి? మూర్తిగారూ! అలా అంటారు? ఒక్క సారిగా పెద్ద నోట్లంతా చిత్తు కాగితాలయిపోతాయని సాక్షాత్తు ప్రధాన మంత్రే ప్రకటిస్తే గుండెలొకసారిగా ఆగిపోవా?... వాటి గురించి ఎవరైనా ఆలోచించారా?"

"నిజమే! వాటిని మార్చుకునే అవకాశం వుందని ప్రజలలో అవగాహన కలిగించాల్సింది."

"ఇప్పుడు పోయిన ప్రాణాలు తిరిగి  వస్తాయా? దీనికి ఎవరు బాధ్యులు?" రాంబాబు ఆవేశానికి అర్థముంది.  

అలా మాట్లాడుకుంటూనే బ్యాంక్ దగ్గరికి వచ్చేశాం.

"అక్కడ చూడండి... చూడండి! ఆ పోలీసోడు వాళ్ళను ఎలా చావ బాదుతున్నాడో..." అన్నాడు రాంబాబు అటు చూ పిస్తూ .
అటు చూసే సరికి ఒక పోలిసోడు క్యూలో వున్న వారిని విచక్షణా రహితంగా చావ బాదుతున్నాడు. వృద్ధులు; స్త్రీలు; పసి పిల్లల తల్లులు; రోగులు ఎవర్నీ వదలడం లేదు. గాయాలయి పడి పోయినా వదలడం లేదు. వాడికి అంత కోపం ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు.
దగ్గరికి వెళ్ళి "ఎందుకయ్యా? అలా బాదుతున్నావు?" అని అడిగాం.

"మీకెందుకూ? ఎళ్ళండెహె?" అన్నాడు విసురుగా.

అంతలోనే ఒక విలేకరి కెమెరాతో అటు వచ్చాడు. ఓ అయిదారు మంది యువకులు మా వెనక నిలబడే సరికి వెనక్కి తగ్గాడు.

"వాళ్ళు దేశ ద్రోహులో...ఆటంక వాదులో కాదు. మీ తల్లో; తండ్రో; అన్నో; అక్కో ఇలాంటి నోట్లతో వేరే బ్యాంక్ ముందు నిలబడి ఉంటారు... అది గుర్తుంచుకో? " అని వార్నింగిచ్చాడు రాంబాబు.

"వీడిని ఇలా వదల కూడదు సార్? కంప్లైంట్ ఇద్దామ"ని యువకులు ఆవేశ పడ్డారు.

"తప్పయింది సార్" అని వాడు కాళ్ళా వేళ్ళా పడే సరికి హెచ్చరించి వదిలేసాం. "చూశావా మూర్తీ! మన డబ్బులు మనం తీసుకోవడానికి పోలీస్ దెబ్బలు తినాల్సిన దుస్థితి వచ్చింది. అసలు బ్రిటీష్ హయాంలో కూడా ఇంతటి అఘాయిత్యం జరగ లేదేమో?" ఆవేశంగా చెప్పుకు పోతున్నాడు  రాంబాబు.

"సరిగ్గా చెప్పారు సార్! మన అవసరానికి పనికొస్తుందని బ్యాంకులో దాచుకుంటే ...మన డబ్బులు మనం తీసుకోవడానికి రోడ్లో నిలబడాల్సివచ్చింది. మొన్నటికి మొన్న దహన సంస్కారానికి డబ్బుల కోసం సి ఎం ఫోన్ చేయాల్సి వచ్చింది. వ్యవసాయం కుప్ప కూలిపోయింది. చిల్లర లేక చిన్న చితక వ్యాపారాలు చితికి పోయాయి.  ప్రజలు రోడ్ల మీదున్నారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయి పోతోంది. అయినా ప్రభుత్వాలు పట్టింపులకు పోతోంది. పరిష్కారం దిశగా ఆలోచించడం లేదు." వాపోయాడు ఒక  యువకుడు. 

"బాగా చెప్పావు బాబూ! నీకున్న తెలివి తేటలు కూడా ప్రభుత్వ పెద్దలకు లేక పోయింది. ఇంత పెద్ద దేశంలో ప్రధానికి ఆర్థిక వేత్తలు; మేధావులు; ఉన్నతోద్యోగులు; సలహా దారులు కరువయ్యారా? వారికి ఈ గ్రౌండ్ రియాల్టీస్ తెలియవను కోవాలా?  ఒక సాహసోపేతమయిన నిర్ణయం తీసుకునేటప్పుడు సలహాలు; సంప్రదింపులు జరప లేదా? సమిష్టి నిర్ణయమయితే ఇంత అనాలోచితంగా తీసుకున్నారా? ఏక వ్యక్తి నిర్ణయమా? ఒంటెద్దు పోకడా?  సరే..అయిందేదో అయిందనుకుందాం. ఇప్పటికైనా అందరిని సంప్రదించి యుద్ధ ప్రాతిపదికన  పరిష్కారం  కనుగొన వచ్చు గదా?"  అన్నాడు  ఆవేశంగా.

ఈ డీమోనిటైజేషన్ చేసిన మరుసటి రోజు సాయంత్రం వాకింగ్ లో రాంబాబు నా అభిప్రాయం అడిగాడు. అప్పుడు నా అభిప్రాయం చెపుతూ - "ఇది చాలా సాహసోపేతమయిన   నిర్ణయం. ఏ రాజకీయ నాయకుడు వూహించనటువంటి చాలా కఠినమయిన నిర్ణయం. ఒక్క దెబ్బతో నల్ల కుబేరుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించే నిర్ణయం.  ఈ దెబ్బతో కోట్లు; కోట్లు గా మూలుగుతున్న నల్ల ధనం బయటికి రాక తప్పదు. ఒక వేళ రాకపోతే చిత్తు కాగితాలు కాక తప్పదు." అన్నాను ఉత్సాహంగా.

నాకెందుకో ఈ నిర్ణయం తెగ నచ్చేసింది. మనస్పూర్తిగానే స్వాగతించాను. కాక పోతే ఈ ఉక్కు సంకల్పం అనుకున్నది సాధించే వరకు సడల కూడదని భావించాను. వారం, పది రోజుల్లో అంతా సర్దుకుంటుందని వాదించాను. నా అభిప్రాయంతో రాంబాబు విభేదించాడు. నల్ల ధనం నిర్మూలించడం అనేది వారం; పది రోజుల్లో అయ్యే పని కాదన్నాడు. ఇప్పుడు ఈ సామాన్యుల కష్టాలు చూసి నాపైన  పైచేయి సాధించినట్లు భావిస్తున్నాడు. అందుకే అతని ఆక్రోశాన్ని  నాపైన చూపుతున్నాడు. 

"నల్ల ధనం ఏమో గానీ...నల్ల కుబేరులు బాగున్నారు. సామాన్యులు సచ్చి పోతున్నారు." అంటూ అటు వెళ్ళిపోయాడు విలేకరి.  మేము మా దారి పట్టాం.

" అసలు నల్లకుబేరులంటే ఎవరనుకున్నావు? వాళ్ళళ్ళో ఎక్కువ మంది రాజకీయ నాయకులు; బడా బడా వ్యాపార్లు; కంట్రాక్టర్లు; రియల్ ఎస్టేట్ వ్యాపార్లు; పారిశ్రామిక వేత్తలు, సినిమా వాళ్ళు.  వాళ్ళను వదిలేసి జనం పైన పడడం ఎంత వరకు సబబు?  అవినీతి పెరిగి పోయి వ్యవస్థలు భ్రష్టు పట్టి పోవడానికి అసలు కారణం ఎవరనుకున్నావు? "

"అందుకే చాలా తెలివిగా ముందస్తు సమాచారం లేకుండా పెద్ద నోట్లు రద్దు చేసి వీళ్ళకంతా ప్రాణ వాయువు లేకుండా చేశారు. తేలు కుట్టిన దొంగల్లా కక్క లేక; మింగ లేక  గిల గిల కొట్టుకు చస్తున్నారు  బడా బాబులు?" అన్నాను ఆవేశంగా.

"అమాయకుడా! నువ్వలా అనుకుంటున్నావు కానీ...వాళ్ళెప్పుడో సర్దుకుని ఉంటారు."

"అలా అవడానికి వీల్లేదు రాంబాబు గారూ! ఇది అకస్మాతుగా ప్రకటించిన నిర్ణయం. ఎవరికీ తెలిసే అవకాశమే లేదు. ప్రధాన మంత్రి  చిత్త శుద్ధిని మనం శంకించ లేము "

"ఇక్కడ శంకించాల్సింది మన చిత్త శుద్ధిని కాదు; నల్ల కుబేరుల చెత్త బుద్ధిని. శత కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్టు వారి తెలివి తేటలు అనంతం. వాటిని తక్కువ అంచనా వేయ లేం."

"ఎంత తెలివి తేటలున్నా ఈసారి తప్పించుకోవడం అంత సులువు కాదు." అన్నాను ధృఢంగా.  

"ఇప్పటికే దార్లు కనిపిస్తున్నాయి. నార్త్ ఈస్ట్ స్టేట్ లలో ఉన్న ప్రత్యేక అవకాశాల్ని ఉపయోగించుకుని బ్లాక్; వైట్ అయి పోతున్నట్లు వార్తలొస్తున్నాయి. చాలా కాలేజ్ లు పిల్లలకి స్కాలర్షిప్ లిచ్చేస్తున్నాయి. ఉద్యోగులకు ముందు గానే రెండు; మూన్నెళ్ళ జీతాలిచ్చేస్తున్నాయి. వాళ్ళకు తెలియకుండానే అక్కౌంట్లోకి వేలకు వేలు జమ అయి పోతున్నాయి."

" పిల్లలకి స్కాలర్షిప్పులు: ఉద్యోగులకు జీతాలు ముందుగానే అందుతున్నాయంటే మంచిదే కదా! ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా? ఎన్నో ఏళ్ళుగా బకాయిపడి ఆగి పోయిన ప్రాపర్టీ ట్యాక్స్ కోట్లు; కోట్లు వసూలవుతున్నాయట. బ్యాంకులకు మొండి బాకీలు వసూలవుతున్నాయట. వసూళ్ళ కోసం తిరిగి తిరిగి వేసారి పోయిన ఉద్యోగులు; ఇప్పుడు సంబర పడి పోతున్నారట." కుతూహలంగా చెప్పాను.

"అలా జరిగితే మంచిదే కానీ... బాణం గురి తప్పింది. నల్ల కుబేరులను వదిలేసి సామాన్య పౌరులకు తగిలింది. వారు విల విల్లాడి పోతున్నారు.  ఇప్పుడు ఆ నల్ల కుబేరుల దృష్టి బడుగు; బలహీన వర్గాల పైన పడింది. బతిమాలో; బామాలో వాళ్ళ ఖాతాల్లో జమ చేసేస్తున్నారట. జీరో బ్యాలన్స్ తో ఓపెన్ అయిన అక్కౌంట్స్ ఇప్పుడు కోట్లలో మూలుగుతున్నాయట.  ఇంకం ట్యాక్స్ వాళ్ళు నోటీస్ లిస్తున్నారు. రెవెన్యు వాళ్ళు మరో పక్క సంక్షేమ పథకాలకి తూట్లు పొడుస్తారట. పాపం పేదలు బలయి పోతున్నారు.”
"అలా జరగదులెండి."

"జరగదనడానికి వీల్లేదు మూర్తీ!   అమాయకులు అల్లాడి పోతున్నారు?"

"ఇవన్నీ తాత్కాలికమే రాంబాబు గారూ! అన్నీ త్వరలోనే సర్దుకుంటుంది. ఇంత పెద్ద సంస్కరణ తేవాలంటే కొన్ని కొన్ని ఇబ్బందులు తప్పవు. ఒక్క సారి నల్ల ధనం బయటి కొచ్చేస్తే దాని ఫలితాలు అనంతం. దీర్ఘ కాలికం కూడా."  

"అలా అని సామాన్య పౌరులను క్యూలలో నిల బెడతారా? ఎందరో బడుగు; బలహీన వర్గాలు పనులు మానుకొని క్యూలో నిలబడుతున్నారు. ఉత్త పుణ్యానికి...వృద్ధులు  రాలి పోతున్నారు. యువకులు పోలీస్ దెబ్బలు తింటున్నారు. రైతులు ఆందోళనలో ఉన్నారు. చిన్నా చితకా వ్యాపారులు రోడ్ల మీద పడ్డారు. ఇంట్లో  ఎలకలున్నాయని ఇల్లు తగల బెట్టు కుంటామా? ఏ రెండు శాతమో; మూడు శాతమో వున్న నల్ల కుబేరుల కోసం తొంభై ఏడు శాతం ప్రజల్ని ఇబ్బంది పెడతారా?  దేశాన్ని సంక్షోభం లోకి నెట్టేస్తారా? ఉహూ! ఇది కాదు పద్ధతి. ఇంత పెద్ద యంత్రాంగముంది. నిజంగా నల్ల కుబేరులను ఏరి పారేయాలనుకునే చిత్త శుద్ధే ఉంటే సర్జికల్ స్త్రైక్ వారి పైన్నే చేయాలి...సామాన్య ప్రజల పైన కాదు.  అధికారులకు ఫ్రీ హ్యండ్ ఇచ్చి చూడండి. వారంలో నల్ల కుబేరులంతా కటకటాల వెనకుంటారు." రాంబాబు ఆవేశం అర్థం చేసుకోవచ్చు. అతను చెప్పే నిజాలు కాదన లేనివి. కళ్ళ ముందు జరుగుతున్న సత్యాలే.

“ ఎవరో ఒకరు ముందడగు వేయాలి.  కుళ్ళి పోయిన వ్యవస్థను సంస్కరించడానికి ఇప్పటికైనా ఒకరు దృఢ సంకల్పంతో  ముందుకొచ్చారు. ఇన్నాళ్ళకు ఒక ప్రధాని 50 రోజుల్లో ఒక కొత్త భారత దేశాన్ని ఆవిష్కరిస్తానంటున్నారు. ఒక అవకాశం ఇద్దాం. చూద్దాం ఏమి జరుగుతుందో..?  తాత్కాలిక పరిష్కార మార్గంగా డెబిట్; క్రెడిట్ కార్డ్స్; ఆన్ లైన్ బ్యాంకింగ్ వగైరా నగదు రహిత మార్గాలు సూచిస్తున్నారు గదా!”

"ఎన్ని అవకాశాలిచ్చినా నల్ల ధనాన్ని పూర్తిగా అరి కట్ట లేం. సరే 50 రోజుల తర్వాత నల్ల ధనమంతా వెలికి తీసేశాం అని గట్టిగా చెప్ప గలరా?  ఇలాంటి వ్యవస్థ  వున్నంత వరకు వ్యవస్థలో నల్ల ధనం ఒక భాగం. ఒక చర్యతో; ఒక రోజులో నల్ల ధనం పోదు. ఇది నిరంతర ప్రక్రియ. నిత్యం సర్జికల్ దాడి జరగాలి. అన్ని వ్యవస్థలూ సమన్వయంతో పని చేయాలి.నిజాయితీగా నిరంతరం యుద్ధం చేయాలి. భారత ఆర్థిక వ్యవస్థ 90 శాతం కరెన్సీ పైనే నడుస్తోంది.  గ్రామీణ భారతంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఇంకా పుంజుకోనే లేదు. ఇంకా చాలా మందికి అకౌంట్సే లేవు. అక్షరాస్యత అంతంత మాత్రంగా వున్న పల్లె జనాలు స్మార్ట్ కార్డ్స్; డెబిట్ కార్డ్స్,క్రెడిట్ కార్డ్స్ ఎలా వాడతారు? తగిన మౌలిక వసతులు కల్పించ కుండా నగదు రహిత వ్యవస్థను రాత్రికి రాత్రే ఎలా ఊహించ గలం? సాధక బాధకాలు పై వారికి తెలియవా?  తెలిసినా సామాన్యుడేం చేస్తాడులే అని నిర్లక్యమా? ఏమైనా మాట్లాడితే దేశ ద్రోహులంటారు. దేశ భక్తి వారికే వున్నట్లు...ప్రశ్నించే వారంతా టెర్రరిస్ట్ లయినట్లు ఎదురు దాడి చేస్తున్నారు. ఈ మధ్య ఇదో ఫ్యాషన్ అయి పోయింది. “  

 "కరెక్టే. ఇప్పటికిప్పుడే నగదు రహిత భారతాన్ని వూహించడం కష్టం. కొంత గ్రౌండ్ వర్క్ చేసి వుండ వలసింది. కొంత టైం ఇచ్చివుండాల్సింది.   కానీ ఇప్పుడు మనం చేయ గలిగింది కూడా ఏమీ లేదు. ఈ సంక్షోభం నుంచి బయట పడే మార్గాల్ని అన్వేషించడం తప్ప. "

“ఇంకో విషయం చెప్పనా?  బడా బడా వ్యాపారులకు ఏడు  వేల కోట్ల పై చిలుకు అప్పులు రద్దు చేసేశారు. కష్టార్జితాన్ని అంతో-ఇంతో బ్యాంకుల్లో పొదుపు చేసుకునే సామాన్యుడి డిపాజిట్ల పైన వడ్డీ తగ్గించేశారు. పెన్షందార్ల డిపాజిట్ల పైన తగ్గించేశారు. వడ్డీలపై ఆధార పడిన బతుకులు చితికి పోతాయి.  బడా బాబులకు అప్పులు కోట్లల్లో రద్దు...వాళ్ళేమో విదేశాల్లో స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తుంటారు. మన వాళ్ళు ఇలా రెండు వేలకు; మూడు వేలకు  బ్యాంకుల ముందు రోడ్ల మీద తాము దాచుకున్న డబ్బు కోసం అడుక్కుంటుంటారు. కాకుల్ని కొట్టి గద్దలకి వేయడమంటే ఇదే మరి! మళ్ళీ… ప్రతి ఒక్కడూ తాము పేదల కోసమే పుట్టామని ఫోజు.  ఇదీ వ్యవస్థ.!"

"బడా బాబుల పని పడతామంటున్నారు కదా? సామాన్యులకు ఇంక మంచి రోజులే అంటున్నారు. కొంత కాలమాగండి. ఏం జరుగుతుందో చూద్దాం!”

“ఆకలితో వున్నవాడు గంజి నీళ్ళడిగితే ఆర్నెల్లాగు పరమాన్నం పెడదామన్నట్లుంది. అంత వరకు వాడు బతికితే కదా ఫలితాలనుభవించడానికి.  ప్రజాస్వామ్యంలో ఒంటెద్దు పోకడలు; ఏక పక్ష నిర్ణయాలు; ఎదురు దాడులు మంచివి కావు. ఇంత పెద్ద యఙ్ఞానికి అన్ని వర్గాల మద్దతు అవసరం.  ఒంటి చేత్తో కాదు... సమిష్టిగా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమయింది. ఇప్పటికైనా పంతాలకి పోకుండా  మేధావులతో; ఆర్థిక వేత్తలతో సంప్రదించి తక్షణ తరుణోపాయాలు ఆలోచించడం ఉత్తమం. మళ్ళీ సాధారణ పరిస్థితులు ఎంత త్వరగా తెస్తే  అంత మంచిది. సామాన్యునికి ఎంతో ఉపకారం చేసిన వారవుతారు. “ ముగించాడు రాంబాబు.

మా వాదనలు ఎలా ఉన్నా ఫలితాలు బాగుంటే చాలు. పెద్ద నోట్ల రద్దువల్ల సామాన్యుల కష్టాలు కళ్ళెదుట కనిపిస్తున్నాయి. బడా  బాబులు కష్ట పడుతున్నారా?...సుఖ పడుతున్నారా? తెలియడం లేదు. వారికి సినిమా చూపిస్తామంటున్నారు. ఎలాంటి సినిమా అనేది  50 రోజుల తర్వాత తెలుస్తుంది. ఏదేమైనప్పటికి సామాన్య  జనాలలో ఇప్పుడున్న భయాందోళనలు   తక్షణం తగ్గించాలి. ఈ సంక్షోభం నుంచి వెంటనే బయట పడే మార్గం ఆలోచించాలి. వ్యవస్థల పైన నమ్మకం కలిగించాలి.

ఇంతకీ ప్రధాని మనసులో ఏముందో తెలియదు; 50 రోజుల తర్వాత ఎలాంటి భారతం ఆవిష్కరిస్తారో తెలియదు.  కానీ ఆయన మాటల్లో విశ్వాసం వుంది. ఏదో సాధించాలని తపన ఉంది.  నిర్ధిష్ట ప్రణాళిక ఏదో ఉన్నట్లుంది. లేకుంటే "బంగారు భవిష్యత్ కోసం కొంత కాలం కష్ట పడండి."అని ధైర్యంగా ఏ ప్రధాని చెప్పలేడు.  కష్టమయినా  ప్రజలూ సిద్ధ పడ్డారు.  ఆయనేదో నూతన భారతాన్ని స్వప్నం కంటున్నారు. ఆ కల   సాకారమవ్వాలని మనమూ ఆకాంక్షిద్దాం.   - మనసులో అనుకుంటూ ఆనాటి వాకింగ్ ముగించి రాంబాబు నుంచి సెలవు తీసుకుని ఇంటిముఖం పట్టాను.

మరిన్ని కథలు