Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

మీరజాలగలడా నీయానతి

‘కళ్ళలో పెళ్లి పందిరి కనబడసాగే పల్లకీలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే’ శ్రావ్యంగా  వినిపిస్తోంది సన్నాయి వాద్యం.   

అక్కడ అంతా ఒకటే సందడి ... పట్టుచీరల రెపరెపల్లో వాళ్ళవాళ్ళ పెళ్లినాటి జ్ఞాపకాల గుసగుసలు,    విరిసీవిరియని కన్నెగులాబీల రంగురంగుల హంగుల పొంగులు,  వాళ్ళని వెంటాడే యువకిశోరాల వలపుల తూటాలు ,  ప్రపంచంలోని ఆనందం అంతా మాదే అంటూ సీతాకోక చిలుకల్లాంటి చిన్నారుల ఆటలూ.   రంగురంగుబట్టలూ,  సింగారాలూ .... సింగారాల్నిమించిన బంగారు ఆభరణాలు మొత్తం స్వర్ణాంధ్రప్రదేశ్ అంతా అక్కడే ఉందా అన్నట్లు వుంది.   రామచంద్రయ్యగారి చిన్న కొడుకు పెద్దకూతురు భవ్య పెళ్లి , పెళ్లి కొడుకు భవేష్  ...   సాఫ్ట్ వేర్ ఇంజనీర్.

జంట ఈడు ... జోడుగా,కన్నులపంటలావుంది .  అప్పుడే పెళ్లితంతు ముగిసి  రిసెప్షన్ కోసం తయారవుతున్నారంతా. భవ్య భవేష్ విడిదింట్లో ఓ పక్కగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు .

"ఏమర్రా కాస్త పెళ్లికొడుక్కీ ,పెళ్లికూతురుకీ ఫ్రూట్ జ్యూస్ తెండి” అని ఇందాకటి నుంచి చెబుతుంటే ఒక్కళ్ళూ పట్టించుకోరేమర్రా ?   ఎంతసేపు సింగారించుకుని టిక్కు టిక్కుమంటూ తిప్పుకుంటూ తిరగడమేనా? చేసేదేమైనాఉందా?   సిగలో పూలు సర్దుకుంటూ కేకపెట్టింది భవ్య పిన్ని శ్రీలక్ష్మి.

"నువ్వు చేసేదేమిటో ...  పూలూ , నగలూ సవరించుకుంటూ వీడియోకి  పోజులియ్యడం తప్ప "భవ్య చెల్లెలు నవ్య అంది.  ఎంత మెల్లిగా అన్నా వినబడనే వినబడింది.  కస్సున లేచింది శ్రీలక్ష్మి తోక తొక్కిన త్రాచులా.

“నోటికెంత మాటవస్తే అంతా అనేయ్యడమేనా?పెద్దంతరం   చిన్నంతరంలేదా?   " 

"అబ్బ…నవ్య వూరికే నవ్వులాటకి అందిలే అమ్మా .   వుండు జ్యూస్ ఇవ్వడమేకదా నేనిచ్చివస్తా. పనిలో పని ఓసారి బావగార్నీ కలిసినట్లు వుంటుంది,   యింతవరకూ నే కలవనేలేదు” అంటూ అక్కడ స్టాల్స్ లో  తయారు చేస్తున్న పళ్ళ రసాలను రెండు అందమైన గాజు గ్లాసుల్లో పోయించి ...   ట్రేలో తనే తీసుకెళ్ళింది  ...   వాళ్ళ దగ్గరకు శ్రీలక్ష్మి కూతురు కావ్య.

"ఇదిగో భవీ కబుర్లు చెప్పుకుని చెప్పుకుని అలసిపోయారు గానీ ఇదిగో తక్షణ శక్తినిచ్చి సత్వర ఉల్లాసానికీ, ఉత్సాహానికీ ‘ కావ్యా ‘ పళ్ళ రసాలనే తాగండి, .. టింగ్ టింగ్.  నమస్తే బావాజీ ...   నేను కావ్య ...   మీ గారాల రాగాల అనుంగుమరదల్ని"తమాషాగా అంది. . నవ్వుతూనే'ఎవరు?'అన్నట్లు చూశాడు.

"భవేష్ ...  ఇది మా చిన్నాన్న కూతురు 'కావ్య ' మొన్న మన నిశ్చితార్ధం అప్పుడు దీనికి ఇంటర్నల్స్ అందుకే రాలేదు .

"ఆహా... ఏమి పరిచయ వాక్యాలూ ... పరిణయ సందడిలో మా భవ్య మెదడు ఎక్కడెక్కడో సంచరిస్తోంది అనుకుంటా’ బావగారూ మనం చెన్నై లో ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాం. మీ నిశ్చయ తాంబూలాల సుఘడియలలో మనం అంతర్గత పరీక్షల కారణమున రాలేకపోతిమి. క్షంతవ్యులం, ఇదిగో మా భవీ నన్ను మనసులోనే తిట్టుకుంటోంది. హాయిగా కబుర్లుచెప్పుకోనీయక 'పానకంలో ఈ పుడకేమిటి?   రామాయణంలో పిడకల వేటేమిటి?   అని ...   బై ...   సీయూ ....     " తుఫాన్ లా వెళ్ళిపోయింది . 

" భలే సందడి  పిల్లలావుందే ....      అవునూ ...   మీ అందరి పేర్లూ ...   చాలా  చక్కగా సింపుల్ గా, శ్రావ్యంగా ఉన్నాయి మీ ఉమ్మడి కుటుంబం లాగే. అవునూ మీ అందరికీ ఒకేలాంటి పేర్లు పెట్టారే?  "

" అవును మా అందరి పేర్లూ మా తాతగారే పెట్టారు ....    అసలు ఎవరి పిల్లలు ఎవరో బయట వాళ్లకి చాలా మందికి తికమకే.   మా పెద్దనాన్నగారి  పిల్లల పేర్లు దివ్య ,  అబ్బాయి దినేష్ ,   దాని పెళ్లి కిందటి ఏడే అయింది . దినేష్ అమెరికాలో ఎం.ఎస్ హార్ట్ సర్జరీ స్పెషలైజేషన్ చేస్తున్నాడు.  . 

రెండు మా నాన్నగారు ..   మా సంగతి తెలుసు కదా నేను ,నవ్య .  మా చిన్నాన్నకిద్దరూ ఆడపిల్లలే ...  శ్రావ్య , కావ్య’ శ్రావ్యకి సంబంధం నిశ్చయమైంది ...    మా దివ్య మరిదే.  ..   అతనూ మా దినేష్ అన్నయ్యతో బాటే ఎండి చేస్తున్నాడు,   అతని చదువు పూర్తయ్యాకా పెళ్లి .”వివరంగా చెప్పింది.

" అంతా బానే వుంది కానీ ..   సమస్యా పూర్ణాల్లా మీరు మనుషులూ ఒకేలా ఉండి, పేర్లూ ఒకేలా ఉంటే ఎవరెవరో తెల్సుకోవాలంటే మా చెడ్డ ఇబ్బందే. ...   ఎవరి పేరు ఏదో గుర్తుపెట్టుకోవాలంటే ... కొంచెం కష్టమే..."

"ముందు నన్ను బాగా గుర్తుపెట్టుకో ...   లేకపొతే ...   "  అల్లరిగా నవ్వింది . 

"అన్నయ్యా ...  వదిన భలే బాగుంది .  " అంటూ వచ్చింది భవేష్ చిన్న చెల్లెలు చాముండి.  ఆ పిల్లకి పదేళ్ళుంటాయి. అన్నగారి దగ్గర చేరిక ఎక్కువ .

చాముండి అక్కడకు రాగానే భవ్య ముఖంలో నవ్వులు మాయమయి, రంగులు మారడం గమనించాడు భవేష్. ...   నవ్వుతూ నవ్వుతూ వున్న ముఖం ముడుచుకు పోవడం భవేష్ దృష్టిలో పడనే పడింది.    

ఉమ్మడి కుటుంబంలోని పిల్లకదా ...    తన వాళ్ళందరితో కలిసిపోతుంది ...   వాళ్ళ భాధ్యత ...    సంతోషంగా స్వీకరిస్తుంది అనుకుని తను పొరపాటు పడ్డాడా?  ఈ కాలపు అందరి ఆడపిల్లలాగే ... నేను ... నా మొగుడు ... అంతే అనుకుంటుందా?   తను క్లియర్ గా  చెప్పి ఉండాల్సిందా?   వాళ్ళ బాధ్యత తన దేననీ,  మీ ఇంట్లో  లాగే ఇక్కడా అందరితో కలసిమెలసి వుండాలి అని .   

చెల్లెలి మాటలకి అన్య మనస్కంగానే ’ఊ’ కొడుతున్నాడు ...  నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్న కొడుకూ కోడలూ,  చాముండి రాకతో ఉలుకూ పలుకూ లేకుండా అయిపోవడం చూస్తూనే అతని తల్లి జానకి   మనసు చివుక్ మంది. అయిపోయిందా? తన బిడ్డ పరాయి వాడయి పోతాడా?   తననీ , ఈ ముక్కుపచ్చలారని ఆడపిల్లలనీ గాలికి వదిలేస్తాడా ?  లేదులేదు తనబిడ్డ అలాంటివాడు కాదు ...  తన బాధ్యతలని మరచిపోడు ...    ఏమో తెల్లారి ఎన్ని చూడటంలేదు? ఎన్నివినడంలేదూ?

ఛ ... ఛా ...   పచ్చటి పందిట్లో తను సంతోషంగా  వుండాలి ...  ఏది ఎలా జరగాల్సివుంటే అలా జరుగుతుంది , చుట్టూ గొల్లున నవ్వులు వినబడి ఆలోచనల్లోంచి బయటపడింది.

భవేష్ కి మేనమామ అయ్యే ఓ పెద్దాయన విచారంగా ముఖం పెట్టి ….

"ఓరే ..    నీ స్వాతంత్రం,  స్వేచ్ఛ ...     ఆనందం  ఇంక కొన్నిగంటలే ...   కాస్త నవ్వరా నాయినా మనసారా " ఛలోక్తిగా అన్నాడు

"అంతేనంటావా మామయ్యా?" భయం నటించాడు భవేష్ .

" మరి ...   తాళికట్టే వరకే నీ జీవితం నీది ...    తర్వాత అంతా ..   పరాధీనమే  ...  నుంచో మంటే నుంచోవాలి,  కూర్చోమంటే కూర్చోవాలి …    గున్నమ్మ గారి మొగుడే  ...   " గొల్లున నవ్వేరంతా.

" ఏంటి మామా ...స్వానుభవమా?  " అరిచాడో గడుగ్గాయి

అందరూ తన మీద జోక్స్ వేస్తుంటే నవ్వుతూ చూస్తున్న భవేష్ ని చూస్తే మండిపోయింది భవ్యకి ,   అతని కండువా చాటు చేసుకు చచ్చేలా గిల్లింది.,  అసంకల్పితంగానే ...  కెవ్వుమన్నాడు .  

" అదిగో ఏదో బహుమతి అందుకున్నాడు మనవాడు ....  "  కళ్ళెగరేస్తూ అన్నాడాయన. మళ్లీ అంతా  నవ్వులు.

భవ్య ముఖం కందగడ్డలా మారడం చూసి ... ' అరే ..  ఏమిటీ అమ్మాయి ...   సరదాగా పెళ్ళిలో అందరూ వేసే జోక్స్ కి ఇలా రియాక్ట్ అవుతోంది ....    అమ్మో ...   చాలా కష్టమే ఇలా అయితే ....    "  గోళ్ళతో చచ్చేలా గిల్లిన చోట రాసుకుంటూ అనుకున్నాడు .

" ముఖం అలా పెట్టకు    ... బాగుండదు ...   ఏదో ...    అదో సరదా ...   పెళ్లిలో అలా సరదాగా ఏడిపిస్తారు ...  జస్ట్ ఎంజాయ్ ...    అంతే గానీ అలా ముఖం గంటు పెట్టుకోకు ...   " నెమ్మదిగా తనకు మాత్రమే వినబడేలా అన్నాడు . 

"చత్ ...   కంట్రీబ్రూట్స్ ...   చెత్తజోకులు ..   పైగా వాటిని ఎంజాయ్ చెయ్యాలా  ?   " సీరియస్ గా అంది . 

"అయ్యబాబోయ్ ...  ఈ పిల్లతో ఎలా వేగాలి రా బాబూ  ‘ఆ’   అంటే ..తప్పు , ‘ఊ’ అంటే తప్పు అనేలా వుంది ఊత్త  పొగరుబోతు గుర్రంలా వుంది ....   మొదట్లోనే జాగ్రత్తగా దారిలోకి తెచ్చుకోవాలి ...    ఆ తరువాత ఏకుమేకై కూర్చుంటే కష్టం  అయినా తను పొరబాటు చేశాడా?   రామచంద్రయ్యగారికి ఆ ఊళ్ళో ఊన్న మంచి పేరు, ముఖ్యంగా ఈ కాలంలో కూడా ఊమ్మడి కుటుంబం ,అదీ కేవలం తన పిల్లలతోనే కాదు ...    ఆయన తమ్ముళ్ళు ...   చెల్లెళ్ళతో కూడా అంటే భవ్య చిన్న తాతగారు   వాళ్ళు అన్న మాట,   ఒక వీధివీధి అంతా ..   ఆయన స్వజనమే ...   ఎంతో అన్యోన్యంగా ...   కలిసి కట్టుగా ఉంటారని మంచి పేరు .   

దివ్య పెళ్ళిలో తనని చూసి ...   దివ్య భర్త దినకర్ తనూ హైస్కూల్ లో క్లాస్ మేట్స్, తరువాత చదువులు వేరైనా మంచి మిత్రులుగా ఉండిపోయారు .. తరచు కలుస్తూనే ఉంటారు .. అందుకే వాడి పెళ్ళికి తను వెళ్ళడం .. అక్కడ దివ్య తాత గారు తనను చూసి మెచ్చడం ,  తన మంచితనం , చదువు , ఉద్యోగం  ముఖ్యంగా తన కుటుంబాన్ని తను చూసుకునే విధానం నచ్చి ...     భవ్యని  చేసుకోమని ఆ పెద్దాయన తన దగ్గరకు కబురు పెడితే   తను  ఎంతో ఆలోచించి ముఖ్యంగా ...   వాళ్ళ ఉమ్మడి కుటుంబం నచ్చి ...   వెంటనే అంగీకరించడం ,   ఆ వెంటనే పెళ్లి . తను పర్టిక్యులర్ గా అడగక  తప్పుచేశాడా?     

తను పక్కనే వున్నా పట్టించు కోకుండా ఆలోచనల్లో పడిపోయిన భవేష్ ని మెల్లిగా గిచ్చింది .  కొడుకు వుండి ...   వుండి ఆలోచనల్లోకి జారిపోవడం ....    గ్రహించి జానకి నిట్టూర్చింది. ...   బహుశా వాడూ తనలాగే భయపడుతున్నాడా అని .

"భవీ" మెల్లిగా మృదువుగా పిల్చింది.  

"ఊ" అన్యమనస్కంగా అన్నాడు.

"ఏమిటాలోచిస్తున్నావ్?     మన హనీమూన్ ప్రోగ్రాం గురించేనా ?    "   అల్లరిగా అంటూ సమ్మోహనంగా నవ్వింది .

"ఊ " నవ్వు ముఖంలోకి తెచ్చుకుంటూ అన్నాడు . 

" బావగారు ...   అక్కా ... మిమ్మల్ని ఆ మండపంలోని కుర్చీల్లో కూర్చోమంటున్నారు ....    " నవ్య వచ్చింది.

" సరే పద ...     ఎగ్జిభిషన్ మొదలయ్యింది ...    బొమ్మల్లా కూర్చుందాం     ...  " విసుగ్గా  అంది భవ్య.   

" అరె ..     నీకిష్టంలేదా ...     మరి రిసెప్షన్ ..    మానేసేవాళ్ళంగా ...    "

" ఇష్టం  లేదని కాదు గానీ హాయిగా మనం గడపాల్సిన మన టైం ......   ..      

"భవ్యా ...      ..   మరీ అంత స్వార్ధం పనికి రాదే ...    జీవితమంతా  మీదే కానీ పాపం ఓ గంట త్యాగం చెయ్యి    కూసింత దీవించుకుని ...   కాసింత చదివింపులు చదివించుకుంటారట....    చల్ ...  చల్ ...    " ఆట పట్టించింది నవ్య. 

" అమ్మో ... మీరు  ఆడపిల్లలే ...  మీ తాతగారు వింటే  ....          "

" అబ్బా ...  మేము ఏమంత ఓవర్ అయ్యామని బావగారు ....   ఈ లెక్కని మీరు ఇంకా ముద్దపప్పన్నమాట    అయినా ఆ బాధేదో ...    మా భవ్యది ... మధ్యలో నాకెందుకు?" కళ్ళు తమాషాగా తిప్పుతూ అంది. . 

“ ఏమర్రా ....  అందరూ మీ కోసం ఎదురు చూస్తున్నారు ...  మీరు అక్కడ కబుర్లేమిటి     " కేకేశారు భవ్య వాళ్ళ నాన్నగారు. . 

" ఆ ... ఆ   వస్తున్నారు నాన్నగారూ. తల్లీ,   నడు   నీకు దండం పెడతా,   నిన్ను  పిలవడానికి వచ్చిన నాకు పడుతుంది డోస్"  తొందర పెట్టింది నవ్య. . 

చూడముచ్చటగా కన్నుల పండుగగా వున్న ఆ జంటని అందరూ ఆశీర్వదించి,  విందు  ముగిసి  అందరూ వెళ్ళేవరకూ ఓపికగా కూర్చోక తప్పలేదు భవ్యకి.    చివరకి నిజంగానే అలసిపోయి నిద్ర ముంచుకు వచ్చేసింది .     

అప్పటికి ఆపేసి అప్పగింతల తంతు ...   మిగతా వేడుకలన్నీ తెల్లవారుఝామే మొదలుపెట్టి   త్వరత్వరగా ముగించారు.                

సశేషం …….. 


అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా పెళ్ళి అనేది సరి కొత్త జీవితానికి నాంది, ఓ మనిషి జీవితం సారవంతమైనా, నిస్సారమైనా దాంపత్య జీవనం ప్రధాన పాత్ర పోషిస్తుందనడం లో ఎటువంటీ సందేహం లేదు .. మన నయకీనాయకులా జీవితంలోకి అడుగుపెడుతున్నారు ... అన్యోన్యతతో, పరస్పర అవగాహనతో జీవితాలను పండించుకున్నారా? అర్ధంలేని ఆవేశకావేషాలతో, వైషమ్యాలతో జీవితాలను ఎడారి చేసుకున్నారా? మీరూ రండి ... వారితో బాటు కలసి ప్రయాణిస్తూ అవసరమైన చోట పెద్దరికంతో వారికి సర్ది చెబుతూ సాగిపోదాం  ...  

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nagaloka yagam