Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
meerajaalagaladaa neeyaanati

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

గతసంచికలో ఏం జరిగిందంటే...... http://www.gotelugu.com/issue194/559/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/

 

( గతసంచిక తరువాయి) ఈసారి మరింత విస్తుపాటు చెందాడు నాగరాజు మహా పద్ముడు` ‘‘మహా బలి... ఏమంటిరి? యువ రాజు ధనుంజయుడు కపటియా... మోసగాడా.. చోరుడా... ఇదేమి చోద్యము’’ అనడిగాడు.

‘‘చోద్యముగాక ఇంకేమి. అతడిని ఏమనవలె? నిండు పేరోగమున నిలబెట్టి అడిగినను తన వివరములు తెలపని వాడు కపటి కాదా? మాకు చెప్పకనే మా అనుమతి లేకనే మా పాతాళము నుండి మరలి వచ్చిన వాడు మోసగాడు గాడా... వచ్చినాడు పో... ప్రాణాధికమగు మా దత్త పుత్రిక మణి మేఖల హృదయము దోచుకొని పారి వచ్చిన వాడు చోరుడు కాడా... అతడిని ఏ విధమున శిక్షింపవలె?’’ అంటున్న బలి చక్రవర్తి మాటలకు మొదట నివ్వెర పోయినా విషయం అర్థం కాగానే ఫక్కున నవ్వాడు నాగ రేడు. ఉలూచీశ్వరి చెప్పిన ధనుంజయుని మూడో ప్రాణం ఎవరో ఇప్పుడు తెలిసి పోయింది తనకు.

వచ్చిన వెంటనే ధనుంజయుని జాడ కోసం గాలిస్తోంది యువరాణి మణి మేఖల. ఆమె కనుగవల నుండి తప్పించుకో లేక పోయాడు యువ రాజు ధనుంజయుడు. అతని గాంచ గానే చంద్రుని గాంచిన చకోర పక్షిలా ఆనందంతో పొంగి పోయిందామె. అంతే` తన వారిని వరిని వదిలి చెంగున కదిలింది.

ఇన్ని రోజుల వేదన, విరహం ముప్పిరి గొన ఉక్కిరి బిక్కిరవుతూ లేడి పిల్లలా దూకింది. సకలాభరణ భూషితమై దేవ కన్యలా మెరిసి పోతూ కర కంకణాదులు సద్దు చేస్తుండగా నాగ జనాలను తప్పించుకుని దూసుకు వచ్చి ధనుంజయుని కౌగిట ఒదిగి పోయింది. అతడి గుండెల మీద వాలగానే దుఖ్ఖం ఆగక వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమెను బిగియార కౌగిలించి బుజ్జగించి ఓదార్చాడు ధనుంజయుడు. ఇంత వరకు వచ్చాక ఇక సంధిగ్ధత వృధా అన్పించింది. తల తిప్పి భద్రా దేవి, ఉలూచీశ్వరిల వంక చూసాడు.

‘‘ప్రియ సఖియూ! మూడో ప్రాణము ఎక్కడని అడిగినారుగా. ఇదో వచ్చినది మదీయ మూడవ ప్రాణంబు’’ అంటూ ఒకరి నొకరికి పరిచయం గావించి మణి మేఖలను వారికి వప్పగించి నేరుగా బలి చక్రవర్తి వైపు కదిలాడు.

నాగ రాణి కీర్తి మతి తనకు పాదాభివందనం చేసిన మణి మేఖలను లేపి మురిపెంగా చూసింది. ‘‘చక్క దనాల చుక్కవు. మీ మూవురి వలపు చూర గొన్న ధనుంజయుడే కాదు, మీరును అదృష్టవంతులే. మీ సఖ్యత ఇటులనే కొనసాగవలె’’ అంటూ ఆశీర్వదించి అక్కనచేర్చుకుంది.
అక్కడ ధనుంజయుడు నేరుగా బలిచక్రవర్తి ముందుకెళ్ళి నిలిచాడు. ‘‘క్షమించండి మహాబలి. మీరు వెదుకుచున్న కపటి, మోసగాడు, చోరుడు ధనుంజయుడు మీ ముందుకు వచ్చినాడు. మదీయ ప్రణామము దయతో స్వీకరించండి’’ అంటూ సవినయంగా మోకాళ్ళ మీద కూచుని నమస్కరించాడు.

‘‘అహో...!’’ అంటూ తిరిగి గదను భుజాన వేసుకుని మీసం తిప్పుతూ హుంకరించాడు బలి చక్రవర్తి. తల తిప్పి శుక్రాచార్యుల వంక ఆశ్చర్యంగా చూసాడు.

‘‘ఆచార్య దేవా... జూచితిరా! జూచినారా ఇతడిని? నిండు పేరోగమున మాకు ప్రణమిల్లి, తల వంచని వీరుడు ఇప్పుడు ఇచట ప్రణమిల్లినాడు. ఈ యువ కిశోరమునకు ఏమి శిక్ష విధింపవలె’’ అనడిగాడు.

‘‘యువరాణి, మీ గారాలపట్టి మణిమేఖలనిచ్చి బెండ్లి చేయుట కన్ననూ వేరేమి శిక్ష కలదు మహాబలి’’ అంటూ నవ్వాడు శుక్రాచార్యులు.
‘‘లెస్స పలికితిరి ఆచార్య దేవా. అదియే ఇతగాడికి సముచితమగు శిక్ష’’ అంటూ దరహాసంతో ధనుంజయుని లేపి ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు బలి చక్రవర్తి.

‘‘క్షమించండి ప్రభూ! నేను పాతాళమున పడినప్పటి పరిస్థితులు వేరు. ఇది భూలోకము. మీరు పురాణ పురుషులు మాకెప్పుడూ ఆరాధ్యులు...’’ అంటూ ధనుంజయుడు చెప్ప బోతుంటే వారించాడు బలి చక్రవర్తి.

‘‘తప్పు నీది కాదు ధనుంజయా, మాది. నాడు సభలో నీ పలుకు డాంబికముని ఎంచితి. మంద బుద్ధినై నీ వివరము జ్ఞాన దృష్టినైన అరయ నైతి. మణి మేఖల చెప్పు వరకు నిజముగ నీవెవరో తెలియవైతివి’’ అన్నాడు.

ఇంతలో నాగ రాణి కీర్తి మతి, ఉలూచీశ్వరి, భద్రా దేవి, మణిమేఖల మూవురినీ వెంటనిడుకొని అచటి కొచ్చినది. యువతులు మూవురూ పాతాళ రాజ దంపతుకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు.

‘‘మహా బలి! ఈ శుభ తరుణమున నాదో విన్నపము. ధనుంజయునితో బాటు మీరును సపరివారముగ మా నాగ లోకమునకు విచ్చేయ వలె. ఒక వారము దినముల పాటు మా ఆతిధ్యం స్వీకరింప వలె’’ అంటూ బలి చక్రవర్తిని అర్థించాడు నాగ రేడు మహాపద్ముడు.
వెంటనే అభ్యంతరము తెలిపాడు శుక్రాచార్యుడు.

‘‘మీ అతిధ్యమును పొందుటకు మాకే అభ్యంతరమును లేదు నాగ రాజా. కాని ధనుంజయుని ఇబ్బంది పెట్టకుము. ఇతడు వెంటనే బయలు దేరవలసిన సమయమాసన్నమైనది’’ అన్నాడు.

ఆ మాటలు అందరినీ విభ్రాంతి పరిచాయి.

ధనుంజయుడు ఆందోళన చెందాడు.

‘‘ఆచార్యా! ధనుంజయుని ఇబ్బంది ఏమున్నది?’’ అనడిగాడు నాగ రేడు.

‘‘పరిస్థితులు విషమించినవి నాగ రాజా! మీకు తెలియనిదేమున్నది, కాలము ఎవరి కోసమూ ఆగదు గదా’’ అన్నాడు శుక్రాచార్యుడు. ఇంకా`
‘‘అచట ఇతని జనకుడు మరణ శయ్యపై నుండె. వెంటనే వెళ్ళి బ్రతికించుకో వలె. మరో వంక యుద్ధము ఆరంభమైనది. పోయి రాజ్యమును కాపాడుకో వలె. లేకున్న రెండును దక్కవు’’ అంటూ హెచ్చరించాడు.

ఎప్పటికప్పుడు ఆ మహనీయుడు తన పట్ల అక్కర చూపుతూ రత్న గిరి పరిస్థితుల్ని గమనిస్తూనే వున్నాడని ధనుంజయునికి అర్థమైంది. వెంటనే చెంతకెళ్ళి` ‘‘ఆచార్య దేవా... నాడు సభలో మీ చిరు నవ్వున కర్థము ఏమో మణి మేఖల నను వరించుటతో తెలిసినది. సర్వజ్ఞులు. నాయందు దయ వుంచి ప్రస్తుతము రత్న గిరి పరిస్థితులేమిటో వివరించండి’’ అంటూ అర్థించాడు.

‘‘ఏమి చెప్పుదు ధనుంజయా! నీ జనకుడు ధర్మ తేజుడు పుట్ట వ్రణ తీవ్రతకు నరక యాతన అనుభవించుచున్నాడు. పరిస్థితి ఇటులే వుండిన వారము దినములకు మించి బ్రతుకడు. నీ జనని కనకాంబిక కన్నీరు మున్నీరుగా విలపించుచూ క్షణమొక యుగము వలె నీ కొరకు ఎదురు చూచుచున్నది.

అటు మీ ఉప సైన్యాధ్యక్షుడు ద్రోహి బాహ్లీకుడు ఇదే తక్క సమయమని ఎంచి తిరుగు బాటు బావుటా ఎగుర వేసి అంతర్యుద్ధమునకు తెర తీసినాడు. నీవు మరణించితివను వదంతి పుట్టించినాడు. అటు ప్రజలు ఇటు సైన్యము గూడ వదంతిని నమ్మాలో వద్దో తెలియక అయోమయంలో ఉండె. ఎప్పుడేమి జరుగునోయని రత్న గిరి వాసులు భీతిల్లుచున్నారు.

మరో పక్క గాంధారాధీశుడు శతానీకుడు బాహ్లీకుని అడ్డు పెట్టుకొని రత్న గిరిని చేజిక్కించుకోవాలని యుద్ధ తంత్రమును నెరపు చున్నాడు. తన సేనతో బాటు మిత్ర పక్షాల సేనల గూడి బయలుదేరినాడు. నేడో రేపో అతడి యుద్ధ నౌకలు రత్న గిరి జలాల్లోకి ప్రవేశింప నున్నవి. ఇరు పక్షాలుగా నిలువునా చీలిన మీ సేనలు ఇప్పటికే తమలో తాము నరుక్కు ఛస్తున్నవి. రత్న గిరి ఓడ రేవు మూసి వేయ బడినది. మీ యుద్ధ నౌకలు జల మార్గమున గస్తీ తిరుగు చున్నవి. నగరమునకు రాక పోకలు నిషేధించి పుర ప్రవేశ ద్వారము మూయించి నాడు మీ సర్వ సైనాధ్యక్షుడు అర్కుడు. బాహ్లీకుని ఎలాగో నిలువరింప వచ్చును. కాని శతానీకుని బలగాలు రత్నగిరి చేరుకుంటే పరిస్థితి కరము దాటునని మహా మాత్యుడు వాసు దేవ నాయకుడు, సర్వ సైన్యాధ్యక్షుడు అర్కుడు సందేహ పడుచున్నారు. ఇక మాళవ యువ రాజు నీకు బావ యగు ఇంద్ర జిత్తు రత్నగిరిలో అంతర్యుద్ధమునణచి వేయుటకు మీకు సాయముగా తన సేనతో బయలు దేరి రత్నగిరి వైపు సాగుచున్నాడు. ఈ క్లిష్ట సమయమున నీవు వెంటనే రత్న గిరి చేరుట అవశ్యము.’’ అంటూ వివరించిన శుక్రా చార్యుల మాటలు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసాయి.
ఆ మాటలు వినగానే ముందుగా స్పందించినది భద్రా దేవి. వెంటనే భూతం ఘృతాచిని పిలిచి మడుగు ఆవల సంపంగి వనమున వదిలిన తమ అశ్వాలను వెంటనే తీసుకు రమ్మని ఆదేశించి పంపించింది.

అయితే, శుక్రా చార్యులు చెప్పింది వినగానే ఎలా స్పందించాలో ధనుంజయునికి అర్థం కాలేదు. ఇచట ఈశాన్య భారతం లోని మర్మ భూమి నుండి నైరుతి దిక్కుగా అనేక రాజ్యాలు దాటుకొని అశ్వాల మీద తమ రత్న గిరిని చేరాలంటే ఎంత తక్కువ అంచనా వేసినా ఇరువది దినములగును. అలాంటిది వారం దినములలోన తను రత్నగిరి చేరుట సాధ్యమగు కార్యమేనా? దివ్య నాగమణి చెంత వున్నను తగు సమయమునకు చేరకున్న తన జనకుని కడ సారి చూపుకైనా నోచలేడే. ఏమి చేయాలి? అలా తీవ్రమైన ఆలోచనలతో చింతా క్రాంతుడైన ధనుంజయుని గాంచి మంద హాసంతో భుజం తట్టారు శుక్రాచార్యుల వారు. భద్రా దేవిని కూడ చెంతకు పిలిచారు. దుష్ట జడల మాంత్రికుని సంహారంతో బాటు కొద్ది సేపటి క్రితం వరకు సాగిన పోరుతో ఇరువురూ నెత్తుటి చారికలతో, మాసిన దుస్తులతో బీభత్సంగా వున్నారు.
‘‘నాయానా ధనుంజయా! మేరు పర్వతము వోలె పిల్లలనిచ్చు నీ ఇరువురు మామలము చెంత నుండ రత్న గిరి ఎటు చేరుటయను చింత నీకేలనయ్యా... సకాలమునకు చేరెదవు గాక’’ అంటూ తన కమండలము నుండి కొద్దిగా జలము గైకొని కొద్ది సమయం కనులు మూసుకొని తెరిచి ఆ జలమును ఇరువురి శిరస్సున సంప్రోక్షించి ఆశీర్వదించారు. అంతే`

ఆశ్చర్య కరంగా భద్రా దేవి, ధనుంజయులు ఇరువురూ తాజాగా మారి పోయారు. ఇపుడు వారి వంటి మీద రక్తపు చారికలతో కూడిన దుస్తులు లేవు. వాటి స్థానంలో నూతన దుస్తులు ఆవిష్క్రతమయ్యాయి. పట్టు పీతాంబరాలతో సకలాభరణ భూషితగా దిగి వచ్చిన దేవ కన్యలా తన సహజ సౌందర్యంతో మెరిసి పోతోంది భద్రా దేవి. ఇక యువ రాజు ధనుంజయుడైతే రాజోచితమగు దుస్తుల్లో దిగి వచ్చిన నవ మన్మథుని వలె ప్రకాశిస్తున్నాడు. ఆ జంటను గాంచి మురిసి పోయారంతా. ఉలూచీశ్వరి, మణి మేఖల ఇరువరూ ‘‘అక్కా’’ అంటూ ఆనందంతో భద్రా దేవి కిరు వంకలా చేరి పోయారు. ధనుంజయుడు తన సఖియు మూవురితో సవినయంగా శుక్రా చార్యులకు పాదాభివందనం చేసాడు.
నాగ రాజు మహా పద్ముడు కరములు చాపి తవగానే అతడి చేతుల్లో దోసిట ఇమిడే ఒక పసిడి పెట్టగము ప్రత్యక్షమైనది. దాన్ని ధనుంజయునికి అందించి` ‘‘తెరచి చూడుము’’ అన్నాడు.

మూత తెరచిన ధనుంజయుని కనులు సంభ్రమంతో మెరిసాయి. ఏ దివ్య నాగమణి కోసమైతే ఇన్ని దినాలు తను రత్నగిరి వదలి శ్రమదామాదుల పాలయ్యాడో ఆ దివ్య నాగ మణి ఈ పసిడి పెట్టగంలో వుంది. నీలి రంగు దివ్య కాంతులతో ప్రకాశిస్తోంది. మూత మూసి కనులకద్దుకొని కృతజ్ఞతగా నాగ రేడు వంక చూసాడు. ఆయన ఆదరంగా కౌగిలించుకుని భుజం తట్టాడు` ‘‘మిమ్మల్ని కొద్ది దినములు మా నాగ లోకమున అతిథులుగా ఉంచుకొని పంపించాలనుకొంటి. అదిపుడు సాధ్య పడదని తెలిసినది. ఈ నీల మణి నీకే సొంతము. ఇది మీ చెంత ఉన్నంత కాలము భవిష్య తరాల్లో కూడ ఎవరికీ పుట్ట వ్రణము సోకనటుల వరమనుగ్రహిస్తున్నాను. ఇక నీకు చింత వలదు. నీ తండ్రి ధర్మ తేజుడు తక్షణమే సంపూర్ణారోగ్య వంతుడు కాగలడు’’ అన్నాడు.

ఈ లోపల`

బలి చక్రవర్తి కనులు మూసుకొని తలచి నంతనే అచట ఒక పుష్పక విమానం ప్రత్యక్ష మైనది.. పద్దెనిమిది స్థంభాలతో ఉచితాసనాలతో మణి మయ కాంతులు వెదజల్లె అందమైన ఆ బంగారు పుష్పక విమానాన్ని గాంచి ఆశ్చర్య చకితులయ్యారంతా.

‘‘ధనుంజయా’’ అంటూ పిలిచాడు బలి చక్రవర్తి.

‘‘ఇది ఒకప్పుడు మాకు ఇంద్ర దత్తమగు పుష్పకం. ఇప్పుడు నీవున్న స్థితిలో త్వరిత గతిని రత్న గిరి చేరుటకు వేరొండు మార్గము లేదు. నీవు కోరిన చోటుకు అది ఆకాశ మార్గమున వేగముగ గొని పోయి చేర్చ గలదు. మీ అశ్వముతో సహా పయనింప వచ్చును. మీరు దిగిన తక్షణం అదృశ్యమై పాతాళమున మా కోటకు చేరును. కావును నీవు భద్రా దేవిని వెంట నిడు కొని రత్నగిరికి మరులుము. అచట పరిస్థితులు చక్క బడగనే మేము ఉలూచీశ్వరి, మణి మేఖలను దోడ్కొని రత్న గిరికి వచ్చెదము’’ అన్నాడు.

‘‘కృతజ్ఞుడను మహా బలి’’ అన్నాడు ధనుంజయుడు. ఒక సమస్య తీరినది గాని రెండో సమస్య మొదలయినది. ఉలూచిని, మణి మేఖలను విడిచి వెళ్ళుటకు అతడి మనసు అంగీకరించుట లేదు. ఈ సమస్యను యువతులే పరిష్కరించారు .

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atadu..aame..oka rahasyam