Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

సెల్ ఫోన్ లతో అయోమయం - భమిడిపాటి ఫణిబాబు

using mobiles too much

ఇది వరకటి రోజుల్లోనే బాగుండేదనుకుంటాను. అంటే మరీ మా చిన్ననాటి రోజులని కాదు, సెల్ ఫోన్లొచ్చిన కొత్త రోజులు. కనీసం, ఎక్కడో అక్కడ ఆగి ఫోనులో మాట్టాడుకునేవారు. కాలక్రమేణా, అవేవో చెవుల్లో పెట్టుకునేవి వచ్చాయి, తరువాత అదేదో blue tooth ట. ఇదివరకటి రోజుల్లో వినలేని వారు, అలాటివి పెట్టుకుంటే అవతలివారికి తెలిసేది,ఆ మెషీన్ పెట్టుకున్న చెవిలో చెప్పేవారు. కాలక్రమేణా అవి ఇప్పుడు ఎవరికి చూసినా కర్ణాభరణాల్లాగ తయారయ్యాయి. ఏమిటో రోడ్డుమీద వెళ్తూండడం, ఏదో గొణుక్కుంటూ పోవడం. అయ్యో పాపం, అనుకునేవారం.ఎంత చెవిలో పెట్టుకున్నా, ఎదురుగా ఏమొస్తోందో చూసేవారు.

ఇప్పుడు ఈ మధ్యన touch phones,2G,3G లకీ కాలదోషం పట్టి, 4G లు  వచ్చిన తరువాత, రోడ్లమీద వెళ్ళేవారికి బాహ్య దృష్టే తగ్గిపోయింది. ఎప్పుడు చూసినా, ఆ సెల్ ఫోనులోకే చూపంతా !

ఏదో కొంపకి చేరిన తరువాత సావకాశంగా చూసుకోవచ్చుగా, అబ్బే, దృష్టంతా కిందకే. ఏం చూస్తారో, ఏం చేస్తారో ఆ భగవంతుడికే తెలియాలి.ఎప్పుడూ ఏదో ఒకటి కెలుకుతూనే ఉంటారు.ఇంక ట్రైన్లలో అడక్కండి. ఏసీ బోగీల్లో ఎక్కడ చూసినా వీటిని ఛార్జింగ్ చేయడంతోనే సరిపోతోంది.పక్కవాడున్నాదో, పోయాడో కూడా చూసుకోరు. అంతంత కొంపలు మునిగే విషయాలేముంటాయో అర్ధం అవదు. పోనీ ఎవరింటికైనా వెళ్ళినప్పుడైనా చేతులు ఖాళీగా ఉంటాయా అంటే అదీ లేదు. ఓ భార్యా భర్తా, ఓ కూతురూ, ఓ కొడుకూ ఎప్పుడైనా బయటకెళ్ళరా అంటే, ననుగురి చేతుల్లోనూ ఒక్కో touch phone ఉండాల్సిందే. ఈ మాత్రందానికి బయటకెళ్ళడం దేనికీ, హాయిగా ఇంట్లోనే కూర్చుంటే పోలా? ఓ మాటుండదు, మంతుండదు, కొంపలు మునిగిపోయినట్టు, ఏమిటో చూసేసికోవడం.

ఇదివరకటి రోజుల్లో గుర్తుందా, కొద్దిగా స్థితిపరులైన వారింట్లో తప్పకుండా ఉండే వస్తువు- వీణ. కొంతమందికి వంశపారంపర్యంగా వచ్చిందవొచ్చు, కొంతమంది ఇంట్లో కూతురికి నేర్పించడానికి కొన్నదయుండవచ్చు. ఏదో కొన్ని నెలలు శ్రధ్ధగానే నేర్చుకుంటారు. ఆ తరువాతే, ఈ పెళ్ళైన పిల్లకి కొత్తకాపరంలో పంపిద్దామని ఆ తల్లితండ్రులు అనుకున్నా కానీ, వద్దుపొమ్మంటుంది.చివరకి పుట్టంట్లోనే సెటిల్ అయిపోతుంది ఆ పూర్ వీణ. ఈ తల్లితండ్రులు పాపం తమ కూతురికి గుర్తుగా, కొత్తగా కొన్న ఇంట్లో హాల్లో ప్రత్యేకంగా ఓ షో కేస్ తయారుచేయించి, ఆ వీణని దాంట్లో పెడతారు. ఎవరైనా వచ్చినప్పుడు " ఆంటీ మీరు వీణ వాయిస్తారా .." అని అడుగుతారేమో అని, వాళ్ళ కూతురు వీణ వాయించినప్పటి ఫోటో ఒకటి పక్కనే పెడతారు.

ఎప్పుడో ఆ కూతురు పిల్లా పాపలతో పుట్టింటికి వచ్చినప్పుడు, మనవడో మనవరాలో " వాహ్ మమ్మా..you used to play Veena....." అంటూ ఓసారి ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ అడిగేసరికి, పాత రోజులు గుర్తుకు తెచ్చుకుంటుంది." haan.. dear..I used to. But your pappa was not interested...అంటూ ఆ అమాయకపు భర్త మీదకు తోసేస్తుంది. ఈ రోజుల్లో ప్రతీవారికీ, అవేవో multiple talents ట, అదో added qualification కూడానూ.దానితో కూతురో కొడుకో అయితే ఈ వీణ మనతో తీసుకుపోదాం, నేన్నేర్చుకుంటాను అని అడగ్గానే, మొత్తానికి ఆ వీణ కి స్థాన చలనం కలుగుతుంది.ఆ పిల్లో పిల్లాడో శ్రధ్ధగా నేర్చుకున్నారా లేదా అన్నది వేరే విషయం అనుకోండి.
అలాగే మధ్య తరగతీ, అంతకంటె కొద్దిగా కిందిమధ్య తరగతి ఇళ్ళల్లో ఉండేది Sewing Machine. ప్రతీ ఇంట్లోనూ place of honour ఉండేది ఈ కుట్టు మెషీనుకే ! పెద్ద సంసారమూ, ఓ నలుగురైదుగురు ఆడపిల్లలూ, ఓ ఇద్దరు మొగ పిల్లలూ. వీళ్ళందరికీ టైలరుకిచ్చి బట్టలు కుట్టించడానికి తడిపిమోపెడైపోతోందనే సదుద్దేశ్యంతో, ఆ ఇంటి పెద్ద, వాయిదాల్లో ఓ మెషీనోటి కొని పెట్టేస్తారు. ఉన్న రెండు గదుల్లోనూఓ రూమ్ములో సగం ప్లేసు దీనితోనే నిండిపోతుంది. ఉత్తినే మెషీన్ కొనేసి పడేస్తే సరిపోదుగా, బట్టలు కుట్టడం నేర్చుకోవాలాయే. ఆ రోజుల్లో "ఉషా" వాళ్ళవి స్కూళ్లుండేవి, వాటిల్లో నేర్పేవారు. ఇంట్లో ఉండే ఓ కూతురిని అక్కడకి పంపి, నేర్చుకోమనేవారు. మరీ ఇంట్లో మొగాళ్ళ బట్టలు కాకపోయినా, ఆడవారి జాకెట్లూ అవీ, ఇంట్లోనే కానిచ్చేసేవారు. పుట్టింట్లో ఈ కుట్టు మెషీను ఉండడం చేత, కొంతమంది స్త్రీలు, పెళ్ళైన తరువాత కూడా, భర్తచేత కొనిపించుకునేవారు. ఏదో కొంతకాలం బాగానే ఉండేది. కాలక్రమేణా, ఆ మెషీను తొక్కడానికి ఓపిక తగ్గిపోయి, దానికో మోటారోటి పెట్టించుకునేవారు. ఈ రోజుల్లో అంతంత పెద్ద మెషీన్లు ఉంచుకోడానికి స్తలం ఎక్కడా, మన అగ్గిపెట్ల ఎపార్టుమెంట్లలో? దానితో, ఆ మెషీను ఆకారం కూడా మారిపోయి, portable లోకి వచ్చేసింది.

పోనీ ఇంట్లో మెషీనుందని బట్టలేమైనా కుడతారా అంటే అదీ లేదు. ఏదో గతజన్మ జ్ఞాపకాల్లాగ, ఈ portable కుట్టుమెషీను ఇంట్లో అలంకారార్ధం మిగులుతుంది.

ఎప్పుడో పిల్లల చదువులూ, పెళ్ళిళ్ళూ అయిపోయి, ఒక్కళ్ళూ ఉన్నప్పుడెప్పుడో గుర్తొచ్చి, ఆ మెషీన్ కి దుమ్ము దులిపి, ఏదో ఓ కర్టెనో ఇంకోటో కుట్టడానికి ప్రయత్నిస్తారు. ఆ కుట్టేమో సరీగ్గా పడదూ, ఎలా పడుతుందీ, అన్నేసేళ్ళు పనీ పాటా లేకుండా ఉంటే? ఈ రోజుల్లో టైలరు దగ్గరకి వెళ్ళాలంటే భయం వేస్తోంది. వాళ్ళు వసూలు చేసే ఛార్జీలు అవీ చూసి. పైగా ఓ పట్టాన వాళ్ళు కుట్టినవి నచ్చవూ.ఇంకోళ్ళని పట్టుకోడం, ఆ కొత్త టైలరు ఏదో మొదట్లో కావలిసినట్టుగానే కుట్టినా, తరువాత్తరువాత వీళ్ళకీ వాళ్ళకీ కుదరదు. మళ్ళీ ఓ కొత్త టైలరుకోసం వేట !

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
beauty of kashmir