Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
using mobiles too much

ఈ సంచికలో >> శీర్షికలు >>

ముక్కు పచ్చలారని కాశ్మీరం - కర్రానాగలక్ష్మి

               ( శ్రీనగర్ ---3)
 

శ్రీనగరు లో ప్రతీ పర్యాటకుడు చూడాలనుకొనే మరో ప్రదేశం శంకాచార్య మందిరం . దాల్ సరస్సు కి మరో గట్టుని వున్న మందిరం . ఈ మందిరం ఆర్కియాలజీ వారి 1958 యాక్ట్ ప్రకారం సంరక్షిత భవనంగా గుర్తించబడింది . దాల్ సరస్సు దగ్గరనుంచి మోటారు వాహనంలో ప్రయాణించి కొండపైకి చేరొచ్చు , అక్కడనుంచి సుమారు 2 వందల మెట్టు యెక్కి మందిరం చేరుకోవచ్చు , లేదా సివిల్ లైన్స్ లో వున్న ' దురగంగా మందిరం '  నుంచి నెహ్రూ అభయారణ్యం లోంచి యేడు కిలోమీటర్లు నడక ద్వారా కూడా చేరుకోవచ్చు .

మందిరం వున్న కొండను తక్త - ఎ - సులేమాన్ అంటారు . శ్రీనగరు పట్టణానికి సుమారు 1100 అడుగుల యెత్తులో వుంది మందిరం . నడక అలవాటు లేని వారికి 2 వందల మెట్లు యెక్కి మందిరం చేరుకోడం కాస్త కష్టమనే చెప్పాలి .  సూర్యరశ్మిని  భూమి పైకి చేరనివ్వకుండా నియంత్రిస్తూ వుంటుంది చుట్టూ వున్న దట్టమైన అడవి . గేటు దగ్గర ఆర్మీ వారి పహారా వుంటుంది . కెమేరా , సెల్ ఫోనులు లోనికి అనుమతించరు . గర్భగుడిలో తోలుతో చేసిన బెల్టులు ,  బేగులు , కోట్లు అనుమతించరు .

2 వందల మెట్లు యెక్కిన తరువాత వృత్తాకారం లో కట్టిన గోడ వుంటుంది , అక్కడనుంచి గర్భగుడి కి చేరడానికి సుమారు పది యెత్తైన మెట్లు యెక్కాలి , మందిరం అష్టభుజాలతో కట్టిన గట్టుమీద నిర్మింపబడింది . లోపల నంది , యెరుపు నలుపు రంగులో వున్న పెద్ద శివలింగం గోడలకు వున్న పలకల మీద యేవో శిలాశాసనాలు వున్నాయి . అవి పర్షియన్ లిపి లో వున్నాయి .

ఓ సారి వెళ్లినపుడు గర్భగుడిలో నాలుగడుగుల నాగుపాము కనబడింది , అందరం  పాము గోడకి వున్న కలుగు లోంచి బయటకు పోయేవరుకు వుండి శివుడిని దర్శించుకొని వచ్చేం .  ఈ మందిరాన్ని శంకరాచార్య మందిరం అని పిలుస్తున్నారు కాబట్టి శంకరాచార్యుల వారిచే కట్టబడింది అంటే మాత్రం పప్పులో కాలు వేసినట్లే , ఈ మందిరం యెంతపురాతన మైనది , యెవరిచే నిర్మింప బడింది అనే తెలుసుకుందాం .

ఈ మందిరం క్రీశ్తు పూర్వం రెండువేల సంవత్సరాలకు పూర్వందిగా చెప్తారు . అప్పటి రాజు యీ కొండమీద మీద శివమందిరం కట్టించినట్లుగా చరిత్ర చెప్తోంది . కల్హనుడు రచించిన ' రాజ తరంగిణి ' ప్రకారం క్రీశ్తు పూర్వం 371 లో రాజా గోపాదిత్య చే శివ మందిరం నిర్మింప బడింది , మందిరం వున్న కొండను గోపాద్రి అని పిలిచేవారు  . తరువాత క్రీశ్తు పూర్వం రెండవ శతాబ్దం లో యీ ప్రాంతం మౌర్య వంశానికి చెందిన అశోకచక్రవర్తి కుమారుని పరిపాలనలో వుండేది , అప్పట్లో యీ మందిరాన్ని బౌద్దమందిరంగా మార్చేరు . తరువాత క్రీశ్తు పూర్వం 90 నుంచి 30 వరకు పరిపాలించిన లలితాదిత్య యీ మందిరానికి మరమ్మత్తులు చేయించేడు .

శంకరాచార్యులవారు అధ్వైతాన్ని ప్రచారం చేస్తూ కశ్మీరు వచ్చినప్పుడు యీ మందిరంలో కొన్నాళ్లు నివసించేరు , దేశాటనలో వున్నప్పుడు శంకరులు ప్రాతఃకాలంలోను సాయంసమయం లోనూ శివారాధన , శక్తి రూపమైన శ్రీయంత్ర పూజ తప్పక నిర్వహించే వారు , యెక్కడ వారుంటే ఆ ప్రదేశంలో మట్టితో లింగం , నేలపైన యంత్రం నిర్మించుకుని పూజా విధులు పూర్తి చేసుకొనేవారు . అలా యీ ప్రదేశంలో కూడా చేసేరు , అంతేకాక ' సౌందర్య లహరి ' యిక్కడే రచించేరట .

భూకంపం వల్ల కూలిపోయిన మందిరాన్ని ఝైన్ - ఉల్ల్- అబదీన్ ఆ తరువాత షేక్-ఉద్-దిన్ యీ మందిరానికి మరమ్మత్తులు చేయించేరు . 
డోగ్రా రాజు గులాబ్ సింగ్ కాలంలో మందిరాన్ని చేరుకొనేందుకు రాతి మెట్ల నిర్మాణం చేయించేరు . ఇప్పడున్న శివలింగం 1925 లో నర్మదానది నుంచి తెప్పించిన శాలిగ్రామం , దీనిని ప్రతిష్టించిన ప్రదేశంలో  శంకరభగవానులచే పూజింపబడిన శివ , శక్తి ల శక్తులు వుండడం తో యీ శివ లింగాన్ని శివ , శక్తుల సంగమమని అంటారు .

అబ్దుల్  ఫజల్ రచించిన గ్రంథం ప్రకారం ' జీసస్ ' యీ ప్రదేశాన్ని సందర్శించినట్లుగా వుంది . చరిత్రకారుల ప్రకారం మందిరం లోపలి గోడలకు  పర్షియన్ భాషలో జీసస్ అనే మతగురువు ఈజిప్టునుండి యిక్కడకు వచ్చెను ' అని రాసి వున్న పలకలు యిప్పటికీ వున్నాయట .
ఈ మందిరం యెప్పడూ ఆటంకవాదుల దృష్టిలో వుండడం తో యిక్కడ యెప్పుడూ ఆర్మీ వారి పహారా చాలా యెక్కువగా వుంటుంది .      ఈ కొండ జ్వాలాముఖి లావా వల్ల యేర్పడ్డదట.

ఈ కొండపై నుంచి మొత్తం శ్రీనగరు పట్నం అంతా కనిపిస్తుంది . దాల్ సరస్సు అందాలు చూడొచ్చు . ఎంతసేపు వున్నా తనివి తీరని ప్రదేశం , అమర్ నాధ్ యాత్రీకులు తప్పకుండా దర్శించుకొనే ప్రదేశంగా యీ మధ్యకాలంలో మారింది .

లోపలకు వెళ్లే వాహనాలను సాయంత్రం నాలుగు గంటల తరువాత లోనికి అనుమతించరు .

శంకరాచార్య మందిరం తరువాత షికారా లో దాల్ సరస్సులో విహరిద్దాం రండి .

దాల్ సరస్సు -----

హిమాలయాలు వేసవిలో సూర్యుని వేడికి కరిగి ప్రవహించడం వల్ల యేర్పడ్డ సరస్సు యిది . శ్రీనగరులో దాల్ సరస్సు కాక చాలా వున్నాయి . కొన్ని ఒకదానితో ఒకటి కలిసి వున్నాయి . కొన్ని సరస్సులు మానవ తప్పిదాలకి కనుమరుగయేయి . శ్రీనగరు పట్టణాన్ని వరదల నుంచి తప్పంచే యీ సరస్సులు మూసి బిల్డింగు లు కట్టేస్తే జరిగే నష్టం మానవుడికి ప్రకృతి తప్పకుండా చెప్తుంది . అలాగే యీ నీటి వల్ల యేర్పడ్డ తడి బురద నేలలు యెక్కువ భూభాగాన్ని ఆక్రమించేయి . వాటిలో ముఖ్యమైనవి నాగిని దాల్ , బోడ్ దాల్ , లోకుట్ దాల్ , గాగ్రిబల్ చెప్పుకో దగ్గవి , వీటిని కలుపుతూ చాలా బురద నేలలు వున్నాయి , లోకుట్ దాల్ , బోడ్ దాల్ లలో రుప్ లంక ( చార్ చినార్ ) , సోనాలంక లు వున్నాయి .

పైన పేరా లో చాలా చోట్ల ' దాల్ ' అనే పదం వాడేను , అంటే శ్రీనగరులో చాలా దాల్ సరస్సులున్నాయా ? అనే అనుమానం మీకొచ్చినట్లే నాకూ మొదటి సారి అక్కడకి వెళ్లి నప్పుడు వచ్చింది , దాల్ సరస్సు అని మామూలుగా వ్యవహరిస్తూ వుంటాం , ఆ ప్రయోగం తప్పు , యెందుకంటే ' దాల్ ' అంటేనే సరస్సు అని స్థానిక భాషలో అర్దం . అలాగే మనం వాడుకలో ' నాథుల్లా పాస్ ' అంటాం , నిజానికి  ' లా ' అంటే పాస్ ( కనుమ) అని అర్దం , నాథుల్లా అంటే చాలు . అదన్నమాట , దాల్ సుమారు 15.5 కిలోమీటర్ల తీరం కలిగి , 18 చదరపు కిలో మీటర్ల మేర నీరు , సుమారు 21 చదరపు కిలోమీటర్ల బురదనేలను కలిగి వుంది . నీరున్న ప్రదేశం లో పర్యాటకులకు హౌసుబోట్లు , షికారా ( చిన్న బోటు , ఒకరి నుంచి నలుగురు కూర్చో గలిగేటట్లు వుండి చిన్నచిన్న తెడ్డులతో నడుపుతూ వుంటారు) లో షికారు చేసేందుకు వీలుగా వుంటుంది . షికారాలు రెండుగంటలకు యింత అని రేటు వుంటుంది . ఇక్కడ ప్రభుత్వం వారి రేటు అని యేమీ వుండదు .కాబట్టి మన అవుసరమా , వారి అవుసరమా అనేదానిమీద ధర వుంటుంది . ఆర్ధికశాస్త్రం బాగా అమలు చెయ్యడం కనిపిస్తుంది ( డిమాండ్ అండ సప్లై ) . సరస్సు తూర్పు తీరాన మొఘల్ ఉద్యానవనాలు , పడమట తీరాన ' హజ్రత్ బల్ ' వున్నాయి .

సరస్సులో విహరిస్తూ మనం  షికారాలో కావలసిన టీ , కాఫీ , స్నేక్స్ కొనుక్కోవచ్చు , అలాగే కశ్మీరీ ఉత్పాదనలు , పేపరు ఆర్ట్స్ , ఉలెన్స్ యిలాంటివన్నీ బోటింగ్ చేస్తూనే చెయ్యొచ్చు .  రెస్టొరెంట్స్ , షాప్స్ , ఫొటో స్టూడియో , పూలపండ్ల దుకాణాలు అన్నీ మన షికారా పక్కన తేలుతూ మనతో పాటు వస్తూ బేరసారాలు చేస్తూ వుంటాయి . మొక్కజొన్నలు కాల్చి అమ్మే వారుకూడా షికారా లో ప్రయాణస్తూ అమ్ముతూ వుంటారు .

మొఘల్ గార్డెన్స్ వైపు తీరం వరకు తీసుకు వెళతారు , కాని హజ్రత్ బల్ ని దూరం నుంచి మాత్రమే చూపిస్తారు . ముస్లిమ్స్ కి పవిత్ర స్థలాలలో యిది వొ కటి , దీనిని ' మొయి-ఎ-ముఖదర్ ' గా వ్యవహరిస్తారు . ఇందులో మహమ్మదు ప్రవక్త తాలూకా తల వెంట్రుక  భద్రపరచేరుట . మహమ్మదు ప్రవక్త ముఖ్యఅనచరుడు సైయ్యెద్ అబ్దుల్లా యీవెంట్రుకను మదీనా నుంచి బీజాపూర్ కి తీసుకొని రాగా 1635 లో మొఘల్ ల కాలంలో దీనిని కశ్మీరుకి తరలించేరు , అప్పటి ప్రముఖ వ్యాపారి దీనిని మూల్యం చెల్లించి సొంతం చేసుకొని మసీదు నిర్మించి అందులో వుంచేడట .

మసీదు వున్న చుట్టు పక్కల వేర్పాటు వాదుల దృష్టి యెక్కువగా వుండి ,హిందువులు ఆ పక్క కనిపిస్తే కాల్పులు జరిపే ప్రమాదం చాలా యెక్కువగా వుండడంతో మేం అటు వైపు వెళ్లే ఆలోచనని పక్కకి పెట్టేం .

ఈ సరస్సులో మరో ఆకర్షణ ' చార్ చినార్ ' గా పిలువబడుతున్న రుప్ లంక . లంక అంటే తెలుసుగా ద్వీపం , యిందులో నాలుగు చినార్ వృక్షాలు వుండేవి , చిన్న వుద్యానవనంలా తీర్చిదిద్ది ఓ పర్యాటక స్థలంగా రూపొందించేరు . ప్రస్తుతం యిక్కడ మూడు చినార్ వృక్షాలు మాత్రమే వున్నాయి , నాలుగో చినార్ మొక్కని నాటేరు , అయినా  కాస్త బోసిగానే వుంది , నాలుగు చెట్లు వున్నప్పుడు నిండుగా అనిపించేది . ఇందులో చిన్న రెస్టొరెంట్ నడుపుతున్నారు . సోనాలంక లో విద్యుత్ దీపాలు అమర్చి నైట్ క్లబ్ లాంటిది నడపబడుతోంది . సాయంత్రం ఆరు తరువాత మాత్రమే దీవిలోకి  ప్రవేశించేం వీలుంది . ఇది ప్రైవేటు వారి చే నడపబడుతోంది .

సరస్సులో పౌంటెన్స్ యేర్పాటు చేసేరు , సాయంత్రం రంగురంగుల దీపాలు వేయడం వల్ల సరస్సు చూడ ముచ్చటగా వుంటుంది .

ముందు పేరా లో బురదనేల అని రాసాను వీటిని కశ్మీరీలు యెలా వుపయోగించుకొంటున్నారో చూద్దాం . వీటిని ' రద్ ' లని అంటారు .  ఈ బురద నేలలో పూలతోటలు , కాయగూరలు పెంచుతున్నారు . ఆనప , బీన్స్ , ముల్లంగి , బటాణి , సల్గమ్ , నూలుకోలు , కాలిఫ్లవర్ , కాకర , మిరప లాంటి కాయ , దుంపకూరలు , పాలాకు , టమేటో లు బాగ పండిస్తున్నారు . బంతి , చేమంతి , డలియా , లిల్లీ , గులాబీ తోటలు వున్నాయి . ఈ సరస్సులో జూలై ఆగష్టు మాసాలలో వెళ్లే వారికి మరో ఆకర్షణ యేంటంటే పెద్ద పళ్లేలంత పూలతో వుండే తామర తోట కళ్లు తిప్పుకోనివ్వదు . ఇవే కాక నీటిపంటలు నల్లగా దుంపలు , పై తోలు తీస్తే లోన తెల్లగా వుంటుంది   'పానీ సింగడా' అని కలకత్తాలో అనేవారు , మేం తినేవాళ్లం అదోరుచి , వీటిని యీ సరస్సులో విరివిగా పండిస్తారు . 1984 తరువాత యీ సరస్సు నిర్లక్ష్యానికి గురై చాలా చెత్త అయిపోయింది , యీ మధ్య ప్రభుత్వం వారు మిషన్లు పెట్టి నీటిని శుభ్రపరచడం లాంటివి చేపట్టడంతో చాలా వరకు శుభ్రపడిందనే చెప్పాలి కాని హౌస్ బోటుల్లో వుండేవారు విసర్జించే మలమూత్రాలు వేరే చోటికి చేరే విధంగా యేదైనా చర్యను చేపడితే బాగుంటుంది .   వెళ్లిన ప్రతీసరీ సరస్సులో షికారాలో విహరించడానికి నాకెంతో యిష్టం . 

పై వారం మరికొన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాను , అంతవరకు శలవు .   
మరిన్ని శీర్షికలు
navvunaaluguyugaalu