Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunaaluguyugaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

గోతెలుగు కథాసమీక్షలు - ..

 

 

కథ : పుట్టినిల్లు
రచయిత్రి : కె. శ్రీలత
సమీక్ష : రాచమళ్ళ ఉపేందర్

గోతెలుగు 77వ సంచిక!

గోతెలుగు వార పత్రిక సాహిత్య విలువలను పెంపొందిస్తూ... సమాజ అభ్యున్నతికి కృషి చేసే క్రమంలో మంచి కథలను ప్రచురిస్తోంది. అందుకు ఒక ఉదాహరణే 77 వ సంచికలో ప్రచురించిన "పుట్టినిల్లు" కథ.

కె. శ్రీలత గారు రాసిన ఈ కథ నేడు బీటలు వారుతున్న మానవీయ విలువలకు, కుటుంబ వ్యవస్థకు చక్కని ఔషధం లాంటిది. కుటుంబంలోని వ్యక్తులు తమ భాద్యతలు ఎలా నిర్వర్తించాలో... కుటుంబ సభ్యుల మధ్య ఎంతటి ప్రేమానురాగాలను కలిగి ఉండాలో కథ అసాంతం గొప్పగా ఆవిష్కరించారు రచయిత్రి.

ఈ కథలో కీలకపాత్రలు రెండు. ఒకటి వనజ. రెండవది ఆడపడుచు లావణ్య. ప్రతి పండుగకు ఆడపడచు పుట్టింటికి రావడం మామూలు విషయమే. అయితే పక్కింటి వారి మాటలు విని, బాత్రూంలో కాలుజారిపడ్డనంటూ పండగకు వచ్చిన   ఆడపడుచు ముందు నాటకం మొదలెట్టి మంచం ఎక్కుతుంది వనజ. కానీ వదిన పరిస్థతికి తల్లడిల్లుతూ అన్న పిల్లలకు, తన పిల్లలకు వంట చేయటం, ఇల్లు శుభ్రం చేయడం, పిండి వంటలు చేసి, వనజను కన్నతల్లిలా ఆదరిస్తుంది లావణ్య. తన నిస్వార్థమైన ప్రేమతో వనజలో పరివర్తన కలిగేలా చేస్తుంది.
పండుగలు, పబ్బాల్లోనే కాదు... కష్టాల్లో... సమస్యల్లో... ఒకరి నొకరు అర్థం చేసుకొని... అండగా నిలబడితే... కుటుంబ సభ్యుల మధ్య ఆనంద సంతోషాలే కానీ, అపార్థాలు చోటు లేదనేది నగ్న సత్యమే. మనసు పెట్టి చదివిన ప్రతి ఒక్కరిని పుట్టినింటి వాతావరణం వైపు అడుగులు వేసేలా కథను అద్భుతంగా మలిచారు రచయిత్రి.

అందుకు నిదర్శనమే కథలోని ఈ వాక్యాలు....

కన్నవారు, తోడబుట్టినవారు వుంటేనే, 'పుట్టినిల్లు'  కాదనీ,  ప్రేమతో ఆదరించి ఆపద సమయంలో మేమంతా వున్నామని భరోసా ఇచ్చే గొప్ప మనసుగల మనుష్యులు వున్న ఏ ఇల్లయినా ప్రతీ ఆడపిల్లకు 'పుట్టినింటి' తో సమానమని గ్రహించిన వనజ ఇకపై ఎప్పుడూ ప్రక్కింటివాళ్ళ మాటలూ, ఎదురింటి వాళ్ళ మాటలూ విని అయినవాళ్ళను బాధపెట్టకూడదని గట్టిగా నిర్ణయించుకుంది.

పాఠకులు ఈ కథలో సూత్రధారి, ముఖ్య పాత్రధారి అయిన వనజ తీసుకున్న నిర్ణయంతో టక్కున ఏకీభవిస్తారు. అంతగా ఆలోచింపజేస్తుంది కథ. అందుకే ఇది మంచి కథ. చదివిన ప్రతి ఒక్కరూ పది కాలాలు గుర్తుంచుకునేలా పసందైన బొమ్మతో అలరించారు విలక్షణ చిత్రకారులు శ్రీ మాధవ్ గారు.  మంచి సృజన చేసిన మేధావులిద్దరికి అర కోటి అభినందనలు.

 

ఈ కథను ఈ క్రింది లింక్ లో చదవచ్చు... http://www.gotelugu.com/issue77/2072/telugu-stories/puttinillu-telugu-story/

మరిన్ని శీర్షికలు
weekly horoscope 6th january to 12th january