Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope 6th january to 12th january

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనంవెంకట వరప్రసాదరావు

sahiteevanam
పాండురంగమాహాత్మ్యం

అత్యుత్తముడైన దైవము, అత్యత్తమమమైన  తీర్థము, అత్యుత్తమమైన క్షేత్రము ఒకేచోట  ఉన్న స్థలం ఏది స్వామీ? అని అగస్త్యుడు 
అడిగిన  ప్రశ్నకు అందుకు సమాధానము  యివ్వగలవాడు పరమశివుడే అనిచెప్పి  ఆయనను వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్ళాడు
కుమారస్వామి. అదే ప్రశ్నను తన తండ్రిని  అడిగాడు. పరమశివుడు పరమానందభరితుడై అటువంటి పుణ్యక్షేత్రము పాండురంగమే అని చెప్పి, పుండరీక మహర్షి చరిత్రమును  చెప్పనారంభించాడు. ఆ సందర్భంగా పుండరీకుడి గుణ శీలాదులను వర్ణించి, ఆతడి  తపోనిష్ఠకు మెచ్చి శ్రీహరి అతడిని కరుణించడం గురించి వర్ణిస్తున్నాడు పరమశివుడు. తనకు ప్రత్యక్షమైన శ్రీహరిని స్తుతిస్తున్నాడు పుండరీకుడు.

పొదలు నీ పొక్కిటి పువ్వుకాన్పునఁ గదా 
పెనుమాయ పిల్లలఁ బెట్టుటెల్లఁ!
బొడము నీ మొదలి యూర్పుల నేర్పులన కదా 
చదువు సంధ్యలు గల్గి జగము మనుట! 
కెరలు నీ యడుగుఁదామరల తేనియఁ గదా 
పాపంపు బెనురొంపి పలచనగుట!
పొసఁగు నీ తెలిచూపు పసఁ గదా యిది రాత్రి 
యిది పగలను మేరలెఱుఁకఁబడుట!                     (సీ)

భవనఘటనకు మొదలి కంబమునుబోలె 
భువనములకెల్ల నీ వాది భూతివగుచు 
నిట్టనిలుచున్కిచేఁ గాదె నెట్టుకొనియె
గెంటుఁ గుంటును లేక లక్ష్మీకళత్ర!                  (తే)

ఓ లక్ష్మీపతీ! నీ నాభియందు జన్మించిన బ్రహ్మదేవునిచేత కదా, ఈ పెనుమాయయైన సృష్టి, సంసారము వర్ధిల్లడం! నీ తొలి ఉచ్ఛ్వాస నిశ్వాసముల వలన కదా తొలి  చదువులు ఐన వేదములు పుట్టడం, జగతి నిలబడడం! పొంగే నీ పాదముల తేనెల  వలనకదా, పాపముల మహా పంకిలం పలుచన అయ్యేది! నీ తేట చూపుల వలన కదా, నీ రెండు కన్నులు ఐన సూర్య చంద్రులవలన కదా, పగలు రాత్రి ఏర్పడడం! భవంతికి  మొదటి స్తంభములాగా భువనములకు అన్నిటికీ నీవు ఆదిగా కలిగి, నిలబడడం వలన  కదా, చలించక పడిపోక ఈ భువనములు అన్నీ నిలబడడం! దశావతార స్తుతి!

ముదమున సోమకాసురుడు మ్రుచ్చిలి యచ్చలమారఁగొన్న ప్రాఁ 
జదువులు తెచ్చి, తజ్జఠర సాంద్రత రాంత్రము నంటు బల్ 
గదరు దొలంగఁ గీర్తియను గంగఁ దొలంచి, విధాతృ విస్ఫుర 
ద్వదనసరోజ గంధలలితంబులు చేసితిగా జగన్నిధీ!                    (చం)

సోమకాసురుడు మదముతో మోసముతో దొంగిలించిన తొలిచదువులను, వేదములను  ముదముతో వాడిని సంహరించి తెచ్చి, వాడి కడుపులోని ప్రేగుల కంపును పూసుకున్న  ఆ వేదములను నీ కీర్తి అనే గంగలో శుభ్రముగా తొలిచి, కడిగావుగదా స్వామీ! ఆ వేదములను వికసించిన బ్రహ్మదేవుని ముఖములు అనే పద్మముల గంధమును కల్గిన వాటిగా చేశావుకదా, బ్రహ్మదేవుని ముఖమునుండి వేదముల వాక్కులు వెలువడేట్లు  చేశావుకదా స్వామీ మత్స్యావతారములో!

కోపన శాపనవ్యశిఖి గోల్మసఁగన్ గసుగంది, మ్రంది త
త్తాపము నాఁపలేక తిమిధామ జలభ్రమిఁ గూలి తూలు జం
భాపహ రాజ్యలక్ష్మి వెరవారఁగఁ దేల్పవె! యీఁతకాయరూ
పై పృథుకర్పరంబమర నాశ్రిత రక్షణదక్షణేక్షణా!                  (ఉ)

కోపనుడు, కోపస్వభావి యైన దుర్వాసుని శాపముచేత తపించి, నశించి సముద్రములో  కలిసిన దేవేంద్రుని స్వర్గరాజ్యలక్ష్మిని భయమునుడిపి తేల్చినది, ఆ రాజ్యలక్ష్మిని  నిలబెట్టినది నీవేకదా స్వామీ! యీతకాయ లాంటి తాబేలువై, నీ డిప్పమీద మంధర 
పర్వతాన్ని నిలిపి, అమృతము లభించేట్లు చేసి, దేవతలకు విజయాన్ని ప్రసాదించి, దేవేంద్రుడిని, స్వర్గలక్ష్మిని కరుణించి నిలిపినది నీవేకదా స్వామీ, కూర్మావతారములో!

ఆపెనువెల్లిఁ ద్రెళ్లు మకరాకరమేఖల నీవుదేర్చి, య
ష్టాపదటంక విభ్రమవిడంబినియౌ నిజ దంష్ట్రఁ గూర్పఁ ద
ద్రూపము దీపితంబగు సరోరుహలోచన! సప్తజిహ్వ జి
హ్వోపరిభాగ ధూమవలయోపమమై విలయోపలబ్ధులన్!       (ఉ)

మకరాలయము, సముద్రము అనే మొలనూలు కలిగిన భూదేవి ఆ మహాసముద్రములో  సంకటములో ఉన్న భూదేవిని బంగారపు కత్తిపిడి లాంటి నీ కోరచేత పైకెత్తి నిలిపినది నీవేకదా స్వామీ! ఏడు నాలుకల అగ్నిదేవుని జ్వాలలపై సుడులు తిరిగే పొగవంటి 
రూపముతో ఆ భూమి మెరిసేట్లుగా చేసిన పద్మాక్షుడవు, హిరణ్యాక్షుడిని సంహరించిన  వరాహమూర్తివి నీవేకదా స్వామీ! అని శ్రీహరి దశావతార ప్రస్తుతి చేస్తున్నాడు పుండరీకుడు. 

(కొనసాగింపు వచ్చేవారం)

**వనం వేంకట వరప్రసాదరావు 
మరిన్ని శీర్షికలు
negligence for 7 body pains