Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

శివద్రుమము (మారేడు) - హైమాశ్రీనివాస్.

maredu tree

శివద్రుమము -అనే మారేడు లేదా బిల్వము .

భూమాత మనకు ప్రీతితో అందించే వృక్షాలన్నీ ఎంతో ఉపయోగకరంగానూ, ఆరోగ్యపరిరక్షణకోసమూ  ఉంటున్నాయి .అందుకే 'వృక్షో రక్షతి రక్షితః 'అనే నానుడి వచ్చింది. భగవంతుడు మానవులపట్ల ఎంతో కృపతో హాయిగా జీవించను ఆరోగ్యంగా ఉండనూ కూడా అనేక రకాల పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కంద మూలాలు ,సుగంధద్రవ్యాలు ప్రకృతిద్వారా ప్రసాదించిన అపు రూప మైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర తృణధాన్యాలను ఆహారముగా తీసుకుని జీవించినట్లైతే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం. మనకు అనేక చెట్లరూపంలో ఆరోగ్యపరిరక్షణకోసం ప్రకృతిద్వారా సహజ ఔషధాలు లభ్యమవుతున్నాయి. వాటన్నింటినీ తెల్సుకుని ఉపయోగించుకుట్లైతే మనకు ప్రకృతిసిధ్ధమైన వైద్యం అందుతుంది. ఒకోచెట్టూ ఒక్కో ఓషధీ నిధి అని చెప్పుకోవచ్చు .

ఈ రోజు మారేడు చెట్టుగురించీ కాస్తంత చెప్పుకుందాం.

    త్రిదళం త్రిగుణాకారం - త్రినేత్రం చ త్రియాయుధం |
    త్రిజన్మపాపసంహారం - ఏకబిల్వం శివార్పణమ్| ---

అంటూ శివుని పూజించే అతిముఖ్యమైన పత్రం బిళ్వపత్రం.

శివుని పూజించను మారేడు దళం  ఒకటి చాలు.శివుడు భోళాశంకరుడు.ఆయనకు ఇష్టామైన ఒక్క బిళ్వపత్రంతో బికారులను కోటీ శ్వరులను చేయగల పూజ బిళ్వపత్రానికుంది.  అందుకే శివరాత్రి వచ్చిందంటే శివార్చన కోసం మారేడు దళాలను వెతు క్కుం టూ వెళతారు  హిందువులు . మారేడు వృక్షం చాలా పవిత్రమైనది. వేదకాలంనాటి దీనికి ప్రాధాన్యత ఉంది.దేవాలయాల్లో ముఖ్యంగా శివాలయాల్లో  ఇది ముఖ్యంగా కన్పిస్తుంది.  మూడు మారేడు ఆకులను కలిపి దళం అంటారు.ఇవి శివుని మూడు కళ్ళకూ ప్రతీ కలు. శివుడు ఈ మారేడు చెట్టు క్రింద నివాసం ఉంటాడని చెప్తారు.ఈ బిల్వపత్రి వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రపూజలో   రెండవది.
మారేడు 8 నుండి 10 మీటర్ల ఎత్తు వరకు పెరిగే వృక్షం. దీని ఆకులు సుగంధ భరితంగా ఏదో దివ్యానుభూతిని కలుగజేస్తూ ఉంటా యి. దీని పువ్వులు ఆకుపచ్చ రంగుతో కూడిన తెలుపు రంగులో ఉండి, కమ్మని వాసనని కలిగి ఉంటాయి. మారేడు కాయ లు గట్టిగా ఉంటాయి. విత్తనాలు చాలా ఉంటాయి. మారేడు గుజ్జు కూడా సువాసనకలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో దీని ప్రాధాన్యత చాలా ఉంది. ఇది అతిసార వ్యాధికి, మొలలకు, చక్కెర వ్యాధి రోగాల నివారణకు ఉపయోగపడుతుంది. 

మృత్యువంచనము, శాండిల్యము, శివద్రుమము అనేవీంకాచాలానే ఉన్నాయి. తెలుఁగులో బిల్వమనీ,తమిళం లో నిల్వమరమ్‌ అనీ కన్నడం లో బిల్వద మర - అనీ , సంస్కృతంలో దీన్ని "బిల్వ్"-అనీ-హిందీలో "బేల్"అనీ, ఉర్దూలో  "బేల్" లేదా "సీర్ ఫల్" అని-కబీట్" అనీ ,మరాఠీ భాషలో "బేల్" లేదా "కవీట్" అనీ పిలుస్తారు   శివపురాణంలో బిల్వపత్రం మహత్తు చెప్పె కథ ఒకటి ఇలా ఉంది.  శివుని దర్శినార్ధమై ఒకరోజున శనిదేవుడు  కైలాసానికి వచ్చాట్ట.  పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని  భక్తితో స్తుతించాడుట. శివుడు శనిదేవుడు తన పనిని ఎలా సక్రమంగా చేస్తున్నాడో పరీక్షిం చాలని  "అరుణాత్మజా! నీవు నన్ను కూడా పట్టి పీడించగలవా? "అని ప్రశ్నించాడుట. అందుకు నీలాంబరుడు " మహాదేవా? నేను ఎవ్వరినైనా సరే పట్టగలను, కావాలంటే మిమ్ము  రేపటి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకూ  పట్టి ఉంచగలనను" అని చెప్పాడుట. అప్పుడు శివుడు ఇతడు నన్నెలా పట్టగలడో చూద్దామని మరునాటి ఉదయా నికే బిల్వవృక్షం రూపందాల్చి దానిలో దాగిఉండిపోయాడు. మహేశ్వరుని జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలంతా ముల్లోకాల్లోనూ వెతికారుట! ఎవ్వరికీ శివుని జాడగానీ, శనిదేవుని జాడగానీ తెలియలేదు. ఆనాటి సూర్యాస్తమయం తర్వాత మహేశ్వరుడు బిల్వ వృక్షము నుండి తన స్వ స్వ రూపంతో వచ్చాడుట. మరుక్షణమే శనిదేవుడు అక్కడికి వచ్చాడుట. శివుడు"సూర్యపుత్రా! నన్ను పట్టుకోలేక పోయావు కదా!?" అనగా మందుడు ,ఈశ్వరునికి నమస్కరించి "స్వామీ!మన్నించండి!నేను పట్టడం చేతనే లోకారాధ్యులైన  తమరు ఈ బిల్వ వృక్ష రూపంలో  రోజంతా ఉన్నారు.సర్వదేవతలూ పూజిస్తుండగా కైలాసంలో నివసించే మీరు ఇలా భూలోకంలో అడవిలో దాక్కోడం నాప్రభావమే ప్రభూ!" అన్నాట్ట. ఛాయాసుతుని విధి నిర్వహణకు,  భక్తి ప్రపత్తులకు మెచ్చిన శివుడు "ఈశ్వరుడినైన నన్నే కొద్ది కాలము పట్టి యుండుటచేత నేటినుండి నీవు నాపేరుకలిపీశనీశ్వరుడు' అను పేరుతో పిలువబడతావు ." అనివరం ఇచ్చాట్ట. అప్పటి నుండీ శని దోషమున్న వారు,  ఆ దోషపరిహారార్ధమై  ఈశ్వరుని బిల్వ పత్రాలలో పూజిస్తే శని దోష నివృత్తి జరుగుతుంది. 'బిల్వ పత్ర పూజ చేత శివభక్తులైన వారిని ఈ శనీశ్వరుడు బాధించడు. అని కైలాసవసుడు అభయమిచ్చట్ట. 

లక్ష్మీదేవి తపస్సు వలన బిల్వవృక్షము పుట్టిందిట. అందుకే ఆమతను 'బిల్వనిలయా' అని పిలుస్తారు.  బ్రహ్మ వర్చస్సు పొంద డానికి, సూర్యుని మెప్పుకోసం చేసే కామ్య యాగంలో బిల్వకొయ్యను యూప స్తంభముగా నాటుతారు. అశ్వమేధ యాగములో ఇలాంటి బిల్వయూపములను ఆరింటిని ప్రతిష్టిస్తారు.

మారేడు దళాన్ని సోమ, మంగళ వారాల్లోనూ, ఆరుద్రానక్షత్రమ్రోజునా, సంధ్యాసమయాన, రాత్రి పూటా, శివరాత్రి రోజున, సంక్రాంతి రోజున, పండుగరోజుల్లోనూ కోయకూడదు. ఈ దళాలను ముందు రోజు కోసి, భద్రపరచి మరునాడు పరమశివుని పూజిస్తాం. మారేడుదళము గాలిలోని, నీటిలోని దోషము లను శుధ్ధిచేస్తుంది.

ఈ బిళ్వపత్రాలలోని   ఔషధ గుణాలు ఇలా ఉన్నాయి.మినరల్స్, విటమిన్స్,  కాల్షియం , పాస్పరస్ , ఇనుము , కెరోటిన్, బి-విటమిన్, సి-విటమిన్ ఉన్నాయి.మారేడు ఆకులలో, పళ్లలో చాలా ఔషధ గుణాలున్నాయి.బిల్వ వృక్షములో ప్రతి భాగము మానవాళికి మేలు చేసేదే.   

అతిసార వ్యాధికి దీని పండ్ల రసం చాలా మంచి మందుగా పనిచేస్తుంది.. మొలలకు ఇది మంచి ఔషధం. దీని ఆకుల రసం చక్కెర వ్యాధి నివారణకు చాలా బాగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో దీని వేరు వాడుతారు.బిల్వ ఆకులు జ్వరాన్ని తగ్గిస్తాయి, బిల్వ ఆకుల కషాయము తీసి అవసరము మేరకు కొంచం తేనె చుక్కలు కలిపి తాగితే జ్వరము తగ్గుతుంది . కడుపు లోను, పేగుల లోని పుండ్లు తగ్గించే శక్తి బిల్వ ఆకులకు, ఫలాలకు ఉన్నది,  బిల్వ ఆకులకు, ఫలాలకు మలేరి యాను తగ్గించే గుణం ఉంది, బిల్వ ఫలం నుండి రసం తీసి దానికి కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే రక్తసంబంధవ్యాధులకుంపనిచేస్తుంది. బిల్వ వేరు, బెరడు, ఆకులను ముద్దగా నూరి గాయాల మీద పూస్తే త్వరగా మానుతాయి.

క్రిమి, కీటకాల విషానికి విరుగుడుగా ఇది పనిచేస్తుంది . మారేడు పండ్ల వాసన చాలా బాగా ఉంటుంది. దీనిని శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణం ఉంది. సగం పండిన పండు జీర్ణ శక్తిని పెంచుతుంది. బాగా పండిన పండులోని గుజ్జు రోజూ తింటే చాలాకాలంగా బాధించే మలబద్ధ సమస్య నివారణ అవుతుంది. మారేడు గుజ్జుని పాలు, పంచదారతో కలిపి తీసుకుంటే వేసవి పానీయంగా కూడా బావుంటుంది.
ప్రేవులను శుభ్రపరచడమే కాకుండా, వాటిని శక్తివంతంగా కూడా తయారుచేస్తుంది. మారేడులో ఉన్న విచిత్రం ఏమిటంటే బాగా పండిన పండు విరేచనకారిగా ఉపయోగపడితే, సగంపండిన పండు విరేచనాలు ఆగటానికి ఉపయోగపడుతుంది.

మారేడు ఆకుల కషాయాన్ని కాచుకుని తాగితే హైపవర్ ఎసిడిటీ లాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. మారేడు ఆకుల కషాయాన్ని నువ్వుల నూనెతో కలిపి కాచి, దానిని తలస్నానానికి ముందుగా రాసుకుంటే తలస్నానం చేసిన తర్వాత జలుబు, తుమ్ములు వచ్చేవారికి బాగా ఉపయోగపడుతుంది. మారేడు ఆకులకు వూబకాయాన్ని తగ్గించే గుణముంది. మొహాలీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. కమలేశ్ కె. భుటానీ నేతృత్వంలోని పరిశోధకులు మారేడు ఆకుల్లోని అంబెలీఫెరోన్, ఎస్క్యూలెటిన్ అనే రసాయనాలు వూబకాయాన్ని తగ్గిస్తున్నట్లు ఋజువుచేశారు.మారేడు ఆకుల్లోనే కాదు మారేడు పండ్లలోనూ ఈ రసాయనాలు ఉన్నాయని ఋజువైంది. 

మరిన్ని శీర్షికలు
navvandi navvinchandi