Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

nagalokayagam

గతసంచికలో నాగలోక యాగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి: http://www.gotelugu.com/issue195/564/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/
.........................................................................

(గతసంచిక తరువాయి)‘‘జనకా! వారిరువురి వెంట మేమును వెడుచున్నాము’’ అంది మణి మేఖల. ఆమెను ఉలూచీశ్వరి సమర్థించింది.

యుద్ధ వాతావరణము నెలకొని వున్న తరుణంలో ఇరువురినీ ధనుంజయుని వెంట పంపుట ఇటు నాగరాజు దంపతులకు, అటు బలి చక్రవర్తి దంపతులకూ ఇష్టము లేదు. నచ్చ చెప్పి వారించాలని చూసారు. చివరకు శుక్రా చార్యులు కల్పించుకొంటూ` ‘‘ఆ నలుగురి ప్రాణము ఒక్కటే. వారింపనేల? ఇక ఒకరిని విడిచి ఒకరు ఉండ లేరు. యుద్ధానంతర వేడుకలకు, వీరి వివాహమునకు ఎలాగూ మనమంతా రత్న గిరికి తరలి వెళ్ళ వలసిన వారమే గదా. అందరినీ ఆశీర్వదించి పంపించండి’’ అన్నాడు. ఆ విధంగా ఈ సమస్య కూడ పరిష్కారమైంది.

ముందుగా భూతం ఘృతాచి అశ్వాలు గరుడ, ఢాకినీలను తీసుకుని పుష్పకంలో ప్రవేశించింది. ధనుంజయుడు సఖియు మూవురితో కలిసి నాగ రాజు దంపతులు, బలి చక్రవర్తి దంపతులు, శుక్రాచార్యులకు మరో సారి ప్రణమిల్లి ఆశీస్సులు పొందాడు. అలాగే వెను తిరిగి నాగ లోక పెద్దలు వాసుకి, తక్షక, కర్కోటకాది పెద్దలందరికీ నమస్కరించి ఆశీస్సులు పొందాడు. శంఖు పుత్రి మధూలిక ఉలూచీశ్వరిని కౌగిలించుకుంది. భద్రా దేవిని, మణి మేఖలను కూడ కౌగిలించుకుని విడిచి కన్నీళ్ళతో అందరికీ వీడ్కోలు పలికింది.

ధనుంజయునితో సహా యువతులు మూవురూ పుష్పక విమానంలో ప్రవేశించారు. ధనుంజయుడు కనులు మూసుకుని పుష్పకానికి నమస్కరించి ఇంద్రుని, బలి చక్రవర్తుల వారిని తలచు కుని తమను త్వరగా రత్న గిరి కోటకు చేర్చమని అర్థించాడు.

అంతే`

చివ్వున గాల్లోకి లేచిన పుష్పక విమానం మెరుపు వేగంతో మబ్బుల మాటున అదృశ్యమైంది. ఆ విధంగా ధనుంజయ బృందాన్ని సాగనంపిన పిమ్మట నాగ రాజు దంపతులు, బలి చక్రవర్తి దంపతులు, శుక్రా చార్యుల వారి పరివారంతో కలిసి తమ నాగ లోకానికి బయలు దేరారు.

***************************

ఆకాశ మార్గంలో మబ్బుల పైన`

మెరుపు వేగంలో దూసుకు పోతోంది పుష్పక విమానం. అది నేల విడిచి గగనంలో ప్రయాణం ఆరంభించిన కొద్ది సేపటికే ఉన్నట్టుండి ధగధగాయమానంగా ప్రకాశిస్తూ అమ్మ వారు ప్రత్యక్షమైంది. అష్ట భుజాలు ప్రసన్న వదనంతో జగన్మోహనమగు సుందర రూపంతో కట్టెదుట సాక్షాత్కరించిన అమ్మవారిని గాంచి గంధర్వలోకాధి దేవత మోహినీ శక్తిగా గుర్తించి తన సఖియతో కలిసి అనేక విధాలుగా స్తుతిస్తూ భక్తితో సాష్టాంగ ప్రణామం చేసాడు ధనుంజయుడు.

‘‘ధనుంజయా! దురాశపరులు దుష్టులైన భక్తులు, మాంత్రికుల వలన మాకును ఇబ్బందులు తప్పవు. జడల మాంత్రికుని సంహరించి లోక కళ్యాణం నెరపినారు. ప్రసన్నురాలినైతి. కోరుకొనుము. ఏమి వరము కావలెనో అనుగ్రహించెద’’ అంది లోక మాత.

‘‘అమ్మా లోక రక్షకీ. అంబ గౌరీ పార్వతి జగన్మాత. గంధర్వ లోకాన మోహినీ శక్తిగా పూజలందుకొను ఆది శక్తివి. నాకంటూ ఏ వరముూ వద్దు జననీ. ఈ జరుగనున్న రణ రంగమున విజయము వరించునటు దీవించిన చాలును’’ అన్నాడు ముకుళిత హస్తాలతో ధనుంజయుడు.

‘‘విజయీభవ. నీ శౌర్య పరాక్రమాలు వినయ సంపత్తి అద్వితీయము. నీవు కోరకున్నను ఇవి మీకు అనుగ్రహించితి’’ అంటూ తన ఎనిమిది చేతుల్లోని ఆయుధాల్లో ఒక అక్షయ తూణీరము, ఒక శంఖమును ధనుంజయునికి ఒక దివ్య ఖడ్గాన్ని భద్రా దేవికి ప్రసాదించింది.

‘‘ఇవి మీ చెంత వున్నంతకాలం అపజయమన్నది మీ దరకి రాదు. దుందుభి యను ఈ శంఖ నాదము శత్రువుల భీతిల్ల జేయును. ఈ అక్షయ తూణీరము, ఈ అంబుల పొది నుండి ఎన్ని బాణములు ప్రయోగించినను నిండుగనే ఉండును. నీవు ప్రయోగించు ఒక్క బాణము నీవు తలవగనే అనేక బాణముగా పోయి ఏక కాలమున శత్రు సంహారము గావించును. బిడ్డా భద్రా దేవి. ఈ దివ్య ఖడ్గము నీ చెంతనున్నంత వరకు నీకును అపజయము కలుగదు. ఉలూచీశ్వరి, మణి మేఖల బిడ్డలారా. మీరెల్లరు కలకాలం యిలా సఖ్యతగానుండి ఎన లేని కీర్తి ప్రతిష్టలు, అష్టయిశ్వర్యములతో చిర కాలము రాజ్య పాలన చేయుదురు గాక. ఇక యుద్ధ రంగమున వీర విహారము చేయండి. మీ జయ కేతనమున వుండి రణ భూమిని వీక్షించెద. విజయీ భవ’’ అంటూ అందరినీ అశీర్వదించి అదృశ్యమైంది మాత మోహినీ శక్తి.

********************

రత్న గిరి కోట.

మహా మాత్యుడు వాసు దేవ నాయకుడు.

కోట బురుజు మీద ఒంటరిగా నిలబడి తీవ్రంగా ఆలోచిస్తూ నగర పరిసరాల్ని పరికిస్తున్నాడు. ఎన్నో యుద్ధాలు చూసిన వాడు. ఎన్నో యుద్ధ తంత్రాలు, వ్యూహాలు తెలిసిన వాడు. అయినా ఇంతటి క్లిష్ట పరిస్థితిని ఎన్నడూ ఎదుర్కో లేదు.

ఉదయం అర్ధ జాము గడిచిన వేళ.

తూర్పున మసక బారిన ఆకాశంలో సూర్యుడు నెత్తుటి వర్ణంలో ప్రకాశిస్తున్నాడు. రత్న గిరి మీద రాత్రి కమ్మిన మంచు పరదాలు కరిగి పోయి సుదూర ప్రాంతం వరకు స్పష్టంగా కన్పిస్తోంది.

తమ ఉప సైనాధ్యక్షుడు బాహ్లీకుడు తిరుగు బాటు చేసే అవకాశముందని సమీపంగా సూచనలు అందుతూనే వున్నాయి. కాని చివరి క్షణం వరకు ఆ ధూర్తుడు నక్క వినయాలు ప్రదర్శించి తమ అంచనాలకి అందనంతగా ప్రభు భక్తిని ప్రదర్శిస్తూ తప్పించు కున్నాడు. ముందే తెలిసుంటే పరిస్థితి చేయి దాటక ముందే ఆ ద్రోహిని పట్టి చెరలో ఉంచే వాళ్ళు.

తగిన ఆధారాలు లేకుండా ఎవరిని నిర్బంధించ డానికి మహా రాజు ధర్మ తేజుని శాసనాలు అంగీకరించవు. ఆపైన ఒక వేళ వదంతులు నిజమై బాహ్లీకుడు అంతకు తెగించి అంతర్యుద్ధానికే ఒడి కడితే సులువు గానే తిరుగు బాటును అణచి వేసి బాహ్లీకుని అంతం చేయొచ్చన్న నమ్మకంతో వున్నాడు ఇంత వరకూ. కాని ఆ నీఛుడు అధికార దాహంతో రత్న గిరికి తీరని ద్రోహం చేస్తూ గాంధార రాజు శతానీకునితో చేతులు కలుపుతాడని వూహించ లేదు. అసలు తిరుగు బాటుకు ధైర్యమే శతానీకుడిదని ఇప్పుడు అర్థమవుతోంది. ఇది అస్సలు వూహించని విషయం. ఇదే ఇప్పుడు మహా మాత్యుని తీవ్రంగా వేధిస్తున్న సమస్య.

గాంధారం నుండి కరూర దేశం సాయంతో రెండున్నర ఆక్షౌణీ సైన్యంతో ముప్ఫైవేల యుద్ధ నౌకల్లో శతానీకుడు సముద్ర మార్గంగా రత్న గిరి వైపు ప్రయాణిస్తున్నట్టు వేగులు సమాచారం పంపించారు. ఇప్పటికే తను ఎందుకైనా మంచిదని తీర రక్షణ కోసం వేయి యుద్ధ నౌకల్ని రత్నగిరి జలాల్లో మొహరించి ఉంచాడు. మరో వేయి నౌకల్ని సిద్ధం చేస్తున్నారు. అయినా ముప్ఫైవేల యుద్ధ నౌకల్ని రెండువేల నౌకలు నిలువరింప గలవా? అది హాస్యాస్పదము, ఆత్మ హత్యా స దృశ్యమును.

ఇటు చూస్తే తమ ప్రియతమ నాయకుడు ఆత్మీయుడు ప్రభువు ధర్మ తేజుడు మరో వారం దినములకు మించి బ్రతకడని ఈ లోపలే దివ్య నాగ మణి తే గలిగితేనే బ్రతికించుకో గలమని రాజ వైద్యులు తేల్చి చెప్పేసారు. అటు చూడ దివ్య నాగ మణి కోసం నగరం విడిచి వెళ్ళిన యువ రాజు ధనుంజయుడు ఇంత వరకు జాడ లేదు. ఈ వారం రోజుల్లో వస్తాడన్న నమ్మకమూ లేదు. ఈ క్లిష్ట సమయంలో ఆ మహా వీరుడుంటే పరిస్థితి వేరుగా వుండేది. ఇంత వరకు తిరిగి రాలేదంటే ఒకవేళ ధనుంజయుడు మరణించాడన్నది వదంతి కాదేమో. అది నిజమేనేమో యను శంక పీడిస్తూ భయం గొలుపుతోంది.

మహా రాణి కనకాంబిక దుఖ్ఖం వర్ణనాతీతం. మహా రాజు చూస్తే మరణ యాతనలో వున్నారు. భగవంతుడా... చీమ కైనా హాని తలపని ధర్మపరులు, దయా మూర్తులయిన మా రాజ దంపతులకే ఏలనీకష్టాలు. మూగ వేదనతో రోదిస్తోంది ఆ వృద్ధ అమాత్యుని హృదయం. చెమ్మ గిల్లిన కనులను ఉత్తరీయంతో తుడుచుకుని మనసు రాయి చేసుకున్నాడు. ఏది ఏమైనప్పటికీ ఆఖరి నెత్తుటి బొట్టు నేల రాలే వరకు రత్న గిరి రాజ్య లక్ష్మి కోసం ప్రభువు కోసం పోరాడక తప్పదు. వీర మరణాన్నయినా స్వాగతింపక తప్పదు.

దృష్టిని సముద్రజలాల మీదకు సారించాడు. దూరంగా తమ యుద్ధ నౌకలు బారులు తీరి గస్తీ తిరుగుతున్నాయి. ఇప్పటికే ఓడ రేవు మూసేయటం జరిగింది. వర్తక నౌకల్ని రేవు లోకి అనుమతించ కుండా వెనక్కి పంపేస్తున్నారు.

రత్న గిరి ప్రజలు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలీక లోలోన భయ పడుతూనే మౌనంగా దిన చర్యలు సాగిస్తున్నారు. రోజూ విన బడే కోలాహం సందడి ఇప్పుడు నగర వీధుల్లో కన్పించటం లేదు. నగర వాకిళ్ళు మూసేయటంతో నగరం లోకి రాక పోకలు నిలిచి పోయి ఎటు చూసినా సైనికుల సందడే కన్పిస్తోంది. చివరిగా తమ సైనిక శిబిరాల వైపు దృష్టి సారించాడు మహా మాత్యుడు.

నిన్న అకస్మాత్తుగా మొదలైన అంతర్యుద్ధంలో చాలా నష్టం జరిగింది. సైనిక శిబిరాలు చాలా వరకు ధ్వంసమయ్యాయి. సాయంత్రం యుద్ధ విరామ సమయానికి ప్రభు భక్తి పారాయణుగు సైనికులు అయిదు వేల మందికి పైగా వీర మరణం పొందారు. అనేక మంది గాయ పడి చికిత్స పొందుతున్నారు. అటు వైపు నష్టం ఎంతో ఖచ్చితంగా తెలీదు.

నిన్న మొన్నటి వరకు కలిసి వున్న సైనికులే యిలా రెండు వర్గాలుగా నరుక్కు చావటం ఎంతో వేదన కలిగిస్తున్నా అనివార్యం. అధికార కాంక్ష... భోగ లాలస... ధన వ్యామోహం... మనిషిని ఎంతటి నీచానికైనా దిగ జారుస్తాయి.

మొత్తం రత్న గిరి రెండు ఆక్షౌణీల పైగా సైన్యం నిలువునా చీలింది. దీని పర్యవసానం ఏమిటో వూహకి అందటం లేదు. యుద్ధ విరామం తర్వాత బాహ్లీకుడు తన పక్షం వహిస్తున్న సేనను తీసుకుని ఎగువన మైదాన ప్రాంతాలకు పోయి విడిది చేసాడు. తెల్ల వార గానే తిరిగి పోరు ఆరంభం కావాలి. అనుభవజ్ఞుడైన సర్వ సైన్యాధ్యక్షుడు అర్కుని మీద తనకు పూర్తి విశ్వాసం, నమ్మకం వున్నాయి. యుద్ధ వ్యూహాల్లో ఆరి తేరిన వాడు. తెల్ల వారి ఈ సమయానికే తిరిగి పోరు ఆరంభం కావాలి. కాని ఇంత వరకు రణభేరీలు మ్రోగటం లేదు. ఎవరో ఒకరు అటు నుంచి వస్తే గాని ఏం జరుగుతుందో తెలీదు.

శతానీకుడు రత్నగిరి జలాల్లో ప్రవేశించే లోపలే అవంతి నుండి బయలుదేరిన మాళవ యువ రాజు ఇంద్ర జిత్తు తన సేనలతో రత్న గిరి చేరుకో గలిగితే ముందీ అంతర్యుద్ధాన్ని ఓ కొలిక్కి తెచ్చి బాహ్లీకుని బంధింప వచ్చు. పిదప శతానీకుని సేనల్ని ఎదుర్కొవటం ఎలాగో వ్యూహ రచన చేయటానికి వీలవుతుంది.

తీవ్రమైన ఆలోచనల్లో మునిగివున్న మహా మాత్యుడు వాసు దేవ నాయకుడు ఎవరో కోట బురుజు పైకి వస్తున్న అలికిడి విని అటు చూసాడు.

సర్వ సైన్యాధ్యక్షుడు అర్కుడు ఎవరినో వెంట నిడుకొని చర చరా మెట్లెక్కి రావటం కన్పించింది. వెనకే అంగ రక్షకులు నలుగురు పది మంది సైనికులూ వస్తున్నారు.

చేతులు వెనక్కి మడుచు కుని బురుజు మధ్య భాగం లోకి వచ్చాడాయన. అర్కుని వెంట వస్తున్న వాడు ద్రోహి బాహ్లీకుని మనిషి. వాడ్ని చూడగానే ఆ విషయం అర్థమవుతోంది. బురుజు పైకి వస్తూనే అమాత్యునికి సైనిక వందనం చేసి నిలిచారంతా.

‘‘ఏమైనది? బాహ్లీకుడు రాయ బారం పంపించినాడా?’’ సూటిగా విషయాని కొస్తూ అడిగాడు మహామాత్యుడు.

‘‘అవును మహా మాత్యా. తక్షణం తన ఆధి పత్యాన్ని అంగీకరించి లొంగి పోయి రత్న గిరిని తన స్వాధీనం చేయ వలె నట. అటుల గాకున్న భారీ విధ్వంసం తప్పదని హెచ్చరిస్తున్నాడు. మనకు అవకాశం యిచ్చుచూ ఈ రాయ బారి వెనక్కు పోయి మన అభిప్రాయము తెలుపునంత వరకు యుద్ధ విరామం పాటిస్తూ తన సేనల్ని హద్దులో ఉంచుతాడట. మన సేనల్ని కూడ అంత వరకు నిలువరించమని అడుగుతున్నాడు.’’ అంటూ విషయం వివరించాడు అర్కుడు.

వెంటనే సమాధానం చెప్పకుండా కాసేపు మౌనంగా పచార్లు చేస్తుండి పోయాడు మహా మాత్యుడు. ఇలా రాయబారం పంపించుటలో బాహ్లీకుని ధైర్యం వెనక శతానీకుని అండ జూచుకునే అని తేటతెల్లమవుతోంది. గాలి వాటు అనుకూలంగా లేనందున శతానీకుడు తన సేనతో రేపు ఉదయానికి గాని రత్న గిరి చేరుకో లేడు. ఇప్పుడే తాడో పేడో తేల్చుకోవటం బాహ్లీకుడికి ఇష్టం లేదు.
 ఈ ఉత్కంఠ వచ్చేవారందాకా....

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atadu-aame-oka rahasyam