Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nagalokayagam

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు-ఆమె-ఒక రహస్యం

గత సంచికలోని అతడు-ఆమె-ఒక రహస్యం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి
http://www.gotelugu.com/issue195/565/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/


(గత సంచిక తరువాయి)  “అయాం సారీ అండీ... పెద్ద రాజా వారు ఈ గదిలో ఉన్నారని నౌకరు చెబితే, వచ్చాను. అయాం రియల్లీ  వెరీ వెరీ సారీ” కనీసం తలుపు మీద నాక్ కూడా చెయ్యకుండా లోపలకి వచ్చిన తన తెలివి తక్కువ తనానికి నొచ్చుకుంటూ అన్నాడు పాణి. 

విశాలమైన ఆమె కళ్ళు అనుకోని సంఘటన వల్ల పొందిన ఆశ్చర్యం వల్ల మరింత పెద్దవయ్యాయి. “ఇట్సాల్ రైట్...పెద్ద రాజా వారు పక్క గదిలో ఉన్నారు” అంది అతడి వైపు సీరియెస్ గా చూస్తూ. 

“థాంక్యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. నేను పక్క గదిలోకి వెడతాను. వన్స్ ఎగైన్ అయాం వెరీ సారీ.  బైదిబై, నా పేరు పాణి.  చని పోయిన రాజేంద్ర స్నేహితుడ్ని ముంబైలో  ప్రైవేట్ డిటెక్టివ్ ఏజన్సీ రన్ చేస్తున్నాను”

అతడు తనని పరిచయం చేసుకోవడంతో ఆమెకి కూడా తనని తాను పరిచయం చేసుకోక తప్పలేదు. “నా పేరు ఇంద్రనీల. రాజేంద్ర  కేసుని పరిశోధించడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ని” అలా అంటుంటే తన మాటలు తనకే ఎంబరాసింగా అనిపించాయామెకి. అతడు వస్తున్న నవ్వుని పెదవుల బిగిన ఆపుకుంటున్నాడన్న విషయం తెలుస్తోంది. 

చూడగానే ఆమెని  ఇనస్పెక్టర్ ఇంద్రనీలగా గుర్తించాడు పాణి. ఆమె ఫోటోనే రమణ తనకి వాట్సప్ లో పంపినది. ఫోటోలో కన్నా చాలా అందంగా ఉందామె. అపూర్వమైన తెలివి తేటలున్న సాహసవంతు రాలని అందరూ చెబుతున్న ఆమె పరిచయం కోసం అతడు ఎదురు చూస్తున్నాడు. ఇలా సెల్ఫీ తీసుకుంటూ పరిచయం అవుతుందని అతడు ఊహించ లేదు. 

“మీరేదో పనిలో ఉన్నట్టున్నారు. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. యూ ప్లీజ్ క్యారీ ఆన్”  బయటకి వెళ్ళి తలుపు దగ్గరగా వేస్తూ అన్నాడు పాణి.

ఇంద్ర నీల ముఖం కంద గడ్డలా మారింది అతడి మాటలకి. అతడు వెళ్ళిన రెండు నిమిషాలకి కానీ మామూలవ లేక పోయింది ఆమె.

***
“మా రాజేంద్ర బాబుకి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. విదేశాలతో పాటూ దేశంలోని అన్ని పర్యాటక ప్రదేశాలనీ చూసాడు. అతడు యాత్ర చేసే విధానం చాలా విశేషంగా ఉంటుంది.  కేవలం అక్కడి ప్రదేశాలని కళ్ళతో చుసి రావడం కాదు - ఆ ప్రాంతంలో నివసించే ప్రజలతో మమేకమై, అక్కడి జీవన విధానాన్ని పరిశీలించి, అనుభవించి రావాలి, అదే నిజమైన  యాత్ర అనేవాడు. అతడు అండమాన్ తరచుగా వెళ్తుండేవాడు. ఆ దీవుల లోని ప్రకృతి సౌందర్య మంటే అతడికి చాలా ఇష్టం” మనవడ్ని తల్చుకుంటూ అన్నాడు నరేంద్ర వర్మ పాణితో.

రాజేంద్ర అభిప్రాయాల గురించి తనకేమీ తెలియక పోయినా, ఆయన్ని నమ్మించాలి కనుక అవునన్నట్టుగా తల ఊపాడు పాణి.

“రాజేంద్ర గారి మనస్తత్వం తెలిసిన వాళ్ళెవ్వరూ ఆయన ఆత్మహత్య చేసుకున్నారంటే నమ్మరు. అసలు ఆయన హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు?” ఆయన తన గ్రిప్ లోకి  వచ్చాడన్న నమ్మకం వచ్చాక పాణి  అన్నాడు.

పాణి ఆ మాటలనగానే అప్పటి దాకా చిన్న పిల్లాడిలా మనవడి జ్ఞాపకాలని నెమరు వేసుకుంటున్న ఆయనకి మనవడు ఈ ప్రపంచంలో లేడన్న విషయం గుర్తొచ్చినట్టుగా, ముఖంలో దుఃఖపు నీడలు కనిపించాయి. మౌనంగా అయి పోయాడు. ఆ తరువాత మెల్లగా అన్నాడు.

“ఎవరెన్ని అనుకున్నా ప్రాప్తం అన్నది ఒకటుంటుంది. మకెంత వరకూ రాసి పెట్టి ఉందో అంత వరకే. నన్ను చూడు. కళ్ళ ముందే కళ కళ లాడే కొడుకు, కోడలినీ, కూతురునీ అల్లుడినీ కోల్పోయాను. ఆ దుఃఖాన్ని దిగ మింగుకుని ఇద్దరు మనవళ్ళనీ పెంచుకొచ్చి మనవళ్ళకి పెళ్ళిళ్ళు చేద్దామనుకుంటున్న సమయంలో ఇలా జరిగింది.  ఇన్ని బాధలని అనుభవించాలని రాసి పెట్టి ఉండబట్టే, డబ్భై యేళ్ళకి కూడా ఈ కట్టె ఇలాగే ఉంది. వాడు వెళ్ళి పోయాడు” 

“అసలు రాజేంద్రది ఆత్మహత్యేనంటారా? చని పోయిన విధానం కూడా విచిత్రంగా ఉంది. నిద్ర మాత్రలు మింగిన వారు మళ్ళీ కాళ్ళ మీదా చేతుల మీదా కత్తితో కోసుకోవడమెందుకు? ఇలా భయంకరమైన మరణం పొందడం విచిత్రంగా అనిపిస్తోంది. మీరేమంటారు?”

నరేంద్ర వర్మ భారంగా నిట్టూర్చాడు. “నా మనవడు అజాత శతృవు. అతడ్ని హత్య చెయ్యాల్సిన అవసరం ఎవరికుంటుంది?” ఎదురు ప్రశ్న వేస్తూ అన్నాడు.

పాణి కూడా అతడి ప్రశ్నకి సమాధానం చెప్పకుండా “మొత్తం మీ సిర్నాపల్లి సంస్థానం ఆస్థి విలువ ఎంత ఉంటుంది?” అన్నాడు.

పాణి ప్రశ్నకి కళ్ళు పెద్దవి చేసుకుని చూసాడు నరేంద్ర వర్మ.

“సిర్నా పల్లి సంస్థానానికున్న ఆస్థులన్నీ ఎప్పుడో కరిగి పోయాయి. మిగిలినదల్లా ఈ కోటా, కొన్ని భూములు మాత్రమే. మాకున్న గొప్ప ఆస్తల్లా ఈ చుట్టు పక్కల గ్రామాలలో ఉన్న పేరు, పలుకు బడి మాత్రమే. భూముల మీద వచ్చే ఆదాయంతో, మా వైభవానికి తగ్గట్టుగా ఏలోటూ లేకుండా జీవిస్తున్నాం. ఈ కోటకి మిగిలిన వారసులం నేనూ,  మా ఇంకో మనవడు సురేష్ వర్మ మాత్రమే. రాజేంద్రతో సహా మాలో ఎవరికీ సంస్థానం పేరు నిలపాలన్న కోరికే తప్ప ఆస్థుల మీద వ్యామోహం లేదు. ఉన్నంతలో ప్రజలకి ఏదైనా చెయ్యాలనుకుంటాం తప్ప మా కోసం ఏదీ కోరుకోము”

“అవును. రాజేంద్ర కూడా తరచుగా నాతో  ఈ మాట చెబుతుండేవారు”

“చిన్నప్పటి నుంచీ రాజేంద్రది చాలా సున్నిత స్వభావం. పైగా ఇంట్రావర్ట్. ఎవరితోనూ ఏ విషయాన్నీ పంచుకోడు. పంచుకుంటే బాధ తరుగుతుంది, సంతోషం పెరుగుతుందంటారు. ఆ స్వభావమే రాజేంద్రలో ఉండి ఉంటే, అతడి మనసులో ఉన్న బాధ చావుకు దారి తియ్యనిచ్చేది కాదు. అంత తీవ్రమైన సమస్యలు అతడికి ఏమీ లేవు. చని పోయే ముందు రోజు రాత్రి కూడా కనీసం ఏమీ చెప్ప లేదు నాతో”  బాధగా అన్నాడు నరేంద్ర వర్మ.

“ఇంట్రావర్టులే ఎక్కువగా రచయితలూ కవులూ అవుతారంటారు. రాజేంద్రలోని ఆ స్వభావమే అతడిని మంచి కవిని చేసిందనుకుంటా” అన్నాడు పాణి.

“అదే అతడి ప్రాణాన్ని కూడా తీసింది”  వైరాగ్యంగా అన్నాడు నరేంద్ర వర్మ.

కొద్ది సేపు ఇద్దరూ ఏమీ మాట్లాడుకో లేదు. పాణి ఆయనకి నమస్కరించి లేచి నిలబడ్డాడు.

“రాజేంద్ర గారు నన్ను సిర్నాపల్లి రమ్మని చాలా సార్లు ఆహ్వానించారు. తమ కోటలో రెండు రోజులు ఉండి, తనతో పాటూ ఈ గ్రామాలలో పర్యటించి ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్నీ, ప్రజల అమాయకత్వాన్నీ చూసి అనుభూతి చెందాలనీ,  ఇద్దరం కలిసి ఈ కోటలో  సాహిత్య చర్చలు చేయాలని ఆయన కోరిక. నేను కూడా ఎన్నో సార్లు ఇక్కడి ప్రయాణం పెట్టుకున్నాను కానీ, ఏదో కారణం వల్ల వాయిదా పడేది.  చివరికి ఇలా రావాల్సి వచ్చింది. మీరన్నట్టుగా ప్రాప్తం అన్నది ఒకటి ఉంటుంది. మనకింతే ప్రాప్తమని మనం అనుకోవాలి. మీరు ధైర్యంగా ఉండండి.  ఇంక నేను బయలు దేరుతాను”  అన్నాడు.

నరేంద్ర వర్మ పాణి దగ్గరగా వచ్చి అతడి రెండు చేతులూ పట్టుకుంటూ అన్నాడు “వేదాంతం మనిషికి దుఃఖాన్ని తట్టుకునే శక్తినివ్వ గలదేమో కానీ, దుఃఖాన్ని పోగొట్ట లేదు బాబూ. నీతో మాట్లాడుతుంటే, చని పోయిన మా మనవడు  బ్రతికొచ్చినట్టుగా అనిపిస్తోంది. ఈ రోజు రాజేంద్ర అంత్య క్రియలు జరుగుతాయి. ఎల్లుండి పెద్ద కర్మ. నువ్వేమీ అనుకోకపోతే, అప్పటి దాకా నువ్వు మాతో ఉండాలని ఈ రోజులూ మా కోటలో గడపాలని నా కోరిక”

ఆయన మాటలకి పాణి మనసు లోనే సంతోషించాడు. తను వెళ్ళి పోతానని చెబితే తప్పకుండా ఆ ముసలాయన రియాక్షన్ అలాగే ఉంటుందని అతడు ఊహించాడు. అందుకే అలా అన్నాడు. వేరే దారిలేక చీకట్లో బాణం వేసాడు కానీ,  తను వెళ్తానని చెప్పగానే ఆయన వెంటనే సరేనని తలూపితే ఏం చెయ్యాలా అని టెన్షన్ పడుతున్నాడు.

తన లాగే ఇంద్రనీల కూడా ఆ బంగళాలో ఉండాలని ఆరాట పడుతోందన్న సంగతి ఆ క్షణంలో పాణికి తెలియదు.

 

(ఇంద్రనీల అక్కడ ఉండడం పాణిని చిక్కుల్లోకి నెట్టిందా?  వచ్చేవారం...)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
meerajalagalada nee anati