Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు... ఆమె.. ఒక రహస్యం..

గత సంచికలోని అతడు-ఆమె-ఒక రహస్యం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి

http://www.gotelugu.com/issue196/567/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/

“నువ్వు ఈ కోటలో రెండు రోజులు గడపాలన్న నీ స్నేహితుడి ఆఖరి కోరిక కోసం, మా తృప్తి కోసం నీ  పనులని కొద్దిగా వాయిదా వేసుకుని, ఈ రెండు రోజులూ ఇక్కడ ఉండు బాబూ. పెద్దవాడ్ని. నా మాట కాదనకు” అన్నాడు రాజేంద్ర వర్మ బ్రతిమాలుతున్నట్టుగా.  సరిగ్గా  అదే సమయానికి సురేష్ వర్మ గది లోకి అడుగు పెట్టాడు. “వీరు  మన రాజేంద్ర స్నేహితులు. ముంబయి నుంచి వచ్చారు” అంటూ పాణిని అతడికి పరిచయం చెయ్య బోయాడు ఆయన.

“నేను వారిని కలిసే వచ్చాను” అన్నాడు పాణి.

“రాజేంద్రకి ముఖ్యమైన స్నేహితులు కదా, పెద్ద కర్మ వరకూ ఉండమని అంటుంటే, పనులున్నాయి వెళ్ళి పోతున్నాను అంటున్నారు. నువ్వైనా చెప్పు బాబూ” అన్నాడు నరేంద్ర సురేష్ సింగ్ తో.

“వారు ముంబైలో  పేరు పొందిన డిటెక్టివ్ తాతయ్యా” అన్నాడు సురేష్ వర్మ.

“డిటెక్టివ్ లైతే మాత్రం? డిటెక్టివ్ లకి స్నేహితులుండరా? స్నేహితుల పెద కర్మలకి వాళ్ళు హాజరు కాకూడదా?” కోపం తెచ్చుకుంటున్నట్టుగా  అన్నాడు నరేంద్ర వర్మ.

ఆ సమయంలో సురేష్ వర్మ హావ భావాలని పరిశీలించాలని కోరికగా ఉన్నా, బాగుండదని అతడి ముఖం లోకి చూడ లేదు పాణి.
“పాణి గారూ, మా తాత గారి కోరిక మన్నించి మీరు ఎల్లుండి దాకా ఉంటే బాగుంటుంది” అన్నాడు సురేష్ వర్మ. పాణి కొద్దిగా ఆలోచించినట్టుగా చేసి అన్నాడు “మీరింతగా అడుగుతుంటే ఎలా కాదన గలను? అయినా, నా చని పోయిన నా మిత్రుడి కోసం నేను చెయ్య గల ఆఖరి సహాయం ఇది. ఇది కూడా చెయ్యక పోతే నేనసలు  స్నేహితుడనిపించుకోను. తప్పకుండా ఉంటాను” అన్నాడు.

****

మధ్యాహ్నం నాలుగు గంటలకి ప్రారంభమయ్యాయి రాజేంద్ర అంత్యక్రియలు. కోట ఆవరణలో దక్షిణం వైపున ఉన్న ఖాళీ స్థలంలో, పూర్వీకుల సమాధుల పక్కనే, అతడ్ని సమాధి చెయ్యడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

వారి వంశాచారం ప్రకారం, శవ పేటికలో రాజేంద్రకి  ఇష్టమైన కవిత్వం పుస్తకాలని కొన్నింటిని ఉంచడం గమనించాడు పాణి.
జిల్లాలోని రాజకీయ ప్రముఖులు, వారి అనుచరులూ, చుట్టు పక్కల గ్రామాల నుంచి ఎడ-తెరిపి లేకుండా వచ్చిన జనం- వీళ్ళందరి మధ్యలో రాజేంద్ర స్నేహితులెవరో, అతడి గురించి తనకి సరైన సమాచారం ఇవ్వగల వ్యక్తులెవరో తెలుసు కోవడం కష్టంగా ఉంది పాణికి.
ఒక పక్క పురోహితులు మంత్రాలని చదువుతుంటే, మరో పక్కన జనం శోక సముద్రంలో మునిగి తేలుతుంటే, ఒక్కొక్కరినీ గమనిస్తూ తిరుగుతున్న పాణికి తన లాగే ఎవరితో కలవాలో, ఎవరితో మాట్లాడాలో తెలియనట్టుగా ఒక పక్కగా నిల్చున్న ఇంద్రనీల కనిపించింది.
ఆమె దగ్గరకి వెళ్ళి “హలో” అన్నాడు.

అతడ్ని చూడగానే ఆమెకి అప్రయత్నంగా ఉదయం జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి సిగ్గుగా అనిపించింది. అతడి  చూపులు తన ముఖం మీదే ఉన్నా ఎందుకో  తన గుండెల వంకే చూస్తున్నట్టనిపిస్తోంది. “హలో” అంది తన మనసులో కలుగుతున్న సంచలనాన్ని సాధ్యమైనంత వరకూ దాచుకోవడానికి ప్రయత్నిస్తూ.

“జరిగిన దానికి నేను చాలా బాధ పడుతున్నాను”  అన్నాడతడు ఆమె పక్కగా నిల్చుంటూ.

“అందులో మీ తప్పేం లేదండీ. తలుపు గడియ సరిగ్గా  వేసుకోక పోవడం నాదే తప్పు” అందామె.

అతడు ఆమె వంక ఆశ్చర్యంగా చూసాడు. “దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? నేను అంటున్నది రాజేంద్ర మరణం గురించి”  అన్నాడు.

ఒక్క సారిగా ఒంట్లోని రక్తమంతా చివ్వున ముఖంలోకి చిమ్మినట్టు ఎర్రగా అయింది ఆమె ముఖం. తన తెలివి తక్కువ తనానికి మనసులో తనని తానే తిట్టుకుంది. “నిజమే... ఇంత చిన్న వయసులో మరణించడం, అదీ ఇలాంటి బలవన్మరణం... నిజంగా బాధా కరం” అంది తడబడుతున్నట్టుగా. 

వస్తున్న నవ్వుని ఆపుకున్నాడు పాణి. “బైదిబై, నా పేరు పాణి. రాజేంద్ర స్నేహితుడ్ని. ముంబైలో డిటెక్టివ్ ఏజన్సీ నడుపుతున్నాను” అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు.

‘డిటెక్టివ్’ అనగానే కొద్దిగా ఆశ్చర్యంగా, మరికొద్దిగా ఆసక్తిగా చూసింది ఇంద్రనీల అతడి వంక. అతడు ఆమె పక్కనే నిలబడి దూరంగా జరుగుతున్న తంతుని గమనించ సాగాడు.

“మీకు రాజేంద్ర గారు ఎంత కాలం నుంచీ పరిచయం?” పాణిని పరిశీలనగా చూస్తూ అంది అమె.

తనని చూస్తున్నప్పుడు ఆమె కనుగుడ్లు కదులుతున్న తీరుని బట్టి చూస్తుంటే  ఆమె తన నుంచి ఏదో ఆశిస్తోందన్న విషయం పాణికి అర్ధమౌతోంది పాణికి. “ముంబై రాక ముందు నేను అండమాన్ లో ప్రాక్టీస్ చేసే వాడిని. రాజేంద్ర గారు తరచుగా అండమాన్ వచ్చేవారు. అక్కడ పరిచయం నాకు వారు”

“మీ స్నేహితుడు రాజేంద్ర గారు మంచి కవి అని విన్నాను. నిజమేనా?”

“అవును. వెన్నెల రాత్రులలో అండమాన్ సముద్ర తీరంలో నాకు ఆయన తన కవిత్వాన్ని చదివి వినిపించేవారు”  అప్రయత్నంగా అబద్దాన్ని కల్పించి చెబుతూ అన్నాడు.

“కవులకి ఉండే స్నేహితుల్లో ఎక్కువ మంది కవులే ఉంటారట. మీరు కూడా కవేనా?”   పాణి తడబడ్డాడు “లేదండీ. నాకు చదివి ఆస్వాదించడమే తప్ప రాయడం తెలియదు”

“నా దృష్టిలో కవిత్వం రాసే వాళ్ళకన్నా చదివి ఆస్వాదించ గలిగే వాళ్ళే ఎక్కువ భావుకులు” 

“థాంక్స్” అన్నాడు పాణి. అందమైన అమ్మాయి పొగడ్త ఎక్కడైనా ఆనందాన్నిస్తుంది, చివరికి స్మశానంలో కూడా అన్న విషయం మొదటి
సారిగా అర్ధమైంది పాణికి.

“రాజేంద్ర గారి కవిత్వం మీరు చదివారా?”

“లేదండీ. మా స్నేహితురాలు ఒకామె ఉంది. ఆమె కూడా కవిత్వం రాసి నాకు చూపిస్తూ ఉండేది. ఆమెకి రాజేంద్ర గారి కవిత్వం అంటే  చాలా అభిమానం. అలా తెలుసు”

“అయితే మీరు కూడా భావుకులే అన్నమాట!”

“అంటే?”

“మీ స్నేహితురాలి కవితలు చదివి ఆస్వాదించే వారు కదా?”

ఆమె చిన్నగా నవ్వింది.  ఆమెనలా చూస్తుంటే, ‘మీరు నవ్వుతున్నప్పుడు మీ  కళ్ళు కూడా కవిత్వం చెబుతున్నట్టుంటాయి’ అనాలనిపించింది పాణికి. కానీ,  అక్కడ జరుగుతున్న కార్యక్రమానికీ తమ సంభాషణకీ పొంతన కుదరడం లేదనిపించి ఆగిపోయాడు.

“మీ ఇన్వెస్టిగేషన్ ఎంత వరకూ వచ్చింది? రాజేంద్ర మరణం గురించి మీరేమనుకుంటున్నారు?” అన్నాడు మాట మారుస్తూ. 

“ఇన్వెస్టిగేషన్  ఇంకేం లేదండీ. దొరికిన ఆధారాలూ,  పోస్టుమార్టమ్ రిపోర్టూ అన్నీ ఆయనది ఆత్మహత్య అని ధృవీకరిస్తున్నాయి.  రాజమహల్లో కూడా ఎవరికీ ఆయన మరణం మీద  అనుమానం లేదు. తొందరలోనే కేసు క్లోజయి పోవచ్చు”

“అలాగా?  ఇక్కడ ఇంత మంది పోలీసులని, మిమ్మల్నీ చూసి ఇంకా ఏమైనా ఫరదర్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారేమో అనుకున్నాను”  అమాయకంగా అన్నాడు.

“అదేమీ లేదు.  ఫరదర్ గా ఇన్వెస్టిగేట్ చేసినా ఆయన మరణం మీద కొత్త విషయాలేమీ తెలియకపోవచ్చు.  అంత్యక్రియలు  జరిగే వరకూ గౌరవార్ధం  ఉండాలని ఉన్నామంతే”

అంతలో ఒక వ్యక్తి వచ్చి “పెద్ద రాజావారు మిమ్మల్ని పిలుస్తున్నారు” అన్నాడు.

“ఇప్పుడే వస్తాను” అని  ఇంద్రనీలకి చెప్పి అతడి వెంట వెళ్ళాడు పాణి.

శవ పేటికలో నుంచి బయటకి తీసిన రాజేంద్ర శవానికి పూల మాల వెయ్యడానికి పిలిచాడు నరేంద్ర వర్మ పాణిని.  ఆయన చెప్పినట్టుగా పూల మాల వేసి శవానికి నమస్కరించి వెనుదిరిగి వస్తుంటే ఒక వ్యక్తి పరుగులాంటి నడకతో పాణి వెనకాలే వచ్చి “అండమాన్ నుంచి  వచ్చిన సారు మీరేనా?” 

“అవును. నేనే.  నువ్వెవరు?” ఆశ్చర్యంగా అన్నాడు పాణి.  ఆ వ్యక్తి వయసు ఇరవై రెండేళ్ళుంటుందేమో. చుట్టు పక్కల పల్లెటూర్ల నుంచి వచ్చిన కుర్రాడని తెలిసిపోతోంది చూడగానే. 

“నా పేరు యాదగిరి అండీ.  సిర్నాపల్లి ఊర్లో ఉంటాను. బంగళాలో పని చేస్తుంటాను” అన్నాడతడు.

“బంగళాలో  పని చేస్తావా? ఇందాకా బంగళాలో కనిపించలేదే నువ్వు?”  అన్నాడు పాణి.

“నేను తోట పని చేస్తానండీ. బంగళా లోపలకి ఎప్పుడూ రాను. కానీ చిన్న రాజా వారు నాకు బాగా తెలుసు.  ఊళ్ళో చెరువు దగ్గరకి వచ్చినప్పుడల్లా నన్ను పిలిచి నాతో కబుర్లు చెప్పేవారు”  అన్నాడు.

“అది సరే,  నా గురించి నీకెవరు చెప్పారు?  నన్నెందుకు అడిగావు?” అన్నాడు పాణి.

“అండమాన్ నుంచి కూడా ఎవరో సారు వచ్చారని పని వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను సారూ.  రాజావారు అండమాన్ వెళ్ళినప్పుడు అక్కడి  విశేషాలన్నీ నాకు కళ్ళకి కట్టినట్టు వివరించి చెప్పారు.  నేనిప్పటి దాకా హైదరాబాద్ కూడా చూడలేదు. అసలు నిజామాబాద్ దాటి బయటికెళ్ళిందే లేదు. అలాంటిది నాకు అండమాన్ ని కళ్ళకి కట్టినట్టు చూపించారండి.  రాజా వారితో నేనే అండమాన్ వెళ్ళినట్టు అనిపించిందండీ నాకు. నా ఇష్టాన్ని చూసి రాజా వారు ‘ఈ సారి అండమాన్ వెళ్ళినప్పుడు మాతో పాటూ నిన్ను కూడా తీసుకెళతా లేరా’ అనే వారు సార్. చివరికి ఆయనే ఇలా వెళ్ళిపోయారు. అవన్నీ గుర్తొచ్చి అండమాన్ నుంచి వచ్చారంటే మిమ్మల్ని చూడాలనిపించింది”   కన్నీళ్ళని తుడుచుకుంటూ అన్నాడు యాదగిరి. 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
Nagaloka Yagam