Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

సెల్ఫీ ముద్దు..చెలగాటం వద్దు

selfee  muddu chelagatam vaddu

నిండా ఇరవయ్యేళ్ళు కూడా లేని ఓ యువకుడు ట్రైన్‌ మీదకెక్కాడు. దురదృష్టవశాత్తూ కరెంటు తీగలు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. మరో యువకుడు ప్రమాదవశాత్తూ డ్యామ్‌లో పడి మరణించాడు. ఇంకో సందర్భంలో ఓ యువకుడు పాము కాటుకి బలైపోయాడు. క్రూర మృగం ఓ యువతిని మెడ కొరికి చంపేసింది. అయితే ఇవేవీ ప్రమాదాలు కావు. వీటిని ఆత్మహత్యలనడం సబబేమో! ఆత్మహత్యలందు సెల్ఫీ ఆత్మహత్యలు వేరయా అని చెప్పుకోవాల్సిన సమయమొచ్చింది. ఎందుకంటే ఇవి సెల్ఫీ చావులు. అరచేతిలో ఇమిడిపోయే మొబైల్‌ ఫోన్‌, ప్రపంచాన్ని క్షణాల్లో మనముందుంచడమే కాదు, మృత్యువు నోట్లోకి మనల్ని నెట్టేస్తుంది. వంటింట్లో కత్తిని కూరగాయల కోసం వినియోగిస్తాం. అదే కత్తితో కడుపులో పొడుచుకోలేం కదా? కత్తి ఎంత ప్రమాదకరమైనదో, మొబైల్‌ పోన్‌ కూడా అంతే. కానీ కత్తిలా మొబైల్‌ఫోన్‌ అంత ప్రమాదకరంగా కన్పించదు. ఇదొక స్వీట్‌ అండ్‌ ఎట్రాక్టివ్‌ వెపన్‌. 

కుర్రాళ్ళకి ఇదొక ఫ్యాషన్‌ అయిపోయింది. వేగంగా వెళుతున్న రైలు, లోతుగా కన్పించే డ్యామ్‌, ప్రమాదకరంగా కన్పించే మృగాలు ఇవేవీ సెల్ఫీకి అనర్హం కాదు. వాటితో సెల్ఫీలు దిగడం ఓ పిచ్చ ట్రెండ్‌. ఆ పిచ్చిలో పడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకరమైన రీతిలో పెరిగిపోతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా యువత ఈ సెల్ఫీల పిచ్చితో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సెల్ఫీ పిచ్చిలో వారికి పొంచి ఉన్న ప్రమాదం కన్పించకపోవడం దురదృష్టకరం. 'సెల్ఫీ కొట్టు, సోషల్‌ మీడియాలో పెట్టు' అనే మాట నేటి యూత్‌లో బాగా విన్పిస్తుంటుంది. సోషల్‌ మీడియాలో ఫొటో పెట్టడానికైనాసరే, ప్రాణం ఉండాలన్న కనీస విజ్ఞత యువతలో కొరవడ్తోంది. 'నాకేంటి?' అనే నైజం యువతలో ఎక్కువ. ఎవరన్నా సెల్ఫీ ట్రెండ్‌ని పిచ్చి అని అభివర్ణిస్తే కస్సుమంటారు, బుసకొట్టే పాములతోనూ సెల్ఫీల కోసం ప్రయత్నించి ప్రాణాలు కోల్పోతారు. చిటికెలో ప్రాణం పోతుంది. కానీ, ఓ కుటుంబం ఎన్నేళ్ళ ఆవేదనను అనుభవించాలి? 

'ఇచ్చట సెల్ఫీలు నిషేధం' అనే బోర్డులు ఈ మధ్య కనిపిస్తున్నాయి. అయితే ఆ ప్రమాదంతో పరాచికాలడటం ఓ ఘనతలా ఫీలవుతోంది నేటి యువత. కానీ యువత ఆలోచనల్లో మార్పు రావాలి. తమ వెనకాల తమ కోసం తమ కుటుంబం ఉందన్న విషయాన్ని యువత తెలుసుకున్నప్పుడే ఇలాంటి వికృత పైత్యాల నుంచి బయటపడగలదు. రోడ్డు ప్రమాదాలను మించి ఈ సెల్ఫీ ప్రమాదాలు ప్రాణాల్ని తోడేస్తున్నా యువత ఆలోచనల్లో మార్పు రావడంలేదు. ఇది శోచనీయం, దురదృష్టకరం. 

మరిన్ని యువతరం
shivoham independent film