Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nagalokayagam

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు..ఆమె..ఒక రహస్యం

 

గత సంచికలోని అతడు-ఆమె-ఒక రహస్యం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి
http://www.gotelugu.com/issue197/569/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/


పాణి ఓదారుస్తున్నట్టుగా అతడి భుజమ్మీద చెయ్యి వేసి చెప్పాడు “నేనిప్పుడు అండమాన్లో ఉండడం లేదు. ముంబయిలో ఉంటున్నాను.  నీకు అండమాన్ చూడాలని ఉంటే చెప్పు. నేను ఏర్పాటు చేస్తాను”

“ఆయనే వెళ్ళిపోయాక నాకు ఇంకా ఆ కోరికే  పోయిందండీ. వస్తానండీ. ఆయన్ని పూడ్చడం నా కళ్ళతో నేను చూడలేను”  అంటూ కళ్ళు తుడుచుకుంటూ పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు. 

    అతడి మాటలూ చేష్టలూ విచిత్రంగా అనిపించాయి పాణికి. అతడి మాటల్ని మరోసారి నెమరు వేసుకుంటున్న  పాణికి ఏదో స్పార్క్ వెలిగినట్టనిపించింది. రాజేంద్ర అతడితో  ‘ఈసారి అండమాన్ వెళ్ళేటప్ప్పుడు మాతో పాటూ నిన్నూ తీసుకెళ్తారా’ అన్నాడని చెప్పాడు అతడు.  ‘మాతో పాటూ’ అన్నాడంటే, అండమాన్ రాజేంద్ర ఒంటరిగా వెళ్ళలేదన్నమాట...  అతడితో పాటూ అండమాన్ ఎవరు వెళ్లారు?  ఆ వివరాలు తెలుసుకోకుండా,  సురేష్ వర్మ  కానీ,  పెద్దరాజావారితో కానీ మాట్లాడేటప్పుడు తను నోటికేది వస్తే అదీ చెప్పడం ప్రమాదకరం...   

తను అండమాన్ వెళ్ళినప్పుడు జరిగిన విశేషాలన్నింటినీ రాజేంద్ర యాదగిరికి కళ్ళకి కట్టినట్టు చెప్పేవాడంటే, అతడ్ని అడిగితే ఆ సమాచారం  తెలిసే అవకాశం ఉంది.  అతడ్ని పిలుద్దామని ముందుకు చూస్తే  అక్కడున్న జనంలో అతడెక్కడ ఉన్నాడో కనపడలేదు.

“యాదగిరీ” అన్నాడు గట్టిగా.

ముందర ఉన్న నలుగురు మనుషులు వెనక్కి తలలు తిప్పి చూసారు అతడి పిలుపుకి.

“ఇక్కడ వీధికొక యాదగిరి ఉంటాడు. మీకు ఏ యాదగిరి కావాలి?”  పాణి పక్కనున్న వ్యక్తి నవ్వుతూ అన్నాడు.

“ఇప్పుడే నాతో మాట్లాడి వెళ్ళిన వ్యక్తి.  సిర్నాపల్లి గ్రామంలో ఉండే యాదగిరి” 

ఆ వ్యక్తి మళ్ళీ నవ్వాడు “ఇక్కడున్న వాళ్ళంతా సిర్నాపల్లిలో ఉండే వాళ్ళే” 

పాణి మరింకేం మాట్లాడలేదు.  అక్కడ ఉన్న జనంలో యాదగిరి ఎక్కడైనా కనపడతాడేమోనని చాలా సేపు వెదికాడు కానీ ప్రయోజనం లేకపోయింది.   ఒక పక్కగా వెళ్ళి అండమాన్ వెళ్ళినప్పుడు రాజేంద్రవర్మ బస చేసాడని  డి.ఎస్పీ ప్రసాద్ తనతో చెప్పిన హోటల్ నెంబర్‍కి ఫోన్ చేసాడు. చాలా రోజులు అక్కడ ఉండడం వల్ల అండమాన్లోని హోటళ్ళలో పని చేసేవాళ్ళందరూ పాణికి తెలిసున్న వాళ్ళే.

అటునుంచి ఫోన్ ఎత్తిన వ్యక్తికి  డేట్లు చెప్పి అన్నాడు పాణి “ఈ తేదీలలో  మీ హోటల్లో  నిజామాబాద్ నుంచి వచ్చిన రాజేంద్ర వర్మ అన్న వ్యక్తి బస చేసాడు.  అతడితో పాటూ  ఇంకెవరెవరు వచ్చారో కనుక్కుని చెప్పాలి.  అంతే కాదు, వాళ్ళకి టూరిస్ట్ గైడ్‍గా ఎవరు పని  చేసారో  ఆ గైడ్ పేరు, ఫోన్ నెంబరు కూడా నాకు కావాలి” 

“తప్పకుండా.  నేను కనుక్కుని నీకు వెంటనే చెబుతాను” అన్నాడు అవతలి వ్యక్తి.
****
అంత్యక్రియలు పూర్తయ్యేసరికి చీకటి పడిపోయింది.

“మా డి.ఎస్పీగారితో మాట్లాడి మీరు కోరినట్టుగానే ఇక్కడ ఏ గదినీ సీజ్ చెయ్యడం లేదు.  రాజేంద్ర గారి గదిలో సేకరించిన ముఖ్యమైన ఆధారాలని సేఫ్ కస్టడీలో ఉంచడానికి  మా ఫోరెన్సిక్ టీమ్ ఆల్రెడీ తీసుకుని వెళ్ళారు” 

“థాంక్సమ్మా.  నా చాదస్తంతో నిన్నేమైనా ఇబ్బంది పెట్టి ఉంటే మన్నించు” అన్నాడు  నరేంద్రవర్మ.

“అదేం లేదండీ.  మీ బాధని నేను అర్ధం చేసుకోగలను”  అంది ఇంద్రనీల.

“కేసు ఎప్పుడు క్లోజవుతుందమ్మా?” 

“పోస్టు మార్టమ్ రిపోర్టు వచ్చేసింది కదా? మిగినిలన  కాంప్లికేషన్స్ కూడా పెద్దగా ఏమీ లేవు.  తొందరలోనే  క్లోజ్ అయిపోవచ్చు.  బంగళాలోని మనుషులని రొటీన్ ఇంటరాగేషన్ కొంత చెయ్యాలి.  ఇవాళ మీరంతా అలసిపోయి ఉంటారు కదా?  రేపు గానీ ఎల్లుండి కానీ వస్తాను” 

“అయ్యో ఇప్పుడు వెడతావా? ఇప్పుడెలా బయలు దేరతావు? శవం లేచిన ఇంటినుంచి చీకటి పడ్డాక బయలుదేరకూడదు. నువ్వు కూడా ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోమ్మా”  

“మా పోలీసులకలాంటి సెంటి మెంట్లు ఉండవండీ” నవ్వింది ఇంద్రనీల.

”మేము కష్టంలో ఉన్నప్పుడు వచ్చి మా కష్టంలో పాలు పంచుకున్నావు.  నా కోరిక మన్నించి ఇన్వెస్టిగేషన్ అంతా  మేము ఇబ్బంది పడకుండా చేసావు.  నిన్ను చూస్తుంటే  పోలీసులా కాదమ్మా, నా మనవరాలిగా అనిపిస్తున్నావు.  నిన్నిలా పంపలేను. ఎలాగూ మిగిలిన ఇంటరాగేషన్ పన్లూ వగైరా పూర్తి చేసుకోవాలి కదా? రోజూ నిజామాబాద్ నుంచి ఏమి తిరుగుతావు?  ఈ రెండు రోజులూ మాతో పాటూ నువ్వు కూడా మా బంగళాలోనే ఉండు.  ఎల్లుండి పెద్ద  కర్మ అయిన తరువాత వెళ్ళిపోదువుగాని” 

ఇంద్రనీల మొహమాటపడుతున్నట్టుగా చూసింది.

“రాజమహల్లో అందరికీ అన్ని వసతులూ ఏర్పాటు చేసాను. మనవడి పెళ్ళి ఎలాగూ చెయ్యలేకపోయాను. కనీసం ఇదన్నా ఘనంగా  జరిపానన్న తృప్తి నాకు మిగలనివ్వండి”  గద్గదమైన కంఠంతో అభ్యర్ధించాడు నరేంద్రవర్మ.

ఇంక ఎక్కువగా బతిమాలించుకోకుండా ఒప్పేసుకుంది ఇంద్రనీల. “మీ మాటని కాదనలేను. మీరన్నట్టుగా  ఈ రెండు రోజులూ ఇక్కడే ఉండి పని పూర్తి చేసుకుని వెడతాను తాతగారూ” అంది.
 
 ఆమె ప్రవర్తనకి పాణికి ఆశ్చర్యం వేసింది. ఒక పక్కన అక్కడ పరిశోధించడానికి ఏమీ లేదంటూనే,  రాజమహల్లో ఉండడానికి అవకాశం వస్తే అంత వెంటనే ఎందుకు ఒప్పేసుకుంది?  రాజమహల్ మీద  ఏమిటామె  ఆసక్తి?!

 ‘ఒకరకంగా ఆమె అక్కడ ఉండడం తనకీ మంచింది. అందరితో పాటూ ఆమెని కూడా అబ్జర్వ్ చేసే అవకాశం దొరుకుతుంది’  అని సంతోషించాడు పాణి.  అయితే, ఆమె అక్కడ ఉండడం ముందు ముందు తనని వేరే రకంగా ఇబ్బందుల్లో పడేస్తుందని అతడికా  క్షణంలో తెలియదు!
****
 రాత్రి  ఎనిమిదిన్నరకి పాణికి అండమాన్ హోటల్ నుంచి ఫోన్ వచ్చింది.  “మీరు చెప్పిన రాజేంద్ర అన్న వ్యక్తి  మా హోటల్‍కి వచ్చినప్పుడు ప్రతిసారీ ఒంటరిగానే వచ్చేవారు.  ఆఖరి సారిగా నాలుగు నెలల క్రితం వచ్చారు.  అప్పుడు మాత్రం ఆయనతో పాటూ పాటూ ఒక  యువతి కూడా వచ్చింది సార్. వాళ్ళు ఈ సారి దాదాపు పదిహేను రోజుల పాటూ అండమాన్లో ఉన్నారు”   అన్నాడు అవతలి వ్యక్తి.

“ఆమె పేరు?” 

“ఆ అమ్మాయి పేరు రికార్డులో లేదు. బహుశా ఆయన భార్యో  ప్రియురాలో అయి ఉండాలి.  ఆయన్ని  వచ్చినప్పుడల్లా టూరిస్ట్ గైడ్ యోగేష్ ఎంగేజ్ చేసేవాడు.  క్రితం సారి కూడా వాళ్ళతో యోగేషే ఉన్నాడు. అతడికి పూర్తి వివరాలు తెలిసి ఉండ వచ్చు”

“యోగేష్ సెల్ నెంబర్ ఇవ్వు నాకు” అన్నాడు పాణి.

అతడు సెల్ నెంబరు ఇచ్చి చెప్పాడు “ప్రస్తుతం అతడు సిటీలో లేడు సర్. ఎవరో టూరిస్టులకి ఐలాండ్స్ చూపించడానికి వెళ్ళాడు. అక్కడ సెల్ ఫోన్లు పని చెయ్యవు.  రేపు మధ్యాహ్నానికి తిరిగి వస్తాడు. రాగానే మీ నెంబరు ఇచ్చి  ఫోన్ చెయ్యమని చెబుతాను” 

యోగేష్ నెంబర్ నోట్ చేసుకుని, అతడికి థాంక్స్ చెప్పి ఫోన్ పెట్టేసాడు పాణి.

రాజేంద్రతో పాటూ అండమాన్ వెళ్ళిన అమ్మాయి ఎవరు? అతడికి పెళ్ళి కాలేదని అందరికీ తెలుసు.  మరి  ఎవరైనా కాల్‍గర్ల్ ని తీసుకుని ఎంజాయ్ చెయ్యడానికి అండమాన్ వెళ్లాడా?   రాజేంద్ర గురించి పెద్దగా తెలియక పోయినా  ఎందుకో అలా అంటే నమ్మబుద్ది కావడం లేదు పాణికి

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్