Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

nagalokayagam

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

గతసంచికలో నాగలోక యాగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి http://www.gotelugu.com/issue197/570/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/

‘‘యువరాజా! పరిస్థితి విషమించినది. దివ్య నాగమణి లభించినదా. యిలా యివ్వండి.’’ అనడిగాడు రాజ వైద్యులలో వృద్ధుడు.

ధనుంజయుడు తన దుస్తుల నుంచి బంగారు పేటిక తీసి అందించబోతుంటే వెంటనే వారించింది భద్రా దేవి. వైద్యుని చూస్తూ` ‘‘మీరు ఘన వైద్యులు. అందులో సందేహం లేదు. కాని ఇంత వరకు మీరు దివ్య నాగ మణిని చూసి వుండరు. దాని శక్తిని మీరు తట్టుకో లేరు.’’ అంటూ ధనుంజయుని చేతుల నుంచి పేటికను అందుకుని ఉలూచీశ్వరికి అందించింది.

‘‘చెల్లీ... ఈ కార్యము నీవే నిర్వహించ వలె. కానిమ్ము’’ అంది.

రాజ వైద్యులు నిర్ఘాంత పోయారు.

‘‘అమ్మా! మీరెవరో మాకు తెలియదు. మేము చేయ లేని కార్యమును ఈ అమ్మడు చేయ గలదా?’’ అనడిగాడు వృద్ధ వైద్యుడు.

‘‘సందేహము వలదు. ఈ దివ్య నాగ మణికి ఈమెయే వారసురాలు.’’ అని బదులిచ్చింది భద్రా దేవి.

రాజ వైద్యులకు అర్థం కాలేదు.

అయినా మిన్నకుండి పోయారు.

ఉలూచీశ్వరి పేటికను దోసిట ఉంచుకుని అర్ధ నిమీలిత నేత్రాలతో భక్తితో ముందుగా తన తాత గారు నాటి నాగ రేడు పద్ముడిని స్మరించుకుంది. పిమ్మట తన జనకుడు మహా పద్ముని తలచుకుంది. పిమ్మట పేటిక మూతను తెరిచింది. అంతే`

ఒక్క సారిగా నివ్వెర పోయారంతా.

స్వయం ప్రకాశమగు దివ్య నీల మణి నీలి రంగు కాంతి పుంజాలతో రాజ మందిరమే తేజో వంతమై పోయింది. ఆ కాంతుల్ని చూడ లేక కొంత తడవు కనులు మూసుకున్నారంతా.

ఉలూచీశ్వరి ఆ నీలి కాంతులు పుట్టవ్రణానికి సోకేట్టు వాలుగా పట్టుకుని సమీపంలో నిల బడింది. దివ్య నాగ మణి కిరణాలు తాకగానే మొదట వ్రణం చుట్టూ వేసిన పైపూతలు లేపనాలు ఎండి గట్టి పడినవి కరిగి సుడి గాలికి లేచి పోయే ధూళిలా లేచి పోయి చర్మం శుభ్ర పడింది. చీము నెత్తురుతో కూడిన వ్రణం లోని ద్రవం ఇంకి పోనారంభించింది.

పిమ్మట దివ్య నాగ మణిని తీయకుండానే ఆ బంగారు పేటికను అలాగే వ్రణం మీద బోర్లించి గట్టిగా అదిమి పట్టుకుంది. ఎప్పుడైతే దివ్య నాగ మణి వ్రణాన్ని తాకిందో అంత వరకు స్పృహలో లేని మహా రాజు ధర్మ తేజుడు ఒక్క సారి బిగ్గరగా మూలిగి తిరిగి అచేతనుడయ్యాడు.

ఏం జరుగుతోందీ ఎవరికీ అర్థం గావటం లేదు. సంభ్రమంతో వీక్షిస్తున్నారంతా. ఎవరో లోపలి నుంచి తోసేస్తున్నట్టు స్వర్ణ పేటిక లేచి లేచి పడుతోంది. ఉలూచీశ్వరి బలంగా అదిమి పట్టి ఉంచుతోంది. బహుశ పుట్ట వ్రణం తాలూకు దోషం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందా అన్పిస్తోంది చూపరులకు.

క్షణాలు భారంగా దొర్లి పోతున్నాయి.

మహా రాజులో చలనం లేదు.

చీమ చిటుక్కుమన్నా విన్పించేంతగా`

రాజ మందిరంలో నిశ్శబ్ధం అలుముకునుంది.

ఊపిరి బిగ బట్టి ఉత్కంఠ భరితులై వీక్షిస్తున్నారంతా. పసిడి కాంతు లీను స్వర్ణ పేటిక క్రమంగా కాంతి హీనంగా మారి నల్లబడుతోంది. పాల కన్నా తెల్లని ఉలూచీశ్వరి చేతులు కూడ కమిలి వాడి పోతున్నట్టు నల్లగా మారి పోతున్నాయి. భద్రా దేవి ఆ దివ్య నాగ మణిని రాజ వైద్యులకు యివ్వకుండా ఎందుకు ఆపిందో అప్పటిగ్గాని ధనుంజయునికీ అర్థం కాలేదు.

స్వర్ణ పేటికతో బాటు తన చేతులూ నల్ల బడి పోయినా పేటికను విడువ లేదు ఉలూచీశ్వరి. అదిమి పట్టి అలాగే ఉంచింది. చాలా సేపటికి ఉన్నట్టుండి మార్పు మొదలయింది.

పాలి పోయిన ధర్మ తేజుని శరీరం తిరిగి కాంతి పుంజుకో నారంభించింది. నలుపు వర్ణం తరిగి పోతూ స్వర్ణ పేటిక తిరిగి పసిడి వర్ణం సంతరించుకుంది. నల్ల బారిన ఉలూచీశ్వరి కరము తిరిగి యథా పూర్వ స్థితికి మారాయి.

ఉత్కంఠ భరితులై వీక్షిస్తున్నారంతా...

మరి కొంత తడవు ఆగిన పిమ్మట...

స్వర్ణ పేటికను దివ్య నాగ మణితో సహా...

వెనక్కు తీసుకుంది ఉలూచీశ్వరి...

దివ్య కాంతులతో మెరిసి పోతోంది నాగ మణి. పేటికను ఎప్పటిలా మూసి వేసింది. అందరి కళ్ళు ఆసక్తిగా ప్రభువు వెన్ను భాగాన్ని చూస్తున్నాయి. ఆశ్చర్యం... అద్భుతం... విచిత్రం. వెన్ను మీద ఎక్కడా కనీసం పుట్ట వ్రణం తాలూకు చిన్న మచ్చ కూడ కన్పించ లేదు. దివ్య నాగ మణి ప్రభావం మొత్తం పుట్ట వ్రణాన్ని సమూలంగా హరించి ప్రభువును సంపూర్ణ ఆరోగ్య వంతుడ్ని చేసింది. కాని ఆయన ఇంకా స్పృహ లోకి రాలేదు.

ఉలూచీశ్వరి దివ్య నాగ మణి వున్న స్వర్ణ పేటికను అత్త గారు రాణి కనకాంబికకు అందించగా ఆమె దాన్ని పక్క మందిరంలో భద్ర పరిచి వచ్చింది. ఈ లోపల భద్రా దేవి రాజ వైద్యుల్ని చూసి` ‘‘మహా రాజు గారు స్పృహ లోకి వచ్చుటకు కొంత సమయమగును. లేవ గానే ఆకలికి తట్టుకో జాలరు. బల వర్ధకము, తేలికగా జీర్ణమగు ఆహారము ఏమి యివ్వ వచ్చునో నిర్ణయించి ఏర్పాటు చేయించండి’’ అంది.

యువ రాజు ధనుంజయుని మనసు ఇప్పుడు తేలిక పడింది.

****************

అదే రోజు మధ్యాహ్న వేళ

రత్న గిరి కోట నుండి బయలు దేరిన అశ్వికుడొకడు చెమటలు కక్కుతూ అశ్వాన్ని మైదాన ప్రాంతాల వైపు దౌడు తీయిస్తున్నాడు. రత్న గిరికి ఈశాన్యంగా పది యోజనాల దూరంలో అటవీ ప్రాంత సమీపంలో విస్తరించి ఉన్నాయా మైదానాలు. బాహ్లీకుని సేనలు ప్రస్తుతం ఆ మైదానాల్లోని శిబిరాల్లో విడిది చేసి వున్నాయి.

అశ్వికుడు శిబిరాల మధ్యగా చాలా దూరం ముందుకు పోయి అక్కడ ప్రత్యేకంగా నిర్మించిన పెద్ద అందమైన శిబిరం ముందు అశ్వం దిగాడు. అతడ్ని ఎవరూ అడ్డగించ లేదు.

రత్నగిరిలో బాహ్లీకుని అనుయాయులు ఇంకా వున్నారు. ఎప్పటికప్పుడు అక్కడి సమాచారం అంద జేస్తుంటారు. వారిలో ఈ అశ్వికుడొకడు. రాజ ప్రాసాద రక్షణ దళం లోని సైనికుడు. ఏదో వంకతో నగర వాకిళ్ళు దాటి రాగలిగాడు.

అశ్వం దిగుతూనే వడి వడిగా లోన ప్రవేశించాడు వాడు. ఆ సమయంలో బాహ్లీకుడు కొందరు సేనాపతులతో యుద్ధంలో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చిస్తున్నాడు. లోనకొచ్చిన అశ్వికుని చూడగానే చిరు నవ్వుతో` ‘‘రా ఉత్కళా... రత్నగిరి సమాచార మేమి? మా రాయబారము అచట సంచలనమైనదా?’’ అనడిగాడు.

‘‘సంచలనము కాదు నాయకా! సంక్షోభమయ్యేట్టున్నది. విషయము మీకు తెలిసినదో లేదో యని ఇటు వచ్చితి’’ అన్నాడు ఉత్కళుడనే ఆ సైనికుడు.

‘‘ఏ విషయము గూర్చి అడుగుచున్నావు?’’

‘‘ఏకాంతము కావలె.’’

బాహ్లీకుడు సైగ చేయగానే`

సేనాపతులు శిబిరం నుండి నిష్క్రమించారు.

‘‘ఇప్పుడు చెప్పుము ఉత్కళా. ఏమి జరిగినది?’’ అడిగాడు.

‘‘యువ రాజు ధనుంజయుడు కోటకు తిరిగి వచ్చిన సంగతి మీకు తెలియునా?’’ అడిగాడు ఉత్కళుడు.

ఆ ప్రశ్న ఒక్క సారిగా బాహ్లీకుని ఉలికి పడేలా చేసింది. పాదాల కింద భూమి కొన్ని లిప్తల కాలం పాటు చలించినట్టనిపించింది. నమ్మ లేనట్టు చూసాడు. ఇంత కాలం తిరిగి రాని వాడు ఈ సమయంలో వచ్చుట ఏమి? అతడి రాక తనకు ఇబ్బంది కరమే కాదు అత్యంత ప్రమాద కరము.

‘‘ఏమంటివి? యువ రాజు వచ్చినాడా?’’ ఎలాగో నోరు పెకల్చి అడిగాడు.

‘‘అవును. దివ్య నాగ మణితో బాటు అప్సరస వంటి ముగ్గురు కన్యలతో పుష్పక విమానంలో వచ్చి దిగినాడు. దివ్య నాగ మణి ప్రభావంతో మహా రాజు ధర్మ తేజుడు సంపూర్ణ ఆరోగ్య వంతుడైనాడు. కోటలో పండుగ వాతావరణం నెలకొని వున్నది. రాజ కుటుంబమంతా విందు భోజనాలారగిస్తుండగా ఆ సమాచారంతో నేనిటు వచ్చితి’’ అంటూ ఉత్కళుడు వివరిస్తుంటే బాహ్లీకుని ముఖం కళా విహీనమై పోయింది.

‘‘నేను పంపించిన రాయ బారం గూర్చి ప్రస్తావన రాలేదా?’’ అడిగాడు.

‘‘ఇంత వరకు ఈ విషయం తెలిసి ఉండదనుకుంటాను. మహా వీరుడయిన యువ రాజు గాని, మహా రాజు ధర్మ తేజుడు గాని రాజ్యాన్ని వదులుకోడానికి సిద్ధంగా ఉండరు. సందేహము లేదు. యుద్ధం తప్పదు. ఈ దినము యుద్ధ విరామము ప్రకటించ కుండా ఉండాల్సింది.’’

తల పంకించాడు బాహ్లీకుడు.

‘‘నీ పలుకులు సత్యములే. కాని యిక్కడ ఇరు వైపులా బలగాలు సమంగా వున్నవి. అటు చూడ ఒక ఆక్షౌణీ మాళవ సేను రత్న గిరికి మద్దతుగా తరలి వస్తున్నట్టు వార్తలు వింటున్నాము. ఈ సమయంలో మనకు అదనపు బలం అవశ్యం. గాంధారం నుండి మారు వేషాలతో రాజ్యాలు దాటి వచ్చిన అశ్విక దళం పాతిక వేల ఉత్తర సరిహద్దులో వేచి వుంది. అది మూడు దినముల క్రితమే బయలు దేరింది. అది రేపటికి వచ్చి చేరుతుంది.. అటు శతానీకుని నౌకలు కూడ రేపటికి గాని రత్నగిరి చేరుకో లేవు. చూచెదము గాక! రత్నగిరి, మాళవ సేను కలిపి రెండు ఆక్షౌణీ సైన్యం. శతానీకుని రాకతో మనది మూడున్నర ఆక్షౌణీ సైన్యం. మన ముందు నిలువ లేక రత్నగిరి దాసోహమనక తప్పదు. అందుకే ఈ యుద్ధ విరామం ఈ దినమున అనివార్యమైనది.’’ అంటూ వివరించాడు బాహ్లీకుడు.

‘‘నిజమే. కాని ధర్మ తేజుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడగుట, యువరాజు తిరిగి వచ్చుట ఈ పరిణామం మన సైనికులకు తెలిసిన కొంత సేన వెనక్కు పోవు ప్రమాదమున్నది...’’

‘‘తెలియదు. నేనా ఏర్పాటు చూసెదను. రేపు ఉదయం తిరిగి యుద్ధ భేరీలు మ్రోగనున్నవి. నీవు కోటకు మరలి పోదువా? ఉండి పోదువా?’’ అడిగాడు బాహ్లీకుడు.

‘‘యుద్ధానంతరము మీరు విజయ లక్ష్మితో రత్న గిరిలో ప్రవేశించునపుడు ఘనంగా స్వాగత సత్కారాలు ఏర్పాటుకు నేను అచట ఉండుట అవసరము. పోయి వత్తును’’ అంటూ వచ్చిన వాడు వచ్చినటులే తిరిగి అశ్వాన్నధిరోహించి రత్న గిరికి సాగి పోయాడు ఉత్కళుడు.

********************

రత్న గిరి కోట పైన అదే బురుజులో`

యువ రాజు ధనుంజయుడు, మహా మాత్యుడు వాసు దేవ నాయకుడు, సర్వ సైన్యాధ్యక్షుడు అర్కులతో ఏకాంతంగా సమావేశమై వున్నాడు. మిట్ట మధ్యాహ్న సమయం. తను నగరంలో లేని సమయంలో జరిగిన పరిణామాలు ప్రస్తుత రాజకీయ పరిస్థితి నిన్నటి యుద్ధ విశేషాలు పూస గుచ్చినట్టు వివరిస్తుంటే శ్రద్ధగా విన్నాడు ధనుంజయుడు. బాహ్లీకుని రాయబార సమాచారం విన్నా కొంచెం కూడ ఆవేశం ప్రదర్శించ లేదు.

చాలా ఎత్తులో వున్న కోట బురుజు నుండి అటు పశ్చిమ సముద్రాన్ని ఇటు నగర పరిసరాలు సుదూరం వరకు స్పష్టంగా చూడ గలుగుతున్నారు. రాత్రికి తమ యుద్ధ వ్యూహం గురించి ఎత్తు గడ గురించి కూడ ఇరువురూ యువ రాజుకి వివరించి చెప్పారు.

చాలా కాలం తర్వాత తన మాతా పితలతో బాటు సఖియలు  ముగ్గురితో విందు భోజనం యువ రాజుకి చాలా ఆనందంగా వుంది. ముఖ్యంగా తండ్రి సంపూర్ణ ఆరోగ్యవంతుడు గావటం తన తల్లి ఆనందం యువ రాజుకి ఎన లేని సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తున్నాయి. చాలా కాలం తర్వాత భోంచేయటంతో వెంటనే నిద్ర పోయాడు ప్రభువు ధర్మ తేజుడు.

కొంత తడవు మౌనంగా వున్న యువ రాజు దరహాసంతో ఎదురుగా వున్న ఇరువురినీ చూసాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atadu..aame..oka rahasyam