Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope 27th january to 2nd febuary

ఈ సంచికలో >> శీర్షికలు >>

తలమానికం కాశ్మీరం - కర్రానాగలక్ష్మి

( పహల్ గాం )

శ్రీనగరు పట్టణానికి సుమారు 88 కిలో మీటర్లదూరంలో వున్న ప్రముఖ వేసవి విడిది ' పహల్ గావ్ ' వెడదాం . పొద్దున్నే ఉపా హారం తిని  'షికారా ' లో దాల్  వొడ్డుకి చేరి పహల్ గాం చూడ్డానికి బయలుదేరేం .

 శ్రీనగరు నుంచి రాష్ట్ర ప్రభుత్వము వారిచే , ప్రైవేటు రంగం వారి చే నడప బడుతున్న పర్యాటక బస్సులు శ్రీనగరు బస్టాండు నుంచి నడుస్తాయి . అందరికీ అందుబాటులో వుండే విధంగా పేకేజీటూరులు కూడా వున్నాయి . మద్యాహ్నపు భోజనం కూడా అందజేసే పేకేజీలు కూడా వున్నాయి . నిర్ణీత ప్రాంతాలలో ప్రయాణీకులను యెక్కించుకొనే వీలును కూడా కలుగ చేస్తున్నారు .

కొన్ని పేరుగల సంస్ధలు జమ్ము రైలు స్టేషను నుంచి  బయలు దేరి తిరిగి జమ్ము రైలు స్టేషనులో దింపడం వరకు యింత అని తీసుకుంటారు . హౌసుబోటులో వుండడం నుంచి భోజనాలు , సైట్ సీయింగుకి తీసుకువెళ్లి తీసుకురావడం అన్నీ అందులోనే వుంటాయి . కాస్త వెల యెక్కువగానే వుంటుంది . పెద్ద పర్యాటక సంస్థలు నడిపే టూరు తీసుకుంటే మోసాలు తక్కువగా వుంటాయి .

రాష్ట్ర ప్రభుత్వపు బస్సులలో వెళితే తక్కువ ఖర్చుతో అన్నీ తిరిగి రావొచ్చు . పహల్ గావ్ బస్టాండు నుంచి సైట్ సీయింగుకి వెళ్లేందుకు ఆటో , టాక్సీ సదుపాయాలు వున్నాయి .

 

పహల్ గావ్ వెళ్లే దారంతా కొండ ప్రాంతం , మంచి పంటనేల . కొండ క్రింద ప్రాంతాలలో మామిడి , బత్తాయి మొదలయిన పండ్ల తోటలు పర్వతాల యెత్తుపెరుగు తున్న కొద్ది యాపిల్ , ఛెర్రి పండ్ల తోల మధ్యనుంచి ప్రయాణం అహ్లాదకరంగా వుంటుంది . టాక్సీలో వెళ్లేవారు యీ తోటల దగ్గర ఆగి తోట యజమాని అనుమతితో తోటలు చూడొచ్చు . ఛెర్రీ లు ఆగష్టులో పండి కోతకొస్తాయి . యాపిల్స్ అక్టోబరులో కోత కొస్తాయి . ఇంకా పైకి వెళ్తున్న కొద్దీ అక్రోటు , బాదం తోటలు చూడొచ్చు . దేవదారు , కోనిఫర్ తోటలు రోడ్డుకి యిరువైపులా వుండి మనకి స్వాగతం పలుకుతున్నాయా ? అనే భ్రమ కలిగిస్తాయి . కొండపైన జారుతున్న జలపాతాలు , పేరు తెలియని అడవి పక్షులు మన ప్రయాణపు బడలికను తెలియకుండా చేస్తాయి .

పహల్ గావ్ అనంతనాగ్ జిల్లాలో వుంది . ఈ వూరుకి అమర్ నాథ్ యాత్రలో ప్రముఖ స్థానం వుంది . అమర్ నాథ్ యాత్ర యిక్కడనుండే మొదలవుతుంది . శివ పురాణం ప్రకారం పరమ శివుడు పార్వతీ దేవికి అమరకథ చెప్పేందుకు అమర గుహకు వెళుతూ శివుని వాహనమైన ' నంది ' ని యిక్కడ విడిచి పెట్టడం వల్ల యీ వూరుని  ' బైల్ గావ్ ' గా పిలువ సాగేరు . కాలాంతరాన యిది పహల్ గావ్ గా మారింది .

కనుచూపు మేర వరకు పచ్చని పచ్చిక బయలు , గలగల ప్రవహించే సెలయేళ్లు ,  అలా పచ్చికలో దేవదారు వృక్షాల కిందన నడుస్తూ కోనిఫర్ పూలను యేరుకుంటూ యెంతదూరం నడిచినా తనివి తీరదు . పర్యాటకుల సౌకర్యార్థం రోడ్లు వెడల్పు చెయ్యడం , హోటల్స్ అధిక సంఖ్యలో నిర్మించడం వల్ల 2014 లో మేం వెళ్లినప్పుడు పచ్చిక బయళ్ల స్థానంలో ధూళి దుమ్ము , హోటల్స్ కనిపించి నిరుత్సాహాన్ని కలిగించేయి .

చాలా దక్షిణాది ఆహారం అందించే హోటల్స్ చాలా వచ్చేయి .

ఇక్కడ ముఖ్యంగా చూడ దగ్గవి ' చందన వాడి ' ,  ' కొలహై ' , హిమనీనదం , బేతాబీ వేలీ .

1) చందన వాడి ----

పహల్ గావ్ నుంచి బయలు దేరే అమర్ నాథ్ యాత్రలో చందన వాడి రాత్రి బసచేసే ప్రదేశం . ఇది పెద్ద పచ్చిక మైదానం , యాత్ర సమయంలో మాత్రమే యిక్కడ పర్యాటకుల తాకిడికి వుంటుంది మిగతా సమయం చాలా శాంతంగా నివురుకప్పిన నిప్పులా వుంటుంది . యెందుకలా అన్నానంటే యీ ప్రాంతం లో చొరబాటు దారుల తాకిడి యెక్కువగా వుంటుంది . అందువల్ల యీప్రాంతాన్ని పర్యాటకుల లిష్ట్ లోచేర్చరు . యాత్ర సమయంలో కొందరు వ్యాపారస్థులు టెంట్లు వేసి ఉచిత పడక , భోజన సదుపాయాలు యాత్రీకులకు అందిస్తారు . యాత్ర ముగిసి పోగానే టెంట్లు తీసివేస్తారు . శివుడు పార్వతీ దేవితో అమర గుహ కు ప్రయాణిస్తున్నప్పుడు చంద్రవంకను యిక్కడ విడిచి పెట్టేడు . హెలీకాఫ్టరులోంచి యీ ప్రదేశాన్ని చూస్తే నెలవంక ఆకారం లో వుంటుందట . అందుకే యీ ప్రాంతాన్ని ' చంద్రవాడి '  అని పిలిచేవారు .

ఎటు చూసినా పచ్చిక మైదానాలు , స్వచ్చమైన జలపాతాలు , చేతికి అందుతాయా అనేటట్టుగా వుండే నీలి మేఘాలు , అంతలోనే సన్నగా పడే వర్షం , అంతలోనే చురుక్కుమనే యెండ మన శరీరాలను తడుముతూ గిలిగింతలు పెడుతూ వుంటాయి . సూర్యాస్తమయం అవగానే సన్నగా మొదలయే చలి నిముషనిముషానికి పెరిగిపోవడం అనుభవించాలిగాని వర్ణించలేము . ప్రకృతిలో మునిగి పోయి యెన్నాళ్లైనా వుండిపోవాలనిపించే ప్రదేశాలలో యిదొకటి . చందన్ వాడి ముందర స్విట్జర్ ల్యాండ్ దిగతుడుపే .రెండు ప్రదేశాలు చూసేను కాబట్టి యీ మాట గట్టిగా చెప్పగలను .

2)కొలహై హిమనీనదం -----

పహల్ గావ్ కి తూర్పున 26 కిలోమీటర్ల దూరంలో , సోనెమార్గ కి దక్షిణాన 16 కిలోమీటర్ల దూరంలో వున్న హిమనీనదం యిది . సుమారు 4,700 మీటర్ల యెత్తులో వుంది యీ హిమనీనదం . పహల్ గావ్ గుండా ప్రవహిస్తున్న ' లిద్దర్ ' నది కూడా యీ హిమనీనదం నుండి పుట్టినదే . అనంత నాగ్ నగరానికి కావలసిన త్రాగు నీరు యీ హినీనదమునుండే అందుతాయి . ఈ ప్రాంతాలలో వున్న పర్వతాలను ' కొలహై ' పర్వత శిఖరాలని అంటారు . ఇందులో యెత్తైన శిఖరం యెత్తు సుమారు 5,425 మీటర్లు . సింధునది యొక్క చాలా ఉపనదులు యిందులోంచే  పుట్టేయి . సుమారు 13.5 చదరపు కిలోమీటర్లు వున్న యీ హిమనీనదం 1963 లో సుమారు 10 చదరపు కిలో మీటర్లకు కుదించుకు పోయింది . 2005 లో యిది మరో 2 చదరపు కిలో మీటర్లు తగ్గిపోయింది . ప్రస్తుతం యీ హిమనీనదం లోపల గుల్లగా మారిపోయి వ్రేలాడుతున్నట్లు గా అయిపోయిందని శాస్త్రజ్ఞులు విచారం వక్తపరుస్తున్నారు .  ఈ ప్రాంతం చేరడానికి కొంతదూరం మోటారు వాహనాలలోని , కొంతదూరం నడిచిగాని లేదా గుర్రాల మీద ప్రయాణించి చేరుకోవచ్చు .

3)బేతాబీ లోయ---

పహల్ గావ్ నుంచి సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరంలోవుంది యీ బేతాబీ లోయ . సన్నీ డియోల్ , అమృతాసింగ్ లు నటించిన  సూపర్ హిట్ హిందీ సినిమా ' బేతాబ్ '  షూట్ చేసిన ప్రదేశం కావడం తో స్థానికులు దీనిని 'బేతాబీ లోయ' గా పిలుస్తూ  పర్యాటకులను యిక్కడకు తీసుకు రాసాగేరు . ఆ సినిమాలో హీరోహీరోయన్ల నటన యెలా వున్నా సినిమాలోని సీనరీలు అప్పట్లో యెందరినో ఆకర్షించేయి .  ఆ సినిమా విజయానికి కారణం సగం యీ ప్రాంతానికి చెందుతుంది .  ఈ ప్రదేశం చూసిన తరువాత సినిమాలో కన్నా నిజంగా యెంత బాగుందో యీ ప్రాంతం అని అనిపిస్తుంది .

మధ్యాహ్నం ఓ హొటల్లో ఉత్తరాది భోజనం చేసి ( ఉత్తరాదిన దక్షిణాది తిండి తినకోడదు అనే పాఠం చాలా సార్లు దక్షిణాది వంటలు తిని నేర్చుకున్నాం ) సాయంత్రం హౌసు బోటు చేరుకున్నాం .

 

 

రవాణా సౌకర్యం :

పాఠకుల సౌకర్యం కోసం కశ్మీరు లోయ యెలా చేరాలో మరో మారు వివరిస్తాను .

దేశరాజధాని ఢిల్లీ నుంచి రైలు  , బస్సు   , విమాన , టాక్సీ సౌకర్యం జమ్ము వరకు వుంది . అక్కడ నుంచి బస్సు , టాక్సీ , విమానం ద్వారా  శ్రీనగరు చేరుకోవచ్చు . కొద్ది కాలంలో జమ్ము శ్రీనగరు రైలు లైను పూర్తయి రైలు సౌకర్యం లోయ వరకు కలగనుంది . ఢిల్లీ నుంచి జమ్ము సుమారు 550 కిలోమీటర్లు , జమ్ము నుంచి శ్రీనగరు సుమారు 322 కిలో మీటర్లు .

మరిన్ని శీర్షికలు
story review