Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు.. ఆమె.. ఒక రహస్యం

 

గత సంచికలోని అతడు-ఆమె-ఒక రహస్యం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండిhttp://www.gotelugu.com/issue198/571/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/

మరి ఆ యువతి ఎవరు?

తెలుసుకోవాలంటే, రేపు మధ్యాహ్నం యోగేష్ తనకి ఫోన్ చేసే వరకూ ఆగాలి. యోగేష్‍ కూడా పూర్తి వివరాలు  చెప్పగలడన్న గ్యారంటీ లేదు.  టూరిస్టులు గైడ్ లతో క్లోజ్‍గా ఉంటున్నట్టే కనిపించినా, వాళ్ళ స్వంత విషయాలు పూర్తిగా చెప్పరు గైడ్ ల కి సెక్యూరిటీ కారణాల వల్ల.

అతడి కూడా అండమాన్ వెళ్ళిన యువతికీ ఈ కేసుకీ ఏమైనా సంబధం ఉండి ఉండచ్చా అని కొద్ది  సేపు ఆలోచించాడు.  ఆమెకీ ఈ కేసుకీ సంబధం ఉన్నా లేక పోయినా రాజేంద్రకి ఎవరో స్త్ర్రీతో సంబంధం ఉందన్నది మాత్రం నిజం.  వయసులో ఉన్న యువకుడు ఏ సంబధమూ లేని యువతితో కలిసి పదిహేను రోజుల పాటూ పర్యాటక ప్రదేశంలో హోటల్ లో ఉండడు. రాజేంద్ర గురించి ఒక కొత్త విషయం తెలుసుకున్నట్టనిపించింది పాణికి.

మర్నాడు మధ్యాహ్నం యోగేష్ ఫోన్ చేసే లోపు ఉదయం ఏదో వంకతో సిర్నాపల్లి గ్రామం లోకీ, చుట్టు పక్కల గ్రామాల లోకీ వెళ్ళి అక్కడి జనాలతో మాట్లాడితే తనకి రాజేంద్ర గురించి మరింత సమాచారం దొరక వచ్చనిపించింది అతడికి.

****

భోజనం చేసాక ఏం తోచక పోవడంతో  పాణీ, సుప్రియా కలిసి రాజ మహల్ బయట ఉన్న గార్డెన్ లోకి  వాకింగ్‍కి వెళ్ళారు.

“ఇది మీ మొదటి పోస్టింగా?” అడిగాడు పాణి ఆమె వంక చూస్తూ.

“అవును” అందామె.

చీర కట్టుకుందామె.  చీర కట్టు లో ఆమెని చూసిన వాళ్ళెవ్వరూ ఆమె ఒక పోలీస్ ఇన్స్ పెక్టర్ అంటే నమ్మేలా లేదామె.  అంత బాగా కట్టుకుంది చీర.  వెన్నెల వెలుగులో  ఆకు పచ్చ రంగు  షిఫాన్ చీరలో, దేవ లోకం నుంచి దిగి వచ్చిన అప్సరసలా ఉందామె.

“సాధారణంగా పోలీస్ డిపార్టుమెంట్ లోకి రావడానికి స్త్రీలు ఇష్ట పడరు కదా? మీరు ఈ డిపార్టుమెంట్ లోకి ఎందుకు వచ్చారు? ఉద్యోగమే కావాలనుకుంటే చాలా ఉద్యోగాలున్నాయి కదా?”  కొద్ది సేపయ్యాక అన్నాడు.

“నిజం చెప్పమంటారా?”

పాణి నవ్వాడు. “నేను డిటెక్టివ్‍ని.  మీరు అబద్దం చెప్పినా పసి గట్ట గలను. కనుక నిజం చెప్పడమే మంచిది” నిండుగా నిండిన మధు పాత్రలోంచి మధువు ఒలికినట్టు చిన్నగా నవ్విందామె. ఆ నవ్వు ఎంతటి వాళ్ళనైనా కనికట్టు చేసేట్టుగా ఉంది. ‘ఎంత గొప్ప డిటెక్టివ్ లైనా నేను నిజం  చెబుతున్నానో అబద్దం చెబుతున్నానో పసి గట్ట లేరు’ అని అన్యాపదేశంగా అన్నట్టనిపించింది పాణికి ఆమె అలా నవ్వుతుంటే.

“నాకు చిన్నప్పటి నుంచీ ‘పవర్’ అంటే ఇష్టం. మాది  దిగువ మధ్య తరగతి కుటుంబం.  మా నాన్న చిన్నప్పుడే చని పోయాడు.  నాన్న చేసే గుమాస్తా ఉద్యోగం అమ్మకి ఇచ్చారు ఆయన పోయాక.   మేము  ఇద్దరు అక్క చెల్లెళ్ళం.  ఇంట్లో అందరం ఆడవాళ్ళమే. ఆడ వాళ్ళకి సహజంగా ఉండే బిడియం, సిగ్గు వల్ల  మేము బయటికి ఎక్కడికి వెళ్ళినా ప్రతి చిన్న దానికీ భయ పడుతూనే ఉండే వాళ్ళము. ఉద్యోగం చేస్తున్నా అమ్మ కూడా అణుకువగానే ఉండేది తప్ప కమాండింగా ఉండేది కాదు.

స్త్రీలు ఎంత గొప్ప ఉద్యోగం చేసినా అలాగే ఉండాలనేది అమ్మ.  నాకు మాత్రం అలా అణకువగా కాకుండా కమాండింగా, పవర్ ఫుల్‍గా ఉండాలని  కోరికగా ఉండేది.  మామూలు ఉద్యోగమైతే అమ్మ లాగే నేనూ ఉంటానని, పవర్ చూపించ గలిగే ఉద్యోగం పోలిస్ ఉద్యోగమే అనిపించి,  డిగ్రీ అయి పోగానే ఎస్సై సెలెక్షన్స్ కి అప్లై చేసి ఉద్యోగం సంపాదించాను”

“పోలీసు ఉద్యోగంలో చేరారు సరే, ఆడ వాళ్ళు కనుక మీకు పోస్టింగులో  ప్రయారిటీ ఇస్తారు కదా? హాయిగా ఏ హైదరాబాద్‍ లోనో  పోస్టింగ్ అడగక ఈ మారు మూల అడవి లోకి ఎందుకు వచ్చారు?”

“ఈ ప్రాంతంలో భూగర్భ నిధులూ, వజ్రాలూ ఎక్కువగా దొరుకుతాయని తెలుసు కదా? అందుకే ఇక్కడ వేయించు కున్నాను పోస్టింగ్. పోలీస్ ఇన్స్ పెక్టర్ ని కనుక నేను ఎక్కడ నిధుల కోసం వెదికినా ఎవరూ అడిగే వారుండరని”

“వాట్?” అన్నాడు పాణి ఆశ్చర్యంగా.

ఆమె  గల గలా నవ్వింది. “లేక పోతే ఏమిటండీ? ఇది నేను అడిగి వేయించుకున్న పోస్టింగ్ కాదు. కొత్తగా జాయినైన వాళ్లని మారు మూల ప్రాంతాలకి వెయ్యడం మామూలే కదా?” అందామె.

పాణి అనుమానంగా చూసాడు ఆమె వంక.  ఆ మాటలంటున్నప్పుడు ఆమె గొంతు ఎంత నిజాయితీగా ఉందటే, తన సెక్రెటరీ రమణ ముందుగా ఎంక్వయిరీ చేసి ఆమె ఈ ప్రదేశానికి కావాలని పోస్టింగ్ వేయించుకు వచ్చిందని చెప్పి ఉండకపోతే, ఆ విషయం నిజమని నమ్మేసే వాడు. అంత చిన్న విషయంలో అబద్దం చెప్పాల్సిన అవసరం ఆమెకి ఏమొచ్చింది?  అసలు ఆమె  ఈ ప్రాంతానికి పోస్టింగ్ వేయించుకుని ఎందుకు వచ్చినట్టు?!

ఆమె మళ్ళీ మనోహరంగా నవ్వింది. ఆమె నవ్వు చూసి తన మనసులో తొలుస్తున్న సందేహాన్ని తాత్కాలికంగా మర్చి పోయాడు అతడు. చుట్టు పక్కల ఎక్కడా విద్యుత్ దీపాలు పెద్దగా లేక పోవడంతో వెన్నెల వెలుగు  స్వచ్చంగా ఉంది.

“ఈ వెన్నెల కవులకి ప్రేరణనిచ్చే శక్తి.  రాజేంద్ర గారు కూడా ఎన్నో వెన్నెల రాత్రులు ఈ తోటలో తిరిగి ఉంటాడు కదా?”   అంది ఆమె.

“అవును” బాధగా అన్నాడు పాణి.

“రాజేంద్ర గారికి మీరు కాకుండా  ఇంకెవరూ స్నేహితులు లేరా?” అందామె.

“ఏందుకలా అడుగుతున్నారు?”

“ఏం లేదు. ఆయన చని పోతే ఇంకెవ్వారూ రాక పోయేసరికి అనుమానమొచ్చి అన్నాను.  మీకు తెలిసి ఉంటుంది కదా?”

ఒక్క క్షణం పాణి తడబడ్డాడు. “రాజేంద్ర ఇంట్రావర్ట్. ఎక్కువగా ఎవరితోనూ కలిసేవాడు కాదు.  నిజం చెప్పాలంటే సాహిత్యం మీద అభిలాషే లేక పోయి ఉండి ఉంటే, అండమాన్ లో పరిచయమైన మా స్నేహం ఇంత దూరం వచ్చి ఉండేది కాదు”   అన్నాడు.

అతడి గొంతులోని తడబాటుని ఆమె సులభంగా గుర్తించింది. అతడి  వంక అనుమానంగా చూసింది. అతడు నిజంగా రాజేంద్ర స్నేహితుడేనా లేక స్నేహితుడిగా నటిస్తూ ఇక్కడికి వచ్చిన వ్యక్తా?  ఒక వేళ అలా నటిస్తూ వచ్చిన వ్యక్తి అయితే ఎందుకు వచ్చినట్టు? ! 

కొద్ది సేపు నడిచాక “సరే, చలిగా ఉంది ఇంక లోపలకి వెడదామా?” అంది. ఇద్దరూ బంగళా లోపలకి వెళ్ళారు.

అందరూ వెనక వైపు దూరంగా ఉన్న సమావేశ మందిరంలో  పార్టీలో బిజీగా ఉండడం వల్ల వాళ్ళు వెళ్ళే సరికి బంగళా అంతా దాదాపు నిశ్శబ్దంగా  ఉంది. పాణి ఆమెకి గుడ్ నైట్ చెప్పి తన గది లోకి వెళ్ళి పోయాడు.

ఇంద్ర నీలకి పాణి మీద వచ్చిన సందేహం మనసులో తొలుస్తుండడంతో ఏం చెయ్యాలో అర్ధం కావడం లేదు.  గూగుల్ సెర్చ్ లో పాణికి సంబంధించిన వివరాలని  సెర్చ్ చేస్తే అతడి బయోడేటా దొరకచ్చు. దాన్ని బట్టి అతడు నిజం చెబుతున్నాడో అబద్దం చెబుతున్నాడో అన్న దాని మీద ఒక అవగాహనకి రావచ్చు అనుకుని సెల్లో నెట్ ఆన్ చేసింది.   నెట్ వర్క్ కనెక్షన్ రావడం లేదు.

గది లోంచి బయటికి వచ్చి “నా ఫోన్లో నెట్ కనెక్షన్ రావడం లేదు. ఎక్కడైనా డెస్క్ టాప్ ఉందా? నెట్లో చిన్న పని ఉంది”  అని హాల్లో  కనిపించిన నౌకరుని అడిగింది.

హాలుకి ఒక పక్కగా ఉన్న ఆఫీసు రూమ్‍ దగ్గరకి ఆమెని తీసుకెళ్ళి చెప్పాడు నౌకరు “ఈ రూమ్ లో కంప్యూటర్ ఉందమ్మా. దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది”

“దాన్ని నేను వాడుకోవచ్చా?”

“ఈ ఇంట్లో అతిధులకి ఎలాంటి ఆంక్షలూ ఉండవమ్మా.  మీరు  నిరభ్యంతరంగా వాడుకో వచ్చు” చెప్పాడు నౌకరు.

ఇంద్రనీల  కంప్యూటర్ ని ఆన్ చేసి ఇంటర్ నెట్ లో గూగుల్ సెర్చ్ పేజ్ ఓపెన్ చేసి అందులో  “డిటెక్టివ్ పాణి” అని టైపు చేసింది.   పాణి రన్ చేస్తున్న ఈగల్స్ ఐ డిటెక్టివ్ ఏజన్సీ తాలూకు అఫీషియల్ వెబ్ సైట్ పేజీలు వచ్చాయి. దాంట్లో పాణి ఫోటో తో పాటూ వివరాలు కూడా ఉన్నాయి.

‘అయితే ఇతగాడు తన ఐడెంటిటీ గురించి చెప్పిన వివరాలు నిజమేనన్న మాట’ అనుకుంది అతడి ఫోటో, ముంబయి అడ్రసూ అవీ చూసి.

రాజేంద్ర తనకి అండమాన్ లో పరిచయం అని చెప్పడం,  ముంబయి రాక ముందు తను అండమాన్ లో  ప్రాక్టీస్ చేసానని చెప్పాడం గుర్తొచ్చి  ఆ విషయం అతడి  బయోడేటాలో ఎక్కడైనా ఉందా అని వెదికింది. అందులో కూడా అబద్దం లేదని తేలడంతో ఆలోచనలో పడింది.....

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nagaloka yagam