Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
atadu..aame..oka rahasyam

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోక యాగం

గతసంచికలో నాగలోక యాగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.  http://www.gotelugu.com/issue198/572/telugu-serials/nagaloka-yagam/nagalokayagam/

‘‘ఈ ఒక్క రాత్రికి బాహ్లీకుని ప్రశాంతంగా నిద్ర పోనిచ్చెదము గాక. మన సేనల్లు కదలాల్సిన పని లేదు. విజయం కోసం మనమేల అడ్డు దారి తొక్కవలె? ఉదయము తొలి జాము గడువ గనే యుద్ధ భేరీలు మ్రోగాలె. ఇటు మన సేనలు అటు బావ ఇంద్ర జిత్తు వెంట వస్తున్న మాళవ సేన మధ్య అడ కత్తెరలో చిక్కిన పోక చెక్క వలె బాహ్లీకుడు వాని సేనలు చిక్కి నలిగి నశించి పోవలె. ముప్పెట దాడిలో మొత్తం తుడిచి పెట్టుకు పోగలరు.’’ అంటూ తన అభిప్రాయం విన్పించాడు.

అది విని ముఖ ముఖాలు చూసుకున్నారు మహా మాత్యుడు వాసు దేవ నాయకుడు, సర్వ సైన్యాధ్యక్షుడు అర్కుడు. పరిస్థితి యువ రాజుకి సరిగా బోధ పడినట్టు లేదనిపించింది వారికి.

‘‘కానీ... శతానీకుని సంగతి మర్చి పోయినట్టున్నారు. భూ మార్గంగా వచ్చిన పాతిక వేల అశ్విక దళం ఉత్తర సరి హద్దు నుండి రత్న గిరి వైపు కదలి వస్తోందని సమాచారం...’’

‘‘అవగతమైనది అమాత్య వర్యా’’ అంటూ మహా మాత్యుని మాటలకు అడ్డు వచ్చాడు యువ రాజు.

‘‘అశ్విక దళాన్ని నేను తుడిచి పెట్ట గలను. అయిననూ రెండు ఆక్షౌణీ గాంధార సేనల్ని సాగరం మీద నిలువరించ లేము. అది ఒక్కటే కలవర పరుస్తున్నది. ఏదో ఒకటి జేసి ఆ మూర్ఖుడు శతానీకుని నిలువరించాలె. చూచెదము గాక, మనమొక పరి సాయంకాలము సమావేశమగుట మంచిది. ఎవరు ఎటు వైపు సారధ్యము వహించిన మేలు జరుగునో చర్చించెదము గాక. మరొక్క విషయము, ప్రస్తుత పరిణామము జనకునకు తెలియవు. పోరు సంగతి తెలిసిన తనూ రణ క్షేత్రమునకు బయలుదేర గలరు. ఆయనకు విశ్రాంతి అవసరము. కోటకే పరిమితము గావలె. వారికి ఏ విషయమూ తెలియ గూడదు. అలాగే మన ప్రధాన సేనల్ని ఈ రోజే ఆరు భాగాలుగా విభజించి సిద్ధంగా ఉంచండి’’ అన్నాడు యువ రాజు.

అర్కుడు ఏదో మనవి చేయ బోతూ`
ఉన్నట్టుండి ఆగి పోయాడు.
రెండో సారి అతడి చెవులకు సోకిందా శబ్ధం.
పాము బుస..!

ఇంత సేపు చర్చలలో పడి గమనించ లేదు గాని గప్పున వీస్తోంది సంపంగి పూల పరిమళం. ఉలికి పడి చూసిన అర్కునికి బురుజు మూడో స్తంభం వద్ద చుట్ట చుట్టు కొని లేచి పడగ విప్పి ఆడుతున్న పెద్ద శ్వేత నాగు కంట బడింది. తెల్లగా మెరిసి పోతున్న ఆ సర్పాన్ని చూసి హడలి పోయాడు` ‘‘యువ రాజా! అటు చూడండి విష సర్పం... శ్వేత నాగు... ఇది ఎలా వచ్చెనిటకు’’ అంటూ విసిరేందుకు వెంటనే చురిక తీయ బోయాడు. చప్పున వారించాడు ధనుంజయుడు. అంతటి మహా మాత్యుని క్కూడా ఆ శ్వేత నాగును చూడగానే నుదుట శ్వేదం అలుముకుంది.

‘‘అది ఎవరినీ ఏమీ చేయదు. మీరు తత్తళింప పని లేదు. ఆగండి’’ అని వారిస్తూ శ్వేత నాగు వద్దకెళ్ళి నవ్వుతూ` ‘‘ఏమి కార్యమిది? ఇచటికేల వచ్చితివి ప్రియ సఖీ’’ అంటూ చేతులు చాపాడు. అంతే`

శ్వేత నాగు అతడి కరములకు చుట్టుకుని భుజం మీదికి ఎగ బ్రాకింది. అర్కుడు, వాసు దేవ నాయకుడు మాటలు మరిచి విభ్రాంతులయి చూస్తున్నారు. ఉలూచీశ్వరి నాగ కన్యయని వారికి తెలీదు. ఉన్నట్టుండి శ్వేత నాగు అదృశ్యమై అక్కడ ఉలూచీశ్వరి ప్రత్యక్షమైంది.
‘‘సఖీ... ఇది యేమి కొంటె తనము. అనవసరముగ వారిని కంగారు పరిచినావు గదా. అంతఃపురమున విశ్రాంతి గైకొనకు ఇటు రానేల?’’ ఆమె చేయి అందుకొంటూ అడిగాడు ధనుంజయుడు.

‘‘రత్న గిరి పురము జూడ ఇచ్చ గలిగి వచ్చితి. మిము కలత పరిచిన పెద్దలు నను క్షమించ వలె.’’ అంటున్న ఉలూచీశ్వరిని చూస్తూ కలత నుండి తేరుకొని నవ్వారు అమాత్యుడు, అర్కుడు ఇరువురూ.

‘‘ప్రభూ! బాహ్లీకుని సేనలు విడిది చేసినది సుదూరమున కన్పట్టు ఆ మైదాన భూములే గదూ?’’ చేయెత్తి చూపుతూ యువరాజును అడిగింది ఉలూచీశ్వరి.

‘‘అవును గాని మా చర్యలు నీవు వింటివనుకొందును. ఈ యుద్ధ సన్నాహములతో నీకు పని యేమి? భద్రా దేవి, మణి మేఖల ఇరువురును ఎచట?’’ అడిగాడు.

‘ఇదో... వచ్చుచుంటిమి ప్రభూ!’’ అంటూ అప్పుడే మెట్లెక్కి పైకి వస్తూ కన్పించారు అతివలిద్దరూ.వచిన భామలు ముగ్గురూ ఒక చోట చేరటంతో ఇక తమ ఉనికి అచట ఉచితము కాదని అర్థం జేసుకుని యువ రాజు వద్ద శలవు గైకొని కిందకు వెళ్ళి పోయారు వాసు దేవ నాయకుడు, అర్కుడు.

పిమ్మట సఖియలు మూవురితో ముచ్చటలాడుతూ చాలా సేపు ఆ బురుజు మీదే ఉండి పోయాడు యువ రాజు ధనుంజయుడు.

*************

అదే రోజు సాయం సమయాన`

ధనుంజయుడు తన యక్ష మిత్రుడు రుచికుని తలచుకుని పిలిచాడు. వెంటనే ప్రత్యక్షమై ధనుంజయుని సంతోషంగా కౌగిలించుకుని అభినందించాడు రుచికుడు. ఇద్దరూ చాలా సేపు మంతనాలు జరిపారు.

‘‘మిత్రమా! నా సహకారం ఎప్పుడూ నీకు ఉంటుంది. అయిననూ రెండు ఆక్షౌణీల పైగా సైన్యము మాటలు కాదు. ఈ రాత్రికే సాధ్యమగునంత వరకు నౌకను సముద్రము పాలు జేసి శతానీకుడు తల పట్టుకుని వ్యథ చెందేలా జేసెద. నీట మునిగి చచ్చిన వాళ్ళు చావగా బతికి తీరమునకు వచ్చు సేనలను మీ మలుకాండ్రు బాణము వేసి మట్టు పెట్ట వచ్చు. ఇక రత్నగిరి కోట వరకు మా యక్షులు అదృశ్య రూపమున కావలి ఉందురు. శత్రువు ఎవడు కోట గోడను తాకినా నెత్తురు కక్కుకుని చచ్చెదరు. రేపు యుద్ధ సమయమున వచ్చి కలిసెద’’ అని మాటిచ్చి అదృశ్యమైనాడు రుచికుడు.

వెంటనే సర్వ సైన్యాధ్యక్షుడు అర్కుడితో మాట్లాడి అనేక మంది మేటి విలుకాండ్రను తమ గస్తీ నౌకల్లోకి తరలింప జేసాడు ధనుంజయుడు.
ఆ రాత్రి ప్రశాంతంగా నిద్ర పోయింది కోట లోని రాజ కుటుంబం మాత్రమే. అటు సముద్రం మీద తరలి వస్తున్న గాంధార రేడు శతానీకునికి, అక్కడ మైదాన భూముల్లో విడిసిన బాహ్లీకునికి వారి సైన్యానికి అది కాళ రాత్రి.

సముద్రం మీద గాలి వాటు అనుకూంగా లేక రెండ్రోజులు ఆలస్యమైనా ఆ రోజు ఉదయం నుండి వాతావరణం సానుకూలంగా వుంది. సముద్ర జలాల్ని చీల్చుకుంటూ తమ యుద్ధ నౌకలన్నీ రత్నగిరి వైపు శర వేగంతో దూసుకు పోతున్నాయి. నిండుగా గాలి పోసుకొని తెర చాపు రెప రెప లాడు తున్నాయి. ప్రయాణం యిలాగే సాగితే తెల్ల వారే సరికి నౌకలు రత్నగిరి చేరుకొని ముట్టడిస్తాయి. అటు నుంచి బాహ్లీకుని సేనలు ఇటు నుంచి గాంధార సేన మధ్య రత్న గిరి సేనలు అగ్నిలో పడ్డ శలభాల్లా మాడి మసి గాక తప్పదు. మూడు దినాలకు మించని ముట్టడితో రత్నగిరి తన వశం గాక తప్పదు.

తన ప్రత్యేక నౌక పై భాగంలో కూచుని మధిర సేవిస్తూ సముద్రం మీద మిడతల దండులా సాగుతున్న తమ నౌకలను, సముద్రం మీద సంధ్యా సమయాన్ని వీక్షిస్తూ రత్నగిరి ఇప్పుడే తన వశమై పోయినట్టు వూహా గానాలతో ఆనంద పడుతున్నాడు గాంధార దేశా ధీశుడు శతానీకుడు. నిజానికి రత్నగిరి యువరాజు ధనుంజయుడు రత్నగిరి చేరుకున్నట్టు గాని, దివ్య నాగ మణి ప్రభావంతో రత్న గిరి రాజు ధర్మ తేజుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడైనట్టు గాని శతానీకునికి తెలీదు.

సముద్రం మీద పశ్చిమాన సూర్యాస్తమయమైంది. చిక్కటి కాటుక వంటి నల్లటి చీకట్లు తూర్పు నుంచి చూస్తుండ గానే అలుముకున్నాయి. వేలాది యుద్ధ నౌకల మీద కాగడాలు వెలిగించ బడ్డాయి. రాత్రి తొలి జాములో శతానీకుడు తన నౌకలో సేనా పతులతో సమావేశమయ్యాడు. ఉదయం రత్నగిరి మీద ముట్టడి ఎలా చేయాలనే విషయంగా చాలా సేపు వారంతా చర్చించుకున్నారు. సరిగ్గా అప్పుడే ఆరంభమైంది సంక్షోభం.

గగన తలం నుండి పెద్ద గ్రహ శకలం ఏదో జారి సముద్రంలో పడినట్టు భయంకర శబ్ధం ఏర్పడింది. అది సరిగ్గా నౌక మధ్యన పడింది. ఉప్పెన తాకినట్టు రాకాసి అలలు లేచి సాగరం అల్లకల్లోలమైంది. అంత వరకు అనేక వరుసలు తీరి క్రమ శిక్షణతో సాగుతున్న యుద్ధ నౌకలు అలల తాకిడికి తలో పక్క దూరంగా చెదిరి పోనారంభించాయి. అది పడిన వేగానికి పది నౌకలు తల్లక్రిందులై సముద్రంలో మునిగి పోయి వంద సైనికులు నీటి పాలయ్యారు. చీకట్లలో ఒక్క సారిగా హాహాకారాలు ఆర్తనాదాలు చెల రేగాయి. ఎందరు బతికున్నారో, ఎందురు చచ్చారో తెలీదు.

శతానీకుడు అతడి సేనాపతులు వున్న నౌక కూడ కొద్ది సేపు వూగి పోయింది. చర్చలు అర్థాంతరంగా ఆగి పోయాయి. అంతా నౌక ఉపరితలానికి పరుగెత్తు కొచ్చి చూసారు. అలల తాకిడికి చెదిరి పోతున్న నౌకలు కన్పించాయి. ఏదో సముద్రంలో పడిందని సైనికులు చెప్తున్నా అదేమిటో అర్థం కాలేదు.

నిజానికి అలా దూకింది ఎవరో కాదు`

ధనుంజయుని యక్ష మిత్రుడు రుచికుడు.

ఆకాశం లోనే తన శరీరాన్ని పర్వతంలా పెంచేసి ఒక్క సారిగా సముద్రం లోకి దూకి నౌకల్ని చెల్లా చెదురు చేసాడు. ఇక తర్వాత శతానీకుని నౌకతో ఆడుకోవటం ఆరంభించాడు. సముద్ర జలాల్లో తిమింగంలా ఈదుతూ దొరికిన నౌకను దొరికినట్టు సముద్రంలో ముంచేయ సాగాడు. కాని సొరచేపలు దాడి చేస్తున్నాయని శతానీకుడు భావించాడు. చూస్తుండగానే అనేక నౌకలు తల్లకిందులు గావటంతో ముందుకు పోడానికి ధైర్యం చాల్లేదు. ముందు సముద్రం విడిచి తూర్పు తీరం చేరుకుంటే తర్వాత ముట్టడి గురించి ఆలోచించ వచ్చనుకున్నాడు. దాంతో నౌకలు దిశ మార్చుకొని తూర్పుగా తీరం వైపు ప్రయాణం ఆరంభించాయి. అయినా మృత్యువులా రుచికుడు వాళ్ళని వెంటాడుతూనే వున్నాడు. తెలతెల వారుతూండగా నౌకలు తీరాన్ని సమీపించే సమయానికి పది వేల నౌకల్ని సముద్రంలో ముంచేసాడు రుచికుడు. శతానీకుడికి నిద్ర లేకుండా చేసాడు. ఏమైతేనేమి ఆ రాత్రి పది వేల నౌకల్ని, డెబ్భై వేల సైన్యాన్ని కోల్పోయాడు శతానీకుడు.

తెల్ల వారే సరికి వేలాది గాంధార సైనికుల మృత దేహాలు తీరానికి కొట్టుకు రా నారంభించాయి. ఎలాగో ప్రాణాలు గుప్పిట ఉంచుకొని తీరానికి ఈదుకొస్తున్నవాళ్ళను రత్నగిరి నావికా దళంలో విలుకాండ్రు బాణాు వేసి ప్రాణాలు తీయ సాగారు.

భళ్ళున తెల్ల వారే సరికి బ్రతుకు జీవుడా అన్నట్టు మిగిలిన సైన్యంతో రత్నగిరికి ఉత్తరంగా పది యోజనాల దూరంలో తీరం చేరుకున్నాడు శతానీకుడు.

ఈ లోపల అదే రాత్రి`

అక్కడ మైదాన భూముల్లో బాహ్లీకుడు అతడి సేనలు శిబిరాల్లో గాఢ నిద్రలో వుండగా ఒక్క సారిగా చెలరేగింది కలకలం. ‘‘బాబోయ్‌ పాములు... ఎటు చూసినా విష సర్పాలు’’ అంటూ సైనిక శిబిరాల్లో అరుపులు, ఆర్తనాదాలు చెల రేగాయి. గాఢ నిద్రలో వున్న బాహ్లీకుడు తృళ్ళిపడి లేచాడు. లేచీ లేవ గానే కాగడాల వెలుగులో బుసలు కొడుతూ వస్తున్న రెండు విష సర్పాలను చూసి అదిరి పడి పక్కకు దూకాడు. వెంటనే ఖడ్గం దూసి రెంటినీ ముక్కులుగా ఖండించి చర చరా గుడారం లోంచి బయటి కొచ్చాడు.

అప్పటికే పరిస్థితి దారుణంగా వుంది.

ఎటు చూసినా కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న విష నాగులు కన్పిస్తున్నాయి. అవి దొరికిన వాళ్ళని దొరికినట్టు కాటు వేస్తున్నాయి. ఎటు చూసినా సైనికుల అరుపులు, ఆర్తనాదాలు, దానికి తోడు హడావుడిలో ఎలాగో ఎగిరి కొన్ని కాగడాలు గుడారాఅ మీద పడి భగ్గున ఎగసాయి మంటలు. మరో వంక సైనికులు కన్పించిన సర్పాన్ని కన్పించినట్టు తన కరవాలాలకు బలివ్వ సాగారు. బాహ్లీకునికి పిచ్చి పట్టినంత పనయింది. ఉన్నట్టుండి ఆ మైదాన భూముల్లోకి వేలాది విష నాగులు ఎలా వచ్చాయో ఎందుకు తమ మీద దాడి చేస్తున్నాయో బుర్ర చించుకున్నా అర్థం గావటం లేదు. గాలి వాటు అధికరించటంతో శిబిరాలు వరసగా తగల బడి పోతున్నాయి. అశ్వాలు తాళ్ళు తెంచుకొని గంతులేస్తున్నాయి. గందర గోళంగా వుంది పరిస్థితి. సర్ప ద్రష్టులై తన సైనికులు ఎందరు నేలకు ఒరిగి పోతున్నారో తెలీటం లేదు. పరిస్థితి ఇలాగే కొన సాగితే ఎవరూ ప్రాణాలతో మిగలరని అర్థమై పోయింది.

 

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్