Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
manasu tadi aaraneeku

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఆంధ్రా ఊటీ - 'హార్స్ లీ హిల్స్' - విహారి

andhra ooty - horsely hills

ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖమైన వేసవి విడిది ప్రదేశాల్లో 'హార్స్ లీ హిల్స్' ప్రధానమైనది. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి సుమారు 1265 మీటర్ల ఎత్తులో వున్నది. చిత్తూరు జిల్లా మదనపల్లి కి చేరువలో వుండే హార్స్ లీ హిల్స్, బెంగళూర్ నుండి 160కి. మీ., చెన్నై నుండి 270కి. మీ మరియు తిరుపతి నుండి 144కి. మీ ల దూరంలో వున్నది. ఇక్కడ వేసవిలో కూడా అత్యధిక ఉష్ణోగ్రత 32 డిగ్రీలు మాత్రమే. ఇక్కడి పరిసర ప్రాంతాలు హరితవర్ణం లో కడు రమణీయంగా వుంటాయి. ఈ ప్రదేశాన్ని పూర్వము 'ఏనుగు మల్లమ్మ కొండ' గా పిలిచే వారు. బ్రిటిష్ కాలంలో కడప  జిల్లా కలెక్టర్ గా పనిచేసిన డబ్ల్యు. డి . హార్స్ లీ ఈ ప్రాంతాన్ని 1840-43 మధ్యకాలంలో సందర్శించి ఇక్కడి ప్రకృతి అందాలకు మంత్రముగ్ధుడై  తన వేసవి విడిదిగా చేసుకున్నాడు. తదనంతర కాలంలో అతని పేరుపై ఈ ప్రాంతాన్ని 'హార్స్ లీ హిల్స్' గా పిలువసాగారు.

ఈ ప్రదేశాన్ని చేరుకునే రహదారి యూకలిప్టస్ చెట్లు, గంధపు చెట్లు మరియు వివిధ వర్ణాల పూల చెట్లతో ఎంతో రమణీయంగా వుంటుంది. గంగోత్రి సరస్సు, మల్లమ్మ గుడి , గాలిబండ, రిషివ్యాలీ స్కూల్ మరియు హార్స్ లీ హిల్స్ మ్యూజియం మెదలగునవి ఇక్కడి ముఖ్యమైన సందర్శక ప్రాంతాలు.  జోర్ఫింగ్, ట్రెక్కింగ్ మొదలుగు సాహస క్రీడలకు కూడా ఈ ప్రదేశం పేరుగాంచినది. ఇక్కడకు వచ్చే పర్యాటకుల కొరకు ఆంధ్రప్రదేశ్ టూరిజం వారు పున్నమి హోటల్ ని ఏర్పాటు చేసారు.

ఎలా చేరుకోవాలి ?

రోడ్డుమార్గం: రోడ్డుమార్గం లో ప్రయాణించేవారు ముందుగా చిత్తూరు జిల్లా మదనపల్లె చేరుకొని అక్కడినుండి హార్స్ లీ హిల్స్ చేరుకోవచ్చు. తిరుపతి మరియు బెంగళూరు నుండి మదనపల్లి వరకు బస్సు సౌకర్యం కలదు . అక్కడినుండి హార్స్ లీ హిల్స్ కి ప్రైవేటు వాహనాల్లో చేరుకొవచ్చు

రైలు మార్గం : హార్స్ లీ హిల్స్ కి సమీప రైల్వే స్టేషన్ - మదనపల్లి రోడ్ . ఇక్కడి నుండి హార్స్ లీ హిల్స్ కి 13కి. మీ. ల దూరం వుంటుంది. ఈ స్టేషన్ కి తిరుపతి-ధర్మవరం ప్యాసింజరు లేదా సికింద్రాబాద్-తిరుపతి బైవీక్లీ ఎక్స్ ప్రెస్ లలో చేరుకోవచ్చు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులకు అనువైన రైల్వే స్టేషన్ లు తిరుపతి మరియు బెంగళూరు .

విమానమార్గం : హార్స్ లీ హిల్స్ కి సమీప విమానాశ్రయాలు తిరుపతి, బెంగళూరు మరియు చెన్నయ్ 

మరిన్ని శీర్షికలు
telugu samskruthi