Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

గుండె జారి గల్లంతయ్యిందే - చిత్ర సమీక్ష

Gunde Jaari Gallantayyinde - Movie Review

గుండె జారి గల్లంతయ్యిందే: ప్రేక్షకులకి తుళ్ళింతయ్యిందే

చిత్రం: గుండె జారి గల్లంతయ్యిందే
తారాగణం: నితిన్, నిత్యా మీనన్, ఇష తల్వార్, అలీ, తాగుబోతు రమేష్, మధు, రవి, రఘుబాబు, దువ్వాసి మోహన్ తదితరులు
మాటలు: హర్ష వర్ధన్
సంగీతం: అనూప్ రూబెన్స్
చాయాగ్రహణం: ఐ ఆండ్రూస్
నిర్మాతలు: నిఖితా రెడ్డి, విక్రం గౌడ్
దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా
విడుదల: 19 ఏప్రిల్ 2013 (శ్రీరామ నవమి)

నితిన్, నిత్యా మీనన్ జంటగా వచ్చిన ఇష్క్ హిట్ కావడంతో ఈ జంటపై అంచనాలు ఏర్పడ్డాయి. ఏడాది తిరక్కుండా మళ్ళీ ఇదే జంట గుండె జారి గల్లంతయ్యిందే అంటూ ఈ రోజు వెండి తెరకెక్కారు. అంచనాలు పెట్టుకుని సినిమా హాల్ లోకి వెళ్ళడం సహజం. ఎన్ని అంచనాలతో వెళ్ళినా వాటిని దాటి అలరించడం ఈ సినిమా లో ఉన్న విషయం. విషయం చెప్పుకున్నాం కాబట్టి విశేషాల్లోకి వెళదాం.


క్లుప్తంగా చెప్పాలంటే:
కార్తీక్ అనే కుర్రాడు ఒక పెళ్ళిలో  శ్రుతి అనే అమ్మాయిని చూసి మనసు పారేసుకుంటాడు. ఆ అమ్మాయి సెల్ నంబర్ ఫ్రెండ్ ద్వారా తెలుసుకుని ఆమెతో స్నేహం చేస్తాడు. కానీ తాగుడు మైకంలో ఆ ఫ్రెండ్ రాంగ్ నంబర్ ఇచ్చాడని, ఇన్నాళ్ళు తాను కలవకుండా ఫోన్ లో మాట్లాడిన అమ్మాయి, పెళ్ళిలో చూసిన శృతి  వేరని తెలుస్తుంది. దాంతో అప్పటి వరకు ఫోన్లో  మాట్లాడిన శ్రావణి ని కట్ చేస్తాడు. కానీ నిండా కార్తీక్ ప్రేమలో మునిగిన శ్రావణి హర్ట్ అయ్యి తన మనసుని గాయ పరిచిన వాడిని ఏడిపించే పని పెట్టుకుంటుంది. ఆద్యంతం అసక్తిగా, సరదాగా సాగే కథ కంచికి ఎలా వెళ్తుందో తెర మీద చూడాలి.


మొత్తంగా చెప్పాలంటే:
సత్తా ఉన్న కథ, సత్తువ గల కథనం, పొందికైన సంభాషణలు, చక్కని నటీ నటులు... వెరసి దర్శకుడికి అన్నీ సరిగ్గా కుదిరాయి. తన ప్రతిభను చాటుకోవడానికి మాంచి గ్రౌండ్ సిధ్ధం అయ్యింది. కథలో సీరియస్ నెస్ చోటు చేసుకుంటున్నప్పుడల్లా సరదా సన్నివేశ కల్పనతో ప్రేక్షకులని నవ్విస్తూ నడిపించేసాడు.

నిత్యా మీనన్, నితిన్ ల అభినయం ఈ సినిమా బాగుండడానికి ప్రధాన భూమిక పోషించింది. అనూప్ రూబెన్స్ ఇచ్చిన నేపధ్య సంగీతం ఈ సినిమాకి ఆయువుపట్టు. అలాగే కూర్పు, ఛాయాగ్రహకుడి పనితనం అన్నీ దర్శకుడి ప్రతిభకు న్యాయం చేసే విధంగా ఉన్నాయి. ప్రత్యేకంగా చెప్పుకోవల్సింది మాత్రం హర్ష వర్ధన్ సంభాషణలు.

ప్రధానంగా నితిన్, నిత్యలపై సాగే ఈ సినిమా అలీ, తాగుబోతు రమేష్ ల నటనతో నవ్వులు పూయిస్తుంది. కథానాయకుడి స్నేహితుడిగా  నటించిన మధు, స్వలింగ సంపర్కుడి పాత్రలో కనిపించిన రవి తమదైన ప్రతిభ కనబరిచారు. మొత్తానికి తొలి సినిమా అయినా దర్శకుడు విజయ్ కొండా పదునైన పని తనం చూపించాడు.

ఇక ఇందులో విడుదలకి ముందు హడావిడిగా చెప్పుకున్న జ్వాలా గుత్త ఐటం సాంగ్ చప్పగా అనిపించింది. ఆమె వెండి తెరకి దూరంగా ఉండడమే క్రీడా కారిణిగా ఆమెకు గౌరవంగా ఉంటుందనిపించింది.

విశేషాల్లోకెల్లా విశేషం ఏమిటంటే పవన్ కళ్యాణ్ సినిమాల్లోని సన్నివేశాల్ని ఇష్టం వచ్చినట్టు వాడేసుకున్నారు. నితిన్ కి పవన్ మీద ఉన్న భక్తిని చాటుకోవడంతో పాటు ఆ సన్నివేశాలతో ప్రేక్షకులను కూడా రంజింపజేసారు. ప్రధమార్థం బాగా బలంగా ఉండి, ద్వితీయార్థంలో అక్కడక్కడ పట్టు సడలింది. అయినప్పటికీ ఇది విస్మరించాల్సిన సినిమా మాత్రం కాదు. సరదాగా నవ్వుకోవడానికి ఒకసారి చూసేయొచ్చు.


ఒక్క ముక్కలో చెప్పాలంటే:  చూసేయండి


గోతెలుగు తీర్పు: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
condolences to PB Srinivas