Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Anubandhaalu Fifteenth part

ఈ సంచికలో >> సీరియల్స్

తొమ్మిదవ భాగం

nadiche nakshatram Ninth part

చిత్రనిర్మాణంలో విలువలు పాటించే 'ఉషాకిరణ్ సంస్థ' అపుడెపుడో ఎనభైల్లోనే 'ప్రతిఘటన' సిన్మా తీసారు... తెలుసా?

'తెలీదన్న'ట్లు అడ్డంగా తలూపింది గాయత్రీపాటిల్.

"ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతిలోకంలో... రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో... అన్నపాట అందులోదే. ఎంతో ప్రాచుర్యం పొందింది. ఆ సినిమాలో కూడా స్టోరీ డిమాండ్ మేరకు ఇలాటి సీన్ లోనే యాక్ట్ చేసిన విజయశాంతి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారి సినీ వైభవకాంతి అయింది. నిన్ను వెతుక్కుంటూ వచ్చిన మంచి అవకాశం ఇది. ఆలోచించుకో" ప్రొడ్యూసర్ టైం ఇచ్చాడు. అతడివద్ద సెలవు పుచ్చుకుని బయటకొచ్చి గుండెల్నిండుగా ఊపిరి పీల్చుకుంది గాయత్రీపాటిల్.

"సెమీ న్యూడ్..." ఆ పదం వినేసరికి ఒక్కసారి వళ్ళు ఝల్లుమంది. ఇంతకుముందు ఇలాగే... రెయిన్ సాంగ్ అనగానే తుళ్లిపడింది.

కానీ... కమర్షియల్ సిన్మాల్లో తప్పనిసరి తంతు అని తెలుసుకున్న తర్వాత ఆ సాంగ్ లో తప్పక నటించింది. మరిపుడో... సెమీన్యూడ్ ఆఫర్ వచ్చింది. ఇంతకీ... తన సినీ జర్నీ ఎటువేపు వెళ్తోంది.

ఫస్ట్ సినిమాలో మిడ్డీస్, షార్ట్స్ తో మోస్ట్ గ్లామరస్ కాలేజ్ గాల్ గా నటించి మెప్పించింది. రెండో సినిమాలో చీర బొడ్డు కిందకి జార్చి అందాల్ని ప్రదర్శించింది. నిజానికి చీర కట్టుకోవడమే తనకు తెలీదు. తొలిసారి ఇంట్లో పెద్దమనిషి అయినపుడు అమ్మ కట్టింది చీర. తర్వాత... మళ్లీ ఎపుడూ చీర కట్టలేదు. రెండో సినిమాలో చీరతో నటించాల్సిన కొన్ని సీన్లున్నాయని తెలిసి ముందు బెదిరిపోయింది. సరిగ్గా అపుడే... అసిస్టెంట్ డైరక్టర్ సాయం చేసి జూబ్లీహిల్స్ లో ఉన్న ఓ సెంటర్ కి తీసుకెళ్లాడు.

అదో ట్రయినింగ్ సెంటర్. పెళ్లిళ్లు, శుభకార్యాలకు అటెండయ్యే అమ్మాయిలకు చీర కట్టుకోవడంలో శిక్షణ ఇచ్చే సెంటర్.

"చీర కట్టడంలోనూ ట్రయినింగా?" ఆశ్చర్యపడింది గాయత్రీపాటిల్.

"ఔను... ట్రయినింగే. శారీ కట్టుకోవడం నీకు రాదుగా" అంది ఆ సెంటర్ నిర్వాహకురాలు శారద చక్కగా నవ్వుతూ.

"రాదు..." సిగ్గుపడుతూ చెప్పిందామె.

"అందుకే... ఈ ట్రయినింగ్. రెండు రోజులు సాయంత్రాలు  వస్తే చాలు... చీరకట్టుకోవడం ఇట్టే తెలిసిపోతుంది. అందులో శిల్పంలా ఉన్న అందాల హీరోయిన్ వి. ముందు ముందు నీ చీరకట్టే ఓ ట్రెండ్ లా మారి మార్కెట్ మాయాజాలం కావొచ్చు. ఫలానా హీరోయిన్ కట్టిన చీరలంటూ వస్త్రనందనాల్లో నీ చీరలకు డిమాండ్ పెరగొచ్చు. అన్నట్టు... కళాభినేత్రి వాణిశ్రీ తెలుసు కదా... సావిత్రి తర్వాత అంతటి హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న తెలుగు తార. ఆమె చీరకట్టుకుంటే చీరకే అందమొస్తుంది. అందులో ఆమె నవలానాయిక కూడా. యద్దనపూడి, కోడూరి కౌసల్యాదేవి లాంటి లేడీ రైటర్లు రాసిన నోవల్స్ ఆధారంగా అప్పట్లో తెలుగులో సినిమాలు తీస్తే... ఆయా చాలా సినిమాల్లో వాణిశ్రీ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. 'ప్రేమ్ నగర్' సినిమాలో 'కడవెత్తుకొచ్చింది కన్నెపిల్లా..." అనేపాటలో చుక్కల చీరలో ఆమె ఎంతో అందంగా ఉంది. ఆమె చీరకట్టుకుని అలా అలవోకగా నిల్చుంటే అజంతా సుందరే ఎదురొచ్చినట్లనిపిస్తుందెవరికైనా..." చెప్తోంది శారద.

"నిజానికి చీరని మించిన గ్లామరస్ డ్రెస్ వేరొకటి లేదు. మినీస్... మిడ్డీస్... గాగ్రాచోళీల్లో కనిపించని అందాలన్నీ ఒక్క చీరకట్టులోనే కనిపిస్తాయంటే అతిశయోక్తి కానేకాదు. నిండుగా చీర కట్టుకున్నా కనిపించీ కనిపించకుండా కనికట్టు చేసే నడుంఒంపుల్ని ఎలా కీర్తించాలో తెలీక ఈ మగాళ్ళు ఆ వొంపుసొంపుల్లోనే తలదూర్చి ఊపిరాడకుండా ఉంటే మేలనుకుంటారు. చీరలో అంత మహిమ ఉంది తెలుసా? అలాటి చీరని విస్మరించడం... పక్కన పడేయడం భారతీయ మహిళకి భావ్యం కానేకాదు. సౌకర్యాలకోసం మిగతా డ్రెస్ ల్ని ఎంత ధరించినా అవసరమైన ప్రతి సందర్భంలోనూ చీర కట్టుకోవాలి. చీరకట్టుకోవడం... అందంగా కుచ్చిళ్ళు అమర్చుకోవడం తెలీదనడం ఈనాటి ఆడపిల్లలకి ఫ్యాషన్ గా మారింది. హటాత్తుగా చీరకట్టుకోవాల్సిన సందర్భం ఎదురైనపుడు ఎలా కట్టుకోవాలో? తెలీక తికమకపడ్తుంటారు. ఇళ్లలో ముత్తయిదువులు, పెద్దవాళ్ళు ఉండి సహకరిస్తే సరేసరి, లేకుంటే... చీర ఎలా కట్టుకోవాలో అర్ధం కాక బుర్రబద్దలు కొట్టుకుంటుంటారు" నవ్వుతూ అందామె.

"అంతా బాగుంది కానీ... ఇలాటి ట్రయినింగ్ సెంటర్ ప్రారంభించాలని ఎందుకనిపించింది?" ఆసక్తిగా ఆరా తీసింది గాయత్రీపాటిల్.

"ఇదంతా మీలాటివాళ్ళ ప్రోత్సాహమే. మొదట్లో ఇరుగుపొరుగు ఆడపిల్లలు దగ్గరకొచ్చి - 'ఆంటీ... ఇవాళో ఫంక్షన్ కి కంపల్సరీ శారీలోనే అటెండవాలి. కాస్త కట్టిపెడుదురూ' అని ముద్దుముద్దుగా అడిగేవారు. అలాఅలా వాళ్లకి చీరలు కడుతుండగా ఓరోజు ఓ టీవీ సీరియల్ లో నటించే యాక్ట్రెస్ కూడా అందమైన చీరకట్టుకోసం నన్నాశ్రయించింది. సరిగ్గా, అపుడే ఇలాటి ట్రయినింగ్ సెంటర్ ప్రారంభించాలనిపించింది. ఇదే ఆలోచనని 'నియర్ అండ్ డియర్' తో షేర్ చేసుకుంటే వాళ్ళెంతగానో ప్రోత్సహిస్తూ 'ఇన్నోవేట్ థాట్' అని ప్రశంసించారు..." అని చెప్పింది శారద.

"అంటే... ఓ ఐడియా మీ జీవితాన్నే మార్చిందన్నమాట" అంది గాయత్రీపాటిల్ కూడా ప్రశంసాపూర్వకంగా ఆమెని చూస్తూ.

"అంతేకాదు... ప్రపంచమెంత ముందుకెళ్తున్నా, ఆధునికత ఎన్ని వెర్రితలలు వేస్తున్నా మనవైన సంస్కృతీసంప్రదాయాలవేపు మనచూపు సహజంగానే పడుతుంది. మనం మరచిపోతున్న చీరకట్టులోని సౌందర్యాల్ని వెతుక్కుంటూ మళ్లీ మొదటికే వస్తామనిపిస్తోంది. ఇవాళ రేపు అలరించే ఆధునిక డ్రెస్సుల్లో అమ్మాయిల్ని చూస్తుంటే... ఒకనాటి పరికిణీవోణీ కనిపించడం లేదే అని ఒక్కోసారి మనసు బెంగపడేది. అంతేనా... ప్రపంచదేశాల్లోనే ఎంతో ప్రత్యేకంగా మనల్ని నిలబెట్టిన చీరకట్టు కూడా క్రమక్రమంగా మాయమవుతోందనే బాధ ఉండేది. సముద్రాలు, సరిహద్దులు దాటి ఇక్కడికి వచ్చిన విదేశీ మహిళలు మన చీరల్ని చూసి మోజుపడి ఒక్కసారంటే ఒక్కసారి తనివితీరా కట్టుకుని ఆ తర్వాత చార్మినార్ ని సందర్శించి అక్కడి గల్లీల్లోని రంగురంగుల గాజుల్ని కూడా చేతులకి వేసుకుని సంబరపడ్తుంటే నాకు పట్టరాని ఆనందమేసేది. అన్నట్లు చెప్పడం మరిచాను... ఈ సెంటర్ పెట్టిన కొత్తలో కొంతమంది నవ్వినవాళ్ళూ ఉన్నారు. 'ఇక్కడ చీర కట్టుకోవడానికీ ట్రయినింగ్ సెంటరా... పిదపకాలం పిదపబుద్దులు' అని ఎకసెక్కం చేసినవాళ్ళూ ఉన్నారు. ఆ తర్వాత్తర్వాతఇండస్ట్రీకి చెందినవాళ్ళు, ఒక్కసారైనా చీరకట్టుకోవాలని తపించి తపన పడే విదేశీమహిళలు రావడంతో ఈ సెంటర్ ఇమేజ్ పెరిగింది" చెప్పుకొచ్చింది శారద.

తర్వాత గాయత్రీపాటిల్ ని లోపలికి తీసుకెళ్ళింది. ఆమెని తీసుకొచ్చిన అసిస్టెంట్ డైరక్టర్ మాత్రం ఎదురుచూస్తూ బయట హాల్లో ఓ కుర్చీలో కూచున్నాడు.

అరగంట తర్వాత బయటకొచ్చిన గాయత్రీపాటిల్ ని చూసి కళ్ళింతలు చేసుకుని ఆశ్చర్యపోయాడతడు. నిండైన చీరలో పొందికైన అందాల్ని ఆవిష్కరిస్తూ కుందనపు బొమ్మలా మెరిసిపోతోంది గాయత్రీపాటిల్.

"నువ్వు కట్టుకున్న తర్వాత చీరకే అందమొచ్చింది" ప్రశంసించింది శారద గాయత్రి చెక్కిలిపై ఆత్మీయ చుంబనం చేస్తూ.

"ఔనౌను..." అన్నాడు ఆ సమయంలో అసిస్టెంట్ డైరక్టర్ కూడా. శారద చెప్పిన మెలకువల్తో చీరకట్టుకోవడంలో సిద్ధహస్తురాలైంది గాయత్రీపాటిల్. ఎవరి సాయం లేకుండా ఇండిపెండెంట్ గా శరీరానికి శారీని అలవోకగా అందంగా చుట్టేసుకోవడం అలవాటు చేసుకుంది. దాంతో... మొన్నటికి మొన్న రెయిన్ సాంగ్ లో పల్చటి తెల్లచీర ఇచ్చి కట్టుకోమనగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇట్టే కట్టేసుకుందామె.

చెక్కిన శిల్పం లాంటి శరీరానికి చీర ఎంతో అందాన్నిస్తోందని ఎంతో మంది పొగుడుతుండగా... ఇవాళ ఈ ప్రొడ్యూసర్ వస్త్రసన్యాసం చేస్తూ 'సెమీన్యూడ్' గా కనిపించమంటున్నాడు. అందుకు తగ్గ ఉదాహరణలిస్తున్నాడు కూడా.

తను బస చేసిన హోటల్ రూంకి వచ్చేదాకా ఆ ఆఫర్ గురించే ఆమె ఆలోచిస్తోంది.

'ఒప్పుకోవాలా... వద్దా?' ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది.

"ఒప్పుకో... మంచి ఆఫర్" విషయం విన్న వెంటనే సజెషనిచ్చాడు ప్రదీప్.

"ఎందుకు చెప్తున్నానో విను. ఆఫర్ ఇచ్చినవాడు సాదాసీదా ప్రొడ్యూసర్ కాదు. ఆయన చేతుల్లో పడ్డ హీరోయిన్లు పదికాలాలు బాక్సాఫీస్ ని ఏలుతారు. అంతేనా... టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ దాకా ఫిల్మ్ జర్నీ చేస్తారు..." అని చెప్పాడతడు.

"ఓ సీన్ లో సెమీన్యూడ్ గా నటించాలి" సంకోచంగా అంది గాయత్రీపాటిల్.

"అంతేగా... ఆ ప్రొడ్యూసర్ ముందుగా చెప్పి ఆ సీన్ కి నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. అలా చెప్పకుండా సినిమా ఇచ్చి నీముందు కెమెరా పెట్టి మరీ చూపిస్తున్న ఈ సోకాల్డ్ ప్రొడ్యూసర్ల కన్నా అతడెంతో నయం కదా! నువ్వేంటో... ఆ సినిమాలో నీ కేరెక్టరేంటో సైన్ చేసేముందు నీకో క్లారిటీ ఉంటుంది"

"తప్పేం కాదు కదా!"

"మారుతున్న కాలంతోపాటు తప్పొప్పులు మారిపోతుంటాయి. ఒకపుడు హీరోహీరోయిన్లు స్క్రీన్ మీద ముద్దుపెట్టుకుంటే పెద్ద దుమారం చెలరేగింది. సొసైటీ పోలిసింగ్ బాధ్యత తమదే అని భావించే కొంతమంది రోడ్డునపడి వీరంగం చేసారు. ధర్నాలు, ఆందోళనల్తో ఆగమాగం చేసారు. మరిపుడో... సిన్మాల్లో ముద్దు సీన్లు వెరీ కామన్ అయిపోయాయి. నిన్నటికి నిన్న మనమిద్దరం కూడా ఓ ముద్దు సీన్లో నటించాం కదా..." తమకంగా ఆమెవేపు చూస్తూ అన్నాడు ప్రదీప్.

"ఛీ... ఫో" అంది సిగ్గుపడుతూ గాయత్రీపాటిల్.

"అందుకే అన్నారు ఆడవాళ్ళ మాటలకి అర్ధాలు వేరని. నువ్వు దూరంగా పొమ్మంటే దగ్గరకి రమ్మనే కదా?" అన్నాడతడు.

"దూరంగా పొమ్మనే అర్ధం"

"అయితే... వెళ్తున్నా" ఒక్క ఊదుటున లేచాడతడు. అంతలోనే అతడి చేతిని పట్టుకుని బలవంతంగా కూచోపెడుతూ - "విషయం తేలకుండా ఎక్కడికి పోతావ్?" అంది గాయత్రీపాటిల్.

"చూసావా... నేను వెళ్తుంటే నువ్వే అడ్డుకుంటున్నావ్. అందుకే, అన్నాను ఆడవాళ్ళ మాటలకి అర్ధాలు వేరని. అది ఒప్పుకుంటేనే కూచుంటాను" అన్నాడు మొండికేస్తూ.

"ఆ ఆఫర్ ఒప్పుకోవాలా... వద్దా? అని నే తలనొప్పి తెచ్చుకుంటుంటే నీకు ఆటయి పోయింది" కసురుకుందామె.

"అంతమంచి అవకాశం ఒప్పుకోమనే కదా చెప్తోంది. ఒకపుడు సిన్మాల్లో హీరోయిన్ ని హీరో తాకేవాడే కాడు. ఇపుడో... అతడు తాకని ప్రదేశం లేదు. ఒకపుడు ఎంత ప్రేమ ఉన్నా ముద్దు పెట్టుకునేవాడే కాడు. ఇపుడో ఏకంగా 'లిప్ లాక్' సీన్లలో కనిపిస్తున్నాడు. అవి కూడా సెకన్లు దాటి నిముషాల లెక్కల్లో పరుగులు తీస్తోంది. ఒకపుడు సినిమాలో 'నాట్యతార'లుండేవాళ్లు. ఇపుడు హీరోయిన్లే ఆ డాన్సులూ చేస్తున్నారు. ఒకప్పటి 'ఎక్స్ ప్రెషన్' కనా ఇపుడు 'ఎక్స్ పోజింగ్', అప్పటి 'ఏక్టింగ్ గ్రామర్ కన్నా ఇపుడు 'వయసు గ్రామర్' ఇండస్ట్రీని ఏలుతున్నాయి. అంతేకాదు... సన్నీలియోన్ లాంటి ఫోర్న్ స్టార్ మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చేసి 'జిస్మ్-2' అంటూ దేహాల సందేహాల్ని తీర్చేస్తున్న ప్రస్తుత యుగంలో ఓ సినిమాలో నువ్వు 'సెమీన్యూడ్'గా కనిపించినంత మాత్రాన ప్రపంచం తలకిందులైపోదు. ఎక్కడా ఏ సంచలనాలు జరగవు. సినీ వైకుంఠపాళిలో ఈ కేరక్టర్ కెరీర్ లో మరింత పైకి ఎదిగేందుకు అందివచ్చిన అవకాశంగా భావించు. నేను నువ్వయితే ఆ కేరక్టర్ కి 'ఓకే' చెప్పేవాడిని" అన్నాడు ప్రదీప్.

అతడు చెప్తోంటే ఆమె వింటోంది.

"మొదట్లో హోమ్లీ హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై తళుక్కుమన్న విద్యాబాలన్ రూట్ మార్చుకుని ఇటు యూత్ ఆడియన్స్ హార్ట్ త్రోబ్ గా... అటు ప్రొడ్యూసర్లకి హాట్ ప్రోపర్టీగా ఎలా మారిందో తెలుసుకదా!" అడిగాడతడు.

"ఔను... 'డర్టీ పిక్చర్' తర్వాత తన రేంజ్ చేంజయింది. ఆ పిక్చర్ ని ఇక్కడి ఈ తెలుగు ఇండస్ట్రీ నాట్యతార స్మిత జీవితాన్నాధారంగా తీసారట..."

"అని ఆ చిత్రనిర్మాత చెప్తున్నాడు. కాదని... స్మిత రిలేటివ్స్ వాదిస్తున్నారు. ఏదేమైనా... అంతవరకూ హోమ్లీ హీరోయిన్ గా చేసిన విద్యాబాలన్ సడన్ గా టర్న్ తీసుకుని ఈ సినిమా చేసేసరికి ఆమెకి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒకపుడు ఆఫర్లకోసం ఆమె ఇండస్ట్రీ చుట్టూ తిరిగేది. ప్రొడ్యూసర్లని కలిసేది. కానీ, ఇపుడో ఆమె చుట్టే ఇండస్ట్రీ తిరుగుతోంది. ఒకపుడు ఆమెని కాదనుకున్న నిర్మాతలే ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ ఇపుడు సినిమాలు తీసేందుకు ఆమె చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే... ఈ సినిమా ఫీల్డ్ సక్సెస్ చుట్టూ తిరుగుతుంది. ఆ సక్సెస్ ని పొందాలంటే అందివచ్చిన ఆఫర్లను తెలివిగా అంగీకరిస్తూ ముందుకు సాగాల్సిందే" విడమర్చి చెప్పాడు ప్రదీప్.

"నువ్వన్నది కరెక్టే" అంది గాయత్రీపాటిల్. ఆ తర్వాత సెల్ తీసి ఆ ప్రొడ్యూసర్ కి కాల్ చేసి 'ఓకే' చెప్పిందామె.

"కంగ్రాట్స్ గాయత్రీ!" అవతలివేపు ఫోన్ లో ప్రొడ్యూసర్ మాతంగరావు. అతడి గొంతు విని ఆశ్చర్యపోయింది గాయత్రి.

"చాల్రోజులకి సర్... మేం గుర్తున్నామా?" అడిగింది ఆమె.

"ఆ ప్రశ్న వేయాల్సింది నువ్వు కాదు"

"మరి..."

"నేను..." ఆ ఆన్సర్ కి అవాక్కయింది.

"నువ్వు ఈ ఇండస్ట్రీకి వచ్చావంటే అది నా చలవే. నేనే కదా నిన్ను ఇంట్రడ్యూస్ చేసింది"

"అదెవరు కాదంటారు? మీ వల్లే ఈ ఇండస్ట్రీలో ఇపుడిలా ఉండగలుగుతున్నా" అంది గాయత్రి.

"కాల్ చేస్తే ఇలా ఎవరైనా మాట్లాడతారు. అరే... మాతంగరావుగారి సినిమా ఎలా రన్ అవుతోంది? అని కనీసం ఆలోచించావా? అడిగాడతడు.

"అది నా మొదటి సినిమా. ఎలా మరిచిపోతాను?"

"మరిచిపోయావు కాబట్టే గుర్తుచేస్తున్నాను. నెక్స్ ట్ సండే ఈవినింగ్ హైదరాబాద్ లో మన సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్. కెరీర్ లోనే ఫస్ట్ హండ్రెడ్ డేస్ మెమెంటో అందుకోవడానికి నువ్వు కంపల్సరీ రావాల్సిందే..." ఇన్ వైట్ చేసాడు మాతంగరావు.

"థాంక్యూ సర్. సినిమాలో అవకాశమే కాదు... నిలదొక్కుకునే కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఇపుడు నేను కూడా హండ్రెడ్ డేస్ సినిమా హీరోయిన్నేకదూ"

"డౌటెందుకు... 'జత' దినోత్సవాలే తప్ప శతదినోత్సవాలు క్రమక్రమంగా కరువైపోతున్న ఇండస్ట్రీలో మన సినిమా థియేటర్లలో జెన్యూన్ గా ఆడింది. విరగబడి ఆడియన్స్ చూశారు. ఒకప్పుడు సినిమాయే ఏకైక ఎంటర్టయిన్ మెంట్. దాంతో, ఎక్కడెక్కడివాళ్లో బళ్లు కట్టుకుని మరీ సినిమాహాళ్ళకి వచ్చి ఎంతో ఇష్టంగా చూసేవాళ్లు. మరిపుడో... సినిమాకి సమాంతరంగా ఎన్నో వినోదాలు వచ్చేసాయి. ఇంట్లోంచి కదలకుండా బుల్లితెర వీక్షకుల్ని ఓ పక్క కట్టిపడేస్తుంటే మరోపక్క పబ్స్... థీమ్ పార్క్ లు హడావుడి చేస్తున్నాయి. వీటికితోడు పెరిగిన కంప్యూటర్ పరిజ్ఞానం పుణ్యమా? అని పైరసీ బెడద సినిమాని చంపేస్తుంది. ఇన్ని అవరోధాల్ని ఎదుర్కొంటూ ఓ సినిమా బతికి బట్టకట్టడమే అరుదైపోయిన ఈరోజుల్లో మన సినిమా హండ్రెడ్ డేస్ ఆడిందంటే నాకెంతో హ్యాపీగా ఉంది. ఈ సినిమాని జనాలు గుండెలకి హత్తుకున్నారు. వీక్ వీక్ కి థియేటర్ల సంఖ్య పెంచాల్సి వచ్చింది. అంటే... సినిమా నచ్చితే ప్రేక్షకులే ప్రచారకర్తలు. వాళ్ల మౌత్ పబ్లిసిటీ ముందు ఏ పబ్లిసిటీ అవసరం లేదు..." ముందు కస్సుమన్నా నెమ్మదించిన తర్వాత కూల్ గా చెప్తున్నాడు మాతంగరావు.

"ఔను... మీరన్నది నిజం" వింటోంది గాయత్రీపాటిల్.

"నువ్వు ఫీల్ గుడ్ మూవీతో ఇండస్ట్రీకి అడుగుపెట్టావు. మొదటి సినిమాతోనే మంచి గ్లామరస్ హీరోయిన్ లా క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నావు. ఇవాళరేపు హీరోయిన్లకు గ్లామర్ స్పెలింగ్ తెలీక తప్పులు చేస్తున్నారు. తప్పటడుగులు వేస్తున్నారు. ఆ తప్పులు నువ్వు చేయొద్దు. గ్లామర్ అంటే... తెల్లవారుజామున మంచులో తడిసి మలినాలు లేని మల్లెపూవులా స్వచ్చంగా ఉంటూ చూసేవాళ్ళకి ఆహ్లాదాన్ని కలిగించాలి. అంతేతప్ప గ్లామర్ ముసుగులో వళ్ళంతా విప్పేసి జనాలు కళ్ళప్పగించేలా చేయడం కాదు. థియేటర్లోంచి బయటకివెళ్ళిన వాళ్లు... ఆ హీరోయిన్ మన పక్కింటి అమ్మాయిలా ఎంత బాగుందో? అనుకోవాలి కానీ... ఓ వగలరాణిలా ఎన్ని హొయలు పోయిందో అని అనుకోకూడదు. చూస్తున్నంతసేపూ మానసిక ఆనందాన్ని... చూసిన తర్వాత తలుచుకున్నకొద్దీ అంతులేని హాయిని అందించేదే అసలు సిసలైన గ్లామర్. కానీ... చూసినపుడూ... చూసిన తర్వాతా మనిషిని నిలువనీయకుండా చేయకూడదు. అపుడది గ్లామర్ అనిపించుకోదు... ప్రోవోకింగ్ అనిపించుకుంటుంది. అంత రెచ్చగొట్టడం భావ్యమా? మన సినిమాలోనూ హీరోయిన్ గ్లామరస్ గానే ఉంది. హీరో హీరోయిన్ కి ముద్దిచ్చే సన్నివేశాలు కూడా పొయెటిక్ ఎక్స్ ప్రెషన్ లా ఉండాలే తప్ప... శరీరాల్ని వేడెక్కించేలా ఉండకూడదు. సినిమా అంటే... వెలుగునీడల కవిత్వం" అన్నాడతడు. ఆయనెపుడూ అంతే... అనుకున్నది అనుకున్నట్లు చెప్పేస్తాడు. సరిగ్గా ఆ క్షణంలోనే ఆమెకి తను తాజాగా సైన్ చేసిన 'సెమిన్యూడ్' కేరక్టర్ గుర్తొచ్చింది. ఈ సంగతి తెలిస్తే మాతంగరావు ఎలా ప్రతిస్పందిస్తాడు? ఊహించడానికే ఆమెకి భయమేసింది.

మరిన్ని సీరియల్స్
Aavidamma Story by Mohanakrishna Indraganti