Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nadiche nakshatram Ninth part

ఈ సంచికలో >> సీరియల్స్

ఆవిడమ్మ - మోహన కృష్ణ ఇంద్రగంటి

Aavidamma Story by Mohanakrishna Indraganti

ఆ సందు మూల ఒక చిన్న డాబా ఇల్లుంది. డాబా అన్నంతమాత్రాన పూర్తిగా డాబా కూడా కాదు. పిట్ట గోడలు సగం కట్టి వదిలేసిన డాబా ఇల్లు అది. ఇంకా పొడుగ్గా ఇనుప ఊచలు గాల్లో నిలబడి గాలొచ్చినపుడు ఊగుతూ, వర్షం వచ్చినప్పుడు తడిసి మెరుస్తూ, ఎండల్లో నిటారుగా నిలబడీ కనబడతాయి ఆ డాబా మీద. ఒక అంచు వెంబడి కొద్దిగా పగిలి బయటికి ఎర్ర, నల్లమట్టి కనబడే పూలకుండీలూ, వాటిలో మొక్కలూ, ఇంటి రంగు మాసిన తెలుపు.

ఆ ఇంటిని ఆవిడమ్మగారి ఇల్లు అంటుంటారు ఆ పేటలో వాళ్ళు. ఆవిడ పేరు ఎవరికీ తెలియదులా ఉంది. కథ రాయడానికి పేరుండాలి కదా అని ఎంత ప్రయత్నించినా దొరకలేదు. ఆవిడ పేరు చిన్నప్పుడు ఆవిడ, ఇప్పుడు ఆవిడమ్మ అనుకుందాం మరి.

ఆ ఇల్లు నాలుగ్గదులది వసారాతో కలిపి. వసారాలకి లతల గ్రిల్లుంటుంది. ఆ గ్రిల్లుకి కూడా ఏదో లత చుట్టుకునే ఉంటుంది. ఒక్కొక్కప్పుడు పూలుంటాయి. ఒక్కొక్కప్పుడు ఉండవు. ఆ ఇంట్లో ఆవిడమ్మ ఒక్కర్తే ఉంటుంది. సాధారణంగా బయటికి రాదు. పొద్దున్నే నడకకి వెల్లొస్తుంది. అరవై ఐదేళ్ళైనా చకచకా నడుస్తుంది. ఆవిడ ముఖం మెరుస్తుంటుంది. ఎప్పుడూ చెరగని చిరునవ్వు. ఎప్పుడూ కాస్త చెదిరిన తెల్ల జుట్టు. మళ్ళీ సాయంకాలం బయటకొచ్చి మొక్కలకి నీళ్ళుపోసి, డాబా మీద కుర్చీ వేసుకుని కూర్చుని పుస్తకం చదువుకుంటుంది. రేడియో వింటుంది. చీకటి పడగానే లోపలికెళిపోతుంది. పదింటికల్లా ఆవిడింట్లో లైట్లు ఆరిపోతాయి.

చెప్పే ముక్కేవిటంటే, ఆవిడమ్మ పెళ్ళి చేస్కోలేదు. ఆవిడ ఒంటరిజీవి. కానీ, హాయిగా ఉంటుంది. ఆనందంగా కనబడుతుంది. పెద్దగా చుట్టాలూ, స్నేహితులూ ఉన్నట్టు కూడా కనబడదు. వింతే మరి!

ఆవిణ్ణి కలిసి ఆవిడ చెప్పమండానికి భయమేసింది. కానీ చుట్టుపక్కల ఆవిడ వయసువాళ్ళూ, ఒకప్పుడు ఆమెని ఎరిగిన వాళ్ళు ఆశ్చర్యం, వాళ్ళెవరికీ ఆవిడ పేరు తెలీదు! కానీ చాలా విషయాలు చెప్పారు. కొందరు ఆమె వింత మనిషి (తిక్కది) అన్నారు. కొందరు అదోరకం మనిషి పిచ్చిది అన్నారు. మరికొందరు 'అబ్బో' వ్యవహారాలు నడిపేరకం అన్నారు. కొందరు మాత్రం "పాపం మంచావిడ" అన్నారు. ఇలా రకరకాలుగా - ఇంకా చాలా విన్నాను గానీ చెప్పడం కుదరదు - విన్న కథలూ, అభిప్రాయాలూ, ఆశ్షర్యార్ధకాలు ఓరోజు ఒళ్ళో పోసుకుని ఏరితే చివరికి ఇదీ తెలిసింది.

ఆవిడమ్మకి చిన్నప్పట్నించీ కోప్పడటం,, ఏడవడం, అంటేనే తెలీదుట. పుట్టినప్పట్నించీ నవ్వుతూనే ఉండేదిట. చిన్న రూపాయిగా ఉన్నప్పుడు ఓసారి పక్కింటి పిల్ల ఎత్తుకుని పడేస్తే ఆవిడమ్మ కితకితలు పెట్టినట్టు నవ్విందట. వాళ్ళమ్మ భయపడి 'ఇదేమిటి మగరాయుడి బుద్ధులు' అని డాక్టరు దగ్గరికి తీస్కెల్తే డాక్టరు తిట్టిపోశాట్ట. "అందరు తల్లులూ మా పిల్లలు ఒకటే ఏడుస్తున్నారూ అదీ ఇదీ అంటుంటే మీరేమిటమ్మా! అసలే ప్రాక్టీసు లేక ఏడుస్తుంటే" అన్నాట్ట.

కాస్త పెద్దయ్యాక కూడా ఆవిడమ్మ ఎప్పుడూ దేని గురించీ తల్లిదండ్రుల్ని ఏడిచి గీపెట్టలేదు. ఏడిస్తే అది తీసుకునేది. స్కూల్లో కూడా ఎవ్వరితో పోట్లాట పెట్టుకునేది కాదు. ఒకట్రెండుసార్లు తోటిపిల్లలు అల్లరిలో కొట్టినా, కంగారుపడి వాళ్ళేడిచార్ట గానీ, ఆవిడమ్మ మాత్రం, ఊహూ!

చదువు కూడా ఫర్వాలేదు ఆవిడమ్మది. సరిగ్గా ఫస్టు క్లాసులో పాసైందిట. నాన్న కాలేజీలో చేర్పించాడు. ("చెప్తే విన్నాడు కాదు, మూర్ఖపు ముండాకొడుకు," అనేది ఆవిడ తల్లి బతికున్నన్నాళ్ళూ.) కానీ నాన్నకి కాస్త ముందు చూపెక్కువ. 'చదువుకున్న అమ్మాయిలనే కోరుకుంటారు ముందు ముందు మగాళ్ళు' అనేవాడాయన. ఆయన లాజిక్కు ఇది - "అబ్బాయిలు చదువుకున్న అమ్మాయిల్ని కోరుకుంటున్నారు. చదివిద్దాం. ఒకవేళ అబ్బాయికి చదువొద్దనికో అమ్మాయిని ఇంట్లోనే ఉండమందాం. అమ్మాయికి చాయిస్సుంది - పెళ్లి, లేకపోతే ఉద్యోగం. మగాడికి పెళ్ళికి ముందూ తర్వాతా కూడా ఉద్యోగమే! హ్హ! హ్హ! హ్హ!'

కానీ నాన్న ఆవిడమ్మని తప్పుగా అంచనా వేశాడు. ఆయన గుక్క తిప్పుకునే లోపల ఆమె బిఏ, ఎమ్మే, పి.హెచ్.డి. చేసి చిద్విలాసంగా కూర్చుంది. "ఇప్పుడు దీనికి పెళ్లెలా?" అంది తల్లి. "చూద్దాం లే!" అన్నాడు నాన్న.

సరిగ్గా ఇక్కడే ఆవిడమ్మ తన అసలు రూపాన్ని ఆవిష్కరించింది.

"చూద్దాం లే!" అన్నాడు నాన్న.
"అక్కర్లేదు," అంది ఆవిడమ్మ.
ఇద్దరూ (తల్లీ, తండ్రీ) వింతగా, విసుగ్గా చూశారు.
"నోర్ముయ్యి" అంది తల్లి.
"వాజ్ పేయ్ లా ఒంటరిగా ఉండిపోతావా" వంకరగా నవ్వాడు నాన్న.
"నాకుద్యోగం వచ్చింది. ఫలానా కాలేజీలో..."
"ఓసినీ"
"జీతమెంత?"
"నేను వేరుగా ఇల్లు తీస్కుందామనుకుంటున్నా." అంది ఆవిడమ్మ.
"ఏమిటీ!"
"పిచ్చా, వెర్రా"
"ఓ ఇల్లు కూడా చూశాను." అంది ఆవిడమ్మ.
"మేమేమన్నా చచ్చిపోయామా!"
"అసలే ఒక్కర్తివే పిల్లవి... హు హు"
"కని, పెంచీ, పోషించీ, చదువు చెప్పించీ, అంత సాతంత్రం ఇచ్చీ... ఇదేనా నువ్వీచ్చేది"
"రాతి గుండె, ముండది"
"పిట్టినప్పట్నించీ ఇంతే! రాయి మొహం! రాయి మనసు!"
"మగ పిల్లాడు పుట్టినా పోయేది. వద్దు వద్దంటే ఆపరేషను..."
కానీ ఆవిడమ్మ ఏం మాట్లాడలేదు. ఒకటే మాటంది.
"ఎందుకే అమ్మా! రాద్ధాంతం! నేనిప్పుడేం చేశాననీ!"
అది ప్రశ్నలా అనలేదు. అంది అంతే.

వచ్చేవారం ఇల్లు మారింది. రోజు విడిచి రోజు అమ్మానాన్ననీ పలకరించేది. ఇంటికెళ్ళిపోయేది.

అసలిక్కన్నించే ఆవిడమ్మ కథ ఇంకా బలే ఉండేది.

ఆవిడమ్మకి ప్రేమ అంటే ఏమిటో తెలీదుట. ప్రేమించడం, ప్రేమించబడడం అంటే అస్సలు అర్థం కాదుట.

ఏమిటో అలా ఉండేదిట. అంతే అలాంటి ఆవిడమ్మని నాగరాజు ప్రేమించాడు. నాగరాజు ఆవిడమ్మ కాలేజీలో తోటి లెక్చరర్. ఆవిడమ్మ అందాన్ని మొదటిసారిగా చూశాడు నాగరాజు. ఆమెలో సొగసు చూసి దాసుడైపోయాట్ట. ఆమె వ్యక్తిత్వం చూసి ముగ్ధుడైపోయాట్ట. నానా అవస్థలూ పడి ఓరోజు ఆవిణ్ణి కలిసి మనసులో విషయాన్ని చెప్పాట్ట. ఆవిడమ్మ వింతగా చూసిందట. "నేనెందుకు నచ్చాను" అని. ఆవిడ చూసినట్టనిపించి నాగరాజు ఆవిడ గుణాలన్నీ వల్లె వేశాట్ట. ఆవిడమ్మకి నాగరాజు నవ్వు నచ్చినట్టుంది. బుగ్గల్లో సొట్ట నచ్చినట్టుంది. కళ్లలో మెరుపు నచ్చినట్టుంది. కళ్ళు దించుకుని మాట్లాడే తడబాటు నచ్చినట్టుంది. అందుకే ఆవిడమ్మ అంతగా నవ్విందట.

పెళ్ళి అన్న మాటే రాలేదుట. ఆవిడమ్మ అడగలేదు. నాగరాజు (యాహూ!) అస్సలు అడగలేదు. శృంగారంలో నాగరాజు ఆవిడమ్మ ప్రావీణ్యం చూసి కంగారు పడ్డాట్ట. 'ఇవన్నీ ఎలా తెలుసు' అనుకున్నాట్ట. ఎక్కడో చిన్నగా ఒకటో, రెండో అనుమానాలు... కానీ "చి ఛీ; తప్పు" అనుకొని తొక్కేశాడు వాటిని. "కొంతమంది సహజంగా... కొన్ని విషయాల్లో టాలెంట్ ఉంటుంది" అనుకున్నాడు.

జీవితం హాయిగా గడిచిపోతోంది. కాలేజీలో, ఊళ్ళో ఏవేవో అంటున్నారని తెలిసినా ఆవిడమ్మ అస్సలు ఏమీ అనేది కాదుట. ఆవిణ్ణి అడగడానికి మాత్రం అందరికీ చచ్చే భయం.

నాగరాజే ఇబ్బందిలో పడ్డాడు. "ఏమిటీ విషయం తేల్చదు" అనుకున్నాడు కొన్ని రోజులు. "ఇలానే బావుందిలే" అనుకున్నాడు మళ్ళీ. కానీ ఇంట్లో ఒత్తిడి పెరిగింది. అతని అమ్మ కోడలు కావాలంది. అతని నాన్న వంశోద్ధారకుడు కావాలంటున్నాడు. చెల్లెళ్లకి పెళ్ళిళ్ళయిపోయి పెద్ద పెద్ద పొట్టలతో తిరుగుతున్నారు. స్నేహితులు పిల్లల్ని స్కూళ్ళకి దిగబెడుతున్నారు. ఎంతకాలం ఇలా? ఎలా ఇంతకాలం?

ఆవిడమ్మ మొదటిసారి కాస్త ఇబ్బందిగా చూసింది.
"నాకు పెళ్ళి ఇష్టం లేదు" అంది.
నాగరాజు పాపం నిజంగా అదిరిపోయాడు.
"నేనంటే ఇష్టం లేదా?" అడిగాడు గారంగా.
ఆవిడమ్మ నవ్వింది.
"పెళ్ళంటే లేదు" అంది.
"ఏ?" అడిగాడు గోముగా.
"నాకు అవన్నీ ఇష్టం లేదు. నాకు పిల్లలొద్దు" అంది.
నాగరాజు ఆశ్చర్యపోయాడు.
"తల్లి కావాలని ప్రతి ఆడదీ కోరుకుంటుంది కదా!" అన్నాడు అలాగే చూస్తూ.
ఆవిడమ్మ మళ్ళీ నవ్వింది, కాస్త గట్టిగా.
"క్లాసుకి టైమైపోతుంది, బాబూ! నే వెళ్ళాలి."

అనేసి వెళ్ళిపోయింది. నాగరాజు కాలేజీలో రావిచెట్టు కింద ఒంటరిగా ఉండిపోయాడు. అతనికి తనకి జ్ఞానోదయం అయినట్టు అనిపించిందట. నిజానికి నాగరాజుకి కూడా పెళ్ళీ గిళ్ళీ ఇష్టం లేదు. హాయిగా ఏ బాదరబందీ లేకుండా ఆవిడతో... ఓహ్! ఇంట్లో పోట్లాడి, తల్లిదండ్రుల్ని ఎదిరించి, బంధువులని ఒదులుకొని ఆవిడమ్మ దగ్గరికి వచ్చేశాడు.

"అందాలా ఆనందం ఇంతేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా డం డం డం డడమ్'

జీవితం హాయిగా ఉందట నాగరాజుకిప్పుడు.

ఆవిడమ్మకి ఎలా ఉందో ఎవ్వరికీ తెలీదు. దాదాపుగా అందరూ, 'దానికే?' అనుకున్నారు. కొందరు మాత్రం "ఆవిడకే?" అనుకున్నారు.

కానీ! వెధవధి, నాగరాజు నిత్యప్రేమికుడు. వయసా పెద్దది కాదూ, మనసా చంచలం. ఫేవరిట్ రైటరా చలం. అందుకే వసుదని ప్రేమించాడు. వసుధ నున్నటి, నగిషీ పెట్టిన టేకు తలుపు రంగులో ఉండేదిట. ఆమెకి కూడా నాగరాజంటే ఇష్టం ఏర్పడింది. కానీ ఒక్క షరతు.

"నువ్వు నా వాడివి! ఎప్పటికీ నా వాడివి! అంతే!" అంది ఓ రాత్రి ఆవేశంగా నాగరాజు చెంప కొరుకుతూ.

నాగరాజు గొంతులో పడిన పచ్చి వెలక్కాయ రాయిగా మారి గుండెల్లోకి జారింది. ఆ రాయి మర్నాటికి పశ్చాత్తాపాగ్నిలో కరిగి కన్నీరై ప్రవహించింది. ఆవిడమ్మ ముందు మోకరిల్లేలా చేసింది.

ఆవిడమ్మకి అర్ధం కాలేదు.

"ఏవైంది, రాజూ?" అంది.

నాగరాజు నెమ్మదిగా తేరుకున్నాడు. కానీ మాట పెగల్లేదు. కళ్ళుపైకి లేవలేదు. ఆవిడమ్మ రెండు అరచేతులతో అతని ముఖం ఎత్తింది.

"ఏవైంది?" అంది మెత్తగా మల్లెపువ్వులాగా.

అయినా సరే, మాట పెగల్లేదు.

"నా దగ్గర దాపరికమా" అంది.

ఊహూ! నాగరాజు దహించుకుపోతున్నాడు.

"ఎవర్నైనా ప్రేమించావా?" అంది. కనబడీ కనబడని చిరునవ్వుతో.

నాగరాజు గుండెలో మంట ఆరిపోయింది. హాయిగా అనిపించింది. చల్లటి గాలి వీచింది.

కళ్ళెత్తి ఆమె ముఖంలోకి చూశాడు.

"నాకు వసుధ గురించి తెలుసు" అంది.

'ఎలా?' అని అడగలేదు నాగరాజు. 'ఎలా ఐతే మనకెందుకూ గొడవ' అనుకున్నాడు.

"నేనంటే అసహ్యంగా ఉంది కదా!" అన్నాడు.

"ఎందుకూ?" అంది.

"అబ్బ కరెక్ట్ గా నేననుకున్నట్టే అంది" అనుకున్నాడు నాగరాజు.

"ఎందుకేవిటి? నాకూ, వసుధకీ..."

"నీకు వసుధంటే ఇష్టం కద" అడిగింది.

ఏం చెప్తాడూ, పాపం! మగాడూ, వెర్రివాడూ ("మా అబ్బాయి ఒత్త వెర్రాడు. వెంగళప్ప" అనేది నాగరాజు అమ్మ)

"నీ అంత కాదు" అన్నాడు.

ఆవిడమ్మ నవ్వింది. ఆవిడ నవ్వు తూటా నవ్వు.

"నీకెలా తెల్సు" అంది.

"తెలుసు! అంతే! అన్నాడు.

"మరి సరే! నీకేం కావాలి?" అడిగింది.

"అలా అడిగితే ఏం చెప్తాను?" నాకే తెలీదు." అన్నాడు.

వసుధతో ఉంటావా వెళ్ళి?" అడిగింది.

నాగరాజుకి చలం 'మైదానం' గుర్తొచ్చింది. 'ఎంత గొప్పగా రాశాడు' అనుకున్నాడు.

"అలా కాదు. వసుధకి నేను ఇంకోళ్ళతో ఉండడం ఇష్టం లేదు" అన్నాడు.

ఆవిడమ్మ నెమ్మదిగా కుర్చీలో కూర్చుంది.

"అహా!" అంది.

నాగరాజు కాసేపు మౌనంగా ఉండిపోయాడు.

ఆవిడమ్మ కుర్చీలోంచి లేచి కిటికీ దగ్గరకెళ్ళి నించుంది బయటికి చూస్తూ.

నాగరాజు ఆమె దగ్గరికెళ్ళి తనూ నిలబడ్డాడు. ఆవిడమ్మ అతనికేసి చూసి నవ్వింది చిన్నగా.

"ఏం చేద్దాం" అంది.

"నాకు తెలుసు నీకు ఈర్ష్యగా ఉందని" అన్నాడు.

"నాకెలా ఉందో చెప్పకోయ్" అంది నవ్వుతూనే.

"ఊరికే అలా నవ్వుతావేంటీ పెద్ద యోగిలాగా! నీకిదో అలవాటు! ప్రతి దానికీ ప్రశాంతంగా నవ్వుతున్నట్లు మొహం పెట్టి అన్నిటికీ అతీతంగా ఉన్నట్టు నటించడం నాకసహ్యం ఆ నవ్వంటే." ఎడా పెడా అనేశాడు కోపంగా.

"నీ సంగతి చెప్పు ముందు! నా గురించి చెప్తావెందుకూ?" అంది.

"నీకు ఈర్ష్యగా లేదా?" అడిగాడు కోపంగా.

"లేదు. ఏ?" అంది.

"ఏవిటీ, నేను వేరే ఆవిడతో తిరిగొస్తే నీకు ఈర్ష్యగా లేదా?"

"తిరిగొస్తే, అసహ్యమేసేదేమో. నువ్వు ప్రేమించానన్నావు మరి?"

నాగరాజుకి గుక్క తిరగలేదుట. దాంతో అహం పాపం రెక్కలు విప్పి రెపరెపలాడిందట.

"నేను నీతో తిరిగానో ప్రేమించానో మరి నీకెలా తెల్సు?" అడిగాడు కసిగా.

"అది నీకు తెలియాలి. నాకు తెలిసి నాకు నువ్వంటే చాలా ఇష్టం" అంది ఆవిడమ్మ.

"ఎందుకు?" అన్నాడు తెలివిగా.

"చచ్చు ప్రశ్నలెయ్యకు" అంది. అయినా ముఖంలో కోపం లేదు.

'యోగి ముండ!'

"అదేం చచ్చు ప్రశ్న కాదు" అన్నాడు.

"వసుధని అడిగినా అదే అంటుంది" అంది ఆవిడమ్మ.

"వసుధకి నేనంటే చాలా ఇష్టమని నాకు తెలుసు. నువ్వు చెప్పక్కర్లా" అన్నాడు.

"ఎలా?" అంది.

"నాకు తెలుసు. అంతే!" అన్నాడు.

ఓ రెండు నిమిషాలాగి,

"వసుధ నీలాగా అయోమయం కాదు. తనకేం కావాలో బాగా తెలుసు ఆమెకి" అన్నాడు.

"నేను వేరే వాళ్ళతో తిరిగితే నీకు ఈర్ష్యగా ఉంటుందా?" అంది 'తిరిగితే' అనే మాటని ఒత్తి పలుకుతూ.

"ఎందుకుండదు. అది సహజం. నీ స్థానంలో నేనుంటే నాగరాజుని చంపేసేవాణ్ణి" అన్నాడు ఆవేశంగా.

"చూశావా, నా స్థానంలో నేనుండడం ఎంత మంచిదైందో! బతికిపోయావ్" అంది నవ్వుతూ.

నాగరాజుకి ఉక్రోషం పొంగిపోయింది.

"ఒక్క విషయం చెప్పు! గుండెలమీద చేయ్యేస్కుని, ప్రమాణం చేసి, నువ్వు ఇంకెవ్వరితోనూ పడుకోలేదని చెప్పు" అన్నాడు.

నాగరాజు చెంప చెళ్ళుమంది. కళ్ళు తిరిగాయి ఒక్కసారి. తేరుకోబోతుంటే ఇంకోసారి చెళ్ళుమంది. నాగరాజు తూలాడు. కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆవిడమ్మ మసగ్గా మారి నెమ్మదిగా సృష్టమైంది. ఆవిడ ముఖంలో కోపం ఎప్పుడూ చూళ్ళేదు కాబట్టి ఆవిణ్ణి గుర్తు పట్టలేకపోయాడు. పైగా తాను ఏడుస్తున్నట్టు అర్ధమైంది. ఆవిడమ్మ ఏడవట్లేదని కనబడింది.

"నువ్వు రాయివి. నేనిలా ఏడుస్తుంటే నీకు కన్నీళ్లు కూడా రావట్లేదు" అన్నాడు వెక్కుతూ.

"నేనెప్పుడు ఏడవాలో నువ్వు చెప్పకు. పో..." అంది తలుపు చూపిస్తూ. ఆమెని ఆ భంగిమలో శిల్పంలా చెక్కచ్చు అనిపించిందట ఎక్కడో నాగరాజుకి. కానీ అహం ఊరుకోదే. విసురుగా బైటకెళ్లిపోయాడు. నెమ్మదిగా తలుపేసేసిందట ఆవిడమ్మ అంతే. ఆ తర్వాత ఆవిడమ్మ ఒంటరిగానే ఉండిపోయిందట. అంటే ఉండిపోయిందనే అందరూ అనుకుంటూ వస్తున్నారు. (ఆశ్చర్యం, అందరూ అలా అనుకుంటూనే 'అబ్బో' అంటుంటారు) అదే ఇంట్లో, అదే డాబాలో. ఆ కుండీలూ, గ్రిల్లూ, లతలూ హాయిగా ఒక్కర్తే. ఏ బాదరబందీ లేకుండా.

అసలీ కథ ఎందుకు రాయబుద్ధైందంటే, నిన్న సాయంత్రం ఆవిడమ్మ ఇంటి ముందునించి వెళ్తుంటే కుండీలో పూసిన పువ్వొకటి రాలి, కింద గోడమీద పడి రోడ్డుమీద పడింది. పైన కుర్చీలో కూర్చొని చదువుకుంటున్న ఆవిడమ్మ అది చూసింది. నేనూ చూశాను. ఆవిడ చూడ్డం కూడా చూశాను. పరుగెత్తుకెళ్ళి ఆ పువ్వు తీస్కెళ్ళి పరిగెడుతూ మెట్లెక్కి ఆవిడ దగ్గరకెళ్ళి ఇచ్చాను. ఆవిడ అది తీస్కుని నావైపు చూసి నవ్వింది. ఆ నవ్వు, అందం నేను చెప్పలేను. ఏం చెయ్యాలో తెలీక ఇదిగో ఇది రాశాను.

చెప్పే ముక్కేవిటంటే నాకు ఆవిడమ్మంటే ఎందుకో చాలా ఇష్టం.

 

 

మరిన్ని సీరియల్స్