Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
peddollunnaare

ఈ సంచికలో >> కథలు >> ఆపద్భాంధవుడు

aapdbhaandhavudu

" రామా రావు గారి అమ్మాయి పెళ్ళికి వెడతారా?" అన్న భార్య మాటలకి కుర్చీలోంచి లేచి " ఆ వెడతాను" అని తయారు అవడానికి లేచారు జగ్గరాజు

రామా రావు గారితో ఈ మధ్య ఆధ్యాత్మిక ప్రవచనాలలో ప్రారంభమయిన పరిచయం స్నేహం గా మారింది..

అదీ కాకుండా రామారావు గారు, దగ్గర బంధువూ, ఆప్త మిత్రుడూ కాక పోయినా, ఆయన ఆప్యాయంగా పిలిచిన పద్ధతి దృష్టి లో ఉంచుకుని వెడదామని నిశ్చయించుకున్నారు. 

పెళ్లి మంటపానికి వెళ్ల గానే, రామారావు గారిని పలకరించి, ఖాళీగా ఉన్న కుర్చీలలో ఒక దాంట్లో కూర్చున్నారు.

ఎవరో ఒక మధ్య వయస్కుడు సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఆయన పక్కన వచ్చి కూర్చున్నాడు. మాట్లాడడం ముగించి ఫోన్ షర్ట్ జేబులో పెట్టుకుంటూ ఆయన కేసి పలకరింపుగా చూసి నవ్వాడు. "ముహూర్తానికి ఇంకా టైము ఉందనుకుంటానండి అన్నాడు. "అవును ఇంకో నలభై నిమిషాలున్నట్టుంది." అన్నారు ఈయన కూడా జవాబుగా నవ్వుతూ. పరస్పర పరిచయాలలో అతని పేరు కాళీ కృష్ణ అనీ, రామారావు గారి భార్య వైపు దగ్గర బంధువనీ తెలిసింది.

"హలొ  బావ గారు ఒక్కరూ కూర్చున్నారేమిటి" అంటూ ఒకతను కాళీ కృష్ణ కి అవతల  పక్కన వచ్చి కూర్చున్నాడు.

'ఓ రాజా నా . ఏమిటి కులాసానా? వ్యాపారం బాగుందా? చాలా రోజులయింది" అన్నాడు కాళీ కృష్ణ జవాబుగా 
"వ్యాపారానికేమండి బ్రహ్మాన్దంగా ఉంది." అన్నాడు ఆ రాజా అన్నాయన.
రాజా కొంచెం పెద్ద గొంతు తో మాట్లాడుతూండడం తో, జగ్గరాజు గారు వద్దనుకున్నా అతని మాటలు చెవిలో పడుతున్నాయి
కొత్తగా ఎక్స్ పోర్ట్ వింగ్ కూడా తెరిచినట్టు, దానికి కావలసిన ఏర్పాట్లకీ ఏ ఏ దేశాలు తిరిగిందీ మొదలయిన వివరాలు చాలా డిటైల్డ్ గా ఒక దాని తరువాత ఒకటి గాప్ ఇవ్వకుండా ఏకరువు పెడుతున్నాడు.
 
కాళీ కృష్ణ గారు " ఉ "  "ఆ" అంటూ ముభావంగా స్పందిస్తున్నా అతగాడు తన  సెల్ ఫోన్లో వచ్చిన మెసేజిలు, వాట్సప్  లో ఉన్న వీడియో లో చూపించడం వంటివి చేస్తూ ఓ పావు గంట గేప్ లేకుండా ఏకరువు పెట్టాడు
పక్కన కూర్చున్న జగ్గరాజు గారికే చిరాకేసింది. కాళీ కృష్ణ గారు ఎలా భరిస్తున్నాడో అనుకున్నాడు
ఇంతలో కాళీ కృష్ణ గారి చొక్కా జేబులో సెల్ మోగితే అది ఆయన ఎత్తి, సిగ్నల్ కోసం కాబోలు హాల్ బయటకు వెళ్లి మాట్లాడుతున్నారు.
 
ఇంతలో మంటపం లో జీలకర్ర బెల్లం పెట్టె ముహూర్తం వచ్చింది కాబోలు భజంత్రీలు బాగా మ్రోగుతున్నాయి.
 
వీళ్ళు కూర్చున్న దగ్గరకి ఇద్దరు పదేళ్ల కుర్రాళ్ళు ఆడుకుంటూ వచ్చి వెళ్లారు.
వాళ్ళని చూడగానే గుర్తుకు వచ్చినట్టుంది. రాజా మొదలు పెట్టాడు
మా పెద్దాడు ఇంతే ఉంటాడండి. వాడు అన్ని కంప్యూటర్లూ బలే హ్యాండిల్ చేస్తాడండీ. సెల్ ఫోన్లో ఫోటోలు చాలా బాగా తీస్తాడండీ
ఇవిగో చూడండి వాడు తీసిన వీడియోలే ఇవి. అని ఒక్కొక్క వీడియో ఒకటి తరువాత ఒకటి కాళీ కృష్ణ గారికి చూపించడం మొదలెట్టాడు
కాళీ కృష్ణ గారు ఒంచెం ఇబ్బందిగా కదిలీనా, అన్నీ చూస్తూ ' బాగున్నాయి. మీవాడు చాలా మంచి ఫోటో గ్రాఫర్ అవుతాడు "  అన్నారు
ఇలా ఓ పది నిమిషాలు గడిచేటప్పటికి కాళీ కృష్ణ గారి చొక్కా జేబులో ఫోన్ మ్రోగింది. వెంఠనే అది తీసి సిగ్నల్ కోసం కాబోలు మళ్ళీ హాలు బయటికి వెళ్లారు.
 
ఇంతలో ఒక పురోహితుడు వచ్చి మాంగల్య ధారణ తరువాత వేయడానికి అక్షింతలు ఇచ్చి వెళ్ళాడు
అవి తీసుకుని స్టేజి దగ్గరికి వెళ్లారు జగ్గరాజు గారు. అక్షింతలు వేసి వస్తోంటే రామారావు గారు వచ్చి పలకరించి వచ్చినందుకు థాంక్స్ చెప్పి భోజనం చేసి వెళ్లండని జగ్గరాజు గారిని భోజన శాల వైపు పంపించారు
భోజన శాల వైపు నడుస్తూంటే కాళీకృష్ణ గారు అక్షింతలు వేసి తిరిగి వచ్చి జగ్గ్గారాజు గారిని జాయిన్ అయ్యారు
 
సలాడ్ టేబుల్ దగ్గర ప్లేటు తీసుకుంటూ జగ్గరాజు గారు కాళీకృష్ణ గారితో అన్నారు " రెండు మాట్లూ  కూడా ఫోన్ కాల్స్ వచ్చి మిమ్మల్ని బాగా రక్షించాయే! " అన్నారు నవ్వుతూ
 
కాళీకృష్ణ గారు చేతిలోని ప్లేటు పక్కన టేబిల్ మీద పెట్టి  "మీరు బాగా కనిపెట్టారే!  నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ మోగుతుంది -చూస్తారా ? అని ఓ క్షణం ఆగారు . ఆయన జేబులోని సెల్ మోగింది.
 
" అదెలా సాధ్యం? అన్నారు జాగ్గ రాజు గారు ఆశ్చర్య పోతూ
 
 " అంత  పెద్ద కష్టం కాదండి"  అని  కాళీ కృష్ణ గారు ప్యాంటు జేబులోంచి ఒక చిన్న సెల్ తీసి చూపించి అన్నారు"  ప్యాంటు జేబులో ఇందులో ఒకటి నొక్కగానే చొక్కా జేబులో సెల్ మోగుతుంది"  ఇలాగ ఫంక్షన్లకు వచ్చినప్పుడు ఇదే నా "ఆపద్భాందవుడు" అన్నారు నవ్వుతూ

సెల్ ఫోన్లు వచ్చిన తరువాత ఇదొక పెద్ద సౌకర్యం అన్న మాట. అన్నారు నవ్వుతూ జగ్గ రాజు గారు.
 
ఇదేదో భలే బావుందే అన్నారు కాళీ కృష్ణ గారి నవ్వులో నవ్వు కలుపుతూ.
 

 

మరిన్ని కథలు