Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటి ఫణిబాబు

apps apps

ఈ రోజుల్లో వస్తూన్న Smart Phone, ల ధర్మమా అని, మనుషుల్లో బధ్ధకం మాత్రం పెరిగిపోయింది.. దానికి సాయం, దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా , ప్రతీ దానికీ, “ నగదు రహిత “ అని ఒకటి మొదలెట్టారు.. గుర్తుందా, కొన్ని సంవత్సరాల క్రితం అంటే మొబైల్ ఫోన్లు వచ్చిన కొత్తలో,  ఓ బేసిక్ హ్యాండ్ సెట్ (  Basic Hand set)  ఉండేది,  అందులో అవసరాలకి ఫోన్లు చేసికోవడమూ, ఇంకోరి నెంబర్లు save  చేసికోవడమూ తప్ప ఇంకోటేదీ ఉండేది కాదు. తరవాత్తరవాత, అంతర్జాలం ప్రాముఖ్యత పెరిగేటప్పటికి , అవేవో స్మార్ట్ ఫోన్లు (  Smart Phone)  వచ్చేశాయి. అందులో లభ్యం అవని విషయం లేదు. జాతీయ అంతర్జాతీయ కంపెనీల  హవా కూడా పెరిగింది. ఈరోజుల్లో ,ఎలాంటి విషయం తెలుసుకోవాలన్నా, ఏ వస్తువు కొనాలన్నా చేతిలో ఈ స్మార్ట్ ఫోను ఉంటే చాలు. అక్కడి దాకా బాగానే ఉంది. కానీ వాటిల్లో జరుగుతూన్న సాంకేతిక అభివృధ్ధి చూస్తూంటేనే , మన కొంప కొల్లేరయిపోతోంది. 

టీవీ ల్లోనూ, పత్రికల్లోనూ వ్యాపార ప్రకటనల ప్రభావం అనండి, లేదా ఈ ఫోన్లమ్మే కొట్టువాడి మాట చాతుర్యం అనండి, కాదూ కూడదూ అంటే , ఏదో discount  ఇస్తున్నాడు కదా అని  Online  లో కానివ్వండి, మొత్తానికి  ఎక్కడ చూసినా,  ప్రతీవాడి చేతులోనూ ఓ smart phone  చూస్తున్నాము. కొత్తగా వచ్చింది కదా అని, వేలకు వేలు పోసి ఓ ఫోను తీసికోవడం. మొదట్లో అదేదో 2G తో ప్రారంభం అయి ఇప్పుడు 5G  దాకా పాకింది.. మహా అయితే మనం కొన్న ఓ ఆరునెలల దాకా, మనక్కావాల్సిన App  లు ఉపయోగించుకోవచ్చు లక్షణంగా. ఈలోపులో అదేదో తరవాతి  G   వచ్చేస్తుంది. మనం కొన్న దానికీ, దీనికీ పడదుట. అప్పటిదాకా ఉన్న App  లన్నీ కృష్ణార్పణం. విసుగెత్తి, ఆ ఫోనువాడి సర్వీస్ సెంటర్ కి వెళ్ళి , చూపిస్తే, అదేదో  Software updating  ట అది చేస్తాడు.. కొన్ని కంపెనీల వాళ్ళైతే ఉచితంగానే చేస్తారు. కొందరైతే ఏ రెండో మూడో వందలు ఫీజు వసూలు చేస్తారు.. పోతే పోయిందని అదేదో చేయించుకుని కొంప చేరుకుంటే, అప్పటిదాకా ఉన్న నెంబర్లన్నీ మాయమైపోతాయి. అదేదో  Back up  చేసికోవాలిట, యువతరానికైతే పరవాలేదు కానీ, పాత తరం వాళ్ళకీ విషయాలన్నీ తెలియవుగా పాపం..

కొట్టువాడిదగ్గరకు వెళ్ళి అడిగితే చల్లగా చెప్తాడు… “ మీ ఫోను పాతదండీ… ఇప్పుడు అన్నీ update  అయాయి కదండీ.. ఇదివరకటి  Apps  ఇందులో పనిచేయవూ… “ అని.  ఏమిటో, ఈ ఫోన్లేమిటో, రోజురోజుకీ మారిపోవడాలేమిటో అంతా గందరగోళం. ఏదో మాట్టాడుకోడానికి తప్ప, ఇంక దేనికీ ఉపయోగపడవు.. ఏమైనా అంటే Exchange  చేసుకోండంటారు. పోనీ అదేదో చూద్దామా అంటే,  కొత్తఫోనుకి ఏదో మొక్కుబడిగా, పాతికో పరకో తగ్గిస్తాడు.

ఏళ్ళక్రితం కొన్న  Basic Handsets  మాత్రం ఇప్పటికీ గుండ్రాళ్ళలా ఉన్నాయి.  ఆ కొట్టువాడు ఓ ఉచిత సలహా కూడా ఇస్తాడు… “  ఓ పని  చేయండి మాస్టారూ… మాట్టాడుకోడానికి పాతఫోనూ,  App  లు పెట్టుకోడానికి Smart Phoనూ ఉంచుకోండి, .. “ అని. దీనితో తేలిందేమిటంటే, ప్రతీవాడి చేతుల్లోనూ ఈరోజుల్లో రెండేసి ఫోన్లు.. అదేదో  Second Set up  లాగ.

మరిన్ని శీర్షికలు
sirasri  question