Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
traditional atical

ఈ సంచికలో >> శీర్షికలు >>

పర్యాటకం - కర్రా నాగలక్ష్మి

paryatakam

హిమాలయాలకు పశ్చిమాన వున్న పీర్ పంజాల పర్వత శ్రేణులలో జమ్ము కశ్మీరు రాష్ట్రం లో బారాముల్ల జిల్లాలో సుమారు 2,650 మీటర్ల యెత్తున వున్న వేసవి విడిది .

దేశరాజధాని నుంచి జమ్ము మీదుగా శ్రీనగరు కి సుమారు 900 కిలో మీటర్లు . జమ్ము వరకు ట్రైను సర్వీసులు  వున్నాయి . అక్కడ నుంచి ప్రైవేటు కారులో గాని లేదా ప్రభుత్వం వారిచే నడపబడుతున్న బస్సులలో గాని ప్రయాణించ వచ్చు . ఢిల్లీ నుంచి విమాన సౌకర్యాలు శ్రీనగరు వరకు వున్నాయి .

శ్రీనగరు నుంచి సుమారు 55 కిలోమీటర్ల దూరం లో వుంది గుల్ మార్గ్ .

శ్రీనగరు నుంచి దట్టమైన తోటలగుండా సాగుతుంది మన ప్రయాణం . అక్రోటు , ఆపిలు , బాదం తోటలే కాక ఛెర్రీ పండ్ల తోటలు కూడా కనిపిస్తాయి . కొండ పైకి చేరుతున్న కొద్దీ చలి పెరుగుతూ వుంటుంది , కాస్త యెండవచ్చినా చాలా వేడిగా వుంటుంది , సన్ స్క్రీన్ రాసుకోక పోతే మాత్రం మన శరీరం నల్లబడుతుంది .

గుల్ మార్గ్ ని పదహారవ శతాబ్ధం వరకు ' గౌరీ మార్గ్ ' అని పిలిచేవారు , ఆ కొండలలో వున్న గౌరీ మందిరానికి వెళ్లే దారిట . ఈ లోయలో అనేక జాతుల అడవి పువ్వులు వుండేవి , వీటి అందాలను చూడడానికి వచ్చిన మొఘల్ చక్రవర్తులు సుమారు 24 పూల జాతులను యిక్కడ నుంచి తీసుకొని వెళ్లి మొఘల్ గార్డెన్స్ లో నాటించేరట , పదహారవ శతాబ్దం లో యీ ప్రాంతాన్ని పరిపాలించిన ' ఛక్ ' వంశానికి చెందిన సుల్తాను యూసుఫ్ షా భార్య ' హబ్బ ఖాతున్ ' తో యీ ప్రదేశాలలో విహరించేందుకు తరచూ వస్తూ  నివాసముండే వాడు . రాజుగారి రాకపోకలకి , నివాసానికి వీలుగా అక్కడ పట్టణ నిర్మాణం జరిగింది . రాణి విహారం కోసం ఉద్యానవనాలను నిర్మించేడు . లోయ లో వున్న పుష్పజాతులను చూచి ముగ్దుడై గుల్ మార్గ్ ( పూలదారి ) అని పిలవడం మొదలు పెట్టేరు .

ఆంగ్లేయుల కాలంలో దీనిని వేసవి విడిదిగా తీర్చి దిద్దేరు . ఆంగ్లేయుల కాలంలోనే యిక్కడ ప్రపంచం లోనే అతి యెత్తైన పెద్ద గోల్ఫ్ మైదాన నిర్మాణం చేసేరు . గుల్ మార్గ్ లో గోల్ఫ్ యెంత ప్రాముఖ్యత పొందిందంటే యిక్కడ మూడు గోల్ఫ్ మైదానాల నిర్మాణం జరిగింది . అందులో ఒకటి మహిళల కోసం ప్రత్యేకంగా నిర్మించేరు . ఆంగ్లేయులు వారి సౌకర్యార్థం భవనాలు హోటళ్లు , ప్రార్ధనా మందిరాలు నిర్మించేరు . వారి రాకపోకల కొరకు రహదారులు , రవాణా సౌకర్యాలు పెరిగాయి .

వేసవిలో కూడా యిక్కడ హిమపాతం జరుగుతూ వుండడం , పీర్ పంజాల్  పర్వతశ్రేణుల వాలులు స్కీయింగుకి అనువుగా ువుండడం తో 1921 లో యిక్కడ స్కీయింగ్ క్లబ్ స్ధాపన జరిగింది , సంవత్సరానికి రెండు పోటీలు నిర్వహించ సాగేరు . ఒకటి క్రిస్మస్ కి , రెండవది ఈస్టర్ కి నిర్వహించ సాగేరు . ఇప్పటికీ యీ పోటీలు నిర్వహిస్తున్నారు . అయితే యిక్కడ కూడా వేసవి యెండల ప్రతాపం పెరగడంతో వేసవి లో యీ ప్రదేశాలు యెండిపోయిన చెట్లతో , యెండిపోయి న పచ్చిక బయళ్ల తో  యెండిపోయిన జలపాతాలతో పర్యాటకులలో నిరాశను కలుగ జేస్తున్నాయి .


భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పాకిస్థాన్ ఆర్మీ వారి దురాక్రమణకు గురై తిరిగి 1947 అక్టోబరులో మన దేశపు జవానుల వీరోచితమైన పోరాటంతో మన వశం అయింది .1948 లో భారతదేశ ఆర్మీ స్కీయింగు స్కూలు ప్రారంభించేరు . తరువాత దానిని అతి యెత్తైన మిలిటరీ యెకాడమీ స్కూల్ గా మార్చేరు .ఆసియా దేశాలలో యీ స్కీయింగ్ పాయింట్ బాగా ప్రాముఖ్యతను పొందింది .

1980 ల నుంచి పెరిగిపోయిన చొరబాటుదారులు దాడుల వలన , వేర్పాటు వాదులు కశ్మీరు బ్రాహ్మణులను తరిమి వేసేందుకు సృష్టించిన అలజడుల వలన పర్యాటకుల సంఖ్య చాలా వరకు పడిపోయింది . 1980 లలో అంటే కశ్మీరు లోయలో అలజడులు రేగక ముందు వున్న అందాలను కాస్త పరిచయం చేస్తాను . శ్రీనగరు నుంచి గుల్మార్గ వరకు వున్న ప్రయాణం కూడా అంతా ఘాట్సే , ఓ పక్క కొండ చరియలలో అక్రోటు , బాదం తోటలు , నేలంతా పచ్చని తివాసి పరిచినట్లున్న పచ్చిక దూరంగా ప్రతి మలుపులోనూ కొండల మీద నుంచి జారుతున్న చిన్న పెద్దా జలపాతాలతో కళ్లు తిప్పుకోనివ్వవు  . అప్పుడు కెమేరా లేని కారణంగా ఆ అందాలను కళ్లల్లోనే దాచుకొన్నాం .

మేం తెచ్చుకున్న వున్న దుస్తులు చాలక అద్దెకు తీసుకొని సాక్స్ , షూసు కూడా తీసుకొని వాటిని మా బట్టల మీద వేసుకున్నాం , పెద్దగా హిందీ రాక కొంత దబాయించడం రాక కొంత వాళ్లిచ్చిన తడి దుస్తులు ధరించి గుర్రాలమీద ' తంగ్ మార్గ ' బయలుదేరేం . దారిలో వచ్చే ' సెవెన్ స్ప్రింగ్ ' దగ్గర ఆగి గుర్రాలు దిగి భూమి లోంచి వస్తున్న యేడు నీటి వూటలను చూసి వాటినీటిని కాస్త నోట్లో వేసుకొని , అక్కడి ప్రకృతిని తనివి తీర అనుభవించి తిరిగి గుర్రాలు యెక్కి ' కంగ్డోరి ' దగ్గర కాస్త సమయం ఆగి పచ్చిక మీద బరువైన లూజు షూ లతో నడిచి తిరిగి పైకి బయలుదేరేం . మొత్తం పది పన్నెండు కిలోమీటర్లు గుర్రాలమీద ప్రయాణం చేసేం . మొదటి మారు గుర్రాలు యెక్కడం వల్ల భయం తో కొంత చలి వల్ల , తడి బట్టలు కట్టుకోవడం వల్ల కొంత శరీరం లో వణుకు మొదలయింది . అలా వొణుకుతూనే కను చూపు మేర వరకు పేరుకున్న మంచులో అటూయిటూ నడిచి చలికి శరీరం లో వణుకు యెక్కువ కాగా తిరిగి గుర్రాలమీదకిందకి వచ్చేం  . ఆ తడి బట్టలు బరువుగా వున్న షూలు యిచ్చేసేక తిరిగి గోల్ఫ్ మైదానాలు చూసేం .పచ్చగా వున్న మైదానాలను చూపించి గోల్ఫ్ మైదానాలు అంటే అక్కడ యేంచేస్తారో తెలియక బాగుంది , యీ పచ్చ గడ్డి ఆవులను మేపుతే  ఆ ఆవులు యెన్ని పాలిస్తాయో అనుకున్నా , యిప్పడు అవన్నీ తలుచుకుంటే నవ్వొస్తుంది .

1980 లో ' హెలీ స్కీయింగ్ క్లబ్ ప్రాన్స్ వారి సహాయంతో హిమాలయ - హెలీ స్కీయింగ్ క్లబ్ ను ప్రారంభించేరు .


1984 తరువాత కశ్మీరు లోయ నుంచి పండిట్లను తరిమి వెయ్యడం , వేర్పాటు వాదులకు ఆర్మీ కి జరిగిన గొడవలలో చాలామంది మరణించడంతో , చొరబాటు దారుల దాడుల వల్ల లోయ కి వచ్చే దేశవిదేశాల పర్యాటకుల సంఖ్య తగ్గిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వారు గుల్మార్గ్ లో ' గండోలా ( కేబుల్ కార్ ) ' నిర్మాణం 1990 లో చేపట్టి తిరిగి పర్యాటకులను ఆకర్షించాలని ప్రత్నించగా , లోయలో తరచు జరుగుతున్న అల్లర్ల వల్ల నిర్మాణం చాలా కాలం నిలిపి వేయ వలసి వచ్చింది . 1997 సంవత్సరాంతంలో తిరిగి పనులు ప్రారంభించి 1998 మేరలో మొదటి విడత నిర్మాణం కంగ్డోరి వరకు పూర్తి చేసేరు . రెండవ విడత పనులు 2005 లో మొదలు పెట్టి అదే సంవత్సరం పూర్తి చేసేరు . దానితో గుల్మార్గ్ నుంచి ' తంగ్ మార్గ్ ' వరకు కేబుల్ కారు లో సులువుగా చేరుకోవచ్చు . తంగ్ మార్గ్ చేరుకోడానికి కూడా రెండు విడతలుగా ప్రయాణించాలి . మొదటి కారులో కంగ్డోరి వరకు , అక్కడ కేబుల్ కారు మారి వేరే దానిలో తంగ్ మార్గ్ వరకు వెళ్లాలి . వీటికి నెట్ ద్వారా ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకోడం మంచిది . సీజన్లో పర్యాటకుల తాకిడి యెక్కువగా వుండడం తో మనకి టిక్కెట్టు దొరకదు . మాకు అలాగే అయింది . కంగ్డోరి వరకు వెళ్లి అక్కడ చలిలో వేడి వేడి గోపి పరాఠా తిని వెనుకకి వచ్చేం . గత కొద్ది సంవత్సరాలుగా యీ ప్రాంతం అక్టోబరు నెలనుంచి అహ్లాదకరంగా మారుతోంది .

ఆసియా దేశాలలో యీ గండోలా అతి యెత్తైన గండోలా గా గుర్తించేరు .

తరవాత 90 లలో వెళ్లినప్పుడు చొరబాటు దారుల భయం తప్ప అక్కడి అందాలలో మార్పు లేదు , తిరిగి 2002 లో వెళ్లి నప్పుడు అందాలు కనుమరుగవడం కనిపించింది , తరచు జరిగే చొరబాటు దారుల దాడులవల్ల పర్యాటకుల రాక తగ్గిపోవడం , ఆర్మీ వారి రాకపోకలు యెక్కువ అవడం మిలిటరీ అవుసరాలకి క్రొత్త నిర్మాణాలు చెయ్యవలసి రావడం , వీటివల్ల యిక్కడ వృక్షాలపైనా , వాతావరణం లోనూ చాలా మార్పులు చోటు చేసుకున్నాం . 2002 లో శ్రీనగరు లోయ లో వేసవిలో వాతావరణం 25 డిగ్రీలకు చేరడం చూసేం . కశ్మీరీలు  మర్యాదస్తులు అని విన్నాం , చూసేం కూడా కాని మెల్ల మెల్లగా వారిలో మార్పులని చూసేం .

తరువాత క్రమంగా గుల్మార్గ్ అందాలు కనుమరగవసాగేయి . క్రొత్త నిర్మాణాల వల్ల పరిసరాలు ధూళి దుమ్ము తో నిండి పోసాగేయి . వేసవి విడిది అని యిప్పటి గుల్మార్గ్ ని అనకూడదేమో , కాని శీతాకాలాలలో మాత్రం హిమపాతం జరిగి స్కీయింగుకి అనుకూలంగా వుంటుంది .

2013 లో జూలై లో వెళ్లినప్పుడు వేసవిలో కశ్మీరు వెళ్లకూడదని అని అనిపించింది .

ఈ పర్వత వాలులలో స్కీయింగే కాక మంచు ఆటలు అంటే టైరులో కూర్చొని జారడం , కర్ర బల్లలపై జారడం లాంటి  ఆటలు నడపబడుతున్నాయి . స్కీయింగ్ పై పాయింట్ కి చేరడానికి వుపయోగించే కేబుల్ ఓపెన్ కారులో ప్రయాణించడం ఓ అనుభవం , శమ్మీ కపూర్ సినిమాలలో గుల్మార్గ్ లో చాలా ప్రదేశాలు చూడొచ్చు , పాట యేదో జ్ఞాపకం లేదుగాని శమ్మీకపూర్ , షర్మిలాఠాగూర్ యీ ఓపెన్ కేబుల్ కారులలో షూట్ చేసేరు . నవ్వంబరు నుంచి యిక్కడ హిమపాతం జరుగు తుంది . 1960 ల నుంచి 1980 ల వరకు వచ్చిన చాలా సినిమాలలో ఒక్క పాటనేనా చిత్రీకరించేవారు .

గుల్మార్గ్ కి అయిదారు కిలో మీటర్ల దూరంలో ' సెవెన్ స్ర్పింగ్స్ ' అనే ఓ పర్యాటక స్థలం చూసేం . అక్కడ యేడు ప్రదేశాలనుంచి భూమిలోంచి వేడినీరు పైకి వుబుకుతూ వుంటాయి . అంత చల్లని ప్రదేశం లో వేడి నీళ్లు రావడం ఆశ్చర్యాన్ని కలుగ జేస్తుంది . వేద కాలంలో యీ ప్రదేశం లో సప్తర్షులు తపస్సు చేసుకునే వారని ఋషుల తపస్సు వేడికి భూమి లోపల వేడి పుట్టి అక్కడవున్న జలం బయటకు చిమ్మబడిందని స్థానికులు చెప్పేరు .

మరిన్ని శీర్షికలు
sarasadarahasam