Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు..ఆమె...ఒక రహస్యం

గత సంచికలోని అతడు-ఆమె-ఒక రహస్యం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి

http://www.gotelugu.com/issue199/573/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/


 

(గతసంచిక తరువాయి) అయితే అతడు చెప్పినది నిజమే అయి ఉండాలి.  అలా అనుకోగానే ఆమె గుండె కొట్టుకునే వేగం పెరిగింది.  అతడు నిజంగా రాజేంద్ర స్నేహితుడే... ఐన పక్షంలో... తను ఆశించే సమాచారం అతడికి కచ్చితంగా తెలిసే ఉండాలి !!  తన అన్వేషణ అతడి దగ్గర పూర్తయ్యే అవకాశం ఉంది !!  అయితే అతడు తనకి సహకరిస్తాడా లేదా అన్నదే మిలియన్ డాలర్ల  ప్రశ్న.

వెంటనే ఆ సైట్ క్లోజ్ చేసేసి, బ్రౌజింగ్ హిస్టరీని డిలీట్ చేసేసి వెనక్కి తిరిగింది.  ఆమె వెనక్కి తిరిగే సరికి వెనకాలే పాణి నిలబడి కనిపించాడు.  ఆమెకి గుండె ఆగినంత పనైంది.

“మీరెప్పుడొచ్చారు?”  స్టన్నయి చూస్తూ అడిగింది.

“మీరు బ్రౌజింగ్ హిస్టరీ డిలీట్ చేస్తుంటే” నవ్వుతూ ఆమె  ఎదురుగా కూర్చున్నాడు పాణి.

“మళ్ళీ  బయటకెందుకు వచ్చారు?”   ఏమ్మాట్లాడాలో తెలియక తడబడుతూ అంది.

“గదిలో మంచినీళ్ళు లేక హాల్లోకి వచ్చాను. ఈ గదిలో  లైటు వెలుగుతుంటే ఎవరా అని చూడడానికి వచ్చాను.  తీరా చూస్తే మీరు.  ఎలాగూ నిద్ర రావడం లేదు కదా, కాస్సేపు కబుర్లు చెప్పుకుందామని వచ్చాను”  

“సెల్లో నెట్ రావడం లేదు. ఒక ముఖ్యమైన  పని ఉంటే ఇక్కడ నెట్ ఉందని తెలిసి వచ్చాను. పని అయిపోయాక కంప్యూటర్లో బ్రౌజింగ్ హిస్టరీ డిలీట్ చెయ్యడం నా అలవాటు” నేనేమీ కాని పని చెయ్యలేదనట్టుగా చెప్పిందామె.

“మీరు డిలీట్ చేసినా మీరు ఏ సైట్ బ్రవుజ్ చేసారో నేను చెప్పగలను” అన్నాడతడు.

“ఎలా?”

“మీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ట్రైనింగ్లో మీకు చెప్పలేదా? కంప్యూటర్లో డిలీట్ బటన్ పెట్టినా డేటా ఏదీ పూర్తిగా డిలీట్ అయిపోదు. కంప్యూటర్ లో ఎక్కడో ఒక చోట సేవ్ అయ్యే ఉంటుంది.  అలాగే ఇంటర్నెట్ బ్రౌజింగ్ డేటా డిలీట్ చేసినా, విండోస్ రిజిస్ట్రీలో సేవ్ అయ్యి ఉంటుంది.  దాన్ని రికవర్ చేస్తే  డిలీటెడ్ బ్రౌజింగ్ హిస్టరీ తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు.  కంప్యూటర్ ఫోరెన్సిక్ నిపుణులకి ఇది చాలా చిన్న పని. మీకు చూపిస్తా చూడండి”  అంటూ చొరవగా ఆమె చేతి లోంచి కీ బోర్డుని  తన ముందుకు లాక్కుని  ఆమెకి డిమానిస్ట్రేట్ చెయ్యడానికి   సిస్టమ్ రిస్టోర్ చెయ్యడం మొదలు పెట్టాడు.

‘తను అతడి వివరాల గురించి వెదికిందని అతడికి తెలిస్తే, తన పరిస్థితి ఏమిటి? అతడికి  ఏమని సమాధానం చెబుతుంది?  ఇతడ్ని తను ఏ ముహుర్తంలో కలిసిందో కానీ,  అతడి ముందు ప్రతి సారీ తను ఇలాగే అవుతోంది’   తనని తానే తిట్టుకుంటూ అనుకుందామె.   అతడ్ని ఎలా ఆపాలో తెలియక గుడ్లప్పగించి కీ బోర్డు మీద చక చకా వేళ్ళు కదిలిస్తూ  అతడు  చేస్తున్న పనిని  చూస్తూ ఉండిపోయింది. 

“ఇదిగో మీ డిలీటెడ్  బ్రౌజింగ్ హిస్టరీ వచ్చేసింది”   రెండు నిమిషాల తరువాత విజయ గర్వంతో అన్నాడు.

కంప్యూటర్ తెర వైపు చూడడానికి కూడా అనాసక్తిగా అనిపించిందామెకి.  తల తిప్పి ఎటో చూడ సాగింది.

“మైగాడ్”  కంప్యూటర్ తెర వైపు చూస్తున్న అతడు ఒక్కసారిగా గట్టిగా అన్నాడు. అప్పటికి కానీ తేరుకుని కంప్యూటర్ వైపు చూడలేదు ఆమె.

“ఏమిటి?” అందామె.

“ఇటు చూడండి?” అన్నాడతడు   స్క్రీన్ మీద కనిపించిన బ్రౌజింగ్ హిస్టరీని చూపిస్తూ.

అతడు చూపిస్తున్నది ఆమె సెర్చ్ చేసిన బ్రౌజింగ్ హిస్టరీని కాదు... అంతకు ముందు ఎవరో ఆ కంప్యూటర్ లో బ్రవుజ్ చేసిన హిస్టరీని.

How to murder a person easily ?

How to murder a man without evidence?

How to hide a dead body?

ఒక్కొక్క ప్రశ్నకి సంబంధించి  చాలా వెబ్ సైట్లు చూసినట్టు  చూపిస్తోంది బ్రౌజింగ్ హిస్టరీ.

చూస్తున్న ఇంద్రనీల తన కళ్ళని తను నమ్మలేక పోయింది.   పాణి ఆ బ్రవుజింగ్ తేదీ, సమయం రాసుకున్నాడు ఒక కాగితం మీద.  అవన్నీ దాదాపు రెండు నెలల క్రితమే చూసిన సైట్లు. 

ఆ కాగితాన్ని ఆమెకి చూపిస్తూ “దీన్ని బట్టి చూస్తే, ఈ ఇంట్లో  రెండు నెలల క్రితమే, రాజేంద్రని చంపడానికి  పధకం వెయ్యడం జరిగిందన్న మాట ! “ అన్నాడు.

“అయితే రాజేంద్రవర్మది ఆత్మ హత్య కాదా? మరి ఆ సూసైడ్ నోట్, పోస్టుమార్టం రిపోర్టు?”

“ఒక మరణాన్ని హత్యా ఆత్మహత్యా అని తేల్చి చెప్పడం అన్నది  పోస్టుమార్టం రిపోర్టు పని కాదు.   పోస్టుమార్టం రిపోర్టులో మరణానికి  కారణం మాత్రమే తెలుపుతారు వైద్యులు.  పైకి కనిపించే ఆధారాలని బట్టీ,  పోస్టుమార్టం రిపోర్టులో మరణానికి కనుగొన్న  కారణాన్ని బట్టీ మనం అది హత్యా ఆత్మ హత్యా అన్న  నిర్ధారణకి వస్తాం. చనిపోయిన రాజేంద్ర ఒంటి మీద గాయాలున్నాయి.  అయితే  అతడు మరణించినది ఆ గాయాల వల్ల కాదనీ,  అధిక మొత్తంలో నిద్ర మాత్రలు మింగడం వల్ల అనీ,  పోస్టుమార్టం రిపోర్టు తేల్చి చెప్పడం, పైగా అతడు తన స్వహస్తాలతో రాసిన సూసైడ్ నోట్ సాక్ష్యంగా దొరకడంతో, మనం దీన్ని ఆత్మహత్య అన్న నిర్ధారణకి వచ్చాము.   సూసైడ్ నోట్‍ని పక్కన పెడితే, అతడి చావుకి కారణమైన నిద్ర మాత్రలు అతడే స్వయంగా మింగాడన్న విషయం మనం ఎలా చెప్పగలం?  అతడికి  తెలియకుండా  నీళ్ళ లోనో, పాల లోనో వేరే వాళ్ళు కూడా నిద్ర మాత్రలని అతడికి ఇచ్చి ఉండచ్చు కదా?”

“నిజమే”

“ఉదయం మీకు అతడి గదిలో ఖాళీ నిద్ర మాత్రల స్ట్రిప్‍లు ఏమైనా దొరికాయా?”

“దొరికాయి. ఒకటి కాదు, రెండు.  మంచం పక్కన ఉన్న  డస్ట్‍బిన్ లో ఉన్నాయి.  వేరే వాళ్ళు  ఆ నిద్ర మాత్రలు నీళ్ళ లోనో పాలలోనో కలిపితే అలా నిర్లక్ష్యంగా  ఖాళీ స్ట్రిప్‍లని డస్ట్ బిన్ లో పడెయ్యరు కదా?”

“జరిగిన దాన్ని హత్యగా చిత్రీకరించాలన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు కావాలని ఆ స్ట్రిప్‍లని అక్కడే వదిలి ఉండచ్చు కదా? అది కాదు ముఖ్యం. అసలు ఆ నిద్ర మాత్రలని ఎవరు కొన్నారు? ఎప్పుడు కొన్నారు అన్న విషయం  తెలుసుకోవాలి”  చిన్న పిల్లకి పాఠం చెప్పినట్టుగా  చెబుతూ అన్నాడు అతడు.

“ఎలా తెలుసుకోవడం?”

“కాస్సేపట్లో తెలుస్తుంది”   చిద్విలాసంగా నవ్వాడు పాణి.

“ఎలా?” అంది ఆశ్చర్యంగా.

“మధ్యాహ్నం  పెద్ద రాజావారితో మాట్లాడి వెళ్ళిపోయాక ఏమీ తోచక రాజేంద్ర గది వైపు వెళ్ళాను. అక్కడ  మీ క్లూస్  టీమ్‍తో మాటలు కలిపి వాళ్ళు సేకరించిన ఆధారాలని పరిశీలించాను.  నేను డిటెక్టివ్‍నని చెప్పే సరికి వాళ్ళు కూడా ఉత్సాహంగా మాట్లాడుతూ అన్నీ నాకు చూపించారు. అప్పుడే నేను ఆ మాత్రల పేర్లూ, బ్యాచ్ నెంబర్లూ నోట్ చేసుకున్నాను. మెడికల్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఆ బ్యాచ్ టాబ్లెట్లు  నిజామాబాద్‍ లోని సుకన్య మెడికల్ షాప్‍కి సప్లై చెయ్యబడ్డాయని తెలుసుకున్నాను.   సుకన్య మెడికల్ షాపుకి మా ఫ్రెండుని పంపించాను. అతడు ఆ మాత్రలు ఎప్పుడు అమ్ముడయ్యాయో, ఎవరు కొన్నారో  బిల్లు బుక్కులు వెదికి ఇంకాసేపటిలో చెబుతానని చెప్పాడు”

ఇంద్రనీల కి కళ్ళు తిరిగినట్టయింది అతడి మాటలకి. పైకి క్యాజువల్‍గా తిరుగుతున్నట్టు కనిపిస్తూనే ఇన్ని పన్లు చేస్తున్నాడంటే, అతడు స్నేహితుడి మరణానికి పరామర్శించడానికి రాలేదనీ,   తన లాగే ఏదో ప్రత్యేకమైన  ఉద్దేశంతోనే  ఇక్కడికి వచ్చాడనీ అనిపిస్తోంది.

“మీకు మరో విషయం తెలుసా? మీ ఫోరెన్సిక్ టీమ్‍లో ఎవరో దొంగ ఉన్నారు” ఉలిక్కిపడ్డట్టుగా చూసింది ఇంద్రనీల.

“సేకరించిన క్లూలన్నింటినీ, సాధారణంగా నెంబరింగ్ వేసుకుని, వాటి మీద వేలి ముద్రలు చెరిగిపోకుండా ప్లాస్టిక్ సంచీలలో వేసి భధ్రపరిచి అవసరమైనప్పుడు కోర్టు వారికి ఎగ్జిబిట్లుగా ప్రవేశపెట్టడానికి సేఫ్ కస్టడీలో ఉంచుతారు.  మీకు తెలుసు కదా?” 

“అవును” అంది ఆమె అతడు ఏం చెప్పబోతున్నాడో ఊహించడానికి ప్రయత్నిస్తూ.

“ఈ విషయం మీరు అబ్జర్వ్ చేసారో లేదో తెలియదు  కానీ, క్లూస్ కి వాళ్ళు వేసిన ఎగ్జిబిట్ నెంబర్లలో  ఒక నెంబర్ కల క్లూ మిస్ అయింది”

గుండె ఒక్కసారిగా ఆగి మళ్ళీ కొట్టుకున్నట్టనిపించింది ఆమెకి.

“అదేం లేదండీ.  నేనే వాళ్ళు సేకరించిన క్లూలని దగ్గరుండీ సీల్ చేయించి నెంబరింగ్ వేయించాను”  తడబాటుని కప్పి పుచ్చుకుంటూ అంది ఇంద్రనీల.

“మరి ఆ  పన్నెండో  నెంబర్ గల క్లూ ఎలా మిస్సయింది?”

“బహుశా  నెంబరింగ్ ఇచ్చేటప్పుడు పొరపాటున ఒక నెంబర్ స్కిప్ చేసి ఉంటారు. అంతే తప్ప క్లూ మిస్ అయ్యే అవకాశం లేదు. నేను స్వయంగా పర్యవేక్షించాను”  తన కళ్ళల్లో భయం కనపడకుండా ఉండడానికి సాధ్యమైనంతగా ప్రయత్నిస్తూ అందామె.

“అంటే ఆ సమయంలో మీరు అక్కడే ఉన్నారన్న మాట!” అన్నాడు పాణి. షాక్ తగిలినట్టు చూసిందామె.   అతడు ఆ మాటలని క్యాజువల్‍గా అనలేదని అర్ధమైంది. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుని వెడుతున్నాడు?!

“అవునండీ.  అంతా నా పర్యవేక్షణ లోనే జరిగింది. కావాలంటే మనం నిజామాద్ వెళ్ళి కస్టడీలో ఉన్న ఆ క్లూస్ అన్నింటినీ మరోసారి చూసి రావచ్చు” అంది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nagaloka yagam