Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
atadu..aame..oka rahasyam

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

గతసంచికలో నాగలోక యాగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. http://​http://www.gotelugu.com/issue199/574/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/

 

దిక్కు తోచ లేదు బాహ్లీకునికి. పాముల నుంచి కాపాడుకోడానికి శిబిరాల మధ్య పరుగులు తీస్తున్నారు సైనికులు. కొందరు బళ్ళాలు, బరిసెలతో దొరికిన వాటిని దొరికినట్లు చంపేస్తున్నారు. ఎటు చూసినా అలజడి కలవరం కన్పిస్తోంది. వెంటనే మైదాన భూములు విడిచి పారి పోవటం కన్నా మరో మార్గం కన్పించ లేదు. వెంటనే అన్నీ సర్దుకుని తన అశ్వాన్ని అధిరోహించాడు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి బయట పడమని అజ్ఞాపిస్తూ అశ్వాన్ని అదిలించాడు.

తూర్పుగా వెళ్తే అటుగా వస్తున్న మాళవ సేనకు చిక్కే ప్రమాదం వుంది గాబట్టి నేరుగా ఉత్తర అడవుల వైపు దారి తీసాడు. అతడి వెనకే సైన్యం బయలు దేరింది. రథ గజ తరుగ పదాతి దళాలన్నీ క్షణాల్లో బయలుదేరి పోయాయి. రాత్రంతా అడవిలో ప్రయాణం సాగిస్తూనే వున్నాయి.

ఇప్పుడున్న గందరగోళ పరిస్థితిలో నిద్ర లేక భయందోళనల్లో వున్న తన సైన్యం ఉదయమే పోరుకు సిద్ధంగా ఉండదని గ్రహించిన బాహ్లీకుడు తెలతెల్ వారే సమయానికి చిక్కటి లోతట్టు అడవుల్లోని లోయ ప్రాంతాలకు వెళ్ళి పోయాడు. తెల్లవారి చూసుకుంటే విష సర్పాల దాడిలో పది వేల సైనికులకు మూడు వేల అశ్వాలు గల్లంతయినట్టు తేలి తల పట్టుకున్నాడు. ఇక ఆ రోజంతా విశ్రాంతి తీసుకుని సైన్యంలో కొత్త ఉత్సాహం నింపితే గాని యుద్ధం చేయ లేరని గ్రహించి సేనాపతుల ఆలోచన కూడ అదే విధంగా వుండటంతో ఆ రోజు కూడ యుద్ధ విరామం ప్రకటించి లోయ లోనే ఉండి పోయాడు బాహ్లీకుడు.

ఇక అతడు విడిసిన మైదాన భూముల్లో తెల్ల వారే సరికి ఆ ప్రాంతమంతా బీభత్సం గాను భయానకంగానూ వుంది. యుద్ధం జరక్కుండానే అపార నష్టం. ఎన్నో గుడారాలు తగలబడి పోయాయి. ఎటు చూసినా పాము కాట్లతో విషానికి మరణించిన సైనికు మృత దేహాలు, ఖండిత సర్పాలు కన్పిస్తున్నాయి. అడవి నక్కలు శవాలను పీక్కు తింటున్నాయి. ఆకాశంలో గ్రద్దలు కారాడుతున్నాయి. ఆవిధంగా బాహ్లీకునికి, అతడి సేనలకు ఆ రాత్రి కంటి మీద కనుకు లేకుండా చేసినది ఎవరో కాదు, నాగ రాకుమారి ఉలూచీశ్వరి. తన నాగ శక్తితో మైదాన ప్రాంతాల చుట్టూ వున్న విష సర్పాలను ప్రేరేపించటంతో అవి చెలరేగి సైనిక శిబిరాల మీద దాడి చేసి దారుణ మారణ హోమం సృష్టించాయి. ఇలా ఉండగా`

ఆ రోజు వేకువ జామునే రత్నగిరి కోటలో యుద్ధ సన్నాహాలు ఆరంభమయ్యాయి. రాజ కుటుంబం తలారా స్నానాలు చేసి నూతన వస్రాలు ధరించారు. యుద్ధంలో గెలుపు కోసం రాజ కుటుంబం కుల దైవంగా భావించే సహ్యాద్రి భీమ శంకరునికి... ధనుంజయుడు కొలిచే వేణు గోపాలునికి... రత్న గిరి నగర అధి దేవత ఆంకా దేవికి... రాజ పురోహితులు ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు. సూర్యోదయమయ్యే సరికి అవన్నీ భక్తి శ్రద్ధలతో నిర్వహించి పురుషులు యుద్ధ సన్నద్ధులయ్యారు.

ధనుంజయుడు శిరస్త్రాణం, ఛాతీ కవచం, భుజ కవచాలు, మణి కట్టు కవచాలు ధరించాడు. భుజాన అక్షయ తూణీరం బిగించాడు. గాంధార లోక అధి దేవత మోహినీ శక్తి ప్రసాదించిన అక్షయ తూణీరం అది. ఎన్ని బాణాలు వాడినా అది సదా బాణాలతో నిండుగా సిద్ధంగా వుంటుంది. గతంలో ఇలాంటిది గాండీవి వద్ద మాత్రమే ఉండేది. ఇక మహా రాజు ధర్మ తేజుడు కూడ ఆ వయసులో రణోత్సహంతో సర్వ సన్నద్ధమై వచ్చాడు.

అసలు ధనుంజయుని ఆలోచన వేరు.

తన తండ్రితో బాటు సఖియలు మూవురినీ కూడ కోటకే పరిమితం చేయానుకున్నాడు. కాని మహా మాత్యుడు వాసు దేవ నాయకుని సహా... తండ్రి సమరోత్సాహం చూసాక ఆయన్ని వారించ లేక పోయాడు.

రాజు ధర్మ తేజు మహా వీరుడు. గతంలో ఎన్నో యుద్ధాలు చూసిన వాడు. ఆ పైన చాలా కాలంగా ప్రభు దర్శనం లేక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆయన ముందుంటే చాలు సైన్యం రెట్టించిన ఉత్సాహంతో పోరాడ గలదు.

ఇక భద్రా దేవి కూడ పురుష వేషంలో రణ క్షేత్రానికి సర్వ సన్నద్ధు రాలయి వచ్చింది. పాతాళ లోక యువ రాణి మణి మేఖల కూడ పురుష వేషంలో సర్వ సన్నద్ధు రాలయి నడుమున వీర ఖడ్గం, భుజాన విల్లు, వీపున అంబుల పొది ధరించి భద్రా దేవి వెంట వచ్చింది.
కుసుమ కోమలి అయిన మణి మేఖల వీర విద్యల్లో కూడ నిష్ణాతురాలని ఇంత వరకు ధనుంజయునికే తెలీదు. ఆమె సామాన్యురాలు కాదు. బలి చక్రవర్తుల వారి ప్రియ దత్త పుత్రిక. ఘటనా ఘటన సమర్థులగు శుక్రా చార్యుల వారి శిష్యు రాలు. ఇక ఆమెకు రాని విద్యంటూ ఏముంటుంది? ఇవన్నీ గ్రహించాకే భద్రా దేవి మణి మేఖలను తన వెంట నిడుకొని వచ్చింది. అశ్వశాల ఆవరణలో కలిశారంతా. భద్రా దేవి మణి మేఖల వెంట రాణి కనకాంబిక, యువ రాణి ఉలూచీశ్వరి పరిచారికలు అంతా వచ్చారు. అచట రథాలు సిద్ధం చేయ బడి వున్నాయి. జరిగేది మహా యుద్ధం గాబట్టి ధనుంజయుడు తన అశ్వం గరుడని, భద్రా దేవి తన మచ్చల గుర్రాన్ని అశ్వ శాలలోనే ఉంచేసారు. అశ్వ శాల సంరక్షుకుడు యుద్ధంలో పరుగెత్తే ప్రత్యేక అశ్వాలు రెంటిని భద్రా దేవి, మణి మేఖల ఇరువురి కోసం సిద్ధం చేసి వుంచాడు.

సాధారణంగా యుద్ధ రంగానికి వెళ్ళే రథాలు అశ్వాలు ఎటు బడితే అటు సులువుగా పరుగెత్తడానికి రథం కోరిన వైపు మళ్ళటానికి అనువుగా రెండే చక్రాలు కలిగి వుంటాయి. నాలుగు చక్రాలు రథాలు ప్రయాణాలకు ఉపయోగించేవి.

రెండు నల్లటి అశ్వాలు పూన్చిన, రథకునికి గొడుగు పట్టినట్టుండే తన రథం పైన జయ కేతనం వంక చూసాడు ధనుంజయుడు. ఉదయపు గాలికి అది రెప రెప లాడుతోంది. ఒక సారి కనులు మూసుకుని గంధర్వ లోకాధి దేవత మోహినీ శక్తిని స్మరించుకుని కనులు తెరిచాడు. అంతే` రథ కేతనం ఒక్క సారిగా ప్రకాశవంతమైంది. జండాలో తమ  రాజ చిహ్నం పైన ధగ ధగాయ మానంగా ప్రకాశిస్తూ అమ్మ వారు తనను ఆశీర్వదిస్తూ ప్రత్యక్షమైంది. ధనుంజయుడు ఆ దేవిని భక్తితో ప్రణామం చేసాడు.

మహా రాజు ధర్మ తేజునిది ఎర్రటి ఒకే అశ్వం పూన్చిన బాదం కాయ ఆకారం లోని రథము. దానికి పైన గూడు లేదు. రథ ఛోదకుని వెనక అడ్డు చెక్క నుండి నిటారుగా వున్న కొయ్య పైన జయ కేతం రెప రెప లాడుతోంది. రథంలో బాణాలు గుట్టగా ఉంటాయి. రధికుడు నిలబడి బాణాలు సంధిస్తుంటాడు. అలాగే`

వరుసలో మహా మాత్యుడు వాసు దేవ నాయకుని రథం, మరి కొందరు రథికుల రథాలు సిద్ధంగా వున్నాయి. ఈ రథాలన్నీ రాజ కుటుంబ బంధు వర్గము, ముఖ్యులకు చెందినవి. అంతా రణ రంగంలో అంప వర్షం కురిపించ గల సమర్థులు. ఇవి గాక సైనిక శిబిరాల వద్ద మూడు వేలకు పైగా రథాలున్నాయి. రెండు వేల రథాల సైన్యం రెండుగా చీలినప్పుడు బాహ్లీకుని పక్షాన వెళ్ళి పోయాయి.

అప్పటికే రథ ఛోదకులు కళ్ళాలు పుచ్చుకుని రథాల మీద సిద్ధంగా వున్నారు. మహా రాణి కనకాంబిక, నాగ లోక యువ రాణి ఉలూచీశ్వరి మహా రాజు ధర్మతేజునికి, యువ రాజు ధనుంజయునికి, భద్రా దేవికి, మణి మేఖలకు హారతులిచ్చి వీర తిలకం దిద్దారు. మిగిలిన రథకులు కూడ వారి కుటుంబ సభ్యుల నుంచి హారతులందుకొని వీర తిలకం పొందారు.

అంతా బయలు దేరు ముహూర్త సమయం కోసం ఎదురు చూస్తున్నారు. అంతలో గూఢచారులిద్దరు అశ్వాల మీద వచ్చి దిగారు. మహా రాజుకి, యువ రాజుకి నమస్కరించారు. వారు తెచ్చిన సమాచారం విని నిర్ఘాంత పోయారు.

రాత్రి మైదాన ప్రాంతాల్లోని బాహ్లీకుని శిబిరాల మీద కుప్పలు తెప్పలుగా విష నాగుల దాడి చేయటంతో బాహ్లీకుడు మైదాన ప్రాంతాలు వదిలి ఉత్తరంగా అడవుల్లోని లోయ ప్రాంతానికి తన సేనలతో పారి పోయాడు. వేలాది సైనికులు మరణించి అపార నష్టం జరిగిందన్నది ఆ సమాచారం.

అది వినగానే`

నిన్నటి రోజున కోట బురుజు పైన ఉలూచీశ్వరి మైదాన ప్రాంతాలను చూపిస్తూ ఒకటికి రెండు మార్లు అడిగిన సంగతి గుర్తొచ్చి ఆమె వంక చూసాడు ధనుంజయుడు. ఈ పని ఆమె తప్ప ఎవరూ చేయ లేరు.

ఉలూచీశ్వరి అల్లరిగా నవ్వుతోంది.

‘‘దేవీ... ఇది తగునా?’’ చెంతకు వెళ్ళి అడిగాడు.

‘‘ఏది తమరు తగదనుచున్నారు?’’ గడుసుగా ఎదురు ప్రశ్నించింది.

‘‘నాకు తెలుసు. బాహ్లీకుని శిబిరాల మీదకు విష నాగుల్ని ప్రేరేపించినది నీవే కదూ?’’

‘‘అవుననుకోండి. అక్క భద్రా దేవి లాగో, చెల్లి మణి మేఖల వలెనో నేను మీతో వచ్చి కత్తి పట్టి కదన రంగమున యుద్ధము సలుప లేను గదా. అందుకే తోచినంతలో మన శత్రువు బలాన్ని కొంతయినా తగ్గింప నెంచి అటుల జేసితి. అది తగదందురా!’’ అంటూ అమాయకంగా చూస్తూ ఉలూచీశ్వరి పలుకుతుంటే ధనుంజయునికి నవ్వొచ్చింది. మహారాజు ధర్మ తేజుడు, రాణి కనకాంబిక కోడలిని మెచ్చుకోలుగా మురిపెంగా చూసారు.

అంతలో మరో యిద్దరు గూఢ చారులు వేగంగా వచ్చి అశ్వాలు దిగి నమస్కరించి నిలిచారు. వారు తెచ్చిన సమాచారం కూడ అందరినీ ఆశ్చర్య చకితుల్ని చేసింది.

తన అపార సైనిక శక్తితో సాగరం మీద తరలి వస్తున్న గాంధారాధీశుడు శతానీకుడు ఉదయానికి రత్నగిరి దరి దాపుల్లో ఉండాలి. కాని రాత్రికి రాత్రి దిశ మార్చుకొని తూర్పుగా ప్రయాణించి రత్న గిరికి ఉత్తరంగా పది యోజనాల దూరంలో తీరం చేరాడు. రాత్రి ఏదో సముద్ర రాకాసి తాకిడికి వేలాది నౌకల్ని, సైన్యాన్ని కోల్పోయాడన్నది చారులు తెచ్చిన సమాచారం.

ఎందుకలా జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు గాని అలా చేసి తమ శత్రువును కొంత బలహీన పర్చింది మాత్రం తన యక్ష మిత్రుడు రుచికుడని ధనుంజయునికి తెలుసు. మాట నిలుపుకున్నాడు రుచికుడు.

సరిగ్గా ఇదే సమయంలో మాళవ యువ రాజు ఇంద్ర జిత్తు కొందరు ముఖ్యుల్ని వెంట బెట్టుకుని సరా సరి అక్కడికి చేరుకున్నాడు. అంతా సైనిక దుస్తుల్లో యుద్ధ సన్నాహం లోనే వున్నారు. ఇంద్ర జిత్తు వెంట వచ్చిన ఒక అక్షౌణీ మాళవ సైన్యం రత్న గిరికి తూర్పుగా రెండు యోజనాల దూరంలో నిలిచి వుంది. బాహ్లీకుడు వాడి సైన్యం మైదాన ప్రాంతాల్లో లేక పోవటం... అక్కడ తగల బడిన శిబిరాలు... గుట్టలుగా విగత జీవులైన సర్పాలు... సైనిక శవాలను చూసి ఏం జరిగిందో అసలేం జరుగుతోందో అర్థం గాక సైన్యాన్ని అక్కడే వుంచి నేరుగా బయలు దేరి వచ్చాడు ఇంద్రజిత్తు.

సంపూర్ణ ఆరోగ్య వంతుడైన తన మేన మామ మహా రాజు ధర్మ తేజుని చూడ గానే అతడి ఆనందానికి మేర లేదు. అలాగే ధనుంజయుని వరించిన కన్యులు మూవురినీ కూడ చూసి సంతోషించాడు. కొద్ది సేపు పరిస్థితిని సమీక్షించుకున్నాక తన సేనల్ని తీసుకుని వేగంగా తమ సైనిక శిబిరాలను చేరుకోమని ఇంద్ర జిత్తును వెనక్కి పంపించాడు ధనుంజయుడు.

ఇక ముహూర్త సమయం వచ్చిందని పురోహితు హెచ్చరించటంతో అంతా తమ తమ రథాలను అధిరోహించారు. అందరి వద్ద వీడ్కోలు తీసుకుని బయలు దేరారు. ఉలూచీశ్వరి అత్త గారు రాణి కనకాంబికతో కోట లోనే ఉండి పోయింది.

ఆరంభంలో వంద మంది అశ్వికులు రెండు వరుసల్లో బయలు దేరగా వెనకే మహా రాజు ధర్మ తేజుని రథం, దాని అనుసరించి ధనుంజయుని రథం కదిలాయి. వాటి వెనక చెరో పక్క భద్రా దేవి, మణి మేఖల తమ అశ్వాలను అదలించారు. వారి వెనక మహా మాత్యుడు వాసు దేవ నాయకుడి రథం దాన్ని అనుసరించి ముఖ్యులయిన వారి రథాలు యాభై నడవగా చివరగా మరో వంద అశ్వాల మీద రెండు వరుసల్లో అశ్విక దళం కదిలింది. మంగళ వాద్యాలు భేరీ నాదాలు కొమ్ము బూర శబ్ధాలు మారు మ్రోగాయి.

ఆ విధంగా బయలు దేరిన మహా రాజు ధర్మ తేజుని చూసేందుకు నగర ప్రజలు బారులు తీరి పుష్ప వర్షం కురిపించారు. చాలా కాలం తర్వాత తమ ప్రభువుని చూసిన ఆనందంలో జేజేలు పలికారు. పడతులు ధర్మ తేజునికి, ధనుంజయునికి విజయ హారతులిచ్చారు. నగర వీధుల నుండి నగర వాకిళ్ళ వరకు ప్రజా సందోహం వెల్లువెత్తి జయ జయ నాదాలు చేసింది. నీరాజనాలు పట్టింది.

నగర వాకిళ్ళు దాటగానే`

రథాన్నీ వేగం అధికరించి తమ సైనిక శిబిరాల దిశగా శర వేగంతో పరుగులు తీసాయి.

***************************

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్