Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope 3rd febuary to 9th febuary

ఈ సంచికలో >> శీర్షికలు >>

అమర్ నాధ్ యాత్ర - .కర్రానాగలక్ష్మి

amarnath yatra

భారత దేశం లో వున్న కష్టమైన యాత్రలలో ఒకటిగా చెప్పుకొనే అమర్ నాధ్ గురించి చెప్పుకుందాం .

ఏడాదిలో రెండు నెలలు మాత్రమే యీ యాత్ర జరుగుతుంది . కొన్ని సంత్సరాల కిందటి వరకు యీయాత్ర ఒక మాసం మాత్రమే జరిగేది అంటే ఆషాఢ పున్నమి నుంచి శ్రావణ పున్నమి వరకు మాత్రమే యీ యాత్ర జరిగేది  . ప్రస్తుతం జ్యేష్ఠ పున్నమి నుండి శ్రావణ పున్నమి వరకు అంటే రెండు మాసాలు జరుగుతోంది . మిగతా సమయంలో యీ ప్రాంతం పర్యటించడానికి వీలుగా వుండదు . ఈ ప్రాంతం లో హిమపాతం చాలా యెక్కువగా వుంటుంది .

ముందు చెప్పుకున్నట్లుగా యిది కష్టతరమైన యాత్ర కావడంతో ప్రభుత్వం వారు పర్యాటకుల భద్రత దృష్ట్యా కొన్ని నిబంధనలు విధించేరు . యాత్ర మొదలవడానికి సుమారు రెండు నెలల ముందు మన పేరు , వయసు మొదలయిన వివరాలతో పాటు ఆరోగ్య నిర్ధారణ పత్రాన్ని కూడా జత చేసి నమోదు చేసుకొని పాసు తీసుకోవాలి . రాష్ట్ర ముఖ్యకేంద్రాలలోనూ జమ్ము అండ్ కశ్మీరు బ్యాంకు లోనూ నమోదు చేసుకునే వీలు కల్పించేరు . ముందుగా నమోదు చేసుకొని యాత్రీకులను యీ యాత్రకు అనుమతించరు .

గత కొద్ది సంవత్సరాలుగా పర్యాటకరంగం చొరవతో ప్యాకేజీ టూర్లు బాగా ప్రాచుర్యం పొందేయి . యీ యాత్ర కూడా ప్యాకేజీ లో అందుబాటులో వుంది . ప్యాకేజీ తీసుకుంటే వారే మొత్తం పేపర్ వర్క్ చేసుకుంటారు . వీటిలో హెలికాఫ్టరు టూరు , నడక టూర్లు వుంటాయి . మన ఆర్థిక , ఆరోగ్యాలననుసించి యేదైనా టూరు యెంచుకోవచ్చు .

అయితే నేను యిక్కడ టూరులో వెళ్ల దలచుకోని వారికి మార్గదర్శకంగా వుండేటట్లుగా రాస్తాను .

దేశ రాజధానికి సుమారు 937 కిలో మీటర్ల దూరంలోనూ , జమ్ము నుంచి 387 కిలో మీటర్ల దూరంలోనూ , శ్రీనగరు వంద కిలోమీటర్ల దూరంలోనూ వున్న ' బాల్టాల్ ' చేరుకోడానికి దేశం నలుమూలలనుంచి రైలు సర్వీసులు జమ్ము వరకు వున్నాయి . గాలిలో ప్రయాణించాలనుకొనే వారికి శ్రీనగరు వరకు విమాన సర్వీసులు వున్నాయి . అక్కడనుంచి బాలాటాలు వరకు రోడ్డు ద్వారా గాని , ఆకాశ మార్గాన్ని గాని ప్రయాణించి బాల్టాల్ చేరుకోవచ్చు .

అమర్ నాధ్ చేరుకోడానికి రెండు దారులు వున్నాయి , ఒకటి బాల్టాల్ మీదుగా రెండవది పహల్ గావ్ మీదుగా . మనం యేదారిలో వెళ్లాలనుకుంటున్నామో కూడా మనం రిజిస్ట్రేషన్ ఫార్మ్ లో తెలియ చెయ్యాలి . దాని ప్రకారంగానూ మనకి బస్సు టికెట్టు యిస్తారు .

నమోదు చేయించు కున్నపుడే మనకి దర్శనం తారీఖు కూడా అడుగుతారు . మనకి కేటాయించిన దర్శనం తారీఖు కి నాలుగు రోజులు ముందు జమ్ము బస్టాండు చేరుకోవాలి . అక్కడ మన రిజిష్ట్రేషను కాయితాలను చూపిస్తే మర్నాటికి బస్సు టికెట్టు  యిస్తారు . ఈ యాత్ర అక్కడి వాతావరణం మీద , చొరబాటుదారుల మీద ఆధారపడి వుంటుంది . ఈ రెండూ సవ్యంగా వున్నప్పుడు మన యాత్ర సజావుగా సాగుతుంది లేక పోతే అనుకున్న దానికన్నా యెక్కువ రోజులు పడుతుంది కాబట్టి అలాంటి పరిస్తితులకు సిధ్దపడి ఆప్రకారంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలి .

ఉత్తర భారతదేశ యాత్రలు యెక్కువగా వాతావరణం మీద ఆధారపడి వుంటాయి , ఒకటి రెండు రోజులు చేతిలో వుంచుకోవడం మంచిది .    మరునాడు పొద్దున్న నాలుగు గంటలకి మన ప్రయాణం మొదలవుతుంది . ప్రయాణీకుల సామానులు స్కేన్  చేసేక మొత్తం ప్రయాణీకుల బస్సులన్నీ మిలిటరీ పహారాలో బయలుదేరుతాయి . భోజనాలకు , ఫలహారాలకు బస్సులన్నీ ఒకే చోట ఆపుతారు . మధ్యలో చొరబాటు దారుల దాడులు లేకుండా వుంటే సాయంత్రానికి బాల్టాల్ చేరుకుంటాం . ముందుగా మీకు బాల్టాల్ దారిలో అమర్ నాధ్ తీసుకు వెళతా , తరువాత పహల్ గావ్ దారిలో అమర్ నాధ్ తీసుకు వెళతా . రెండు దారులలోనూ వెళ్లి మేం అమర్ నాధుడిని దర్శించుకున్నాం . రెండు మార్లు బాల్టాల్ మీదుగా , ఓ మారు పహల్ గావ్ మీదుగా మరో మారు హెలికాఫ్టరు మీద వెళ్లి మంచులింగాన్ని దర్శించుకున్నాం .

జమ్ము బస్సుస్టాండు నుంచి లంగరులు ( యాత్రీకులకు ఉచిత భోజనాదులు అందించే టెంట్లు) వుంటాయి . పెద్ద పెద్ద వ్యాపారులు యాత్రీకులకోసం యిలాంటి లంగరు సేవలను అందిస్తూ వుంటారు . జమ్ము నుంచి ఉధమ్ పూరు , పత్నీటాప్ , రాంబాణ్ , శ్రీనగరు , సోన్ మార్గ్ మీదుగా బాల్టాల్ చేరుతాం .

బాల్టాల్ లో రాత్రి గడపడానికి టెంట్లు మాత్రమే దొరకుతాయి . ఇద్దరు నుంచి యిరవై మంది వరకు వుండేంత పెద్దవి కూడా వుంటాయి . భోజనాలకి లంగరులు వుండనే వున్నాయి . లంగరులు పంచభక్షాలు వండి కొసరి కొసరి తినిపిస్తారు . రాత్రి యెనిమిది నుంచి పొద్దున్న ఆరు వరకు మూసి వేస్తారు .

ప్రొద్దుట యెనిమిది  బాల్టాల్ చెక్ పోయింట్ మూసివేస్తారు ఆలోపున యాత్రీకులు గుర్రాలమీద , నడక లేదా డోలీ లలో కాని యాత్ర మొదలు పెట్టాలి . ఎంత ప్రొద్దుట బయలు దేరితే యాత్ర ముగించుకొని అంత తొందరగా వచ్చేయొచ్చు . కొండలలో చాలా తొందరగా చీకటి పడుతుంది , ప్రయాణం కూడా కష్టమౌతుంది . ఈ యాత్రకి ముఖ్యంగా చలిబట్టలు , ఉన్ని లో దుస్తులు , పై దుస్తులు , తలకి టోపీలు , కాళ్లకు కొండలలో నడకకు సహకరించే షూలు , రైన్ కోట్లు , మంచి కాంతి నిచ్చే టార్చ్ వుండాలి . ఇక్కడ వాతావరణం మైనెస్ లలో వుంటుంది .    ప్రొద్దుట బయలుదేరి సాయంత్రానికి తిరిగి బాల్టాల్ చేరుకోడం మంచిది . అమర్ నాధ్ గుహ దగ్గర రాత్రి వుండడం శ్రేయస్కరం కాదు .         బాల్టాల్ చొరబాటుదారుల తాకిడి యెక్కువగా వుండే ప్రాంతం కావడంతో ఆర్మీ పహారా కూడా యెక్కువగా వుంటుంది .

బాల్టాల్ ఓ పక్క అమర్ గంగ ప్రవహిస్తూ వుంటుంది . లోయంతా పచ్చని పచ్చిక తో ఆహ్లాదంగా వుంటుంది . చక్కని వాతావరణం లో పచ్చిక మీద నడవాలనే కోరిక కలుగుతుంది . హద్దు దాటరాదనే ఆర్మీ వారి హెచ్చరికలు మనని అడుగు ముందుకు వెయ్యనియ్యవు . బాల్టాల్ నుంచి అమర్ నాధ్ గుహ సుమారు 18 కిలో మీటర్లు  , సన్నని మట్టి బాటలో నడిచేవారు , గుర్రాలమీద వెళ్లేవారు , డోలీల వాళ్లు అందరూ అటునుంచే వెళతారు . వర్షం పడనంతవరకు ఆ దారిన ప్రయాణం ఫరవాలేదు కాని వర్షం పడితే దారంతా బురదయి మనుోషులను గుర్రాలతో సహా లోయలోకి లాగేస్తుంది . అడుగు వెయ్యడం సాధ్యంకాదు . ఓ సారి అలా వాన పడి ఆ బురదలో కాలు తీసి కాలు వెయ్యడం వీలవక గుర్రాలవాళ్ల సాయంతో దానిని దాటగలిగేం . స్థానికులకి అలాంటి బురదలో నడక అలవాటే . దారంతా మట్టి రాతి కొండలు తప్ప గడ్డి కూడా కనబడదు .  కాస్సేపు కూర్చొని సేదతీరేఅవకాశమే వుండదు . గుర్రం మీద ప్రయాణం , దాని విసురుకి మన నడ్డిపడిపోతూ వుంటుంది .గాలిలో ఆక్సిజన్ లోపించడం వల్ల పిచ్చి ఆయాసం కలుగుతుంది . శ్వాసకోశ యిబ్బందులు వున్నవాళ్లు తగు జాగ్రత్తలు తీసుకొని ప్రయాణించాలి . శ్వాస ఆడక , గుర్రం లోయలోకి పడిపోయి మనకళ్లముందే మరణించడ చూస్తూ ప్రయాణం చెయ్యడం బాధకలిగిస్తుంది .

అడుగడుగునా వేడివేడి ఆహారపదార్థాలను అందిస్తూ వుంటారు లంగరు నిర్వాహకులు . 13 కిలోమీటర్ల ప్రయాణానంతరం ' పంచతరణి ' చేరుతాం దీనిని ' సంగం ' అని కూడా అంటారు . ఇక్కడ పహల్ గావ్ వైపు నుంచి వచ్చే దారి , బాల్టాల్ నుంచి వచ్చే దారి కలుస్తాయి . సంగం నుంచి మరో రెండు కిలో మీటర్ల తరువాత మన ప్రయాణం గడ్డకట్టిన మంచుమీద సాగుతుంది . మంచుకి ముందర వరకే గుర్రాలని అనుమతిస్తారు , డోలీలలో వచ్చిన వారిని మాత్రం గుహ దర్శనం వరకు అనుమతిస్తారు . గడ్డ కట్టిన మంచుమీద నడవడం చాలా కష్టం , అయితే గుర్రాలవాళ్ల సహాయంతో ఆరెండు కిలోమీటర్లు  సునాయాసంగా దాటేయొచ్చు . రెండు వైపులా ఆ మంచుమీదే యేర్పాటు చేసుకున్న దుకాణాలు , మంచుమీద గోనె పట్టాలు పరిచి పడుకొనేందుకు యేర్పాటు చేసి యాత్రీకులను విశ్రాంతి తీసుకోమనే వారిని చూస్తే మన వళ్లు గజగజ వణుకుతుంది .

అక్కడ ఫ్రీ మెడికల్ కాంపులు నిర్వహిస్తున్న యితరమతస్థుల డాక్టర్లు మనని ఆశ్చర్యానికి గురి చేస్తారు . ఆర్మీ వారు కూడా ఫ్రీ మెడికల్ కాంపులు నిర్వహిస్తున్నారు .

గుహ అరకిలో మీటరుందనగా మెట్లు మొదలవుతాయి , చాలా మంది భక్తులు పాదరక్షలు విడిచి పెట్టి నడుస్తూ కనిపిస్తారు , మెట్లమీద క్యూ వుండడం వల్ల చలిలో మన కాళ్లు గడ్డకట్టుకు పోతాయేమో అని అనిపిస్తుంది . గుహలోకి వెళ్లాకా గుహ యెత్తున వున్న మంచులింగం ( మూడు మార్లు యిరవై అడుగుల లింగం , ఓ సారి నాలుగడుగుల లింగం చూసేం ) చూసాకా అంతవరకు పడ్డ కష్టం చేత్తో తీసేసినట్లు పోతుంది . శివలింగానికి కొన్ని అడుగుల దూరంలో మంచుతో యేర్పడ్డ పార్వతి , వినాయకుడిని చూసి  ఆ పక్క మరో చిన్న గుహలో ప్రవహిస్తున్న అమరగంగను దర్శించుకొని అక్కడ నుంచి అమరగంగను బాటిల్ లో నింపుకొని వెనుతిరిగేం . అయితే దర్శనానికై వెళుతున్నప్పుడు   చాలా మంది గుహ పైకప్పు కేసి చూస్తూ  ' కనిపించలేదు ' అనడం విని విషయమేమిటని అడిగితే వారు రెండుపావురాలని యీ గుహ లో చూస్తే మన యాత్ర సఫలమయినట్లు అన్నారు . సరే మేమూ వెతకడం మొదలుపెట్టేం , రెండుకాదు మూడు రెళ్లు కనిపించేయి . దర్శనం అవగానే ఆర్మీ వారిచ్చిన వేడి టీ , వేడి వేడి నీళ్లు తాగి తిరుగు ప్రయాణమయేం .

గుహనుంచి బయటకు వచ్చేక మెట్లమీద కూర్చొని అడుక్కుంటున్న మా టెంటు మేట్ ( మేం ఆరువందల మంచాల రాత్రికి కొనుక్కొని వున్న టెంటులోనో అతను కూడా వున్నాడు ) ని చూసి కలిగిన ఆశ్చర్యం అంతాయింతా కాదు . ప్రాణాలకు తెగించి చలి పులి అనకుండా తలచారా చన్నీటి స్నానాలు చేసి యాత్రీకులకు వేడివేడి ఆహారపదార్థాలు సమకూర్చే లంగరు యజమానులు గొప్పా ? లేక ప్రాణాలకు తెగించి అక్కడ అడుక్కోడానికి వచ్చిన భిక్షగాళ్లు గొప్పా ? అన్నది యానానికి నాకు అర్దం కాని ప్రశ్నే .

ఆ రాత్రి టెంటులో పడుక్కొని మరునాడు జమ్ముకి బస్సులు లేని కారణాన హౌసుబోటులో రెండురోజులు వుండి శ్రీనగరు చూసుకొని యెన్నో మరపురాని జ్ఞాపకాలతో ఢిల్లీ చేరేం .

ఇప్పుడు టాక్సీలు విరివిగా నడుపబడుతుండడంతో మనం వుండదల్చుకుంటేనే శ్రీనగరులో వుండొచ్చు లేకపోతే టాక్సీలో జమ్ము చేరవచ్చు ,  వాతావరణం , చొరబాటుదారులు యిబ్బందులు కలుగజెయ్యకపోతే .

ఓ సారి బురదలో జారి కిందపడి కొండవాలులో మా అబ్బాయి జారిపోతూ వుంటే గుర్రాలబ్బాయి రక్షించడం , కుక్కని చూసి బెదిరిన నేను యెక్కిన గుర్రం పరుగులెత్తితే నాకాలు గుర్రపు నాడాలో యిరుక్కుపోయి గుర్రం మీద తలకిందులుగా వ్రేలాడుతూ వుంటే గుర్రం అబ్బాయిలు రక్షించడం యిప్పటికీ వళ్లు ఝల్లుమనిపిస్తుంది .

అమర్ నాధుడిని దర్శించుకున్నాం కదా యిప్పడు కధ కూడా చెప్పుకుందాం .

ఒకనాడు పార్వతీ దేవి నారదుని ప్రోద్బలంతో శివుని కంఠాన వున్న కపాలముల మాల గురించి అడుగగా శివుడు ఆ కపాలాలు పార్వతి పూర్వ జన్మల కపాలాలని ఆమె మీద ప్రేమతో వాటిని తన కంఠాన అలంకరించుకున్నానని శలవిస్తాడు . నారదుడు కలహ ప్రియుడు కదా ? పార్వతిని శివుని పూర్వజన్మలో కపాలాలు ధరించమని అప్పుడు ఆమెకు శివునిపై కల ప్రేమ వెల్లడవుతుందని మెలిక పెడతాడు . పార్వతి హఠముచేయగా శివుడు తాను అమరుడినని చెప్తాడు . దానికి మరల నారదుని మెలిక యేమనగా లక్ష్మికి , సరస్వతికి లేని మరణము పార్వతికి యెందుకు వుంది . పార్వతి శివుని యిదే ప్రశ్న వేయగా శివుడు అమరకథ విన్నవారు అమరులౌతారు అనగా పార్వతి  తనకుకథను చెప్పి అమరత్వము కలుగజేయవలసినదిగా కోరుతుంది . శివుడు తన నందిగణాలను అమరకథ పార్వతికి వినిపించుటకు అనువైన ప్రదేశమును వెతుక వలసినదిగా భూమి పైకి పంపుతాడు . నందిగణాలు వెతుకుతూ ప్రాణులు లేని యీ ప్రదేశమునకు వచ్చి గుహలో ఆసనముయేర్పరచి దానిపై గడ్డి పరచి కూర్చొనేందుకు వీలుగా చేసి శివునకు యెరుక పరుస్తారు . శివుడు తన వంది మాగధులతో ఆ ప్రదేశమునకు పోతూ ముందుగా నందిని ఓచోట విడిచి పెడతాడు ఆ ప్రదేశం బైల్ గాం గా పిలువబడి కాలాంతరాన పహల్ గాం గా పిలువబడసాగింది . ఇంకాస్త దూరం ప్రయాణించేక తలపైనున్న చంద్రుణ్ణి తీసి అక్కడ విడిచి పెడతాడు , ఆ ప్రదేశం ' చందనవాడి ' గా పిలువబడుతోంది . తరవాత మెడలో వున్న పామును విడిచి పెడతాడు ఆ ప్రాంతం శేష్ నాగ్  గా పిలువబడుతోంది . తరవాత చేతిలోని ఢమురుకాన్ని విడిచిపెడతాడు ఆ ప్రదేశం పంచతరణి లేక సంగం అని పిలువబడుతోంది . తరువాత జీవరాశి లేని గుహ చేరి ఆసనము పై ఆశీనుడై పార్వతికి అమరకథ వినిపిస్తాడు , అమరకథ పూర్తవగానే శివుడు ఆశీనుడై వున్న గడ్డి క్రింద నుంచి పావురము బయటకు వచ్చుట చూచి శివుడు పావురమును బంధించుటకై తరమ సాగేడు . పావురము ప్రాణభయంతో వశిష్ఠుని పత్ని అరుంధతి ని శరణు కోరుతుంది . అరుంధతి పావురమును తన పొట్టలో దాచుతుంది . శివుడు పావురము కొరకై చాలాకాలము అరుంధతి ముంగిట వేచివుండి యెంతకీ పావురము అరుంధతి పొట్టనుండి రాకుండుట చూచి అరుంధతి ని పావురమును బయటకు పంపమని అడుగగా ఆమె పావురమునకు ప్రాణభిక్ష యిస్తే పావురము ను విడుస్తానని చెప్పగా శివుడు దానికి అంగీకరించి యికపై యెవ్వరికీ అమరత్వము లేదని చెప్పి పావురమునకు ప్రాణభిక్ష ప్రసాదించి  కైలాసానికి మరలుతాడు .

అమరకథ చెప్పబడిన ప్రదేశము కావున యిక్కడ శివుని అమర్ నాధుడని అంటారు .

అమర్ నాథుని దర్శించుకున్నవారికి మరుజన్మలేదని హిందువుల విశ్వాసం .

ఈ గుహను నాలుగు మార్లు దర్శించుకున్నాం అనే విషయం తలుచుకుంటే అది మా గొప్పతనం కాదని భగవత్సంకల్పం మాత్రమే అని అనిపిస్తుంది .

ఈశ్వరానుగ్రహం లేనిదే యే యాత్రా చెయ్యలేము . అందులో యిలాంటి కష్టతరమైనవి అస్సలు చెయ్యలేము .

భం భం భోలే ...... బోల్ భం .

మరిన్ని శీర్షికలు
chamatkaaram