Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
paryatakam

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఆచారం - నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు

achaaram

"మహాశివరాత్రి పర్వదినం-విశేషాలు"

"ఓం నమఃశివాయ"

" ఓం త్ర్యయంబకం యజా మహే సుగంధిం పుష్ఠి వర్థనం,
ఊర్వారుక మివబంధనాత్ మృత్యోర్మోక్షీయ మామృతాత్"


ఈ రోజు "మహాశివరాత్రి" పర్వదినం. మన మహాపర్వదినాల్లో మహాశివరాత్రి ఒకటి. ఈ పర్వం మాఘమాసంలో కృష్ణ పక్షం అర్థరాత్రి వ్యాపకమైన చతుర్థశి తిథియందు వస్తుంది. చతుర్థశి తిథి శివుడికి ప్రీతికరమైంది. అందులో కృష్ణ చతుర్థశి తిథి మరీ ప్రీతికరమైంది. అందుచేత ప్రతిమాసంలోని కృష్ణ చతుర్థశి తిథులు మాసశివరాత్రులు అయ్యాయి. సంవత్సరంలో వచ్చే పన్నెండు మాసశివరాత్రులలో మాఘబహుళ చతుర్థశి శివునికి మరీ ప్రీతికరమైంది. అందుచేత ఇది మహాశివరాత్రి [ శివరాత్రులలో గొప్పది] అయింది.

శివరాత్రులు ఐదు రకాలు;-

1. నిత్యశివరాత్రి, 2.పక్షశివరాత్రి, 3.మాసశివరాత్రి,  4. మహాశివరాత్రి, 5. యోగ శివరాత్రి.
1. నిత్యశివరాత్రి;- ప్రతినిత్యము హరారాధనకు ఉద్దిష్టమైనరాత్రి.
2.పక్షశివరాత్రి;- పక్షపక్షమునకు శివార్చనకు ఉద్దిష్టమైనరాత్రి.
3.మాసశివరాత్రి;- మాసమాసానికి శివపూజకు ఉద్దిష్టమైనరాత్రి.
4.మహాశివరాత్రి;- ప్రతినెల మాసశివరాత్రికి పూజ చేయలేని వారు కనీసం మహాశివరాత్రి రోజన్నా శివ పూజ తప్పక చేయాలి.
5.యోగ శివరాత్రి;- యోగి అయిన వాడు తన యోగ మహాత్మ్యం చేత యోగ నిద్రలో కూర్చునే రాత్రి.

*కాళరాత్రి

సాధారణంగా రాత్రిపూట దేవీపూజకు, పగటిపూట దేవపూజకు ప్రత్యేకింపబడుతూ ఉండడం ఆచారమై ఉంది. కాని ఆచారానికి విరుధ్దంగా ఈ పర్వదినంగా శివుని పూజ జరుగుతుంది.

శివుడు త్రిమూర్తులలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో మూడవవాడు. బ్రహ్మ సృష్ఠికర్త, విష్ణువు సంరక్షకుడు, శివుడు లయకారకుడు.    ఒకసారి ప్రళయం వచ్చింది. అప్పుడు ప్రపంచమంతా చీకటికోణం అయింది. జీవులు అణురూపంలో మైనం ముద్ద మీద బంగారు రేణువులవలే అంతరాళంలో ఉండిపోయారు. అప్పుడు లోకహితమును కాంక్షించి పార్వతీదేవి శివుని గూర్చి తపస్సు చేసింది. అప్పటి ధీర్ఘకాళరాత్రిని తప్పించి మామూలు రాత్రింబవళ్ళు కల్పన చేసి జీవులను ఉద్ధరించవలసినదిగా ఆమె శివుణ్ణి కోరింది. శివుడు ఆ కోరిక నెరవేర్చాడు. తాను చేసినట్లుగా రాత్రిపూట శివపూజ సాగించేవారికి సమస్త సౌఖ్యాలు చేకూరేటట్లుగా కూడా ఆ సంధర్భంలో పార్వతి శివుడి వల్ల వరంపొందింది. ప్రళయ కాలమునాటి దీర్ఘకాల రాత్రి సమయంలో పార్వతి చేసిన శివపూజ ప్రళయానంతరం శివరాత్రి నాటి శివపూజగా పరిణామం చెందింది. శివపూజా భాజనమైన ఆ రాత్రి "మహాశివరాత్రి" గా పేరు పొందింది.

* లింగోద్భవ కాలం.

ఈ రాత్రికి శివరాత్రి అనే పేరు రావడానికి కారణం ఈశాన సంహిత ఈ విధంగా చెబుతూ ఉంది. శివుడు నేటి అర్థరాత్రి కాలాన కోటి సూర్య సమప్రభతో లింగాకారంతో పుట్టడం చేత దీనికి శివరాత్రి అనే పేరు వచ్చింది. అర్థరాత్రి లింగోద్భవకాలం.శివరాత్రి పేరు రావడానికి రెండు కారణాలు కలవు.

పరమశివుడు లింగాకారంలో పుట్టినరోజు కావడం చేత ఇది శివుడికి ప్రియకరమైనదని, ఈనాడు లింగరూపి అగు శివుడికి పూజ జరపాలని శైవాగమం చెబుతుంది.

శివరాత్రినాడు పగలు ఉపవాసము, రాత్రి జాగరణము, శివలింగార్చన విధిగా చేయాలి. ఉపవాస, జాగరణ లింగార్చనా రూపకమైన శివరాత్రి వ్రతం ఆచరిస్తే ఆ వ్రతం ఫలదాయకంగా ఉంటుంది.

శివరాత్రికి ముందు రోజు ఒంటిపూట మాత్రమే భోజనం చేయాలి, ఆ రాత్రి పవిత్రమైన స్థలంలో నిద్రపోతారు. శివరాత్రినాడు అరుణోదయాన్నే స్నానం చేయాలి, శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేయాలి, రాత్రి జాగరణం చేస్తూ నాలుగు జాముల్లోను నాలుగు సార్లు శివపూజ చేయాలి.

నాలుగుజాముల్లోను శివపూజ నాలుగు రకాలుగా సాగాలి. మొదటిజాములో శివుని పాలతో అభిషేకించాలి, పద్మాలతో పూజ చేయాలి, పెసరపప్పు బియ్యం కలిపి పులగం వండి నైవేద్యం పెట్టాలి. ఋగ్వేదమంత్రాలు పఠించాలి. రెండవ జాములో పెరుగుతో అభిషేకం చేయాలి, తులసిదళాలతో శివుణ్ణి అర్చించాలి. పాయసం నైవేద్యం పెట్టాలి. యజుర్వేద మంత్రాలు పఠించాలి. మూడవ జాములో నేతితో అభిషేకించాలి, మారేడు దళాలతో శివుణ్ణి పూజించాలి. నువ్వుల పొడి కలిసిన తినుబండారం నైవేద్యం పెట్టాలి. సామవేద మంత్రాలు పఠించాలి. నాల్గవ జాములో తేనెతో అభిషేకించాలి. నీలి రంగు పుష్పాలతో పూజించాలి, కేవలం అన్నం నైవేద్యం పెట్టాలి, అధర్వణ వేద మంత్రాలు పఠించాలి. 

ఈ విధమైన పూజ శక్తి కలవాళ్ళు ఇంటివద్దనే చేసుకోవచ్చు. శక్తి లేని వాళ్ళు దేవాలయానికి వెళ్ళి దర్శించుకోవచ్చును. అభిషేకం జరుగుచుండగా శివదర్శనం చేయడం మహా పుణ్యప్రదం.

* ముఖ్య విషయం;- చిన్న పిల్లలు, వృద్దులు, అనారోగ్యంతో ఉన్నవారు ఉపవాసం లేకున్నా తప్పకుండా జాగరణ చేయాలి.
 

మరిన్ని శీర్షికలు
story reviews