Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
anubhandham

ఈ సంచికలో >> కథలు >> శతాయుష్మాన్ భవ

.shaayushmaanbhava

నిన్నటి రోజు ఎంతో బావుందనీ, నేడు ఇంకా బావుంటుందనీ , రేపు బేషుగ్గా వుంటుందనీ మనిషి ఆశిస్తాడు. ఇది సహజం. అలాగే నిన్నటి నేనూ, నా శ్రీమతి, నేటి మా అమ్మాయీ, రేపటి మా మనవరాలు, మనవడూనూ.  నిన్నటికీ, నేటికీ, రేపటికీ అనుక్షణం పెనుమార్పులు చోటుచేసుకుంటూనే వుంటాయి. ఈ మార్పులు మనిషి వుజ్వల భవిష్యత్తు కోసం  అనుకోవాలి లేకపోతే మనిషి మనుగడ సాధించలేడు.
బెంగుళూరు నుండీ మా అమ్మాయి , టంథ్ చదువుతున్న మనవరాలూ, సెవెంత్ చదువుతున్న మనవడూ కాన్వెంట్స్ కి కొన్ని రోజులు సెలవులు ఇవ్వడంతో వస్తున్నట్లుగా ఫోన్ చేసింది.

నేను నా ముద్దుల మనవరాలూ, మనవడితోనూ వాళ్ళు ఉన్నన్ని రోజులూ సరదాగా కాలక్షేపం  చెయ్యాలని నా గదిలో అన్నీ సర్దుకుంటున్నాను.  వెనుక నుండి నా శ్రీమతి వచ్చి "ఏమిటో మీ హడావిడి అంతా మనవరాలూ, మనవడూ మీతో ఆడుకుంటారనీ, మీరు చెప్పే కాకమ్మ కథలూ, వింటారనీ, కేరం బోర్డూ ఆడుకుంటారనీ మీ గదంతా సిద్ధం  చేసేస్తున్నారా?  వాళ్ళు ఇవన్నీ ఎప్పుడో మర్చిపోయారు. పిచ్చిమేళం అనవసరం. హైరానా పడకండి. వాళ్ళ దైనందిన అలవాట్లు మారిపోయాయి. వాటికి అనుగుణం గా మీతో కాలక్షేపం చేయడానికి వాళ్ళకు వీలు కాదు. అంటూ గలగల నవ్వుతూ కుడి బుగ్గన , కుడి అరచేయి ఆనించుకుని అచ్చంగా రాజా రవివర్మ చిత్రం లోని స్త్రీలా వయ్యారంగా నిలబడి వుంది. ఆమె పెళ్ళయిన కొత్తలో అప్సరసలా వుంది. మొన్నమొన్నటి వరకూ నన్ను మురిపించింది మురిపాలతో, నేడు నేత చీర కాసి వడపోసి కట్టుకుని, నుదుట రూపాయి కానంత కుంకుమ బొట్టుకు తోడుగా అడ్డంగా విభూతి కూడా చేర్చి మిగల మగ్గిన బంగినిపల్లి మామిడి పండులా ముడుతలు పడిన బుగ్గలతో నా చూపుల్లో ఇంకా అలానే విరాజిల్లుతోంది.  

నేను వెంటనే "భలే దానివే, మన బుజ్జిగాడి పెంపకం ఎలా వుంటుందనుకున్నావ్? వాళ్ళు నాతో పూర్తిగా కాలక్షేపం చేస్తారు తెలుసునా? అన్నాను.." సరేలెండి. మీ మాట ఎందుకు కాదనాలి? " అంటూ చిరు కోపంతో బాపూ గారి కార్టూన్స్ లో భర్త మీద విరుచుకుపడే భార్యలా విసవిసా వెళ్ళిపోయింది. ఆ రోజున నాన్నగారూ అంటూ నా కూతురు వచ్చి చిన్న పిల్లలా నా ఒడిలో తల పెట్టుకుని గారాలు పోయింది." అమ్మా అన్యాయం కదూ, తాతగార్ని మేము ప్రేమగా , ఎన్నాళ్ళకో కలిశాం కదా, ఆయన ఒడిలో వాలిపోదామని వస్తే ముందుగా నువ్వే వెళ్ళి తాతగారి ఒడిలో పడుకుండిపోయావే..." అంటూ లేడి పిల్లలా గెంతుకుంటూ.. నా మనవరాలూ, బుల్లి ఆవు దూడలా  నా మనవడూ ఆమె వెనుకనే నిలబడిపోయారు. నేను వెంటనే.."అది కాదురా మీ అమ్మ నా ముద్దుల కూతురు గదా, మరి మీకన్నా ముందు పుట్టిందా లేదా? ఆ తరువాత మిమ్మల్ని కన్నది కదా.." అంటూ ఆప్యాయతానురాగాలతో నా బుజ్జిగాడి వీపు సవరిస్తోంటే నా గుండెలు గుబగుబలాడేయి. ఆ వెంటనే కుడిపక్కగా మనవరాలూ, ఎడమ పక్కగా మనవడూ నన్ను కావలించుకుని నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంటే, లోపలి నుండి నా ధర్మపత్ని వచ్చి ముక్కున వేలేసుకుని "ఏమర్రా ఆయన్ను ముగ్గురూ అనురాగం తో అలా చుట్టుముట్టేస్తే మరి ఆయన్ను నాకు మిగులుస్తారా?" అంటూ మా ముందు నిలబడి వుంది. ఒక చేతి లో గరిటె, మరో చేతిలో చీర చెంగుతో ముఖం తుడుచుకుంటూ ప్రేమానుబన్ధాలు మనిషిని జీవితం లో ఒక్కోసారి పిచ్చిపిచ్చిగా వుంటాయి. అది నిజంగా అనుభవించిన వారికే తెలుస్తుంది.
వెంటనే మనవరాలూ, మనవడూ గభాల్న లేచి అమ్మమ్మను చుట్టేశారు. మా బుజ్జి గభాల్న లేచి మా అమ్మ.. మీ అమ్మమ్మ  కాదు" అంటూ తల్లిని కావలించేసుకుంది. నా ఇంట్లో సభ్యులందరూ ఇలాగే కల్లాకపటం లేని ప్రేమానురాగాలతో విలసిల్లాలని నా ఆకాంక్ష . నేటికీ సర్వేశ్వరుడు నా కోరిక తీరుస్తూనే వున్నాడు.

మర్నాటి నుంచీ ఉదయం లేచిన దగ్గర్నుండీ నా మనవడు నాతో పాటు బావి  దగ్గర జలకాలాడడం , పూజ గదిలో నాతోపాటు శ్లోకాలు దైవ ప్రార్ధనలు చదవడం, టిఫినయ్యాక పెరట్లో మామిడిచెట్టు కిందా, జామ చెట్టు కిందా ఆడుకోవడం, వేపచెట్టు నీడన కేరం బోర్డ్ పెట్టుకుని ఆడుకోవడం, మరోసారి గోళీలు ఆడుకోవడం, ఇంకోసారి కర్రా బిళ్ళా ఆడుకోవడం. ఇలా నేను చంటి పిల్లాడినై పోయి వాడితో కాలక్షేపం చేసాను. మా అమ్మాయి మనవరాలు తో సహా వాళ్ళ అమ్మకు తెల్లవారి లేచిన దగ్గర నుండీ పూలు కోయడం నాకు పూజకు ఏర్పాట్లు చేయడం, టిఫిన్ తయారుచేయడం లో సాయం చేయడం, ఆ తరువాత వంటకు కూరలు తరగడం, బియ్యం కడిగి ఇవ్వడం పని మనిషి తోమిన అంట్ల గిన్నెలు సర్దడం, ఉతికిన బట్టలు ఆరేయడం, మధ్యాహ్నం తినడానికి ఏదైనా తయారుచేస్తుంటే సాయం చేయడం, అప్పుడప్పుడు వాళ్ళు కూడా "పేకాట అష్టాచమ్మా వంటివి ఆడుకోవడం, ఇలా మైమరిచిపోయి పనీపాటా ఆటలతో రోజులు ఇట్టే గడిచిపోయాయి.

అమ్మాయి పిల్లలూ వచ్చి వారం రోజులైనా ఏడు రోజులూ ఏడు క్షణాల్లా గడిచిపోయాయి. రేపు ప్రయాణం అనగా అమ్మాయిని పిలిచి "అరేయ్ బుజ్జిగాడా మీ పిల్లల్ని ఈ కాలపు కంప్యూటర్ పిల్లల్లా కాకుండా చాలా బాగా పెంచావురా, నేను నా స్నేహితుల ఇళ్ళకు వెళ్తుంటాను. అదో ప్రపంచం. పిల్లలు తలా ఓ గదిలో లాప్ టాప్, మ్యాక్ బుక్ కిండిల్ లేదా స్మార్ట్ ఫోను లతోనూ తండ్రి కంప్యూటర్ బల్ల ముందు బయట ప్రపంచంతో సంబన్ధం  లేకుండా గడుపుతోంటే ఆ ఇంటి ఇల్లాలు మాత్రం వంటింట్లో వంట పనితో సతమతమౌతోంటుంది. ఆ ఇళ్ళల్లోకి ఎవరు వచ్చినా పోయినా తల్లికి తప్పితే ఎవరికీ పట్టదు. ఒకవేళ వారి కుటుంబసభ్యులు వచ్చినా ఎవరికీ పట్టదు.

ఒక పలకరింపూ, పట్టింపూ వుండదు. చాలా సంతోషంగా వుందిరా బుజ్జీ " అని నేనంటోంటే బుజ్జిగాడి ముఖం అదోలా అయిపోయింది."నాన్నగారూ నా కుటుంబం, పిల్లలూ మీరు అనుకున్నట్లుగా వుంటారని మీరు భావిస్తారని నాకు తెలుసు.  నా కూడా రండి మీకో వింత చూపిస్తాను. అంటూ నన్ను  పిల్లల బెడ్రూం దగ్గరకు తీసుకువెళ్ళి తలుపు ఓరగా తెరచి చూడండి  అంది. నా మనవడూ, మనవరాలూ రెండు బెడ్ల మీద లాప్ టాప్, మ్యాక్ బుక్,  స్మార్ట్ ఫోన్లు ముందేసుకుని సన్ ఫ్లవర్ పువ్వంత సంతోషం తో మెరిసిపోతున్న ముఖాలతో తమను తాము మరిచిపోయి వాటిలో లీనమైపోయి వున్నారు.

ఆశ్చర్యపోవడం నా వంతైంది. నన్ను
భుజం  తట్టి నా బుజ్జి " నేను ఇక్కడకు వచ్చే ముందు పిల్లలకు నిక్కచ్చిగా నియమం పెట్టాను. ప్రతీ రోజూ రాత్రి 9 గంటల వరకూ , సాయంత్రం 6 నుండీ అర్ధరాత్రి వరకూ సెలవు రోజుల్లో రోజంతా వాళ్ళు ఆయా యంత్రాలకూ బానిసలైపోయి వుంటారు. ఇది గమనించి  మా ఇంటికీ ఎవరూ రారు. సారీ నన్నగారూ. ' అంటూ తడికళ్ళతో చెబుతున్న నా ముద్దుల ఏకైక కూతురు బుజ్జిని అవాక్కై చూస్తూ వుండిపోయాను.

ఒక్క వారం రోజులైనా సరే పిల్లలను టెక్నాలజీకి పగలంతా దూరం గా వుంచగలిగిన మా బుజ్జి తల్లి తెలివితేటలకు నా మనసులోనే అభినందిస్తూ "శతాయుష్మాంభవ! అంటూ దీవించాను మనసులోనే. కాలం మనుషులను అలవాట్లని మారుస్తుందేమో చూడాలి. మనిషి ఆశాజీవి కదా..!

మరిన్ని కథలు