Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

naadaina prapancham

 గతసంచికలో నాదైన ప్రపంచం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.  http://www.gotelugu.com/issue202/579/telugu-serials/naadaina-prapancham/naadaina-prapancham/

 

( గతసంచిక తరువాయి ).... క్షణం పాటు ఏం జరిగిందో అర్ధం కాలేదు. స్టేడియం అంతా నిశ్శబ్దమై పోయింది. అందు లోంచి నిరుత్సాహపు నిట్టూర్పులు వినిపించాయి.
కృష్ణా జిల్లా జట్టు విజయం సాధించారు.

వాళ్ళంతా ఒకటే విజయాన్ని ఆస్వాదిస్తున్నారు.

పసి తనం వదలని వారి మొహాల్లో ఆనందం ప్రస్ఫుటంగా తాండవిస్తోంది. చెమటతో నిండిన వారి శరీరాలు విజయం కోసం వారు పడిన తపనను తెలియ జేస్తున్నాయి.

ఓడిన జట్టు మొహాలు ముకుళించుకు పోయాయి. జట్టులో మిగతా అందరూ లెఫ్ట్‌ స్పైకర్‌ వంక ఆరోపణగా చూస్తూ కోర్టు వదిలారు.
ఆ షాక్‌ నుంచి ఇంకా తేరుకో లేక పోతోంది అమ్మాయి....అంత చక్కటి బంతి....ఎంత అనువుగా పొజిజన్‌ లోకి వచ్చింది....? తనెందుకు స్మాష్‌గా మలచ లేక పోయింది?!

అందరిలా ఎందుకు రివ్వున ఎగర లేక పోయింది?

ముందు నుంచి అదే తన వీక్‌ పాయింట్‌!... ఆ వీక్‌ పాయింట్‌ ప్రత్యర్ధికి మ్యాచ్‌ పాయింటయ్యింది. అందరి చూపునుంచి తప్పించు కుంటూ అక్కడి నుంచి ఎక్కడికైనా పారి పోవాలని వుంది.

అపజయాన్ని.... ఓ మెట్టుగా భావించ గలిగే ధైర్యం అవడటానికి ఆమె వయసు ఎంతని?! కళ్ళ నుండి నీరు చెంపల మీదకి జారకుండా వుండటానికి, మనసుతో పోరాటం చేస్తోందామె. స్టేడియంలో జనాలు చాలా మంది తిరుగు ముఖం పట్టారు. కొంత మంది గెలిచిన జట్టుకి అభినందనలు తెలుపుతున్నారు. చాలా తక్కువ మంది ఓడిన జట్టుని కన్సోల్‌ చేస్తున్నారు.

ఆ అమ్మాయి....

అక్కడే....

ఆ కోర్టు లోనే చిత్తరువులా నిలబడింది.

మాటి మాటికి కోర్టులోవున్న బంతి వంక, చేతుల వంక మార్చిమార్చి చూసుకుంటోంది. ఎవరో చూసి రమ్మని పిలిచారు. వెళ్ళ లేదామె....
ఎవరూ ఆమె కోసం ఆగ లేదు. ఎవరి దోవన వారు నిష్క్రమిస్తున్నారు.... ఆసక్తిగా ఆమె వంకే చూస్తున్నాడు ఆ యువకుడు.
జనాలు పలుచ బడుతున్నారు.... మ్యాచ్‌ కోసం వచ్చిన వాళ్ళలో అందరూ వెళ్ళి పోయారు. మిగతా వాళ్ళు ఎవరి గేమ్‌ వాళ్ళు  ప్రాక్టీస్‌ చేసుకుంటూ ఉండి పోయారు. ఆ అమ్మాయి బంతి చేతి లోకి తీసుకుంది. పొజిషన్‌ లోకి విసిరి....స్మాష్‌ కొట్టడానికి ఎగిరింది. బంతి వెళ్ళి నెట్‌కి కొట్టుకుంది. అంత వేగం రావటం లేదు. నిరుత్సాహంగా బంతి నేలకేసి కొట్టి, కాసేపు ఆలోచిస్తూ వుంది. మళ్ళీ లేచి నిలబడింది.
అదే ప్రయత్నం.....

అదే ఫలితం....

ఆ యువకుడు నవ్వుకుంటూ ఆమె దగ్గరకు నడచి వచ్చాడు. పొంగుతున్న దుఃఖ ప్రవాహంతో..... కసిగా.... పట్టుదలగా....  తన బలహీనతను జయించ డానికి ప్రయత్నిస్తున్న ఆ పసి మొగ్గని చూసి ఆనంద పడ్డాడు. అప్పటికే కను చీకట్లు ముసురు కుంటున్నాయి.
అదేమీ గమనించే స్థితిలో లేదామె.

అతను దగ్గిరకు వచ్చి కోర్టు బయట నిలబడి....

‘‘హలో....!’’ అన్నాడు.

చివ్వున తల తిప్పి చూసింది.

ఆరడుగుల పొడవున్న యువకుడు....

గడ్డం మాసి పోయి, పీక్కు పోయిన దవడలతో, ఒకప్పటి శారీరక దృఢత్వాన్ని తెలియ జేసే బాడీ షేప్‌తో.... చూడ గానే క్రీడాకారుడని తెలుస్తోంది. ఏంటన్నట్లు చూసింది. అతను కోర్టు లోకి వచ్చాడు. బంతివ్వమన్నట్లు చేయి చాపాడు. మంత్ర ముగ్ధలా బంతిని అతనికి అందించింది. బంతిని చేతిలోకి తీసుకుంటుంటే, అతని చేతి వేళ్ళు కంపించాయి. కొత్త వస్తువుని చూసినట్లు దాన్ని చూశాడు.
బంతిని నేలకేసి కొట్టాడు. మళ్ళీ అది చేతి లోకి రాలేదు. కిందే పడింది. వంగి చేతి లోకి తీసుకున్నాడు. ఆ అమ్మాయికి చిరాకు వచ్చింది. బంతి సరిగ్గా చేత్తో పట్టుకోవడం రాని మనిషి.....తనని ఇప్పుడు ఆట నేర్పించమంటాడేమో!

‘‘ఏంటీ....గేమ్‌ నేర్పించాలా?’’ విసుగ్గా అడిగింది.

‘‘ఊహూ!....’’

‘‘మరి?’’ ప్రశ్నార్ధకంగా చూసింది.

‘‘స్మాష్‌ కొట్టడానికి పైకెగిరినప్పుడు నువ్వు కాళ్ళు స్ట్రయిట్‌గా పెడుతున్నావు. అలా కాదు....ఎగిరే క్షణం లోనే కాళ్ళు వెనక్కి వంగాలి. అదే సమయంలో చేయి లేవాలి....’’ చెప్పాడు.

‘‘ఓహో....థియరీనా వ్యంగ్యంగా అందామ్మాయి.

‘‘ప్రాక్టికల్‌గా కూడా అదే కరెక్ట్‌ పొజిషన్‌....’’ నమ్మకంగా అన్నాడు.

‘‘అక్కడ, ఇక్కడ విని అందరూ కబుర్లు బాగానే చెపుతారు....కాని ఆడటమే చాలా కష్టం’’ కోర్టు బయట వున్న కుర్చీలో కూర్చుంటూ అంది.
అతనొక్క సారి బాల్‌ వంక, నెట్‌ వంక చూశాడు. నెట్‌ని మరింత హైట్‌కి లేపాడు.

లెఫ్ట్‌ సైడ్‌ స్పైకర్‌ ప్లేస్‌లో నిల్చుని బంతి పట్టుకొని...

‘‘కమాన్‌...’’ పిలిచాడు.

హేళనగా, నవ్వులాటలా భావిస్తూ వచ్చిందామ్మాయి. బూస్టర్‌గా నిల్చుంది.

చేతి లోని బంతిని ఆమె వైపు విసిరాడు. లెఫ్ట్‌ సైడ్‌ స్పైకర్‌ వున్న వైపు బూస్టింగ్‌ చూసింది. బంతి పొజిషన్‌ తెలిసింది. ఇందాక  అచ్చం బంతి అలాగే తన చేతికి అనువుగా వచ్చింది. అతని ముందు కూడా బంతి అలాగే లేచింది. శరీరాన్ని తేలిక చేసుకొని...

బంతిలా రివ్వున పైకెగిరి.... కాళ్ళు కాస్త వెనక్కి వంచి.... ఉక్కు ముక్కలా దృఢంగా వుండే చేతితో... స్మాష్‌ కొట్టాడతను....
ఆమె విస్మయంగా చూస్తుండగానే బంతి ఆపోజిట్‌ కోర్టు బూస్టర్‌ ప్లేస్‌ మీదుగా శర వేగంతో వెళ్ళి రైట్‌ డిఫెస్స్‌ వెనకా బ్యాక్‌ లైన్‌కి ఇవత పడింది.

ఆ బంతి తాలూకు తీవ్రత ఎలాగుందంటే, అలా పడిన బంతి లేచి మళ్ళీ నేలని తాకింది. ముప్పై అడుగుల అవతలే! కళ్ళు మిరుమిట్లు గొలిపాయి ఆ అమ్మాయికి!

మార్వలెస్‌!!!....

ఆ బంతిని ఎదుర్కోవడం ఇంపాజిబుల్‌. ఏమనాలో తెలియక అచేతనంగా నిలబడి పోయింది.

అతను ఆ అమ్మాయిని మాటలతో ఎత్తి పొడవ లేదు.

‘‘కమాన్‌... ట్రై చెయ్యి....’’ చెప్పాడు.

అతను బూస్టర్‌గా. ఆమె స్పైకర్‌గా ప్రాక్టీస్‌ మొదలయింది....

మొట్ట మొదట ఆమె పైకెగిరినపుడు ఉండాల్సిన పొజిషన్‌ నేర్పించాడు....

ఆ తర్వాత శక్తినంతా చేతి లోకి ఎలా తెచ్చుకోవాలి...టైమింగ్‌తో బంతిని స్మాష్‌గా ఎలా మలచాలీ చెప్పాడు...

ఒక గంట...

అంతే!...

నేర్పిన వాడి గొప్ప తనమో!.... నేర్చుకున్న అమ్మాయి గొప్ప తనమో!...గంటలో ఆమె తన ఏకైక బలహీనతని అధిగమించింది.
ఈ ప్రపంచమే తన సొంతమయినట్లు ఆనందించింది....

పది సార్లు కృతజ్ఞతలు తెలియ జేసింది.

‘‘మీ పేరు....?’’ తను గుర్తుంచుకో దగ్గ వ్యక్తుల లిస్ట్‌ లో మొదటి స్థానాన్ని అతనికి కేటాయిస్తూ అడిగింది.

‘‘ప్రణీత్‌!....’’ చెప్పాడు.

ఆమె మెమరీలో నిక్షిప్త మయి పోయింది అతని పేరు....

అతను తన పేరు అడగక పోవడం చూసి...

‘‘నా పేరు కీర్తన....’’ తనే చెప్పేసింది.

‘‘ఆహా!....’’ తల పంకించాడు.

మిగతా భాగం వచ్చేవారం......

________________________


నాలుగు సంవత్సరాలుగా "గోతెలుగు" అంతర్జాల పత్రికలో నా సీరియల్స్ ని ఆదరిస్తున్న పాఠకాభిమానులకు కృతజ్ఞతాభివందనాలు. మన తెలుగు ఆడపడుచు "సింధు" ఒలింపిక్స్ లో తన సత్తా చాటినందుకు యావత్ భారత జాతి గర్వించింది. ఆ సందర్భంగా తెలుగు ఆడపడుచులకు ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించే సీరియల్ ఒకటి వ్రాయమని గోతెలుగు సంపాదకులు శ్రీ బన్ను గారు అడగడంతో, క్రీడల మీద ఇదే కథాంశంతో చాలా కాలం క్రితం విజేత అనే నవల వ్రాసానని, అది ఏ  పత్రికలోనూ సీరియల్ గా రాలేదని, కొద్దిపాటి మార్పులతో నాదైన ప్రపంచంగా సీరీయలైజ్ చేయడం ప్రారంభించాను. ఈ నేపథ్యాన్ని సహృదయులైన గోతెలుగు పాఠకులు అర్థం చేసుకొని ఆశీర్వదిస్తారని వినమ్రంగా మనవి చేసుకుంటున్నాను - సూర్యదేవర రామ్మోహన రావు. 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atadu..aame..oka rahasyam