Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

కొత్త ఆలోచనలకి గ్రాండ్‌ వెల్‌కమ్‌

grand welcome

తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కొత్త ఆలోచనలకు పెద్ద పీట వేస్తున్నాయి. తెలంగాణకి అభివృద్ధి చెందిన రాజధాని హైదరాబాద్‌ కొండంత బలం. అందుకే ఆ హైదరాబాద్‌ ఖ్యాతిని ఇంకా పెంచడం కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కొత్త ఆలోచనలతో వచ్చేవారికి గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెబుతోంది. యువకుడు, ఉత్సాహవంతుడు, ఐటీ రంగంపై ఎంతో అవగాహన ఉన్న తెలంగాణ మంత్రి కెటియార్‌ నేతృత్వంలో యువతకు అవకాశాలు పోటెత్తుతున్నాయి తెలంగాణలో. ఐటీ రంగం అనే కాకుండా ఇతర రంగాల్లోనూ సరికొత్త ఆవిష్కరణల కోసం తెలంగాణ ప్రభుత్వం పిలుపునిస్తోంది. కొత్త కొత్త ఆలోచనలతో వచ్చేవారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, సహాయ సహకారాలు అందిస్తుందని, తెలంగాణ రాష్ట్ర అభివృద్దిలో అలాంటివారికి చోటు కల్పిస్తామని ఇప్పటికే ప్రకటించింది. దాంతో యువత తమ ఆవిష్కరణలకు తెలంగాణని వేదికగా, ప్రయోగశాలగా మార్చుకుంటున్నారు. ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. సరికొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతోంది. ఎక్కడో విదేశాలకు వెళ్ళి మన ప్రతిభను చూపించుకోవాలనుకుంటున్న యువత, ఇప్పుడు స్వదేశంలో స్వరాష్ట్రంలో ఆ ఆవిష్కరణలతో సత్తా చాటేందుకు అవకాశాలు దొరకడంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. 

ఇంకో వైపున ఆంధ్రప్రదేశ్‌ కూడా అభివృద్ధిలో 'పరుగు' ప్రారంభించింది. కొత్త రాష్ట్రంలో లెక్కలేనని అవకాశాలు యువత ముందుంటున్నాయి. అవకాశం అంటే ఉద్యోగం కాదు, ఆవిష్కరణ. ఆ ఆవిష్కరణలు సరికొత్తగా ఉంటే, తద్వారా దక్కే గుర్తింపు అంతా ఇంతా కాదు. కొత్త రాజధాని నిర్మాణం దగ్గర్నుంచి, చాలా రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త అడుగులు వేయవలసి ఉంది. ఈ కారణంగానే యువత వైపు దృష్టి సారించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు. విదేశాలకు చెందిన సంస్థలతో టచ్‌లో ఉంటూనే, సొంత గడ్డపై ఉన్న టాలెంట్‌ని ప్రోత్సహించడంలో తాము ఏమాత్రం వెనుకడుగు వేయబోమని అంటున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకోవడానికి యువత ముందుకు రావాలని పిలుపునిస్తున్నారాయన. పేరుకి తాత్కాలికమే అయినా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో నిర్మించిన సచివాలయం, శాసనసభ - మండలి భవనాలు దేశం దృష్టిని ఆకర్షించాయి. అతి తక్కువ కాలంలో వీటి నిర్మాణం పూర్తయ్యిందంటే, అందులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమే అత్యంత కీలక భూమిక పోషించింది. రహదార్ల నిర్మాణం దగ్గర్నుంచి, చూపరులను ఆకట్టుకునే భవనాలదాకా ప్రతి అంశంలోనూ యువత ఆలోచనలు అత్యంత కీలకం. 

కాబట్టి, యువత రొటీన్‌కి భిన్నంగా ఆలోచించగలిగితే, అందరిలోకీ తాము ప్రత్యేకం అనిపించుకోడానికి తాపత్రయపడగలిగితే అద్భుతాలు సాధించడానికి అవకాశాలు ఎక్కడో కాదు, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మీ మెదళ్ళకు మరింత పదును పెట్టండి. ఆల్‌ ది బెస్ట్‌. 

మరిన్ని యువతరం
Is changed banking