Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
grand welcome

ఈ సంచికలో >> యువతరం >>

బ్యాంకింగ్‌ అర్థం మారిపోతోందా?

Is changed banking

అభివృద్ధి చెందిన దేశాలతో భారతదేశాన్ని పోల్చలేం. ఎందుకంటే భారతదేశం పరిస్థితి పూర్తిగా వేరు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల అలవాట్లు అన్నీ వేరుగా ఉంటాయి. ఎన్నో దశాబ్దాలుగా భారత్‌ అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెప్పుకుంటున్నాం. కానీ 'అభివృద్ధి చెందిన భారతదేశం' అనే మాట వినలేకపోతున్నాం. ఇది శోచనీయం. ఏ దేశమైనా సంస్కరణలతోనే అభివృద్ధి పథంలోకి దూసుకెళుతుంది. అయితే ఆ సంస్కరణలు దేశాన్ని ముందుకు నడిపించేలా ఉన్నప్పుడు వాటి ఫలాలు సామూన్యులకు అందుతాయి. సామాజిక స్థితిగతుల్ని బట్టి, ప్రజల అవసరాల్ని బట్టి ఈ సంస్కరణలు రూపుదిద్దుకోవలసి ఉంటుంది. తొందరపాటు చర్యలతో సంస్కరణలను చేపడితే పరిస్థితులు తారుమారైపోతాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయని దేశ ప్రజానీకం ఆశించింది. కానీ అలాంటి సానుకూల వాతావరణం కనిపించడంలేదు. కొంత మార్పు వచ్చినప్పటికీ, పాలకులు చెప్పినంత మార్పు లేకపోవడం సామాన్యులను ఆందోళనలోకి నెట్టేస్తోంది. 50 రోజులపాటు కరెన్సీ నరకాన్ని చూసిన ప్రజలు, దాన్ని భరించారంటే తమను అభివృద్ధి పథం వైపు నడిపించే నాయకుడు తెచ్చిన మార్పు అని భావించబట్టే. అయితే ఆ మార్పు ప్రజలకు భవిష్యత్తులో ఎలాంటి ఉపయోగం కలిగించబోదనే అనుమానాల్ని కలిగిస్తోందిపుడు. 

పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో బ్యాంకింగ్‌ రంగం దేశ ప్రజల్ని సంక్షోభంలోకి నెట్టేస్తోంది. 'మీ దగ్గర డబ్బులన్నీ బ్యాంకులో జమచేసెయ్యండి' అని కేంద్రం ఇచ్చిన పిలుపుకి దేశం స్పందించింది. అది నగదు మార్పిడి ద్వారా జరిగింది కూడా. అయితే కరెన్సీ సంక్షోభం తీరిన తర్వాత బ్యాంకులు కొత్త ఆలోచనలతో ముందుకు వెళుతున్నాయి. బ్యాంకుల్లో నగదు వేస్తే జరీమానా, తీస్తే జరీమానా అన్నట్లుగా మారింది. ఏటీఎంకి వెళ్ళినా అంతే. ఈ చర్యలతో మొత్తం బ్యాంకింగ్‌ రంగంపైనే సామాన్యుడిలో అసహనం పెరిగిపోతోంది. బ్యాంకుల తీరు చూస్తుంటే భవిష్యత్తులో క్యాష్‌లెస్‌ లావాదేవీలపైన కూడా జరీమానాలు విధించే ప్రమాదం ఉందనే అనుమానం కలగడం సహజమే. దేశంలో ఈ పరిస్థితి కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకే కారణం. ప్రజలు సతమతమవుతున్నప్పుడు వారిని ఎడ్యుకేట్‌ చేయగలిగితే, ఇంకొంచెం 'పెయిన్‌' అయినా భరించగలుగుతారు. ఇంత విశ్వాసాన్ని ప్రజలు తమపై చూపినందున, ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశ ప్రజలనుద్దేశించి ఓ సందేశం పంపవలసి ఉంటుంది. లేదంటే, బ్యాంకింగ్‌ వ్యవస్థ తన అర్థాన్ని మార్చేసుకుంటుంది. పోపుల పెట్టె నుంచి బ్యాంకుల వైపు వెళ్ళిన జనం, తిరిగి పోపుల పెట్టెలను ఆశ్రయించే ప్రమాదం పొంచి ఉంది కాబట్టి, ప్రదాని నరేంద్రమోడీ అప్రమత్తమవ్వాలి.

మరిన్ని యువతరం