Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

సీరియల్

nadaina prapancham

 గతసంచికలో నాదైన ప్రపంచం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.   http://www.gotelugu.com/issue204/583/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

 

( గతసంచిక తరువాయి ).... ఒక వైపు అన్నయ్య.

మరో వైపు ఓదార్పు చూపుతో తండ్రి ఆమెను ఎల్ల వేళలా సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

ఈ పరిస్థితుల్లో అతి కష్టం మీద డిగ్రీ ఫైనల్‌ కి వచ్చిందామె! ఆమె చదువులో యావరేజ్‌ స్టూడెంట్‌!

ఆమె గోల్‌ అల్లా నేషనల్‌ గేమ్స్‌లో ఆడి తన రాష్ట్రానికి పతకాన్ని తెచ్చి పెట్టడం.

ఇప్పటికే ఆమె టీమ్‌ ఇంటర్‌ యూనివర్శిటీ కాంపిటీషన్‌ లోనూ, స్టేట్‌ లెవెల్‌ లోనూ అనేక పతకాను సాధించింది. సమర్ధవంతమైన కెప్టెన్‌గా ఆమె పేరు తెచ్చుకొంది.

కీర్తన కోర్టులో ఏ ప్లేస్‌లోనయినా స్ట్రాంగ్‌ అన్ప పేరు తెచ్చుకుంది....

అయితే కీర్తన ఇంత పేరు తెచ్చుకోవడమే మృదులా దేవికి కంటగింపుగా వుండేది.

అసలు ఆడపిల్లలు చదువుకోవడమే వృధా అనుకుంటే ఈ ఆటలూ, గంతులూ ఏంటని సణుగుతూ వుండేది.

ఆమె మాటలు ఆ చెవితో విని ఈ చెవితో వదిలేసే వారు అన్నా చెల్లెళ్ళు. ఆస్తి విషయంలో అశోక్‌ ఎప్పుడయితే బెదిరించాడో అప్పటి నుంచీ జాగ్రత్త పడటం ప్రారంభించింది మృదులా దేవి. తనకి చేతికి చిక్కినంత డబ్బుని పుట్టింటికి చేరేస్తూ వుండేది. సంవత్సరానికి ఆరు నెలలు పుట్టింటి లోనే వుండటం ప్రారంభించింది.

అది ఇంట్లో వాళ్ళకి ఆట విడుపుగా ఉంటుంది. కోడలు ఉన్నపుడు కిక్కురు మనకుండా ఓ మూలన ఉండే నానమ్మ మృదుల ఇంట్లో లేక పోతే మాత్రం బోసి దవడలు ఆడించు కుంటూ హుషారుగా ఉంటుంది.

ఆ రోజు అలాగే మృదుల సూట్‌ కేసు సర్దుకుని డ్రైవరుని తీసుకుని పుట్టింటికి వెళ్ళంది.

ఉదయం లేవడం తోనే ప్రకృతి అంతా ఆహ్లాదంగా కనిపించింది కీర్తనకి.

ఇంటి చూట్టూ వున్న చెట్ల నుంచి రాలి పడిన పూలు మంచు బిందువులకి తడిసి స్వచ్చంగా వున్నాయి. తోటలో అర విరిసిన పూల నుంచి సుగంధ పరిమళాలు యింట్లోకి కూడా వ్యాపించాయి.

సూర్యుని లేత కిరణాలు గిలిగింతలు పెడుతున్నాయి. నైటీ సవరించుకుని తోట లోకి వెళ్ళింది. రెండరచేతులూ రాసుకుని వేడి తెప్పించి చెంపకి రాసుకుంటూ తోటంతా కలియ తిరగడం ప్రారంభించింది.

తోట లోని పూలే తమ రంగుతో కళ్ళు చెదర గొడుతుంటే మధ్యలో సీతా కోక చిలుకల గుంపు ఒకటి. అయినా అసలు వీటికి ఇంత ఉదయాన్నే విహారం చేయ డానికి తీరిక ఎలా దొరికిందబ్బా! ఆశ్చర్యంగా అనుకుంది.

వాలీ బాల్‌ ఆట తప్ప ఆమెకి మరో ప్రపంచం గురించి అంతగా తెలీదు. ఆమె ఎప్పుడూ టి.వి. చూడదు, సినిమాలు చూడదు. ఎపుడయినా పేపర్‌ తిరగేస్తుంది కానీ, ఒక ముక్క అర్ధం గాక పక్కన పడేస్తుంది.

ఆమెకి ఈ సృష్టిలో అత్యంత ఆకర్షణీయమైన వస్తువు వాలీ బాల్‌. దాని గురించి అనర్గళంగా ఆమె ఎంత సేపయినా మాట్లాడ గలదు.
ఆమె టీమ్‌ మేట్స్‌ సినిమా గురించీ, రక రకాల ఫ్యాషన్స్‌ గురించీ. కొండొకచో బాయ్‌ ఫ్రెండ్స్‌ గురించీ మాట్లాడుకుంటుంటే ఆమె దూరంగా గ్రౌండ్‌లో తనొక్కతే ఎవరైనా తోడు వస్తారేమో నని వెతుకుతూ ఉంటుంది.

ఆ ప్రకృతిలో లీనమయి కూడా ఆమె వాలీబాల్‌ గురించే ఆలోచిస్తోంది. రక రకాల ప్రణాళికలే వేస్తుంది. బాల్‌ని ఇంకా కొత్త రకంగా ఎలా ఆడొచ్చో  వూహిస్తూ వుంటుంది.

మర్నాడు క్లాస్‌లో తమ టీమ్‌ మేట్స్‌కి చెప్ప బోతే బోయ్‌ఫ్రెండ్స్‌ గురించి రసవత్తరంగా సాగుతున్న చర్చలో ఆమె పానకంలో పుడకలా ప్రవేశించడం చూసి నీకెపుడూ ఇదే గోలా! మా జీవితాల్ని కూడా అంత డ్రైగా మార్చకే బాబూ! అంటూ విసుక్కునే వారు. ఆమె మీద రక రకాల జోక్స్‌ వేసేవారు.

కీర్తనకి ఏ మాత్రం కోపం వచ్చేది కాదు. గేమ్‌ పట్ల ఎంత నిబద్ధత ఉండాలో ఎక్స్‌ప్లెయిన్‌ చేయ బోతే వాళ్ళు పారి పోయే వారు. వేప చెట్టు మీద నుంచి ఉడుత జర జరా పాక్కుంటూ వచ్చి కీర్తన వంక నిక్కి నిక్కి చూడటం ప్రారంభించింది.

‘‘ఇంత ఉదయాన్నే నువ్వు హడావిడిగా లేవాలా? కాసేపు పడుకోవచ్చు కదా!’’ ఉడతని కోప్పడింది కీర్తన.

ఆమె మాటని మన్నించినట్లుగా మళ్ళీ పైకి పాక్కుంటూ వెళ్ళి పోయింది.

‘‘చిట్టీ!’’ పై నుంచి అశోక్‌ పిలవడం వినిపించింది.

‘‘ఆ వస్తున్నా....’’ పరుగు లాంటి నడకతో లోపలికి నడిచింది.

ఇంటా బైటా అందరూ ‘కీర్తన’ అనే అంటారు, కానీ అశోక్‌ ఒక్కడికే ‘చిట్టీ’ అని పిలవడం అవాటు. అన్న అలా పిలిస్తేనే ఆమెకు ఇష్టంగా వుంటుంది.

‘‘నాన్న గారు నిద్ర లేచారు’’ అందుకే పిలిచినట్లు చెప్పాడు.

గబ గబా వెళ్ళి తండ్రి నుదుటి మీద ముద్దు పెట్టింది. ఆయన నవ్వ బోయాడు. మూతి వంకరగా పోయింది. ఆయన కళ్ళు నవ్వాయి.
ఇంట్లో ఎందరు పని వాళ్ళున్నా, ఆయన మంచంలో పడిన దగ్గర్నుంచీ ఆయన పనులన్నీ అన్నా చెల్లెళ్ళే చూసుకునే వారు.
మొదట్లో అశోక్‌ కూడా పట్టించుకో లేదు. అతనే కాదు మృదులా దేవి కూడా పని వాళ్ళ మీదే వదిలేసింది.

వాళ్ళు శ్రద్దగా చూసుకునే వారు కాదు. ఆయన దగ్గరకి పోతే వాంతి వస్తుండేది. పని వాళ్ళు విసుక్కుంటూ వుండే వారు. ఒక సారి అలా జరగడం చూసి అశోక్‌ మనసు చివుక్కుమంది. మృదులా దేవికి చెప్పి చూశాడు కానీ ఆమె పట్టించుకో లేదు. ‘‘వాళ్ళు మాత్రం ఎంతని చూస్తారు?’’ అంది

‘‘వాళ్ళు చూడటం గురించి కాదు పిన్నీ! మీరు చూడాలి అని చెప్పాడు.

ఓసారి కోపంగా చూసి అక్కడి నుంచి విస విసా నడచి వెళ్ళి పోయింది.

ఆమెకి పిల్లలు పుట్టక పోవడంతో మరింత అసంతృప్తిగా ఉండేది. అప్పుడనిపించింది అశోక్‌కి. తనూ చెల్లీ ఉండగా తండ్రికి మరొకరు చెయ్యడమేంటని.

అప్పట్నించీ ఆ బాధ్యతని వాళ్ళిద్దరూ స్వీకరించారు. వాళ్ళు ఇంట్లో లేనపుడు నాయనమ్మ మిగతా పనులు చేసేది. అశోక్‌, కీర్తన లిద్దరూ ఆయన పనులు చేయడం మొదలు పెట్టారు. ఇద్దరూ మెల్లగా లేపి బాత్‌ రూపం తీసుకు వెళ్ళారు. అశోక్‌ దగ్గరున్నాడు.

ఈ లోపు కీర్తన ఆయన మంచం మీద దుప్పట్లు మార్చి, ఉతికి ఇస్త్రీ చేసినవి వేసింది.

మొహం కడిగించి, స్నానం చేయించి, ఒళ్ళంతా తుడిచి తెల్లని మల్లె పూవు లాంటి శుభ్రమయిన బట్టలు వేశారు.

పిల్లలిద్దరితో ఈ సేవలు చేయించు కుంటుంటే ఆయన కళ్ళు తడవుతాయి.

ఈ ఆరేళ్ళలో పిల్ల్లిద్దరూ ఏనాడూ తనని విసుక్కో లేదు. వాళ్ళకి ఒంట్లో బాగా లేక పోయినా ఒక్క రోజు కూడా బద్దకించ లేదు.
ఇన్నాళ్ళూ మంచంలో వున్నా, ఒక్క రోజు ఆరోగ్యం తేడా చేసింది లేదు. బెడ్‌ సోర్స్‌ తన మీద దాడి చేయ లేదు. ఎప్పటికప్పుడు తను తాజాగా వుండేలా చూస్తారు వీళ్ళు.

దేవుడు తనకి ఒక విషయంలో అన్యాయం చేసినా, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లల్నిచ్చి ఆ లోటుని భర్తీ చేశాడు.

అలాగని మృదులా దేవి పట్ల అతనికి ద్వేషం లేదు. ఆమెని ఆర్థం చేసుకున్నాడు పక్షవాతంలో వున్న భర్త, తన కడుపు పండక పోవడం, సవతి పిల్లలు....యిన్ని కష్టాల మధ్య ఆడది దేవతలా వుండాలనుకోవడమూ తప్పేనని సమర్థించుకుంటూ వుంటాడు.
‘‘నాన్న గారు ఎంత ముద్దొస్తున్నారో!’’ అంటూ కీర్తన మళ్ళీ తండ్రి బుగ్గ మీద ముద్దు పెట్టింది.

తన చిన్న తనం నుంచీ తండ్రికి సేవ చేయాల్సి రావడం మూలం గానో ఏమో, తడ్రి విషయం వచ్చే సరికి ఆమె ఆరిందాలా అయి పోతుంది.
తండ్రి  చిన్న పిల్లవాడిలా కనిపిస్తాడు. ఆయన తనకు కథలూ కాకర కాయలూ చెప్పాల్సిన వయసులో ఏవేవో విషయాలు. ఆయన మంచంలో పక్కన కూర్చుని తనే చెపుతూ వుండేది.

ఏదో పని మీద అటూ యిటూ తిరుగుతూ ఏ వత్తులు చేసుకుంటూనో, బియ్యం బాగు చేస్తూనో కూర్చున్న నాన్నమ్మ నవ్వుతూ వినేవారు.
‘‘నాన్న గారూ! మీకో విషయం తెలుసా?’’ ఆయనకి టిఫిన్‌ తినిపించ టానికి పక్కన కూర్చుంటూ అంది.

తెలీదన్నట్లు తల చిన్నగా కదిపారు.

అదే మరి. చెపుతాను వినండి. నిన్న కాలేజీకి వెళ్ళేపుడు రోడ్డు పక్కన ఒక బండి కనిపించింది. అందులో చిన్న చిన్న పూరీలున్న సంచి కనిపించింది. అందులో ఏవో నీళ్ళు లాంటివి పోసియిస్తుంటే అందరూ రోడ్ల మీదే ప్లేట్లలో పెట్టుకుని తింటున్నారు. తెలుసా?’’ కళ్ళు పెద్దవి చేస్తూ అంది.

ఆయన కళ్ళు కూడా ఆశ్చర్యాన్ని నటించాయి. ఆశ్చర్య పోక పోతే ముందు కూతురు డిసప్పాయింట్‌ అవుతుంది.

అశోక్‌ కి నవ్వు వచ్చింది.

ఈ డిస్కషన్‌ అంతా బహుశా పానీ పూరి గురించి కావచ్చు.

‘‘నానమ్మా! విన్నావా?’’ అడిగింది.

‘‘ఆ? ఆ! విన్నాను. లోకం మారి పోవడంలేదూ....బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు’’ అంటూ ఎక్కడికో వెళ్ళి పోయింది. కళ్ళింతలు చేసి ఆవిడ పురాణమంతా ఆసక్తిగా వినడం ప్రారంభించింది కీర్తన.

నవ్వుతో పాటే కొంచెం బాధగా అనిపించింది అశోక్‌కి. చెల్లెలికి లోక జ్ఞానం బొత్తిగా లేదు. నలుగురిలో కలవడమూ తక్కువే. ఆ వాలీ బాల్‌, ఇల్లూ తప్ప మరో లోకం తెలీదు. దిగులుగా అనుకున్నాడు.

పిన్ని అతి క్రమ శిక్షణ మూలంగా ఆ వయసు ఆడపిల్లకి ఉండాల్సిన చిన్న చిన్న కోరికలూ, సరదాలు కీర్తన దరికి రాలేదు.

వాలీ బాల్‌ పోటీకి పంపించ డానికి ఆమె చేసే గొడవ అంతా ఇంతా కాదు. జమీందారీ వంశంలో పుట్టిన పిల్ల అలా ఫాంటూ, చొక్కా వేసుకుని గెంతడం ఆమెకి మహాపరాధంగా అనిపిస్తుంది.

ఆ ఆట ఎంత గొప్పగా ఉంటుందో.... అది ఆడుతుంటే ఎంత ఆనందం కలుగు తుందో మృదులా దేవికి చెప్పి ఉపయోగం లేదని అన్నా చెల్లెళ్ళిద్దరూ వాదించరు.

కీర్తన గ్రౌండ్‌కి వెళ్ళ కుండా ఆపడానికి ఆమె అనేక టెక్నిక్‌లు ఉపయోగిస్తుంది.

మాచ్‌కి బయల్లేరే టైమ్‌కి కడుపు నొప్పో, కాలునొప్పో అంటూ అందరినీ హడల గొట్టేస్తుంది.

మొదట్లో అందరూ నిజమేననుకునే వారు. కాల క్రమేణా తెలిసి వచ్చింది. అదంతా నటన అని, ఆ విషయం పైకి అనేంత కుసంస్కారం వాళ్ళలో లేదు.

అందుకే యింట్లో ఏదన్నా పనుంటే, దాన్ని అశోక్‌ చేయడానికి ఒప్పుకుని చెల్లికి రూట్‌ క్లియర్‌ చేసేవాడు.

తన టీమ్‌ మేట్స్‌ అందరినీ వాళ్ళ పేరెంట్స్‌ ఎంతో సపోర్టు చేస్తారు. కానీ అందేంటో తనకే ఆ సపోర్ట్‌ లేదు.

మనసున్నా, ప్రోత్సహించ లేని పరిస్థితిలో తండ్రీ, అన్నీ వుండి మనసే కరువైన వన్నీ....

మిగతా వాళ్ళని చూసి అసూయ పడుతూ కూర్చునే స్టేజ్‌ని దాటేసింది కీర్తన.

ఆమెకి ఆటే ప్రాణం...ఆటే ఆహారం...ఆటే విశ్రాంతి.... ఆటే నిద్ర...దాని మీదే అలుగుతుంది.

దానినే ప్రేమిస్తుంది....

కష్ట నష్టాలూ, సుఖ దుఃఖాలు, ఒడిదుడుకులు అన్నీ దాని మీదే....

 

 

(మిగతా వచ్చేవారం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atadu..aame..oka rahasyam