Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nadaina prapancham

ఈ సంచికలో >> సీరియల్స్

సీరియల్

atadu..aame..oka rahasyam

గత సంచికలోని అతడు-ఆమె-ఒక రహస్యం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి. http://www.gotelugu.com/issue204/584/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/

 

 

( గతసంచిక తరువాయి )....  “ఆ రోజు సురేష్ వర్మ గారు కోటలో ఉన్నారా?”

“లేరండి. ఢిల్లీకి పని మీద వెళ్లారు”

“ఢిల్లీలో ఈయనకి ఏం పని?”  అతడ్ని మాటల్లో పెడుతూ అన్నాడు.

“ఏదో కోర్టు కేసు ఉందండీ. పెద్దరాజావారు పెద్దవారైపోవడంతో, రాజేంద్ర బాబుగారు పట్టించుకోరని అన్ని వ్యవహారాలూ సురేష్ వర్మ దొరగారే చూసుకుంటారు”

“అయితే ముందు రోజు ఇంట్లో ఉన్నది రాజేంద్రగారూ, ఆయన తాతయ్యే నన్నమాట!”

“అవునండీ ఆ రోజు రాత్రి  నాకింకా గుర్తు. బాబుగారు  పట్నం నుంచి లేటుగా వచ్చారు.  వస్తూనే నేరుగా ఆయన గదిలోకి వెళ్ళిపోయారు. ‘భోంచేస్తారా బాబూ’ అంటే మాట్లాడలేదు.  చాలా సేపు చూసి  నేనూ లక్ష్మీ మా గదిలోకి వెళ్ళి పడుకున్నాం”  తల్చుకుంటున్నట్టుగా అన్నాడు.

“అసలు ఆయన ఆత్మహత్య ఎందుకు చేసుకున్నట్టు? ముందు రోజు కానీ, ఆ రోజుగానీ రాజేంద్ర బాబుగారు తాతగారితో ఏ విషయమైన అగొడవ పడడం, మాటా మాటా అనుకోవడం చూసావా?”

“మాటా మాటా అనుకోవడమా?!”  ఆశ్చర్యంగా అన్నాడు నరసింహ “మాటా మాటా అనుకోవడానికి అసలు వాళ్ళిద్దరి మధ్యనా మాటలుంటే  కదా?”

ఉలిక్కి పడ్డట్టుగా చూసాడు పాణి “తాతా మనవళ్ళ మధ్యన మాటల్లేవా?” విస్మయంగా అన్నాడు.

“అవునండీ... దాదాపు యేడాదిగా ఇద్దరి మధ్యనా మాటల్లేవు”

“ఎందుకు?”

“నాకు తెలియదు సారూ”

“తాత గారు సురేష్ వర్మ గారి మధ్యన సంబంధాలు ఎలా ఉంటాయి?”

“వాళ్ళిద్దరూ బాగానే ఉంటారండీ. పెద్ద రాజా వారికి కూడా సురేష్ వర్మ గారి మీదే నమ్మకం ఎక్కువ.  కానీ వంశానికి వారసుడు మాత్రం రాజేంద్ర వర్మ గారే కదా? అందుకే ఆయన మాట మీదే మొత్తం వ్యవహారాలన్నీ నడుస్తూ ఉంటాయి.  మరేం అనుకున్నారో ఏమో చిన్న రాజా వారు అలా వెళ్ళి పోయారు”

కాసేపు ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉండి పోయాడు పాణి.  మరింకేం మాట్లాడకుండా కాఫీ త్రాగడం ముగించి  “కాఫీ చాలా బాగుంది నరసింహా, థాంక్స్” అంటూ లేచాడు.

 “మిమ్మల్ని చూస్తుంటే నాకు మా చిన్న రాజా వారితో మాట్లాడుతున్నట్టే ఉంది సారూ. ఆయన కూడా పని వాళ్ళూ వీళ్ళూ అని చూడకుండా అందరితోనూ ఆప్యాయంగా మాట్లాడే వారు”

పాణి నవ్వుతూ అతడి భుజం తట్టి అక్కడి నుంచి కదిలాడు.

****

“నిన్నటి వసంత రాత్రులు

గడిచిన వెన్నెల పున్నములు

నిరుడు కురిసిన హిమసుమాలు

గుర్తొచ్చి-

మదిని మెలిపెడుతుంటే

వర్తమానం భారంగా అనిపిస్తోంది

తీపి రుచి తెలిసాక

చేదు మరింత చేదుగా ఉన్నట్టుగా

బ్రతికినంత కాలం

ఆనందాన్ని దోసిలితో తాగిన తృప్తి

ఇంక ముందు బ్రతికినా

ఇంత ఆనందాన్ని పొందలేనేమోనన్న

దిగులుని కలిగిస్తోంది...

ముల్లు...

కాలిలో గుచ్చుకుంటే ఓర్చుకో వచ్చు

చేతిలో గుచ్చుకుంటే తీసుకో వచ్చు

గుండెలో గుచ్చుకుంటే మాత్రం  భరించడం కష్టం

అందుకే

ఆ దిగులుతో,

విరక్తితో  వెళ్ళి పోతున్నాను

నిష్క్రమించడం ఓటమి కాదు

ఎందుకంటే,

శక్తి వంతమైన సూర్యుడు కూడా

సాయం కాలమయ్యేసరికి అస్తమిస్తాడు !

-రాజేంద్ర వర్మ

రాజేంద్ర సూసైడ్ నోట్‍ని క్లూస్ టీమ్ దగ్గర చూసినప్పుడు ఎవరూ గమనించకుండా తన సెల్‍ఫోన్ లో   తీసిన ఫోటోని తదేకంగా చూస్తూ ఆలోచిస్తున్నాడు పాణి.   ఆ కాగితాన్ని  ప్లాస్టిక్ కవరులోంచి బయటికి తీసి చూసినప్పుడు తన మెదడులో మెదిలిన ఆలోచనలు మరోసారి గుర్తొచ్చాయి అతడికి.

ఏకాగ్రత కోసం కళ్ళు మూసుకుని అదే విషయమ్మీద మరింత ముందుకు ఆలోచించ బోయే లోగా అతడి సెల్ ఫోన్ రింగయింది.  ధ్యాన భంగమైన ఋషిలా కళ్ళు తెరిచి  ఆ ఫోన్ కాల్ ఎవరిదా అని చూసాడు.

‘డి.ఎస్పీ రాజేంద్ర కాలింగ్’

వెంటనే ఫోన్ ఎత్తి “హలో” అన్నాడు

“గుడ్ మాణింగ్... ఎలా ఉంది రాజా వారి ఆతిథ్యం?” అన్నాడు ప్రసాద్.

“బాగుంది. వారి ఆతిథ్యం కన్నా, మీ డిపార్టుమెంటు వాళ్ళ కంపెనీ బాగుంది”  అన్నాడు పాణి.

అతడెవరి గురించి మాట్లాడుతున్నాడో అర్ధమైంది ప్రసాద్‍కి  “నీకు పెళ్ళైంది. గుర్తుంచుకో. ఇలాంటివన్నీ తప్పు” అన్నాడు నవ్వుతూ.
 “మేకింగ్ ఎఫైర్ ఈజె ఛాయిస్. నాట్ మిస్టేక్!”  తనూ నవ్వుతూ అన్నాడు పాణి.

“అంజలికి తెలిసందంటే, రాజేంద్ర సూసైడ్ కేసుతో పాటూ నీ మర్డర్ కేసు కూడా నేను బుక్ చెయ్యాల్సి వస్తుంది. అది సరే గానీ నీ పరిశోధన ఎంత వరకూ వచ్చింది?”  అసలు విషయం లోకి వస్తూ అన్నాడు ప్రసాద్.

“రాజేంద్ర మరణం మరణం యాదృఛ్ఛికం కాదు, అది  ఒక క్రిమినల్ ఇన్సిడెంట్ అన్నదాంట్లో ఎటువంటి అనుమానం లేదు.  అయితే, అది ఎలా జరిగిందీ, దాని వెనుక ఉన్న క్రిమినల్ బ్రెయిన్ ఎవరిదీ అన్నది మాత్రం ఇతమిత్ధంగా  తెలియడం లేదు. అది తెలియాలంటే, రాజేంద్ర జీవితం గురించి మరికొంత తెలుసుకోవాలి నేను. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాను”  అంటూ తను ముందు రోజు రాజ మహల్‍కి వచ్చిన దగ్గర నుంచీ జరిగిన ఒక్కో సంఘటనలో తన అబ్జర్వేషన్స్ చెప్ప సాగాడు.

తనని చూడగానే సురేష్ వర్మ కళ్ళల్లో  తనకి కనిపించిన భయం,  బంగళా లోని కంపూటర్ లో తాము చూసిన బ్రవుజింగ్ హిస్టరీ,  కాఫీ తాగుతున్నప్పుడు నరసింహ తనతో చెప్పిన విషయాలని చెప్పి  చివరగా అన్నాడు “వీటన్నింటి కన్నా మిన్నగా,  జరిగినది  ఒక క్రిమినల్ ఇన్సిడెంట్ అని నేను నిర్ధారణకి రావడానికి గల మరో ముఖ్యమైన కారణం  రాజేంద్ర రాసిన సూసైడ్ నోట్”

“సూసైడ్ నోటా? ఎలా?” అర్ధం కానట్టుగా అన్నాడు.

 

 

(ఈ సస్పెన్స్ వచ్చేవారం దాకా..........)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్