Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> మెసేజ్

message

సాయంత్రం జనరల్ షిఫ్ట్ నుంచి ఇంటి కొచ్చి నాన్న పక్కన కూర్చుని కాఫీ తాగుతూ చెప్పాను.

"నాన్నా ! రేపు మా ఛానల్ కి రచయిత్రి భార్గవీ రావ్ వస్తోంది. నన్ను ఇంటర్వ్యూ చెయ్యమన్నారు. నాకిష్టం లేదు. మరో యాంకర్ కివ్వమని చెప్పాను . కానీ మా హెడ్ మీరే చెయ్యండి అన్నారు తప్పదు."

"భార్గవీ రావు గారా ? ఇంటర్వ్యూ చెయ్యడానికి నీకెందుకూ అభ్యంతరం ? నిన్నేం చేసిందావిడ ? చెయ్యి ”అన్నారు నవ్వుతూ నాన్న.
భోజనం చేశాక భార్గవీ రావు గారి వివరాలున్న కాగితం తీశాను. పాతికేళ్ళ నుంచీ యాభై నవలలూ, రెండొందల కధలూ రాసిందావిడ. ఆవిడ రాసిన కొన్ని ప్రేమ కధలూ, బహుమతి పొందిన కధల సినాప్సిస్ లూ ఓ గంట చదివి పక్కన పెట్టాను.   
అన్నిట్లోనూ ప్రేమ ప్రధాన వస్తువు.  అందుకే ఆమెకు "ప్రేమ భార్గవి " అని బిరుదు ఇచ్చారట అభిమానులు. ఆవిడ  గృహిణి . భర్త వ్యాపారి. ఇద్దరు పిల్లలు.

పడుకునే ముందు మా క్రియేటివ్ హెడ్ డేవిడ్ గారన్న మాట గుర్తొచ్చింది. "మరో యాంకర్ కివ్వమంటున్నారెందుకు ? ఆవిడ మీ యువతకు ఆరాధ్య రచయిత్రి కదా ! "అని.

"నాకు కాదు సర్ ! మా చెల్లి లాంటి టీనేజర్స్ కి, ఎక్స్ పోజర్ లేని వాళ్ళకి , ప్రపంచం తెలీని వాళ్ళకి.  అసలీ భార్గవీ రావు లాంటి వాళ్ళకి ఇంటర్వ్యూ లిచ్చే స్థాయి లేదు సర్ ! "అన్నాను ఆ వేశంగా. ఆ మాటకి "ఓవర్ మె చ్యూ రిటీ  కూడా మంచిది కాదు విద్యా ! డూ యువర్ డ్యూటీ !" అన్నారాయన క్లుప్తంగా .

ఆయనకి నా తెలివితేటల మీద గౌరవం ఉన్నా ఒకోసారి నేను అతి చేస్తానని ఆయన అంతర్యం. నేను మాట్లాడకుండా తలూపి వచ్చేసాను.       
ఆయన మా యాంకర్ లకి చెబుతూ ఉంటారు. ఇంటర్వ్యూ ఇస్తున్న వ్యక్తి చెప్పేది అభిమానం తో చక్కగా వినాలి. వారి నుంచి ప్రేక్షకులకి ఓ సందేశం రాబట్టాలి. మనమే విసుగూ,  నిర్లక్ష్యం చూపిస్తే చూసే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఎలా కలుగుతుంది? వివిధ రంగాల్లో కృషి చేసి పేరు సంపాదించుకున్న వారిని ప్రజలకు పరిచయం చెయ్యాలి.అందులో పక్షపాతం ఉండకూడదు. మనం చేసే పనిలో మనం నిజాయితీగా ఉండాలి. వచ్చిన గెస్ట్ లకు గౌరవం ఇచ్చి మన గౌరవం మనం నిలుపుకోవాలి. ఇలా సాగుతాయి సర్ మాటలు .

వ్యక్తి గత ఇంటర్వ్యూ లకి నేను వ్యతిరేకి నేమీ కాను. ఒక విధంగా ఆ పని చేసి చేసీ ఇలా అయ్యానేమో కూడా ! నిజంగా చాలా సత్తా ఉన్న వాళ్ళని పరిచయం చేసే అవకాశం వస్తే ఎంతో సంబర పడతాను. అదృష్టం గా భావిస్తాను. వాళ్ళెంతో సహజంగా ఉంటారు. తగినంత  ప్రతిభ లేని వాళ్ళు కూడా ఒకోసారి అదృష్ట వశాత్తూ పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. వాళ్ళ ముఖా ముఖీల్లో గొప్ప హిపోక్రసీ కనబడుతుంది.  

ఇలా వి ఐ పీ లయి పోయిన చాలా మంది మతలబీలుగా కూడా మారిపోతారు. అబద్దాలు చెప్పి, చెప్పి  ఏది నిజమో ఏది అబద్దమో తెలీని స్థితి కి చేరుకొని ఉంటారు. ఆయా రంగాల్లో పైకి రావడానికి వారు పడిన కష్టాలూ, కన్నీళ్ళూ  దాచి పెట్టి తాము నిద్ర పోతుంటే ఎవరో లేపి తమని కళాకారుల్ని చేసేసారంటారు. మేము పుట్టడమే ప్రతిభా వంతులుగా పుట్టా మంటారు. ఇలాంటి అసత్యపు ఇంటర్ వ్యూ ల వల్ల ఎవరికీ ఉపయోగం ఉండడం లేదనేదే నా బాధ.

*****

మర్నాడు పొద్దున్నే లేచి కిటికీ దగ్గర నిలబడ్డాను. పక్కింట్లో ఓ చుడీదార్ పిల్ల పూలు కోస్తోంది. నాకు వెంటనే చెల్లాయి రాజీ గుర్తొచ్చింది. తను కూడా ఈ పిల్ల లాగే మంచి మంచి డ్రెస్ లు వేసుకుని గెంతుతూ ఉండేది. సినిమాల పిచ్చి బాగా ఉండేది. టెన్త్ ఫెయిల్ అయ్యి నవలలూ, మాగ జైన్ లు చదువుతూ స్నేహితుల నేసుకుని సినిమా థియేటర్ లకు పోతూ ఉండేది. అవన్నీ సిల్లీ ప్ర్రేమ కధల సినిమాలే ! 
నాకు పదేళ్ళప్పుడే అమ్మ అనారోగ్యం తో చని పోయింది. నాన్నకూ నాకూ రాజీ అంటే గారం. మేము హయత్ నగర్ దాటి లోపల ఒక కాలనీ లో ఉండే వాళ్ళం. చుట్టూ గ్రామీణ వాతావరణం ఉండేది.  నాన్న ఓ చిన్నపాటి దిన పత్రిక లో తగు మాత్రపు జీతంతో సంసారం నడుపుతూ వచ్చారు. ఈ మధ్యే రిటైరయ్యి   

వచ్చిన కొద్ది మొత్తం సొమ్ము బ్యాంకు లో వేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. రాజీ పుస్తకాల, సినిమాల పిచ్చితో మునిగి తేలుతుండేది. నేను అందంగా ఉన్నాను కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరో రాజ కుమారుడు అమెరికా నుంచి వస్తాడనుకునేది. నేను డిగ్రీ చదివి జర్నలిజం పీ జీ చేస్తుంటే తను హాయిగా ఇంట్లో టీ.వీ. చూస్తూ రక రకాల వార పత్రికలూ, సినిమా మాగజైన్ లూ కాలనీ లైబ్రరీ నుంచి తెచ్చి చదువుతూ ఉండేది.

 “ ఏదో ఒక పుస్తకం అని చదవకు. చదవాల్సినవి  ఈ పత్రికలు కాదు. మంచి సాహితీ విలువలున్న కధలూ, నవలలూ చదువు. గొప్ప గొప్ప సినిమాలున్నాయి. పేర్లు చెబుతాను అవి చూడు. కానీ ఈ పిచ్చి ప్రేమ కధలున్న సినిమాలు చూడకు “ అనేదాన్ని . 

"ఏడుపులూ, కష్టాలంటే పడదు నాకు. మా యూత్ కోసం తీసిన సినిమాలే బావుంటాయి నాకు "అనేది,

నా మా ట కొట్టి పారేస్తూ.

రాజీకి అభిమాన రచయిత్రి ఈ భార్గవీ రావే . ఈవిడ  పుస్తకాలే ఎక్కువగా  లైబ్రరీ నుంచి  తెచ్చి చదివేది. నేను ఒకటి రెండు సార్లు చదవడానికి ప్రయత్నించి వి సుగేసి ఆపేశాను. థీమ్ లు ముందు మాటల్లో తెలుసుకున్నాను.  నాకు అర్ధమైనంత వరకు అవన్నీ అర్ధం పర్ధం లేని ప్రేమ కధలు. తమ పొలం లో పని చెయ్యడానికి వచ్చిన యువకుడిని ప్రేమించి అది చెప్పలేక పెద్ద వాళ్ళు చేసిన పెళ్లి వద్దని పిచ్చి పిల్లగా మారిన ఓ అమ్మాయి కధ ఓ నవల.

మరో నవలలో ప్రేమ సఫలం కాలేదని బ్రహ్మచారిణిగా ఉం డి పోయి ఊరి కందరికీ సహాయాలు చేసే టీచర్ కధ.  ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇంట్లోంచి పారిపోయి సినిమా హీరోయిన్ లయిన వాళ్ళూ, కోటీశ్వరుల కోడ ళ్ళయిన వాళ్ళూ ఇవీ పాత్రలు.

“ఇవేం నవలలే ? జీవితం ఇంత ఈజీ గా ఉండదు. ఎంతో కష్ట పడాలి. సులువుగా ఏదీ రాదు.మనుషులు ఈ కధల్లోలా ఉండరు. ఆవిడెలా రాస్తుందో ! నువ్వెలా చదువుతావో ! నాకర్ధం కాదు. అన్నానొకసారి చెల్లి మీద కేక లేస్తూ.

"నువ్వో జడ పదార్దానివి. నీకు రంగూ, రుచీ, వాసనా లేని జీవితం అంటే ఇష్టం. నాకలా కాదు. అయినా నా భవిష్యత్తు నేను చూసుకో గలను. నీది నువ్వు చూసుకో ! చాలు ! " అంది రాజీ అసహనంగా.

అనడమే కాదు. తన భవిష్యత్తుని తనే నిర్ణయించుకుని మా పక్కింటి కుర్రాడితో వెళ్లి పోయింది. వాడు ఇంటర్ ఫెయిల్ అయ్యి ఏవో కంప్యూటర్ కోర్స్ లు చేస్తూ ఓ రూంలో ఉండే వాడు. అతన్ని పెళ్లి చేసేసుకుని ఫోన్ చేసి చెప్పింది.

నాన్నా, నేనూ ఏడుస్తూ పరిగెత్తాం నల్గొండకి. ఓ చిన్న గదీ, కిచెన్ ఉన్న పోర్షన్ లో ఉన్నారిద్దరూ.

"ఇతనేం పోషిస్తాడు నిన్ను? ఏం చూసి చేసుకున్నావ్ ?" అని ఏడుస్తూ అడిగాను. 

"ఇతనికి చాలా ఆస్తి ఉంది.కొన్ని రోజులయ్యాక తల్లి తండ్రుల్ని ఒప్పించి తీసుకు వెళ్తాడు వాళ్ళింటికి" అంది.ఆ అబ్బాయి ఒక్క మాట మాట్లాడలేదు. తలొంచుకుని నిలబడ్డాడు.

నాన్న మౌనంగా కుమిలిపోయారు తప్ప ఒక్క మాట కూడా అనలేదు రాజీని . నేనే  పట్టరాని కోపం తో ఏవేవో తిట్టాను దాన్ని. నేనూ, నాన్నా తిరిగి వచ్చేసాం. ఆ రాత్రంతా నిద్ర పోకుండా ఏడ్చాను.  

"చెల్లిని బలవంతం గానైనా తీసుకోచ్చేద్దాం నాన్నా! మళ్ళీ వెళ్లి "అన్నాను మర్నాడు పొద్దున్నే ఉక్రోషంగా. "వద్దు లేమ్మా ! విజ్ఞత లేని వాళ్ళు ఇంకొకరి మాట వినరు. దాని బతుకు దానిష్టం. ఎవరి జీవిత సౌధానికి వాళ్లే ఆర్కిటెక్ట్ లంటారు కదా ! రాజీ లైఫ్ బావుండాలని ఆశిద్దాం అంతకంటే ఏమీ చెయ్యలేం "అన్నారు నాన్న. తర్వాత రాజీ అప్పుడప్పుడూ ఫోన్ చేసి చెబుతూ ఉండేది వివరాలు. ఓ రోజు చెప్పింది. అతనికి ఆస్తి ఉండడం అబద్దమట. ఒక అనాధ శరణాలయంలో పెరిగాడట.

నేను అవాక్కయ్యి "మరెలాగే ఇప్పుడు ? "అన్నాను.

"నా కోసం నా మీద ప్రేమతో అసత్యాలు చెప్పాడులే. ఏం లేకపోయినా అతనికి నా మీద నిజమైన ప్రేమయితే  ఉంది. అది చాలదా అక్కా ? "అంది అమాయకంగా. నా గుండె తరుక్కు పోయింది. పిచ్చి పిల్ల ఎలా ఆలోచిస్తోందో అనిపించి బాగా ఏడ్చాను. నాన్న కీ సంగతి చెప్పగానే ప్రేమ గుడ్డిది అన్నారందుకే ! అదీ ఒకందుకు మంచిదేలే ! " అంటూ గట్టిగా నిట్టుర్చారు.  

మరో రెండు నెలల తర్వాత ఇద్దరూ ఓ సూపర్ మార్కెట్ లో చేరి పని చేస్తున్నామని చెప్పింది. ఎప్పుడైనా వస్తూ ఉంటుంది.ఒక రోజుండి వెళ్లి పోతుంటుంది. అతనెప్పు డూ రాలేదు మా ఇంటికి. అసంతృప్తితో రాజీ అతన్నిబాధపెట్టడం లేదు, ఇద్దరూ కలిసి కష్టపడుతున్నారు మంచిదే కదా అనుకున్నాం నాన్నా, నేనూ.   

గతేడాది నా కొచ్చిన ఈ ఛానల్ యాంకరింగ్ జాబ్ తో నేను బిజీ అయ్యాను. ఈ ఛానల్ కొత్తది, అంతగా మార్కెటింగ్ లేనిది. మరో పెద్ద ఛానల్ కి వెళ్ళాలంటే  రికమెండేషన్ లేదు. అయినా ప్రయత్నిస్తూ ఉన్నాను.  

 అప్పుడప్పుడూ నాన్నా నేనూ రాజీకి ఫోన్లు చేస్తూ ఉంటాము. రాజీ అతన్ని వదిలి వచ్చేసే రోజొకటి వస్తుందేమో, వచ్చాక దానికెక్కడైనా ఉద్యోగం చూడాలని నాకూ నాన్నకీ ఆశ ఉందింకా.

***

మర్నాడు మధ్యాహ్నం నాలుగు గంటలకి లైవ్ ఇంటర్వ్యూ కి ఏర్పాట్లు జరిగాయి. రచయిత్రి ప్రేమ భార్గవీ రావ్  మూడున్నరకే వచ్చింది. వయసు యాభై పైనే ఉండొచ్చు. మొహం అమాయకంగా ఉంది. మానసిక పరిపక్వత లేకపోవడం వల్ల కావచ్చు అనుకున్నాను మనసులో. 
ప్రోగ్రాం మొదలయ్యింది. నమస్కారాలయ్యాక ప్రఖ్యాత రచయిత్రి అయినందుకు ఆవిడను అభినందించి జీవిత విశేషాలు అడగడం మొదలు పెట్టి “ముందుగా మీ బాల్యం గురించి చెప్పండి ” అన్నాను.

ఆమె తన చిన్నతనం గురించి ఆనందంగా వివరించడం మొదలు పెట్టింది. తను నిత్యం కధలూ, నవలలూ చదివే దాన్ననీ, ఆ ఇష్టం కొద్దీ టెన్త్ అయ్యాక కాలేజీ కి వెళ్ళలేదనీ క్లాస్ పుస్తకాలు తనకయిష్ట మనీ చెప్పింది. ‘ ఎంత అదృష్టమో !’ అనుకున్నాను మనసులో. రచయిత్రి కావాలని తన జీవితాశయంగా పెట్టుకుని మరీ అయ్యానని గర్వంగా  చెప్పింది. 

" మీరు ప్రధానంగా ప్రేమను నవలా వస్తువుగా. కధా వస్తువుగా తీసుకుని రాసారు. మిమ్మల్ని ప్రేమ భార్గవి అంటారంతా ! ప్రేమ మీ అభిమాన సబ్జెక్టు ఎలా అయ్యింది ? " ప్రశ్నించాను. 

“నా ఉద్దేశంలో ప్రేమ చాలా గొప్పది. విశ్వమంతా నిండి ఉంది ప్రేమే ! దాని వల్లనే ప్రపంచం నడుస్తోంది కదా ! “ అంది నవ్వుతూ భార్గవి.
"యువతకి నచ్చే ప్రేమ గురించి చెప్పండి " అన్నాను. " ప్రతివారికీ జీవితంలో ఒక్క సారయినా ప్రేమాను భవం ఉంటుంది. అందుకే అందరికీ నాపుస్తకాలు నచ్చిఅభిమానిస్తారు " అంది తృప్తిగా 

" మరి జీవితాల్ని వెలిగించే ప్రేమలే కాక ఆర్పేసే ప్రేమలు కూడా ఉంటాయేమో కదా ! వాటి సంగతేమిటి ? " అన్నాను కాస్త సీరియస్ గా 
బిత్తర పోయిందామె. ఏ మనాలో తోచనట్టు కొన్ని సెకన్లు చూసి " ప్రేమను మించిన గొప్ప పదం లేదండీ అసలు " అంది చిలక పలుకులా.
 "ప్రేమ గురించి ఇంత గొప్పగా రాస్తున్నారంటే దాని గురించి మీకు బాగా అవగాహన ఉండే ఉంటుంది. మీరు ఎవరినైనా ప్రేమించారా !  ప్రేమించే ఉంటారు లేకపోతె ఇంట మధురంగా రాయలేరు " అన్నాను మొహమాట పెడుతూ.            

ఆమె కొంచెం అనుమానించి "నేను హై స్కూల్ లో చదివే టప్పుడు మా ఎస్ పీ యల్ పై నాకు  చాలా అభిమానం, ఇష్టం ఉండే వి . టెన్త్ అయ్యాక అతను మళ్ళీ కనబడలేదు"

“ మరి మీరు అతని కోసం వెతకలేదా ? అతని కోసం మీకు పిచ్చి ఎక్కడం లాంటివేమీ జరగ లేదా ?" ఆశ్చర్యం గా అడిగాను.

"అదంతా ఇన్ ఫా ట్యూ ఏ షన్ కదా ! మర్చి పోతాం " అంది నవ్వుతూ 

" మరి పెళ్లి చేసుకునే టప్పుడు అతను గుర్తు రాలేదా ? బాధ పడలేదా ?" అడిగాను కుతూహలంగా.

" అబ్బే! అలాంటి దెందు కుంటుంది ? అది టీనేజ్ లవ్ అంతే !" అందామె నవ్వేస్తూ. 

" మీరు మాత్రం మీ లవర్ ని హాయిగా మర్చి పోయి, పెళ్లి చేసుకుని మీ పేరు చివర భర్త పేరు తగిలించికుని ఆదర్శ గృహిణి అయిపోతారు . మీ నవలల్లో, కధల్లో ఆడ పిల్లలు పక్కింటి ఆవారా గాడిని, దొడ్లో పని చేసే పాలేర్నీ ప్రేమించి అతనితో వెళ్లి పోతారు. లేదంటే పిచ్చి వాళ్లయిపోయి ఊరిలో తిరుగుతూ ఉంటారు. అంటే వాళ్ళు మానసికంగా మీ అంత బలమైన వాళ్ళు కాదేమో కదా ! " అన్నాను వ్యంగ్యంగా .
కొంతసేపు మాట్లాడలేనట్టు గా ఉండిపోయి నెమ్మదిగా " కొందరలాంటి ప్రేమికులు ఉంటారండీ !" అంది భార్గవి చిన్నబుచ్చుకుంటూ.

 " మీరు చూసారా ? ఊహించారా ! " అన్న నా ప్రశ్నకి బిత్తర పోయింది. 

" ఆ ! అంటే విన్నాను " అంది నెమ్మదిగా 

"విన్నవి  కాదు. జీవితాన్ని స్వయంగా చూసి రాయాలి. ఊహించి కాదు. మనం మాత్రం మన బతుకుల్ని జాగ్రత్తగా దిద్దుకుంటూ, అమాయకమైన యువతకి రంగుల కలలు అమ్ముతూ వారికి వక్ర మార్గాలు సూచించి  రాంగ్ గై డెన్స్ ఇచ్చి వారి జీవితాలు నాశనం చెయ్యకూడదు కదా !" అన్నాను

" అంత ప్రభావం సాహిత్యానికి ఉంటుందా ?" బలహీనంగా అందామె 

" ఉంటుంది. సినిమా కాల్పనిక లోకం. కానీ కధలూ,నవలలూ జీవితాన్ని వివరించాలి. మన జీవితానుభవం తర్వాత తరానికి ఉపయోగపడాలి, ఆదర్శ వంతంగా ఉండాలి తప్ప వెర్రి మొర్రిగా ఉండకూడదు.                          

ఆమె నా వైపు అభావంగా చూస్తూ ఉండి పోయింది. నేను ఆవేశంగా మొదలు పెట్టాను.

“సబ్జక్టులు లేకపోతే, మీలో సృజన ఆగిపోతే రచనలు ఆపండి. ఎదగని బ్రెయిన్ తో అదే వస్తువు తో   మళ్ళీ మళ్ళీ రాయకండి. జీవితం అనేది ఓ లోతైన ప్రవహించే నది లాంటిది. దాని లోతుల్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ క్రమంలో మీకు తెలిసిన సత్యాల్ని ఆవిష్కరించండి. రాయడాన్ని ఒక వ్యసనంగా చేసుకోకండి. ముందు తరం వారు రాసిన గొప్ప సాహిత్యాన్ని బాగా చదవండి. ఆకళింపు చేసుకోండి. ఆ తర్వాత మీకు నేనేదో చెప్పాలి అనిపిస్తే అప్పుడు రాయండి." 

నా మాటలకి ఆమె మొహం పాలిపోయింది. మౌనం దాల్చింది. అది చూసిన నేనుకూడా కొన్ని సెకన్లు  పాజ్ ఇచ్చి " మా ప్రేక్షకులకి ఏదైనా మెసేజ్ ఇస్తారా ?" సౌమ్యంగా అడిగాను 

ఆమె తల అడ్డంగా ఊపి నమస్కారం చేసింది. నేనామె చెయ్యి అందుకుని కలిపి,

"చాలా థాంక్సండీ ! మా స్టూడియో కొచ్చి చాలా మంచి విషయాలు చెప్పారు” అని ముగించాను   

షూట్ చేస్తున్న వాళ్ళంతా షాక్ తిన్నట్టుగా ఉండి పోయారు. లైట్స్ ఆఫ్ చేసేసారు. ఎవరో వచ్చి ఆమెను డేవిడ్ గారి రూం కి తీసుకెళ్ళారు. నేను బాగ్ తీసుకుని ఇంటికి బయలు దేరాను. నాకు తెలుసు. రేపీపాటికి నా ఉద్యోగం ఊడినట్టు ఆర్డర్స్ రావడం ఖాయం. చెల్లిలిపై నాకున్న మమకారం బహుశా ఇలాంటి బాధ్యతా రహితమైన రచయితలపై కోపంగా మారిందేమో ! అది నన్ను నా హద్దుల్ని దాటించి నా చేత అలా మాట్లా డించిందేమో ! ఆ రాత్రి కలత నిద్రే గతయ్యింది నాకు మర్నాడు ఆఫీసు కొచ్చి సీట్లో కూర్చోగానే అనుకున్నట్టుగానే, మా సీఈఓ నుంచి పిలుపొచ్చింది. ఒక్కసారి నిట్టూర్చి నిలబడి అందరి వైపూ చూసాను. ఈ రోజుతో ఈ ఛానల్ తో నా సహోద్యోగులందరితో ఋణం తీరి పోబోతోంది. భార్గవీ దేవి గారితో ముఖా ముఖీ విద్యా మేడం గారిని ఇంటికి పంపుతోంది. విధి బలీయం అంటే ఇదే కదా !కెమెరా ముందు ఆవిడని నేను పెట్టిన హింసకి ఆవిడ నాకు శాపం పెట్టేసింది. శాప ఫలితం అనుభవించాలి తప్పదు’ అనుకుంటూ వెళ్ళాను ఆయన రూం కి.

శ్రీ రామచంద్ర గారు సీరియస్ గా ఏదో చదువుతున్నారు. నెమ్మదిగా చప్పుడు కాకుండా ఎదురుగా కుర్చీలో కూర్చున్నాను. కొన్ని సెకను ల తర్వాత మరో ఫైల్ తీసి చదువుతూ తలెత్త కుండానే 

" ఓ రచయిత్రి ని ఇంటర్వ్యూ చేస్తూ, రచయితలందరికీ నువ్వే సందేశం ఇచ్చావట కదా !" గంభీరంగా అన్నారు. నేను నేల చూపులు చూసాను. 

ఆయనే మళ్ళీ " చాలా ఫోన్ లొచ్చాయి. నీ ముఖా ముఖీ విభిన్నంగా, వెరైటీ గా ఉందని." అని ఆగారు. 

నేను నెమ్మదిగా తలెత్తాను ధైర్యం కూ డ దీసుకుంటూ.

 " ఇప్పుడు నీకు మరింత బాధ్యత పెరిగింది. నీ సందేశం నీక్కూడా వర్తిస్తుంది. ఇంటర్వ్యూ కొచ్చే వాళ్ళని భయపెట్టకు “అన్నారాయన చిన్నగా నవ్వుతూ.     

నెత్తి మీద మోస్తున్న బండరాయిని అమాంతం ఎవరో తీసేసి నట్టయింది. ఆనందాన్నిమింగేసి బైటికి నడిచాను గంభీరంగా.

మరిన్ని కథలు
old age home vaddu baboo